వర్తమాన లేఖ- శిలాలోలిత

ప్రియమైన ప్రశాంతీ !

ఎలా ఉన్నావ్‌? నువ్వె లాగూ ప్రశాంతంగానే ఉంటావనుకో కొందరికి వాళ్ళ వాళ్ళ పేర్లు సరిపోవు. పూర్తి విరుద్ధంగా ఉంటాయి. నీ పేరు మాత్రం మీ వాళ్ళు చాలా ఆలోచించి పెట్టారు అన్పిస్తోంది. ప్రశాంతంగా, చిద్విలాసంగా, నిర్మలంగా, ప్రేమ పూర్వకంగా, చూడగానే హాయి గొల్పేలా ప్రశాంతమైన చిర్నవ్వు మొఖంతోనే గుర్తొస్తాయి. నిజం ప్రశాంతీ! నీపట్ల అవ్యాజమైన ప్రేమ కలుగుతుంది. ఇంత చిన్న వయస్సులోనే అన్నన్ని పెద్దపెద్ద పన్లు అవలీలగా ఎలా చేస్తున్నావో అని ఆశ్యర్యమేస్తుంటుంది నాకు. మహిళా సమత డైరెక్టర్‌గా నువ్వు చేస్తున్న కృషి సామాన్య మైంది కాదు. సామాజిక సాధికారత కోసం పడుతున్న తపన, స్త్రీలకు మానసిక ధైర్యాన్ని ఇస్తూ, స్త్రీలు సర్పంచులుగా వార్డు మెంబర్లుగా ఉంటే ఎంత సానుకూల వాతావరణం ఏర్పడుతుందో, అక్షరాస్యత ఆవశ్యకతను గురించి, హక్కుల గురించి, వివక్ష గురించి ఒకటేమిటి అసలు నువ్వు సమాజ అభ్యున్నతి కోసం చెయ్యని పనంటూ ఉందా అన్పించి ముచ్చటేస్తుంది. నీలో ఇంతటి కార్యదక్షత నిబిడీకృతమై వుంది కాబట్టే సత్యకు దత్తపుత్రికవై పోయావు. పురుషుల్లో కూడా స్త్రీలపట్ల సున్నిత భావాలు ఏర్పడాలని, జెండర్‌ వివక్షవల్ల స్త్రీలు ఎంతటి హింసకు గురవుతున్నారో విపులీకరిస్తూ బాలబాలికలకు సంఘాలు ఏర్పాటు చేసి, వాళ్ళల్లో మానసిక పరివర్తన కోసం, ఆలోచ నా సరళిలో మార్పు తీసుకురావడంకోసం, రేపటి తరంపై పెట్టిన ముందు చూపు దృష్టి ఎంతో సరైంది సుమా!

 భూమిక నిర్వహించిన ఆదిలాబా దు – నిజామాబాద్‌ ట్రిప్‌లో నువ్వు చేస్తున్న పనిని చాలా దగ్గరగా చూసే అవకాశం దొరికింది. నీ పట్ల ఆయా గ్రామీణ, గిరిజన మహిళలు చూపిన ప్రేమ, ఆప్యాయత చూసి మా కళ్ళు చెమర్చాయి. వీడ్కోలు చెబుతూ వాళ్ళు నిన్ను పట్టుకుని దుఃఖ పడుతుంటే నువ్వు వాళ్ళు కోసం ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నావో ప్రత్యక్షంగా చూడగలిగాం. సమతా నిలయంలోని పిల్లలకి నువ్వు పంచుతున్న ప్రేమ అనితర సాధ్యం ప్రశాంతీ! సత్యద్వారా మాకందరికీ పరిచయమై ఫ్రెండ్‌వి అయినందుకు చాలా సంతోషంగా వుంటుంది నాకు

 ప్రశాంతీ! మనం ఎప్పుడు కలుసు కున్న తక్కువ సమయాలే దొరుకుతున్నాయి కాబట్టి, ఉత్తరంలో నన్నా నీతో మాట్లాడాలి, నువ్వంటే నాకెంత ఇష్టమో, ప్రేమో, ఆరా ధనో చెప్పాలనే ప్రయత్నం మాత్రమే ఇది.

