తెలంగాణల ఆడోల్లమున్నమా! వుంటే ఎక్కడున్నము, ఏమైనట్లు? రాజకీయంగ, ఆర్థికంగా, సాంఘికంగా, సాంస్కృతికం గా, విద్య, తాత్వికంగా అశక్తతలన్ని చుట్టు ముట్టినపుడు ఏం జెయ్యాలె ఏంజేస్తము? మనుసుకు బతికున్న శవాలోలె మాకు మేము కనిపిస్తున్నము. అందరికి యిదే తండ్లాట పేల్కలు పేల్కలుగా, పోసలు పోసలుగా యిదే కుందాపన.
ప్రజాస్వామ్యములో వున్నామని చెప్పుకుంటున్న యీ కాలం కంటే ఏడు వందల సంవత్సరాల కింద అంటే క్రీ.శ. 13వ శతాబ్ద కాలంలో ఆడోల్లు ముఖ్యంగా బహుజన మహిళలు రాజ్యాలేలిండ్రు. యీ శతాబ్దాన్ని బహుజన మహిళా సాధికార శతాబ్దమని ప్రకటించుకోవాలి. ఆ కాలాన రుద్రమదేవి తెలుగు నేలనేలింది. మైసూర్‌లో ఎల్లమ్మ పాలించిందని ఏన్నిమార్లు యిప్పటికి పాడుకుంటారు కర్నాటకలో. బానిస వంశము నుంచి రజియా సుల్తాన ఢిల్లీ సామ్రాజ్యాధినేత అయింది. యివి కొన్నే… యింకా ఎక్కడెడ ఎవరెవరో ఆ కాలాన తవ్వి తీయాల్సింది. ప్యూడల్ కాలములోనే ఆడవాల్ల పట్ల యింత పరిణితి కనబరిచిన ఆ కాలాలపట్ల చాలా ఆసక్తి గౌరవాలనిపిస్తయి. ఏడొందల యేండ్ల కింద జెండర్ ప్రజాస్వామ్యాలు కనిపిస్తున్నయి గానీ… భూగోళమంతా ఒక్కటే గ్రామం ఓ… అభివృద్ది అని మాట్లాడుకుంటున్న యీ కాలంలో కనీస ప్రజా స్వామ్యాలు కనబడకపోవుడు పెద్ద విషాదము. గత కాలము మేలు వచ్చుకాలము కంటే అనేది యిది వరకు వ్యతిరేకించి మంచి గతమున కొంచమే అనే దాన్నే ఎక్కువ సపోర్టు చేద్దుము. కాని అది యిప్పుడు తప్పనిపిస్తుంది. కొత్త తెలంగాణల మహిళలెక్కడున్నరు? ఏ విభాగంలో, ఏ నాయకత్వంలో ఏ ఆధిపత్యంలో, ఏ సాధికారంలో, ఏ గుర్తింపు గౌరవాల్లో వున్నారని చూస్తే యిప్పటిదాకా యింకా ఏమి మహిళల దాకా వస్తలేవు. పెండ్లి భోజనంలో ఆఖరికి మిగిలినవి, తగిలినవి, సల్లారినవి, అడుగు బొడుగుల్ని సర్దుకొమ్మంటారేమో!
తెలంగాణ ఉద్యమం ఆడవాల్లు లేకుండా సాగలేదు. ఆడవాల్ల భాగసామ్యాలున్నా నాయకత్వాల్లోకి రాకుండా జాగ్రత్తపడింది తెలంగాణ ఉద్యమం. అన్ని జెఎసి ల్లో అంటే ఒక రాజకీయ జెఎపి కాకుండా మిగితా ఉద్యోగ, టీచర్స్, లాయర్స్, డాక్టర్స్, ఆర్టీసీ, నర్సుల, లెక్చరర్స్ లాంటి వాటిలో, రాజకీయ పార్టీ (టిఆర్‌ఎస్)లో కార్యకర్తలుగా క్రియాశీలకమైన పోరాటాలు చేసినా వాల్లు నాయకత్వ స్థానంగా గుర్తించబడలే… సహాయ నిరాకరణలు, సకలజనుల సమ్మెలు, పాదయాత్రలు, రాస్తారోకోలు ఆంధ్ర రాష్ట్రాలకు అడ్డగోడలైండ్రు. లాఠీ చార్జీలు తిన్నరు. ఆంధ్రపాలకుల వాహనాలకు, మీటింగులకు అడ్డంబడి ఆపిండ్రు. తెలంగాణ జెండాలు బ్యానర్లు మోసి సేతులన్ని, భుజాలన్ని కాయ గాసినయి. పొలికేకల మీటింగులు, మిలియన్ మార్చ్‌లు, సాగర హారాలు, రైల్‌రోకోలు చేసినా బత్కమ్మలాడినా, బోనాలెత్తినా మా స్థానాలు మందబలంకోసమే అని తెలవది. ఫలితాలు రావు యీల్లదాక.
పోరాటాలు, నక్సల్ పోరాటాలు, దళిత ఉద్యమాలు, దండోర ఉద్యమాలు కూడా మహిళా నాయకత్వాల్ని గుర్తించలే, గౌరవించలే. యీ అన్ని ఉద్యమాలు వాటి చరిత్రల్లో ఆడవాల్లని మిగిలనీయకుండా అవాచ్యం చేసినయి. ఆ ఉద్యమ ఫలితాలు మహిళలకు అందనట్లే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధించినంకకూడా ఉద్యమ ఫలాలు మహిళలకు యింకా చేరువ కాని దూరంగానే వుంది.
కొత్త తెలంగాణలో అన్ని సామాజిక అస్తిత్వాలు కొన్ని ఆశల్ని, ఆశయాల్ని కట్టుకుంటాయి. కొన్ని మెరుగుల్ని కల గంటాయి. కాని ఎన్నికల టికెట్స్ కేటాయింపులే చెప్పినయి మహిళలకు ఏ స్థానము కల్పించారోననేది. 119 ఎంఎల్‌ఎ సీట్లకు కనీసం 40,30 టికెట్లు కూడా తెలంగాణ రాజకీయ పార్టీ మహిళలకు కేటాయించని మగాధిపత్య రాజకీయాలు చూసినం. వున్న ఆరుగురు ఎమ్మెల్యేల్లో ఒక్కటంటే ఒక్క మహిళ మంత్రి లేకపోవడం కొత్త తెలంగాణ దౌర్భాగ్యం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మహిళా మంత్రిలేని రాష్ట్రం లేదు. అదీ తెలంగాణ తప్ప. 2వసారి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినా మహిళా మంత్రిలేని క్యాబినేట్‌గా తెలంగాణ మంత్రి మండలి వుందంటే తెలంగాణ మహిళా ఆత్మగౌరవాలు ఏ రీతన వున్నయో అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణ జనాభాలో ఒక సగాన్ని విస్మరించే పాలన ఎంత అభివృద్ది అయినా ఎన్ని హర్మ్యాలు నిర్మించినా అది సమగ్రాభివృద్ధి కాదు. మహిళా రక్షణ కమిటీలు వేయడమే మహిళల్ని ఉద్దరించినట్టుకాదు.