మా ఆయన పరుశురాముడు, శౌర్యంలో ఏమోగాని క్రోధంలో మాత్రం ‘అపరశురాముడే’! నేను పదో క్లాస్ చదువుతుండగా (బళ్లో ఆలస్యంగా చేర్చడం వల్ల అయితేనేమి నేనంత తెలివిగా చదవకపోవడం వల్ల అయితేనేమి నాకప్పుడు 17 ఏళ్ళు) మా నాయనగారు ఎదో గవర్నమెంటు ఉద్యోగమనీ, ప్రమోషన్స్ వస్తాయనీ, నన్ను ఆపైన చదవనీయకుండా, పెళ్లనే తంత్రంతో, బాగానే కట్నం ముట్ట జెప్పి పల్లెటూరిదాన్నయిన నన్ను ఆయనతో ముడేశారు. కొత్తల్లో తెలీదు కానీ రానూరానూ ఆయన సంపాదనే నాకు అతీగతి గనుక ఆయన మాటే నాకు మంత్రం, ఆయన వా:క్కే వేదమూ, ఆయన ఆలోచనే నా లోచనము, ఆయన తోడిదే నా బతుకైంది. నాకంటే మా ఆయన పన్నెండు ఏండ్లు పెద్ద. అందుకేనేమో ఆయనంటే నాకు భయము ఎక్కువే! నవ్వుతూ మాట్లాడి నా భయం పోగెట్టిందెప్పుడూ!? మానాయనకు, నాకు జోడు చేసినాయనకు పెద్ద అధికారముండే ఉద్యోగమూ, చాలా పెద్దజీతం, ఇంకా చాలా పెద్ద మొత్తంలో గీతం, లంకంత బంగళా, నౌకర్లు, చాకర్లూ, వంట మనుషులూ అన్ని హంగులతో చూసేవారికి నా జీవితం మూడు పువ్వులు ఆరు కాయలూనూ, (నా కడుపున ఆరు కాయలు కాకున్నా నాలుగు కాయలు కాచాయిలెండి!) పల్లెటూరిదా న్నైనా, ఎక్కువ చదువుకోకపోయినా కనీసం మనసుంటదని ఎవ్వరూ గుర్తించని ఆ ఇల్లు మాత్రం నాకు చువ్వల్లేని పంజరం.
మా ఆయన పరుశురాముడే అంటే అందరికి బహుషా నాలాగే పైకి మాత్రం మహాభయం, లోలోపల నాలాగే ఐ ఉండవచ్చు ఎందుకంటే ఆయన మాటకు ఎదురుచెప్పేవారు ఎదగరు. మాట మీరిన వారు మరి ఉద్యోగంలో ఉండరు. అందుకే అందరికీ మా ఆయనంటే నా లాగే వణుకు. నాకు నలుగురూ మగ నలుసులే! అందువల్ల ఇబ్బంది లేకుండా బయటికి వెళ్లే పనే లేకుండా పెరిగి పెద్దై ఆయన కోరిక మేరకు (కోరినంత కట్నం మా ఆయనకు ముట్టాకేలేండి)పెళ్లిళ్లు చేసుకొని విదేశాలకు ఎగిరివెళ్లి వాళ్ల నాన్న పరుశురామాగ్ని నుంచీ బయటపడ్డారు.
