యస్.శ్రీదేవి
(భూమిక కథల పోటీలో మొదటి బహుమతి పొందిన కథ)
”పెళ్ళికి రావాలని నాకెంతగా వున్నా నాన్న వప్పుకోలేదురా!
ఎందుకురా, ఇప్పుడంత డబ్బు తగలేసి? వెళ్ళి ఆర్నెల్లవలేదు.
ఇలాగైతే డబ్బు సంపాదించినట్టే . . . మిగిల్చి తెచ్చినట్టే . . . అని కోప్పడ్డారు. నాకైతే మిమ్మల్నందర్నీ చూడాలనుందిరా బావా! నాదికాని చోట, నాకు సరిపడని తిండి తింటూ, ఎవరికో అర్థమవాలని వాళ్ళ భాషలోకి నా అనుభూతులని తర్జుమాచేసుకునే ప్రక్రియలో వాటిని చంపేసి కేవలం అనుభవాలే మిగుల్చుకుంటూ బతకడం చాలా అయిష్టంగా వుంది . . .” అన్నాడు అత్తయ్య కొడుకు ఉమా. పెద్దనాన్న కూతురు మంగ పెళ్ళికి రాలేకపోతున్నందుకు వాడికి బాధ. ప్రస్తుతం అమెరికాలో వున్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేసి, ఎన్నో అప్పులు చేసి అమెరికా పంపారు మామయ్య. వెళ్ళటం సరదాగానే వెళ్ళాడుగానీ అక్కడికెళ్ళాక బెంగ మొదలైంది. ఎప్పుడెప్పుడు తిరిగి వస్తానాని తపన.
* * *
మంగ పెళ్ళైపోయింది. అప్పటిదాకా మాతో ఆడిపాడి అల్లరి చేసిన మంగ ఒక్కసారి పెద్దదైపోయింది. మధుపర్కం చీర కట్టుకుని ఒక అపరిచితుడి చిటికెనవేలిని పట్టుకుని కొత్త బంధం ఏర్పరుచుకుంది. పెళ్ళి హడావిడంతా అయింది. ఇంక అంపకాలు. అవతల కారు రెడీగా వున్నా తను ఇంకా తన గదిలోనే వుండిపోయింది. పిలుచుకొద్దామని వెళ్ళాను. పుస్తకాల అరలో ఏవో వెతుక్కుంటోంది.
”ఒక్కదానివీ ఏం చేస్తున్నావమ్మా? వాళ్ళంతా నీకోసం ఎదురుచస్తున్నారు” అన్నాను.
తను తలతిప్పింది. ముఖం ఉద్వి గ్నంగా వుంది. పెదవులు చిన్నగా అదురు తున్నాయి.
”పుట్టిపెరిగిన ఇంటినీ, పరిసరాలనీ మిమ్మల్నీ వదిలిపెట్టి ఇంకెక్కడికో వెళ్ళి కొత్తవాళ్లమధ్య ఎప్పటికీ అక్కడే వుండి పోవాలన్న ఆలోచన నాకెందుకో భయం కలిగిస్తోందన్నయ్య!” అంది. తన గొంతు కూడా వణుకుతోంది.
అప్పటిదాకా పెళ్ళి అనే నాణెం యొక్క అందమైన పార్శ్వాన్ని మాత్రమే చూసిన నేను ఇప్పుడు విషాదకరమైన రెండో పార్శ్వాన్ని చూస్తున్నాను.
”వచ్చివెళ్తునే వుంటావుకద మంగా!” అన్నాను.
”కానీ అతిథిగానే”. నేను నిర్విణ్ణుడి నయను. కాదనలేని వాస్తవం అది. ఏవో మాటలు చెప్పి మభ్యపెట్టి తనని ఓదార్చాలని పించలేదు. ఆ నిజాన్ని యథాతథంగా స్వీకరించే ప్రయత్నం చేసాను. బహుశః నేను ఈ గదిలోకి అడుగు పెట్టినప్పటికి తన అదే చేస్తుండవచ్చు.
