ఇటీవల కాలంలో మహిళలకు భూమి గురించి చర్చ కేంద్రీకృతమైంది. మొదటితరం భూ సంస్కరణలన్నీ భూమి విషయంలో మహిళలను విస్మరించాయి. 90వ దశకంలో ప్రపంచ వ్యాపితంగా ప్రారంభమైన రెండవ దఫా భూ సంస్కరణలు స్త్రీలపై కేంద్రీకరించాయి. 1990లలో భారతదేశంలో తిరిగి ప్రారంభమైన భూ సంస్కరణలు స్త్రీలను కూడా తమ ఎజెండాలో భాగం చేసుకుని గుర్తించడం ప్రారంభించాయి. 1990 దశకంలో మన రాష్ట్రం కూడా భూమి పంపకంలో కనీసం 40శాతం స్త్రీల పేరు మీద ఉండాలని విధానాలను రూపొందించింది. అప్పటినుండీ భూమి పంపిణీ సమయంలో భార్యా, భర్తలిద్దరి పేరు మీద భూమి హక్కులు ఇవ్వడం మొదలెట్టింది.
2007లో విడుదలైన జాతీయ రైతుల విధానం క్రింద, వివిధ మార్గాలలో స్త్రీలకు వ్యవసాయం, అనుబంధ రంగాల్లో సాధికారతను కల్పించే చర్యలను చేపట్టారు. భూమి, రుణాలు, ఇతర సేవలను అందించేందుకు ఇంటి స్థలాలు, సాగు భూమి పంపిణీ సమయంలో భార్యా భర్తల పేరున జాయింట్ పట్టాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సృజనాత్మకంగా కొన్ని ప్రత్యేక చర్యలను చేపట్టాయి. మహిళల స్వయం సహాయక బృందాలకు భూమి కొని అందించే పథకాన్ని ప్రారంభించడం ఇందులో భాగమే.
మహిళలకు అదనపు ఆదాయాన్నిచ్చే జీవనోపాధిని అభివృద్ధి చేసేందుకు పశుపోషణ, పెరట్లో కూరగాయల సాగు తదితరాలకు అవసరమైన పెరటి స్థలాలను (కనీసం 10-15 సెంట్లు) ఇచ్చే పథకాలను కూడా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించాయి. కర్నాటక, పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు 2005లో భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఇంటి స్థలం మరియు పెరటి స్థలాలను ఆయా కుటుంబాలలోని స్త్రీల పేరున ఇవ్వడం ప్రారంభించాయి. ఈ అన్ని పథకాలు కూడా భారాన్ని మోస్తున్న స్త్రీలకు ప్రాధాన్యత ఇచ్చి అమలు చేశారు. 11వ పంచవర్ష ప్రణాళిక కూడా స్త్రీలు కేంద్రంగా భూమి పంపిణీ పథకాలను చేపట్టమని (వారి పేరునే పట్టాలు ఇచ్చేలా) రాష్ట్రాలను ఆదేశించింది.
2005లో (సవరించిన) హిందూ వారసత్వ చట్టం కూడా మరో అడుగు ముందుకు వేసి కుటుంబంలోని స్త్రీలకు కూడా పురుషులతో సమానంగా ఆస్తి హక్కును కల్పించింది.
”విధానపరంగా ప్రభుత్వాలు ఈ చర్యలు చేపట్టాక కుటుంబం నుండి, ప్రభుత్వం నుండి స్త్రీలకు ఏ మేరకు భూమి అందుబాటులో కొచ్చింది” అనే విషయంపై అధ్యయనం మేం చేశాం. ఇందుకోసం దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాలలో – మేఘాలయ (ఈశాన్యం), పశ్చిమ బెంగాల్ (తూర్పు), రాజస్థాన్ (ఉత్తరం), మధ్యప్రదేశ్ (మధ్య భారతం), ఆంధ్రప్రదేశ్(దక్షిణం)- ఈ అధ్యయనం సాగింది.