నాకు మాత్రం ఆ అదృష్టం లేదు. మా ఆయన గార్ని తిట్టుకోలేక అదృష్టరేఖను నా ముఖాన లిఖించిన బ్రహ్మదేవుని మాత్రం ఆట్టే కాకపోయిన అప్పుడప్పుడూ తిట్టుకుంటూ బ్రతికేస్తున్నాను. పెళైన కొత్తలో ఒకమారు మా స్నేహితురాలొకటి ఈ ఊరు వస్తూ తాను ఆరకు లోయ వెళుతున్నట్లూ కార్లో చోటుందనీ వస్తే తీసుకువెళతాననీ, మూడురోజుల్లో రావచ్చని ఫోన్చెసింది. మా పరశురామున్ని అడిగాను ”ఏమండి! నేనూ మా స్నేహితురాలితో ‘ అరట వెళ్లిరానా? ఎంత మూడురోజులే. వాళ్ల కార్లోనెనట అన్నాను. ”ఛీ మరొకరి కార్లలో, పరాయి మగాళ్లతో తిరగడం నాకిష్టం లేదు. అడక్కు అన్నారు. నా ఉత్సాహంతో మొదటి మారుగా నీళ్లు దిమ్మరించారు. ఏడ్పు ఆపుకోలేక వెళ్లి ఉల్లిపాయతరుక్కుంటూ కూర్చున్నాను. ఉల్లి చేసే మేలు తల్లి చేయదంటే ఏంటో మొదటి మారుగా తెలిసొచ్చింది. రానురానూ నా ఉత్సాహం మీద మా పరుశురాముడు నీళ్లు పోయకుండానే చల్లారిపోయిందని వేరే చెప్పక్కర్లేదనుకుంటా. ఆతర్వాత మా పరుశురామయ్యకు ప్రమోషనొచ్చింది. ఆఫీీస్ వాళ్లే కారు ఇచ్చారు. ఈ మారు వెనక మేమున్న అద్దె ఇంటి ఓనరు భార్య ”అమ్మాయి! నందూ! నందూ! మన ఊరికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంజనేయస్వామికి మా పిల్లాడు పాసైతే నూటొక్క కొబ్బరికాయ కొడతానని మొక్కుకున్నానమ్మాయ్! పెట్రోల్ మేమే పోయించుకుంటాం నీవూ మీ ఆయనా కూడా మాతో రండి, మీ కారు ఓ రెండు గంటలు ఆదివారం నాడు ఇస్తారేమో కనుక్కుందూ!” అంది ఆప్యాయంగా. పెళ్లైన కొత్తలో వారింట్లో ఉన్నంత కాలం నన్ను కూతురులా చూసుకుంది ఆమె.
నా మాట వినగానే మా ఆయన తాటి ప్రమాణంలో లేచి ఇతరులు మన ఆపీస్ కార్లో షికార్లు కొట్టడం నేను సహించను అన్నారు. ఖచ్చింతంగా నాకు తెలుసు ఆయన ఒక్క మారు చెపితే వందమార్లు చెప్పినట్టే! ఇహ మరెవ్వరూ మా పరుశురామున్ని ఏ సాయమూ అడగలేదు.ఇంకా పెద్ద ప్రమోషన్ వచ్చింది.బంగళా, నౌకర్లు చాకర్లు పిల్లల చదువులూ, పళ్ళిళ్లు అంతా పరుశురామయ్య ఇష్టం మేరకే జరిగేప్పుడు నేనొక యంత్రంలా పట్టుచీరలో నగలు దిగేసుకొని, చిరునవ్వు ముఖం పులుముకొని, పెళ్లిమంటపంలో కూర్చొడం, అంతా నందిని ఎంత అదృష్టవంతురాలు! నలుగురు పిల్లలు, మంచి చదువులు ,పెద్ద ఉద్యోగాలు, మంచి పెద్దింటి అమ్మాయిలతో (కావల్సినంత కట్న కానుకలతో) పెళ్ళిళ్ళు, బాదరా బందీ లేని సంసారం అని పొగుడుతుంటే చిరునవ్వు మాస్కు ముఖానికి అతికించుకుని నేను ఇకిలించాను. బాదరా బందీ కాదు. మనస్సూ ఆలోచనలు, స్వతంత్రం లేని రోబో బతుకు అనండి అని లోలోపల ఏడ్చుకుంటూ.
ప్రభుత్వరంగంలోని తన విభాగాన్ని ఒక ఊపుఊపి మా పరశురామయ్య ఉద్యోగ విరమణ పొందిన రోజు బహుశా ఆఫీసు వారంతా పండగ చేసుకొని ఉండి ఉంటారు ఈ జీవి నుండి విముక్తి పొందినందుకు. కానీ నాకు విముక్తి ఎప్పుడు? అని అనిపించిన మాట వాస్తవం. పరుశురాం ఉద్యోగ విరమణ తర్వాత నా పంజరం బతుకు మరి కాస్త ఇరుకౌతుందని నేను కలనైనా తలంచలేదు. రోజంతా దేనికీ స్పందన లేని ఆ ముఖం చూస్తూ బ్రతకాల్సి వచ్చింది. ఇప్పుడు ఆఫీస్ బంగళాలేదు. నౌకర్లు చాకర్లు లేరు. ఉచిత కారు,పెట్రోల్ లేవు. ఉన్నప్పుడైనా నేను తిరిగిందెక్కడికి? వాకిలే వైకుంఠం కడపే కైలాసం బతుకాయె నాది.