”ఏం చేస్తున్నారే లోపల?” పెద్దమ్మ వచ్చింది. ”అక్కడ వాళ్ళు తొందరపడు తున్నారు. ఇక్కడీ గదిలో ఏం కబుర్లు?” అంది వస్తూనే. మంగ కళ్ళలో నీళ్లు నిలిచాయి. ”అమ్మ!” పెద్దమ్మ భమీద తలానించి ఏడ్చేసింది. ”బావుండదు మంగా! ఈ ఏడుపేమిటి అసహ్యంగా? వాళ్ళేమను కుంటారు?” తను కన్నీళ్ళు తుడుచుకుంటూనే కోప్పడింది పెద్దమ్మ.
అర్థమైంది. త్యాగంకూడా నవ్వుతూనే చెయ్యాలి . . . ఎలాంటి పరిస్థితుల్లో చేసినా ఎంత బలవంతంమీద చేసినా. లేకపోతే స్వీకరించడానికి అవతలివారికి ఇబ్బందిగా వుంటుంది . . . అతన్ని చేసుకుని అతని వెంట వాళ్ళింటికి వెళ్ళటం తన అదృష్టం అన్నట్టు మంగ వుండగలిగితే తన వైవాహికజీవితం చాలా హేపీగా వుంటుంది.
కొద్దిసేపటికి సర్దుకుని మంగ అత్తవారింటికి వెళ్ళిపోయింది. కారు కనుమరుగయేదాకా చూసి మేం లోపలికి వచ్చేము.
”నీ ప్రయాణం ఎప్పుడు? ఒక్కడివే వెళ్తావా, నీ భార్యనికూడా తెసుకెళ్తావా?” అడిగింది అమ్మ నన్ను.
”అవనిని కొద్దిరోజులు వుంచ కూడదూ? అందరూ ఒక్కసారి వెళ్ళిపోతే ఇల్లుబోసిపోతుంది.” అంది పెద్దమ్మ.
”అదా? ఇక్కడా? శివా ఆఫీసుకి వెళ్ళింది మొదలు వచ్చేదాకా గేటుకే కళ్ళు అతికించి వుంచుతుంది. ఈ ప్రేమలేమిటో… ఈ విడిచిపెట్టి వుండలేకపోవటాలేమిటో మనప్పుడు తెలీవు” అమ్మ చెప్పింది. కానీ ఆ ఎదురుచపులకర్థం నాకు తెలుసు. మా పెళ్ళై ఆరునెలలైంది. గేటు చిన్నగా చప్పుడైనా వులిక్కిపడి ఆశగా చూస్తుంది అవని, వాళ్ళ నాన్నగారు వచ్చారేమోనని. వాళ్ళదీ ఈ వూరే. ఆయన ఎప్పుడైనా వస్తే తన కళ్ళు దీపాల్లా వెలుగుతాయి. ఆయన కాకుండా ఇంకెవరేనా అయితే నిరాశ. కొంతలో కొంత నన్ను చూసినా తన కళ్ళలో వెలుగుంటుంది. ఆ చిరువెలుగుని గురించే అమ్మ అంటున్నది.
అవని నాతో వస్తుందనే విషయం మా ఇద్దర్లో ఎవరం బైటికి అనకపోయినా దానంతట అదే సెటిలైపోయింది.
తపస్వినీ నదిమీద భారీ ప్రాజెక్టు కడు తున్నారు. దాన్ని మా కంపెనీకి కాంట్రాక్టు కిచ్చారు. ఇంతకాలం పేపరువర్కు జరిగింది. అచనాలు ఆమోదించబడ్డాయి. పర్యావరణ శాఖ నుంచీ, అటవీశాఖనుంచీ అనుమతి వచ్చింది. అక్కడుండే యాభైవేల కోయజాతి కుటుంబాలు నిర్వాసితులౌతారు. వాళ్ళకి పునరావాసం కల్పించటానికి ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. కానీ ఆ కోయలు స్థలాన్ని మాకప్పగించి వెళ్ళటానికి ప్రతిఘటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాకు ప్రాజెక్టుసైటులో క్వార్టర్సు కట్టిచ్చి ప్రాజెక్టు నిర్మాణంపని మొదలు పెట్టింది మా కంపెనీ. ఇప్పుడు నేనక్కడికి వెళ్ళాలి.
