డా. శిలాలోలిత
‘షహనాజ్ ఫాతిమా’ అనే కవయిత్రి ‘మౌన శబ్దాలు’ అని కవిత్వానికి పేరుపెట్టడంలోనే ఆమెకు గల తాత్విక దృక్పథం తెలుస్తోంది.
నిజానికి ధ్వనిపూర్వకమైంది శబ్దం.
వినగలిగిన వాళ్ళకే అది తెలుస్తుంది. ఇక్కడ ‘మౌన శబ్దాలు’ అనడంలో స్త్రీలు తరతరాలుగా మౌన పర్వతాలు ఘనీభవించిన స్థితిని చూపిస్తూ, ఈ మౌనులు విస్ఫోటనం చెంది పోరాట స్తూర్తిని పొందినపుడు తాము సాధించుకున్న విజయాలను అందరూ వినగలిగేలా శబ్దీకరిస్తారని కవయిత్రి భావన.
సిరిసిల్ల ప్రాంతం నుంచి కవిత్వం రాస్తున్న వారిలో వినూత్నంగా రాస్తున్న కవయిత్రి. మానేరు రచయితల సంఘంలో సభ్యురాలు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. ఉపాధ్యాయ సంఘాలు, లోక్‌సత్తా వంటి సంస్థల్లో బాధ్యురాలు. ఉపాధ్యాయ సాహిత్య సాంస్కృతిక కళావేదిక ‘వేదిక’ లో ముఖ్య భూమికను పోషిస్తున్నారు.
తెలుగు, హిందీ భాషల్లో కవిత్వం రాస్తున్న షహనాజ్ 2004లో ‘కెరటాలు’ అనే కవితా సంకలనాన్ని వెలువరించింది. 2006లో ‘మౌనశబ్దాలు’ చేస్తూ కవిత్వాన్ని రచించింది. షహనాజ్ సుమారు 20 ఏళ్ళ క్రితం నుంచి రాస్తున్నా, మధ్యలో పది, పదిహేను ఏళ్ళపాటు రాయడాన్ని నిశ్శబ్దరూపంలో ఆపేసింది. మళ్ళీ ఇన్నాళ్ళకు కవిత్వపు కుంచెను చేతబట్టడం అభినందించదగిన విషయం.
‘రాతిని తొలిచి/ హృదయంగా మార్చాను /స్పందన ఎలా/ చెక్కాలో తెలియదు – అని స్త్రీల అంతర్గత ఘర్షణను చెప్తూ స్త్రీ సమస్యల్ని పట్టించుకోని సమాజతనాన్ని గురించి – ‘ముళ్ళు గుచ్చుకుందని /పువ్వు అరిచింది /ఎందుకో /ఎవర నమ్మలేదు’. అసలు స్త్రీలకు కష్టాలే లేవన్న వర్గాన్ని గురించి రాస్తూ, ఇళ్ళల్లో గృహ హింస కనబడకుండా ఎలా వుంటుందో తేలిక మాటల్లో చెప్పింది. ఇంటి బయట శత్రురూపంలో వున్న శత్రువుల్ని ఎదుర్కోవడం తేలికే. కాని ఇంట్లోనే బహురూపాల్లో వున్న శత్రువుల గురించి – ‘శతృవులదేముంది శత్రువులే వారు మిత్రులతోనే బాధ’ అనేస్తుంది. ‘పరదాల జైలులో/ బందీని/ నిరపరాధిని/ నాకెందుకీ శిక్ష’.. ‘నాల్గర్రల్లో /వెతుకుతున్నాను/ మరి ఏ అర్రలో /నేనున్నానో!’ ….. ‘ఎన్ని రంగుల /పువ్వులో /శూన్యం పలకమీద/ అవి మౌన శబ్ధాలు’….. ‘బాధకు భాష వస్తే /గగ్గోలు పెట్టేదేమో /మనం పెట్టే బాధలకు’…. ‘ఏకంగా వాకిట్లో /పూర్ణబింబం! /ఆకుల పరదాలు/ పక్కకు తొలిగాయి….’ ‘ఈత అసలేరాదు/ అయినా తండ్లాట/ జీవితమంటే /అదేమరి….” ”ఎప్పుడు చూసినా/ ఒకే లాంటి/ నిశ్శబ్ద దృశ్యం/ అద్దంలో నేను” ఇలా షహనాజ్ భావోద్వేగ కెరటాలు పరితుల అంతరంగాలను కల్లోలాలకు గురి చేస్తాయి. ‘చేయాల్సింది ఇంకా చాలావుంది అందుకే నిద్రను ఏమారుస్తున్నాను’.
స్త్రీల జీవితాల్లోని అనేక పార్శ్వాలను, ఒత్తిడిని వ్యక్తీకరిస్తూ, సమాజంతో మమేకమవుతూ, లోతైన ఆలోచనా రీతితో వాచ్యంగా కాక, నిశ్శబ్ద రూపప్రక్రియలో స్త్రీ వాదాన్ని, స్త్రీ వాద ఉద్యమ నేపథ్యాన్ని వినిపించిన కొత్త గొంతు షహనాజ్‌ది.
స్త్రీలుగా సమాజంలో అణచివేయబడటం కంటే కూడా, ముస్లిం స్త్రీల అణచివేత మరింత కనుక, అలాంటి ఇతివృత్తంతో కవిత్వాన్ని మరింత రాయాలని నా ఆకాంక్ష. మనకు కవయిత్రుల్లో ముస్లిం కవయిత్రులు చాలా తక్కువ. షాజహానా, మహెజబీన్, రజియా, షంషాద్ బేగం, రేష్మా యిలా వేళ్ళ మీద లెక్క పెట్టగలిగెేవారే వున్నారు. ఒక స్పష్టమైన అవగాహన, రచనా సామర్థ్యం వున్న షహనాజ్ లాంటి సీనియర్ రైటర్స్, రచనలు ఎక్కువగా చెయ్యయ్యాల్సిన అవసరం, బాధ్యత ఎక్కువగా వున్న కాలమిది. సాహిత్యం జీవితాల్నే కాదు, జీవన విధానాన్ని కూడా మార్చగలిగే మహత్తర శక్తి. సమాజాన్ని చైతన్య పరిచేదిశగా షహనాజ్ కవిత్వముందని, మరింతగా ఆమె రచిస్తే బాగుంటుందని నా అభిలాష.
చక్కని విషయలు రాసారు. చాలా సంతొషమ గ ఉంది.
ప్రక్షాళిని
9441265122