ఈ అధ్యయనంలో వెల్లడైన ప్రధాన అంశాలు
వివిధ రాష్ట్రాలలో మేం అధ్యయనం కోసం ఎంచుకున్న నమూనా గ్రామాలలో భూమి ఉన్న కుటుంబాల శాతం అత్యధికంగా పశ్చిమబెంగాల్‌లో 78 శాతం, మధ్యప్రదేశ్‌లో 76శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 65శాతంగా ఉంది. భూసంస్కరణల విధానం, అసైన్డ్ భూముల పంపిణీ విధానం, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్‌లో భూమిలేని కుటుంబాల సంఖ్యను గణనీయంగా తగ్గించాయి. కానీ స్త్రీల పేరుమీద భూమి వున్న కుటుంబాల సంఖ్య చూస్తే ఆంధ్రప్రదేశ్ ముందంజలోవుంది. ఆంధ్రప్రదేశ్‌లో 33శాతం, మధ్యప్రదేశ్‌లో 22 శాతం కుటుంబాలలో స్త్రీల పేరుమీద భూమి వుంటే, అతి తక్కువగా పశ్చిమబెంగాల్‌లో 16శాతం కుటుంబాలలో మాత్రమే స్త్రీల పేరుమీద భూమి వుంది. ఈ గణాంకాలను పరిశీలిస్తే, భూసంస్కరణలన్నీ భూమి పంపిణీ విషయంలో స్త్రీలను పక్కన పెట్టేశాయని స్పష్టంగా అర్థమవుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 1956 చట్టానికి సవరణ చేసి 1985లో కొడుకులతో సమానంగా కూతుర్లకు కూడా సమానవారసత్వ హక్కులిస్తూ తీసుకువచ్చిన చట్టం ఎక్కువ మంది స్త్రీలు తమ పేరు మీద భూమి కలిగి వుండడానికి ప్రధాన కారణంగా పని చేసింది.
హక్కులు పొందడంలో, భూమి హక్కుల మీద మహిళలకు పూర్తి అవగాహన, చైతన్యం కలిగి వుండడం ముందస్తు షరతుగా వుంటుంది. కొన్ని సందర్భాలలో స్త్రీలకు చట్టం పట్ల అవగాహన వున్నా, తమకు వున్న హక్కును వినియోగించుకోవడానికి సిద్ధపడలేదు. తనకు జన్మనిచ్చిన కుటుంబంలో ఇతర కుటుంబ సభ్యులకు విబేధాలు తలెత్తుతాయన్న భయం వల్ల చాలా మంది స్త్రీలు తమకున్న చట్టం (సవరణ) చెప్పుకోదగ్గ ప్రభావం చూపలేదు.
ఈ విషయంలో ఆయా కుటుంబాలలోని కూతుళ్ళు, చెల్లెళ్ళకంటే, భర్త చనిపోయిన స్త్రీలకు వారసత్వహక్కులు కల్పించడానికి గ్రామీణ సమాజం, గ్రామపెద్దలు సానుభూతితో, సానుకూలంగా వ్యవహరించారు. కొత్తగా పెళ్ళయిన యువతులు, కూడా అన్ని రాష్ట్రాలలోనూ భూమిని పొందడంలో సఫలీకృతులయ్యారు.
ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు వాడుకోవడానికి భూమిపై విధించిన పరిమితి కూడా స్త్రీల చేతుల్లోకి భూమి రావడానికి మరో కారణంగా పనిచేసింది. పెద్ద భూకమతాలు వున్న పరిస్థితులలోనూ, ముఖ్యంగా ఆధిపత్య కులాల కుటుంబాల లోనూ ఈ స్థితి ఎక్కువగా కనపడింది.
వివిధ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం చురుకుగా పనిచేసిన చోట, కుటుంబాలలోని సాంప్రదాయక భావజాలాన్ని బద్ధలు కొట్టడానికి, ఆయా కుటుంబాలు కుటుంబాలలోని అమ్మాయిలు కూడా అబ్బాయిలతో సమానంగా చూడడానికి ఉపయోగపడుతుంది. అటువంటి చోట మహిళలకు కొంత భూమి దక్కింది. అన్ని చోట్లా భూమిపై చట్టబద్ధ హక్కులను పొందడానికి ఏం చేయాలనే దాని విషయంలో స్త్రీలకు అవగాహన చాలా తక్కువగా వుంది.
