చీకటి పేగుల నీడన అంటరాని మొక్కలుగా
ఎదిగిన పాపానికా మమ్మల్నిలా లింగవివక్ష అంటూ,
ఆత్మాభిమానాన్ని, ఆడతనాన్ని, అమ్మతనాన్ని
నిలువునా దోచి బజారులో నిలబెట్టి
నిర్భయ, అభయులుగా తగులబెడుతున్నారు?
మానవ మృగాళ్ల కోరల్లో చిక్కుకొని వారి కామదాహానికి
విషపు బలి అవుతూ.. అరిగిపోయిన అరిటాకు ముల్లు సామెతని
తిరగదోడతారు. మేమేం పాపం చేశామని ?
ద్వితీయ పౌరురాలి ముసుగు తెరలలో మమ్మల్ని కప్పెట్టి
నోట్లో ఇంత మట్టిపోసి, పచ్చగ ఎదిగే మా జీవితాల్లో దుమ్ము కొడ్తున్నారు
పందిరిపైకి పచ్చని తీగై పాకాల్సిన వారం, ఇంటికి దీపమై వెలగాల్సిన వాళ్ల
ఉద్యోగాలు, ఊళ్ళూ ఏలుతున్నందుకా లేదా మీ పురుషహంకార
ప్రాతినిధ్య ప్యూడల్ వ్యవస్థను ప్రశ్నించి నిల్చినందుకా మాకీ శిక్ష?
కొడవలి పట్టిన ఒక చాకలి ఐలమ్మ లేదూ, నాయకత్వ పటిమలో
విచ్చిన కత్తి జోన్ ఆఫ్ ఆర్క్ లేదూ, ఉరిమే ధిక్కార స్వరం
రాణీ పద్మిని లేదూ.. సాహస భరిత సామ్రాజ్యాల్ని నిర్మించటానికి!
అద్భుత ప్రపంచాల్ని మా చుట్టూ నిర్మించుకొనేవారం!
ఇంద్రధనస్సుల్ని మా కళ్ళలోకి ఒంపుకొనేవారం !
అనంతాకాశంలో సగమంటూ రివ్వున దూసుకుపోయేవారం!
మా కాళ్ల కింద కంపబెట్టి, యాసిడ్ దాడుల్తో మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసి
మా తల మీద మురుగు గుమ్మరించి, వరకట్నం చావుల అగ్నికీలల్లో…
జ్వలింపజేస్తూ వికార దృక్కుల లైంగిక వేధింపుల్లో ఎందుకు మమ్మల్నిలా కుతకుత ఉడికిస్తారు?
మీ చెల్లి- తల్లి – కూతురిగా బహుపాత్ర పోషణలో మీ అడుగులకు
మడుగులొత్తుతూ, మీరు పెట్టే శారీరక హింసలకు ఒంటిని హూనం చేసుకుంటు
సుఖాలను మీకిచ్చి దఃఖాల కనుదోయిని కొనుక్కుంటున్నాం.
జన్మతః ప్రతిభాపాటవ తేజోరూపులం!
గుండెల్లో శతఘ్నల్ని పొదవుకున్న ధీరవనితలం!
ఇక మా నైపుణ్యాల ఉలికొసల్నే ఆయుధాలుగా ధరించి
మూడో కన్ను తెరిస్తే.. మృగాళ్ల వికృత క్రీడల ఆటకట్టు !
ఆకాశపు జయకేతనంలో ఉదయిస్తున్న బతుకుపోరులో…
కామించే రాహుకేతువుల తలనరికే మహాశక్తులం.. అపర రుద్రాలికలం!!