మా ఆయన విశ్రాంతి పొందాక పిల్లలు ఒకటే రమ్మని ఫోన్లు చేస్తుండగా ఒకరోజు మా వారిని అడిగాను. ఏమండి పిల్లలు ఒకటే రమ్మంటున్నారాయో, ఒక మాటు వెళ్లొద్దామా! అని. ఏం నేను రిటైరయ్యాక బంగ్లా కార్లు నౌకర్లు,చాకర్లు లేరనా? నాకు వండి వార్చడం కష్టమైందా? నీ పిల్లలింటికి వెళ్దామంటున్నావా? నేను పరాయింట చేయికడగను. అనేశారు. పిల్లలు పరాయివారై పోయారా అనుకున్నానే తప్ప ఎదిర్చి అడిగి వెళ్లలేకపోయాను.
మావారితో విశ్రాంతి పొందిన ఇద్దరు ఆయన స్నేహితులు ఒక మారు వచ్చి ఏమోయ్ పరుశురాం మేముకుటుంబాలతో తీర్ధయాత్రలకు వెళుతున్నాం,నీవు వస్తావా! సరదాగా వెళ్లొద్దాం ఎటూ రిటైరయ్యాక ఆఫీసుల నుండి విముక్తి పొందాం కదా? అని అడిగారు.మా ఆయన ఏమంటారో అని తలుపు చాటు నుంచి వినసాగాను.ప్రభుత్వం రిటైర్ చేసింది. ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకోమని కానీ ఊరు పట్టుకు తిరగమని కాదు ఏ మోస్తుందయ్యా ! తీర్ధయాత్రలకు వెళితే అనేశాడు నిర్మొహమాటంగా ఆడవాళైనా కాస్త బయటి ప్రపంచం చూడాలి కదా! ఇంతకాలం మన కోసం ఇల్లు వదలి బయటికెళ్లింది లేదు కదా? అన్న వారి మాటలకు ఏం వాళ్లేమైనా జైళ్లో ఉన్నారా ఇంతకాలం? అనేశాడు పరుశురామయ్య నీవు మారవు పరుశురాం! వస్తా మరి అని వారు వెళ్లిపోయారు.
కాలం సాగిపోతూనే ఉంది. ఎవరు చేసిన కర్మ వారనుభవించక తప్పదన్నట్లు ఒక రోజున మాపరశురామయ్య బాత్‌రూంలో కాలుజారి పడ్డాడు. తుంటి ఎముక విరిగింది. నేను మొట్ట మొదటిసారిగా మా పక్కింటి వారి సాయం అడిగి తీసుకెళ్లి మంచి ఆసుపత్రిలో వైద్యం చేయిస్తూ మా పిల్లలకు తెలిపాను.అంతా రెక్కలు కట్టుకు వాలారు. మా వెంటరండి మంచి వైద్యం ఉంటుందక్కడ అని అడిగారు. ఆయన ససేమిరా అనేశారు. కొద్దిరోజులుండి అంతా వెళ్లిపోయారు.పిల్లలు వెళ్లేటప్పుడు నా పేర బ్యాంక్ అకౌంట్ తెరిపించి కొంత డబ్బు జమచేసి, క్రెడిట్ కార్డు,ఏటియం కార్డు ఇచ్చి వాటిని ఉపయోగం ఎలాగో కూడా నేర్పారు.నా చిన్నతనంలో ఇవన్ని లేవు, నా పెళ్లయ్యాక కరెన్సీ నోట్లే చూడలేదు. అన్నీ మా ఆయన నౌకర్ల చేత తెప్పించేవారు. చెప్తే ఎవ్వరూ నమ్మని యదార్ధం.