2005 హిందూవారసత్వ ఆస్థిహక్కు చట్టంను సమర్థవంతంగా అమలుచేసి, మహిళల పేరుమీద భూమి పట్టా పత్రాలను రూపొందించడానికి రెవిన్యూ శాఖ సన్నద్ధం కాలేకపోయింది. ప్రభుత్వం భూమి పంపిణీ చేసిన సందర్భాలలో కూడా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. పూర్తి చట్ట బద్ధత లేని భూమి దస్తావేజులు, తెల్ల కాగితాలపై కొనుగోళ్ళు అమ్మకాలు, పట్టా కాగితం చేతికందినా, అక్కడ భూమి లేకపోవడం తదితరాలన్నీ సమస్యలుగానే ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లో గ్రామ అధికారి (ప్రధాన్) వారసులను గుర్తించి సర్టిఫికెట్ ఇవ్వడం, ప్రభుత్వ భూపంపిణీ సమయంలో లబ్ధిదారులను గుర్తించి పేర్లు నమోదు చేయడం చేస్తుంటాడు. ఈ పద్ధతి కొన్ని సార్లు రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం అయ్యింది. మరోవైపు ఈ క్రమంలో రెవెన్యూ శాఖ వైఖరి కూడా మరికొన్ని తప్పులకు కారణమైంది.
పౌరసమాజ పాత్ర :
మిగిలిన రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ మహిళలు తాము పుట్టిన కుటుంబాల నుండి భూమిని పొందడంలో ముందున్నారు. కానీ ఉత్తర భారతదేశంలో భూమి ప్రధానంగా పెండ్లి చేసుకున్న కుటుంబానిదై ఉంటుంది. మేఘాలయలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ అమ్మాయిలకు తమ స్వంత కుటుంబాలతో బలమైన అనుబంధాలుంటాయి. మిగిలిన రాష్ట్రాలలో ఈ బంధం చాలా బలహీనం. వివాహాలు, పెండ్లి అనంతరం నివాస గృహం తదితర విషయాలను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా దగ్గరి వాళ్ళతోనే పెండ్లి సంబంధాలు కుదుర్చుకోవడానికి ప్రయత్ని స్తుంటారు. భూమితో వారికి వుండే సంబంధం కూడా ఇందులో ముఖ్యపాత్ర పోషిస్తుంది. కానీ మిగిలిన రాష్ట్రాలలో పెళ్ళిళ్ళు సాధారణంగా దూరం వాళ్ళతో జరుగుతుంటాయి. అమ్మాయిలకు తాను పుట్టి పెరిగిన కుటుంబంతో సంబంధాలు కూడా చాలా బలహీనంగా వుంటాయి. గిరిజనులలో అమ్మాయిలకు తల్లి తరుపు వారూ, అత్త తరుపు వారు కూడా భూమిని ఇచ్చే సాంస్కృతిక పద్ధతి వుంది.
స్త్రీల పేరున ఉన్న భూమి, తర్వాత తరంలో కూతుళ్ళకు ఇవ్వడం అనేది మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో చాలా తక్కువగా వుంది. ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో కొంత మెరుగ్గా వుంది. స్త్రీలు తమ వాటా భూమిని, తమ తర్వాత తరంలో కూతుళ్లకు ఇవ్వగలిగేంత సాధికార స్థితి లేకపోవడంతో పాటు కూతుళ్ళకు ఇవ్వడం కంటే కొడుకులకు ఇస్తే మంచిదనే భావజాలం (వృద్ధాప్యంలో తమను చూస్తారనే భావనతో కూడా) బలంగానే వుంది. మేఘాలయలో కుడా మాతృస్వామిక వ్యవస్థ కొనసాగింపుకు, స్త్రీలకు భూమి హక్కు కలిగి వుండడానికి వ్యతిరేకంగా ఆలోచనా ధోరణులు వున్నాయి. మాతృస్వామిక వ్యవస్థ నియమాలకు, వ్యవస్థ కొనసాగింపుకు ఈ ధోరణి భిన్నమైనవి.