 నీ మీద కంప్లయింట్స్‌ కూడా ఉన్నాయి నాకు. మనిషివి కనబడవు, ఫోన్లో వినపడవు, దొరకడమే కష్టమని కానీ ప్రశాంతీ ఒకటనిపిస్తుంది నాకు, మనం కలుసు కోలేకపోయినా, మానసిక బంధమొకటి మన మధ్య సదా అల్లుకుపోయే ఉంటుందని ఆమధ్యన నువ్విచ్చిన మొగిలిపూల పరిమళం, నిన్ను గుర్తు చేస్తూనే ఉంది. సన్నటి గాలిలో ఆటలాడుకుంటూ నీలో అద్భుతమైన కవిత్వశైలి ఉంది. లోగడ సత్య కోసం నువ్వు రాసిన రైటప్‌లో పూలంత సున్నితమైన భావస్పర్శ వుంది. నీకోసం కాకపోయినా నా కోసం కవిత్వాన్ని అప్పుడప్పున్నా రాస్తూండు. రాయడమనేది అందరూ చేయలేరు. రాసే శక్తి వున్న వాళ్ళు రాయకుండా ఉండటం నా దృష్టిలో నేరమే. స్నేహదక్షిణే అనుకుంటావో, ఆజ్ఞే అనుకుం టావో తెలీదుకానీ, కవిత్వం మాత్రం రా యాలి. వింటున్నావా లేదా? సరే! అనుమరి.

 ‘ఇఫ్లూ’ లోని విషయం విన్నావు కదా! ఎంతదారుణమో, వివక్షో చూడు, ‘తురగా జానకీరాణి’ గారు శరీర విరమణ చేశారు. రేడియో అక్కయ్యగా ఆవిడ ప్రజలకు ఎంతో దగ్గరై, ఈ భూమి మీద స్వరాల విత్తనాన్ని నాటి వెళ్ళిపోయారు కదా! ‘భూమిక’లో పి.సత్యవతిగారు ‘గెస్ట్‌ ఎడిటోరియల్‌’ రాశారు. చాలా అద్భుతంగా ఉందది. నువ్వు కూడా చదివే ఉంటావు కదా! మృణాళిని కూడా బాగా రాసింది.

 వాడ్రేవు వీరలక్ష్మీదేవి కథా రచయిత్రి మంచి విమర్శకురాలు, నీక్కూడా తెలుసుకదూ! ఆమె 60వ పుట్టిన రోజు సందర్భంగా సభను ఏర్పాటు చేశారు. ‘కిటికీ బైట వెన్నెల’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తనపట్ల ఆప్యాయతతో వచ్చిన అందర్నీ చూసి మనసు నిండిపోయిందన్నారు. స్త్రీలకు అరుదుగా ఈ వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఆ రొటీన్‌ దాటి ఆమెకు అభినందన సభను ఏర్పాటు చేయడం సంతోషంగా అన్పించింది నాకు.

 ‘ఒక హిజ్రా ఆత్మకథ’ అని పి.సత్యవతి గారు అనువాదం చేశారు. రేవతి రాసింది. పురుషుల శరీరాల్లో ఇరుక్కొని పోయిన స్త్రీలం అంటుంది రేవతి. స్త్రీ స్వభావం ఉండటం వల్ల స్త్రీలుగా ఉండడా నికి ఇష్టపడతామని రాసింది. స్త్రీగా మారే క్రమంలో ఆమె ఎదుర్కొన్న అవమానాలు, సమాజదృష్టి, దొరైస్వామితో పడ్డ కష్టాలు చాలా రాసింది. మమ్మల్ని కేవలం శరీరాలుగానే కాకుండా మనుషులుగా ఈ సమాజం చూడదనీ, చూడాలనీ రేవతి భావించింది. అందుకై ఆవిడ కృషిచేస్తుంది. అందరూ చదవాల్సిన పుస్తకమది. రేవతి పుస్తకావిష్కరణ సభలు చాలా విలక్షణంగా జరిగాయట. హైదరాబాద్‌లో ఎప్పుడూ లేని విధంగా ఒకే పుస్తకం మూడుసార్లు ఆవిష్కరించబడడం విశేషమే. వేరే పనుల వొత్తిడివల్ల నేను వెళ్ళలేకపోయాను. నువ్వు వెళ్ళే వుంటావు. రేవతి పుస్తకం చదివేసావా? మరి ఉండనా! మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం.

Share
This entry was posted in వర్తమాన లేఖ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.