మంచంలో ఉండి వీల్ చైర్లో తిరుగుతూ వెద్యం అందుకుంటూ ఉండగా, అహంతోటి బిపీ కూడా పెరిగిందేమో స్టోక్ వచ్చి చెయ్యీ నోరు కూడా పడిపోయాయి. అన్ని రకాల వైద్యమూ ఐంది. కానీ ఫలితం లేదు. 60 తర్వాత ఐదు పర్సెంట్ మాత్రమే బాగవుతుందని చెప్పేశారు. వైద్యులు ఒక రోజున వారి పాత స్నేహితులు పరామర్శించను వచ్చి పరుశురామా ఇన్ని రోజులు చికిత్స చేయించుకున్నా ఫలితం కనిపించలేదంటే అసలీ అలోపతి వైద్యం నీవంటికి పట్టిందో లేదోని మాకు అనుమానంగా ఉంది! కేరళలోని ఒక ప్రకృతి ఆశ్రమం ఉంది. అక్కడ వైద్యం చాలా చౌకే కాక ఫలితం కనిపించవచ్చు నీవు సరే అంటే మేము ఏర్పాటు చేస్తాం అన్నారు. నేనూ దైర్యం చేసి అన్నయ్య మాట వినండి ఏపుట్టలో ఏ పాముందో ఎవరికి తెల్సు? ఆ వైద్యానికి మీకు నయమై నడుస్తారేమో అన్నాను. ఏకళనున్నారో మొట్టమొదటిసారిగా ఇతరుల మాటలు అంగీకరించి సరే అని తల ఊపి అంగీకారం తెలిపారు. నోరు లేదాయే మాట్లాడడానికి.
వారి స్నేహితులే దగ్గరుండి తీసుకెళ్లి, కేరళ ప్రకృతి వైద్యశాలలో చేర్పించారు.అక్కడ మా ఆయన అడ్మిటయ్యాక పేషెంట్స్ మాత్రమే ఇక్కడ. మీరిక్కడ కాదమ్మా! అందరితో కల్సి కామన్‌హాల్లో వసతి ఏర్పరుస్తాం. వారానికో మారు వచ్చి ఓ గంట ఉందురు, గానీ మిగిలిన సమయంలో మీరూ అక్కడివారితో కల్సి పుణ్యక్షేత్రాలు దర్శించి రావచ్చు దానికి ఏర్పాట్లూ మేము చేస్తాం. సొమ్ము మాత్రం మీరు చెల్లించుకోవాల్సి వుంటుందన్నారు. అలా నాకు చువ్వల్లేని పంజర విముక్తి జరిగి పుణ్యక్షేత్ర దర్శనం సాగింది మాపిల్లలిచ్చిన ఏటియం కార్డుల అవసరం తెల్సింది. బయటి ప్రపంచాన్ని చూపనే దేవుడు మా ఆయన్ను రోగం పాల్జేశాడేమో అనిపించిన మాట వాస్తవం.పాపం పరిహారమగుగాక! ఆతరువాత కొన్నాళ్లకు అక్కడి వారినంతా ఆ ఆశ్రమ యాజమాన్యం పేషెంట్స్ నందరిని మానసిక విశ్రాంతి కోసమని క్షేత్ర దర్శనానికి తీసుకెళ్లగా మా ఆయన్నీ వీల్‌చైర్లో నెట్టుకుంటూ నేను కేరళలోని ఆలయాలు చాలా వరకూ చూశాక,మా ఆయనకు దిగులంటుకున్నట్ల యింది.ఎంత మంచి వైద్యం అందుతున్నా ఆయన కొలుకోలేక వెళ్లిపోయారు. బహుషా బయటి ప్రపంచాన్ని ఎన్నో ఏళ్ల తర్వాత స్వతంత్రంగా చూస్తున్న నా ముఖంలో కనిపించే సంతోషం ఆయన్నేమన్న బాధ పెట్టిందేమో తెలీదుగానీ, ఆయన నుంచీ నాకు ”చువ్వల్లేని పంజరం” నుంచీ శాశ్వత విముక్తి లభించింది.
హైమాశ్రీనివాస్ గారి ‘ ముక్తి ‘ కధ చాలాబావుంది.ఇప్పుడేమోకానీ అక్కడక్కడా ఉండవచ్చునుకూడానూ, ఇలాంటిమగవారి నుంచీ [ భర్తలనుంచీ] ముక్తి అప్పుడే కలుగుతుంది భార్యలకు, మేల్ ఈగో చచ్చేవరకూ వదలదు వారిని.
దేవి.
పురుషాధిక్య ప్రపంచానికి తలవంచితే బ్రతుకంతా పంజరంలోనే…. కాదని ఎదిరిస్తే బ్రతికినంతకాలం పదిమందిలో(తో) పోరాటమే….