ఆడపిల్లలను, మగపిల్లలను సమానంగా చూసే ధోరణిని మరింత పెంచేందుకు ప్రభుత్వాలు మహిళలకు భూమి హక్కు కల్పించే విషయంలో తీసుకు వచ్చిన చట్టాలు ఉపయోగపడ్డాయి. భూమి హక్కు పొందిన తరువాత మహిళలలో స్వావలంబన, సామర్థ్యం బాగా పెరిగాయి. అదే సమయంలో స్త్రీలపై గృహహింస కూడా పెరిగింది. 2005 హెచ్.ఎస్.ఏ. చట్టం ఉనికిలో వున్నప్పటికీ కుటుంబం నుండి స్త్రీలకు భూమి ఇవ్వడంలో ఇంకా పాత సాంప్రదాయక ఆచరణ కూడా బలంగా అడ్డుపడుతూనే వుంది.
అభివృద్ధి చెందిన, తక్కువ అభివృద్ధి చెందిన ప్రాంతాల మధ్య మార్కెట్ పాత్ర
బాగా అభివృద్ధి చెందిన సామాజిక, ఆర్థిక పరిస్థితి కూడా స్త్రీలకు భూమి హక్కు ఇవ్వాలనే వాదనకు మరింత బలాన్నిస్తుంది. స్త్రీలలో అక్షరాస్యత, విద్యా ప్రమాణాలు పెరగడంతో ఆస్థి హక్కుపై అవగాహన బాగా పెరిగింది.
ఆడపిల్లలు, మగ పిల్లలు మధ్యవివక్ష చూపకుండా పెంచే సంస్కృతి, వాతావరణం పెరిగిన కుటుంబాలలో, సామాజిక పరిస్థితులలో స్త్రీలకు భూమి పొందే అవకాశాలు మెరుగ్గా వున్నాయి. అదే విధంగా సాగునీటి సౌకర్యం మెరుగై వ్యవసాయం అభివృద్ధి చెందడం, వ్యవసాయేతర అవసరాలకు భూమి మళ్ళిపోతూ, భూముల విలువలు భారీగా పెరగడంతో స్త్రీలకు కూడా భూమిలో వాటా, హక్కు ఇవ్వాలని కోరడం బాగా పెరిగింది.
మహిలకు భూమి అందుబాటులోకి తెచ్చే విషయంలో వివిధ సామాజిక బృందాల మధ్య ఎటువంటి చర్చలూ జరగడం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో లాగా భూమి పంపిణీ సమయంలో ప్రభుత్వం మహిళల పేరున భూమి ఇవ్వడం, ఇటువంటి చర్చలకు అవకాశం ఇస్తుంది. అభివృద్ధి చెందిన ఆధిపత్య సామాజిక వర్గం స్త్రీలకు కూడా భూమిలో వాటా కల్పిస్తుంటే, అది ఇతర సామాజిక బృందాలను కూడా ప్రభావితం చేస్తుంది. చర్చలకు ఆస్కారమిస్తుంది.
రాజ్యాంగంలోని 5వ షెడ్యూలు పరిధిలోకి వచ్చే గిరిజన ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో తల్లి వారింటి వైపు నుండి, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్‌లలో అత్యధిక సందర్భాలలో అత్తింటి వైపు నుండి స్త్రీలకు భూమిలో వాటా దక్కే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. షెడ్యూల్డ్ తెగలలో కంటే షెడ్యూల్డ్ కులాలలో స్త్రీలకు భూమి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వ పాత్ర కీలకంగా వుంది. వివిధ మత సమూహాల మధ్య ఈ విషయంలో పెద్ద తేడా కనిపించలేదు. కానీ, పశ్చిమ బెంగాల్‌లో మాత్రం ముస్లిం, గిరిజన కుటుంబాలలో ఎక్కువ శాతంలో స్త్రీల పేరున భూమి వుంది.
