జమీల్యా- ఉమామహేశ్వరి నూతక్కి

చింగీజ్‌ ఐత్‌మాతోవ్‌. గర్జించు రష్యా !! గాండ్రించు రష్యా !! అన్న శ్రీ శ్రీ గీతాన్ని చదివి, రష్యా పై ప్రేమను పెంచుకుని, అలాంటి సోవియట్‌ విప్లవం ఇక్కడ కూడా పునరావృతం కావాలని గాఢంగా కోరుకున్న యువత ఒకప్పుడు ఎంతోమంది ! ఆ రోజులు నిజంగా ఎంత ఉత్తేజమయినని !! ఎంత అద్భుతమైనవి !! రష్యన్‌ విప్లవంతో పాటు రష్యన్‌ సాహిత్యం కూడా 70, 80 దశకాలంలో యువత పై చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. విద్యార్ధి ఉద్యమాలలో రష్యన్‌ సాహిత్యం పెద్ద పాత్ర పోషించింది. మాక్సిం గోర్కీ, టాల్‌స్టాయ్‌, చింగీజ్‌ ఐత్‌మాతొవ్‌, షొలకోవ్‌ వంటి రచయితలతో అప్పటి యువతకు అద్భుతమ యిన మానసిక అనుబంధం ఉండేదంటే అతిశయోక్తి కాదు.

వీరందరిలోకి చింగీజ్‌ ఐత్‌మాతొవ్‌ ప్రత్యే కత వేరు. ఒక అనామక కిర్గిజ్‌ ప్రాంతంలో పుట్టి అత్యంత సాధారణంగా పెరిగి కేవలం తన రచనల ద్వారా తనతోపాటు తన దేశానికి ప్రపంచ పటంలో ఒక గుర్తింపు తెచ్చిన అరుదయిన రచయిత ఆయన. కేవలం 50 లక్షల మంది జనాభాతో, కొండలు గుట్టల మయంగా ఉండే కిర్గిస్తాన్‌ ప్రతినిధిగా, కమ్యూని స్టుగా రచనా వ్యాసంగాన్ని ఆరంభించిన చింగీజ్‌ ఐత్‌మాతొవ్‌ ”రచయిత తన అంతరాత్మను ఆవిష్కరించడం కంటే కూడా తన సమాజం అంతరాత్మగా ప్రతిధ్వనించడమే ముఖ్యం” అన్న మాక్సిం గోర్కీ మాటలను శిరసావహించి అన్ని భావజాలాలను తన రచనలలో ప్రతిబింబింపచేసారు.

ఆయన చేసిన రచనలలో అత్యంత అదరణ పొంది ”ప్రపంచంలోనే బహు సుందరమయిన ప్రేమకథ”గా విమర్శకుల ప్రశంసలు పొందిన పుస్తకం ఈ నెల మీకు పరిచయం చేస్తున్న ”జమీల్యా”.. జమీల్యా ఒక అపురూపమయిన ప్రేమ కథ. దీనిని ప్రేమ కథగా అభివర్ణించినా అంతకుమించిన బలీయమయిన సామాజిక సందర్భం, సంస్కృతుల సంఘర్షణ, సమకాలీన జీవన సంక్షిష్టతలను ప్రతిఫలించడం ”జమీల్యా” గాఢతను మరింత పెంచిందని చెప్పవచ్చు.

ఇక కథ విషయానికి వస్తే., జమీల్యా మరిది సయ్యద్‌ ఉత్తమ పురుషలో చెప్పిన కథ ఇది. తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు జమీల్యా. తండ్రి దగ్గర గుర్రపు స్వారీ నేర్చుకుని మంచి ప్రావీణ్యం సంపాదిస్తుంది. ఒకసారి గుర్రపు పందెంలో సాదిక్‌ని ఓడిస్తుంది. ఆడపిల్ల చేతిలో ఓడిపోయానన్న ఉక్రోషంతో ఆమెని ఎత్తుకొని వెళ్ళిపోయి పెళ్ళి చేసుకొంటాడు సాదిక్‌. తెగ సాంప్రదాయం ప్రకారం ఆ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. రష్యా, జర్మనీల మధ్య యుద్ధం ముమ్మరంగా జరుగుతున్న రోజులవి. యుద్ధంలో ప్రతీ యువకుడు పాల్గొనవలసిన పరిస్థితి. గ్రామాలలో వృద్ధులు, పిల్లలు, వికలాంగులు తప్ప ఉండలేని వాతావరణంలో జమీల్యా భర్త సాదిక్‌ యుద్ధానికి వెళ్లవలసి వస్తుంది.

”పండే ప్రతిగింజా యుద్ధ భూమికే” అన్న నినాదంతో యుద్ధంలో పాల్గొంటున్న అవసరాల కోసం., ఇంకా చెప్పాలంటే ప్రతీ స్త్రీ తన భర్త, కొడుకుల కోసం శ్రమించాల్సిన పరిస్థితి. తన చుట్టూ తన ప్రమేయం లేకుండా జరుగుతున్న సంఘటనలను మౌనంగా చూడటం తప్ప సమర్ధించటం లేదా వ్యతిరేకించటం చేయలేని పదహారేళ్ళ సయ్యద్‌ తన వదిన మీద అపరిమితమయిన అభిమానం పెంచుకుంటాడు. జమీల్యా చురుకయిన యువతి. కష్టపడి పనిచేసే మనస్తత్వం, ఎవరిచేతా మాటపడదు. హఠాత్తుగా జరిగిన పెళ్ళి, అంతలోనే తన భర్త యుద్ధానికి వెళ్ళడం – కొత్తగా తనజీవితంలో వచ్చిన ఈ మార్పులు ఆమె ప్రవర్తనపై చాలా ప్రభావతం చూపుతాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ప్రవర్తించే ఆమెను చూసి చిన్నతనమని అత్తరింట్లో పాత్రల చేత రచయిత చెప్పించినా పుస్తకం చదువుతున్న కొద్దీ ఆమె పడే అంతః సంఘర్షణ పాఠకులకు అర్ధం అవుతుంది. జమీల్యా అందంగా ఉంటుంది. ధార్యమయిన శరీరం, ఒయ్యారం ఒలికే తీరు, బిగుతుగా దువ్విన రెండు జడలు,

తెల్లని రుమాలును తమాషాగా నుదటి మీదకు ఐమూలగా వచ్చేటట్టు చుట్టుకున్న తీరు.. ఇలా రచయిత ఆమెను వర్ణించే తీరు అద్భుతం.

ఊరిలో పురుషులంతా యుద్ధంలో ఉన్న పరిస్థితి. యుద్ధంలో గాయపడి వెనక్కి వచ్చిన మగవాళ్ళు ఊరిలోని స్త్రీల పట్ల చూపే ప్రవర్తన చాలా నీచంగా ఉంటుంది. భర్త దూరమయిన బాధ కన్నా, కుటుంబం కోసం పడే శారీరక శ్రమకన్నా ఆడవారిని కేవలం ఒక వస్తువుగా, దారుణంగా చూసే వాతావరణం జమీల్యాను విపరీతంగా బాధపెడుతూ ఉంటుంది. అలాంటి రోజులలోనే గోధుమ పంటను రైల్వే స్టేషన్‌కు గుర్రపు బండిపై తీసుకు వెల్ళేందుకు జమీల్యా అవసరం పడుతుంది. మరిది సయ్యద్‌, యుద్ధం నుండి తిరిగి వచ్చిన దనియార్‌ సహాయంతో జమీల్యా గోధుమ రవాణా మొదలు పెడుతుంది. స్వతహాగా వాగుడుకాయలయిన జమీల్యా, సయ్యాద్‌కి., మాటలలో అత్యంత పొదుపరయిన దనియార్‌కి అస్సలు పొసగదు. దారి పొడువునా దనియార్‌ను ఏడిపిస్తూనే ఉంటారు. ఉదయం వెళ్ళిన వారు రాత్రికి గానీ తిరిగి రాలేదు కాబట్టి… తిరుగు ప్రయాణాన్ని ‘సైపు” మైదానాలలో గుర్రపు బండ్ల పోటీగా మార్చుకుంటారు. తిరుగు ప్రయాణంలో జమీల్యా పాడే పాటలు, వెన్నెల రాత్రులను మరింత అందంగా చేస్తాయి. ఆ పాటలు దనియార్‌ను ఆకర్షిస్తాయి.. మొదట్లో తగవులతో మొదలైనా.. జమీల్యా, దనియార్‌ల మధ్య మంచి స్నేహం కుదురుతుంది.