ఒక కుటుంబానికి మొత్తం ఎంత భూమి ఉందనే దానిని బట్టే ఆయా కుటుంబాలలో మహిళలకు వాటా కల్పించడమనేది అన్ని రాష్ట్రాలలోనూ సాధారణంగా కనబడింది. గిరిజన సముహాలలో ముఖ్యంగా చిన్న, మధ్య తరగతి కుటుంబాలలో, వారి చేతుల్లో భూమి చాలా తక్కువగా వుండడం వల్ల, మహిళలకు భూమి హక్కును విడిగా ఇవ్వడం కాకుండా కలిసి పని చేసుకోవడమే ఎక్కువగా కనిపిస్తుంది.
మహిళలకు భూమి అందుబాటులోకి తేవడంలో విధాన సమస్యలు
మహిళలకు భూమి హక్కులు కల్పించేందుకు తగిన చట్టాలు వున్నా మహిళలకు భూమి అందించడంలో ప్రస్తుతం ఉనికిలో వున్న సామాజిక, ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని వ్యవహరించ గలిగితేనే, మహిళలకు భూమి అందుబాటులోకొస్తుంది. రాష్ట్ర స్థాయిలో విశాలంగా ఆలోచించే విధానాల రూపకల్పనకు, ఆయా ప్రాంతాల ప్రత్యేక పరిస్థితుల కనుగుణంగా అభివృద్ధి నమూనాలను అభివృద్ధి చేయడం ద్వారా, మహిళాభివృద్ధి కోసం మంచి సూచనలు రూపొందించాలి.
మహిళలకు భూమికి సంబంధించి వారికున్న హక్కులపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం క్రియాశీలంగా జోక్యం చేసుకోవాలి. మహిళల ఆస్థి హక్కులకు సంబంధించి అవసరమైన అన్ని చట్టబద్ధ డాక్యుమెంట్లను రూపొందించడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాలి. ప్రచారం నిర్వహించాలి.
మహిళలకు సామర్థ్యం పెంచడం ద్వారా స్వయం సహాయక మహిళా బృందాలకు ఈ బాధ్యతను అప్పగించాలి. అవసరమైన మార్గదర్శకాలు, నిబంధనలు రూపొందించి హెచ్.ఎస్.ఏ. 2005 పట్ల ప్రభుత్వ యంత్రాంగానికి అవగాహన పెంచి, ప్రచారం నిర్వహించేందుకు ప్రభుత్వం పూనుకోవాలి.
ప్రభుత్వం నుండి భూమిని, భూమి హక్కులను పొంది ప్రయోజనం పొందేందుకు అనుసరించాల్సిన క్రమ పద్ధతిపై క్షేత్ర స్థాయిలో మహిళలకు అవగాహన లేదు. వారికి చట్ట పరమైన అంశాలపై అవగాహన కల్పించాలి. న్యాయ సహాయం చేయాలి. మహిళలకు భూమి హక్కు కల్పించడానికి అవసరమైన చర్యలన్నీ సింగిల్ విండో ద్వారా చేపట్టాలి. ఇందుకోసం సర్వే రెవిన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల మధ్య అనుసంధానం ఏర్పరచాలి. భూమిపై చట్టబద్ధ హక్కు కల్పించేందుకు భూమి సర్వే, పట్టా తదితరాలపై వివాదాలకు తావు లేకుండా ఖచ్చితమైన విభజన జరగాలి. పంచా యితీ/రెవెన్యూశాఖలు, మహిళా స్వయం సహాయక బృందాలతో (గ్రామ/మండల/జిల్లా) కలిసి, ఈ చట్టం ద్వారా మహిళలకు భూమిపై హక్కును ప్రభుత్వ భూ పంపిణీ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు కృషిచేయాలి. ఉద్యోగులలో జండర్ స్పృహను అభివృద్ధి చేసేందుకు రెవెన్యూ శాఖ ఉద్యోగులలో కనీసం 30 శాతం మహిళలతో నింపాలి. మహిళలకు భూమి హక్కు కల్పించడం విషయంలో అవగాహన, ఆచరణను మెరుగుదిద్దడంలో పౌర సమాజ సంస్థలను, స్వచ్ఛంధ సంస్థలను భాగస్వాములను చేయాలి.
(తొలకరి మాస పత్రిక నుండి)