జమీల్యా భర్త సాదిక్‌ నుంచి ఆమెకు ఆశించిన ప్రేమ ఎప్పుడూ దొరకదు. భార్య అంటే ఒక వస్తువుగా మగాడి ఆస్థిలో భాగంగా చూసి అప్పటి సమాజానికి అసలయిన ప్రతినిధి అతను. భర్త దగ్గర నుంచి ఉత్తరం వచ్చినప్పుడల్లా.. ఆత్రుతతో ఆ ఉత్తరం తెరిచిన ఆమెకు.. కుటుంబ సభ్యుల క్షేమసమాచారాల వాకబు తర్వాత చివరిలో మొక్కుబడిగా జమీల్యా గురించి వాకబు ఆమెను తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. ధనియార్‌తో పరిచయం ఆమెకు కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది. జమీల్యా మనసు లోలోపలి పొరలలో నిక్షిప్తమై, ఇన్నాళ్ళూ నిర్లిప్తత కప్పివేసిన ఉత్సాహం పొంగిపొర్లడం మొదలవుతుంది. ఇన్నాళ్లూ తను ఎదురు చూసిన వస్తువేదో తనను పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. వారిద్దరి మధ్య పెరుగుతున్న స్నేహం మొదట్లో సయ్యద్‌ను ఇబ్బంది పెడుతుంది. అయితే.. వెన్నల రాత్రులలో ధనియార్‌ పాడే పాటలు… అతని గొంతులోని ఆర్తి… అతనికి జమీల్యాను, సయ్యద్‌ను అభిమానులుగా మారుస్తాయి.

ఇదిలా ఉండగా ఒకరోజు రైల్వే స్టేషన్‌లో కలిసిన ఒక సైనికుడు జమీల్యా భర్త రాసిన ఒక ఉత్తరం ఆమెకు అందిస్తాడు. ఎప్పటిలాగే నిర్లిప్తంగా ఆ ఉత్తరం తెరిచిన జమీల్యా తన భర్త యుద్ధంలో గాయపడి త్వరలో ఊరికి తిరిగి వస్తున్నాడనన్న వార్త వినగానే ఒక్కసారిగా బిత్తరపోతుంది. తనకు తెలియకుండానే ధనియార్‌ ప్రేమలో పడిన ఆమె ఏటూ నిర్ణయించుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. చివరకు, సంఘం మన్నన పొందే బంధం కన్నా తన దృష్టిలో విలువయిన బంధాన్నే ఆమె ఎన్నుకొంటుంది. పెళ్ళి అనే బంధం ఏర్పడిన తరువాత సంఘం కట్టుబాట్ల మధ్య జీవించాల్సిన స్త్రీ, భర్తే దిక్కుగా సంతానమే పరమావధిగా జీవించాల్సిన స్త్రీ, సంసారం పట్ల బాధ్యతను ఎందుకు విస్మరించింది? తాను తీసుకున్న నిర్ణయంపై సమాజానికి సమాధనం చెప్పి తీరాలా? అయితే ఇవేమీ జమీల్యా లెక్క చేయదు. తనకు ప్రేమను అందజేయలేనివాడు, ఆమె ప్రేమని పొందలేనివాడు, అతనెంత గొప్ప వ్యక్తి అయినా జమీల్యాకు అవసరం లేదు.

జమీల్యా ధనియార్‌కు తన మనసుని విప్పి చెప్పే సందర్భం, రచయిత చెప్పే తీరు అద్భుతం.. జమీల్యా గురించి ఆనాటి సమాజం ఎన్ని రకాలుగా అనుకున్నా… ఆమెను దగ్గరగా చూసి.. ఆమెలోని అంతః సంఘర్షణలు అతి దగ్గరగా గమనించిన వ్యక్తిగా సయ్యద్‌, జమీల్యా పాత్రను సమర్ధించిన తీరు… రచయిత సయ్యద్‌ పాత్రను మలచిన తీరు అద్భుతం అని చెప్పవచ్చు. తర్వాత రోజు ఒక కాగితం, బొగ్గుముక్క సంపాదించి ఆ దృశ్యం చిత్రిస్తాడు సయ్యద్‌. సయ్యద్‌ జీవిత గతిని మలుపు తిప్పిన సంఘటనగా మనం ఆ దృశ్యాన్ని తన జీవితాంతం ఉదయం నిద్ర లేవగానే చూసేవాడినని చెపుతాడు సయ్యద్‌.

తొలినాళ్ళలో ”జమీల్యా” నవల కిర్గిస్తాన్‌లో ఎన్నో ప్రకంపనలను సృష్టించింది. పురుషాధిక్య, సంప్రదాయ ముస్లిం సమాజం, మరో పురుషుడి కోసం జమీల్యా భర్తను విడిచి వెళ్ళిపోవడాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేకపోయింది. జమీల్యా కథకు నేపధ్యం రెండవ ప్రపంచ యుద్ధం. సోవియట్‌ యూనియన్‌ అంతర్భాగమయిన రష్యాలో స్త్రీ స్వాతంత్య్రానికి అనుకూలంగా జరిగిన అనేక సంఘటనలు అప్పటి సమాజంలో స్త్రీకి కొంత ధైర్యాన్ని, సమాజ కట్టుబాట్లను ఎదిరించే తెగువను ఇచ్చాయి. అటువంటి పరిస్థితులలో ఐత్‌మాతోవ్‌ సృష్టించిన జమీల్యా పాత్ర.. ఒక్క కిర్గిజ్‌.. సోవియట్‌ యూనియన్‌లోనే కాక యావత్‌ ప్రపంచంలోని ప్రతి స్త్రీ తన మనస్సులోకి తను తొంగి చూసుకొనేలా చేసింది.

సామాజికంగా సరికొత్తగా విలువలు, వ్యవస్థలు పొందు కొల్పుకుంటున్న సంధి దశలో కిర్గిస్థాన్‌ ఎదుర్కొన్న జాతీయ, సాంఘిక, సైద్ధాంతిక సంఘర్షణలకు అద్దం పడుతుంది ఈ రచన. ఒక వైపు కుటుంబం పరువు ప్రతిష్ఠలు, జాతి గౌరవం వంటి తరతరాలుగా వస్తున్న కిర్గిజ్‌ గిరిజన సాంప్రదాయాలు. మరోవైపు సోషలిస్టు భావజాలం తీసుకు వస్తున్న సరికొత్త ఆలోచనా ధారల మధ్య సామాన్య జీవితాలు పొందే మానసిక సంఘర్షణ ”జమీల్యా” లోని ప్రతీ అక్షరంలోనూ మనకు కనిపిస్తుంది. అలాంటి అభ్యదయ తరానికి ప్రతినిధిగా చూపబడ్డ జమీల్యా పాత్ర తనకు కావలిసిన ప్రేమ దొరికనప్పుడు ఇక వెను తిరిగిచూడదు.

అంతిమంగా జమీల్యా ధనియార్‌ల పయనం సరికొత్త సోవియట్‌ జాతి, సోవియట్‌ జీవిత నిర్మాణానికి ప్రతీకగా నిలుస్తుంది. పాకెట్‌ సైజ్‌లో ఉండే 96 పేజీల చిన్ని పుస్తకమిది. సున్నితమయిన కథ., పరుగులు పెట్టించే కథనం. ఇబ్బంది పెట్టని ఉప్పల లక్ష్మణ రావు గారి అనువాదం.. ముగింపుతో కథ మొదలవుతుంది కాబట్టి ఏమవుతుందో అన్న ఆదుర్దా ఉండదు. అయితేనేం కధలో లీనమయిన ప్రతి ఒక్కరికీ చదవడం పూర్తయిందన్న విషయం అర్ధం కావడానికి సమయం పడుతుంది. ప్రతి పాఠకుడి మనస్సు పెను మార్పు కోసం ఆలపిస్తోన్న సమూహ గీతంలో శృతి కలుపుతుంది.

Jamilya

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

One Response to జమీల్యా- ఉమామహేశ్వరి నూతక్కి

  1. Anil Battula says:

    జమీల్యా – సమీక్ష చాలా బాగా రాశారు..నాకు బాగ నచ్హింది…ఆనాటి కాలమాన పరిస్థుతుల్ని వివరించిన తీరు చాల బాగుంది..మరిన్ని సొవియట్ పుస్తకాల గురించి రాస్తారని ఆశిస్తూ….సొవియట్ పుస్తక అభిమాని ….అనిల్ బత్తుల

Leave a Reply to Anil Battula Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.