సిటీకి బాగా దూరంగా అడవిలోప లెక్కడో వుండాలి. కంపెనీ ఎన్ని సదు పాయలు కల్పించినా దూరం దూరమే. ఆ తర్వాతిరోజే మా ప్రయాణం. ”ఇల్లుదాటి ఎటూ వెళ్ళకండి. టార్చిలైటు ఎప్పుడ దగ్గిరుంచుకోండి. రాత్రులు బైటికి వెళ్ళద్దు. స్టాఫుతో కలిసే వెళ్తున్నారుగాబట్టి ఇప్పుడు మేం రాము. వీలుచూసుకుని వస్తాం” అమ్మ జాగ్రత్తలు చెప్పింది. అవని తల్లిదండ్రులు కూడా వచ్చి వీడ్కోలు చెప్పారు.
కంపెనీ టాటాసువె ఏర్పాటు చేసింది. దాదాపు పన్నెండుగంటల ప్రయాణం. అందులో ఐదుగంటలు అడవి లోలోప లికి. ప్రయాణం సరదాగానే అనిపించింది. విశాలంగా రెండు బెడ్‌రూమ్స్, హాలు కిచెనుతో మాకిచ్చిన ఇల్లు చాలా బావుంది. చుట్టూ కనుచూపుమేరంతా ఆకాశాన్ని కప్పేస్తూ పచ్చటి చెట్లు. దూరాన్నుంచీ తపస్వినీ నది గలగలలు.
కుటుంబాలమధ్య పరిచయాలు పెరగాలనీ కొత్తవాతావరణంలో అలవాటు పడాలనీ మొదటి వారంరోజుల కంపెనీ గెస్టుహౌస్‌లో లంచీ డిన్నర ఏర్పాటు చేసారు. పిక్నిక్‌లా సరదాగా గడిచిపోయింది. కానీ వారంరోజులు అంత సన్నిహితంగా గడిపేసరికి ప్రథమ పరిచయంలో కనిపించే డీసెన్సీ కనుమరుగై దానివెనుక దాగి వుండే అసలు వ్యక్తిత్వం బహిర్గతమవటం మొదలైంది. రావుకి గర్వం ఎక్కువ. సుందర్ భార్యకి అహంభావం ఎక్కువ. రాహుల్ అసంతృప్తి మనిషి. విక్రమ్ చాలా సెల్ఫ్‌సెంటర్డ్. నాగురించీ అవని గురించీ కూడా ఏవో అంచనాలు వుండే వుంటాయి. ఇలా ఒకరికొకరం అర్థమయాక దరాలు మెయింటెయిన్ చెయ్యటమే మంచిదని అందరికీ స్వంత వంటలు మొదలు పెట్టాము.
???
పగలంతా నేను సైట్‌లో వుంటాను. అవని ఇంట్లోనే వుంటుంది. బలంగా నాటుకున్న మొక్కని ఒక చోటినుంచీ పీకి మరోచోట పెట్టినప్పుడు ఎలా వడిలి పోతుందో అలాంటి మార్పుకి తనలో సూచనలు కనిపించాయి నాకు. క్రమంగా సర్దుకుంటుందనుకున్నాను.
బైటి ప్రపంచంతో దాదాపుగా సంబంధాలు తెగిపోయాయి. సిగ్నల్స్ దొరక్క ఫోన్లు పక్కని పడ్డాయి. టీవీ పరిస్థితీ అంతే. కేబుల్ నెట్‌వర్కు లేదు. అతికష్టమ్మీద న్యూస్ పేపరు, కొన్ని పత్రికరు వస్తున్నాయి. అమ్మవాళ్ళతో మాట్లాడాలనే తీవ్రమైన తపన మొదలైంది. రెండుకిలోమీటర్లదూరంలో పోస్టాఫీసుంది. అక్కడికి వెళ్ళి కార్డులు, కవర్లు తెచ్చుకుని వచ్చాను. అవనీ నేనూ చెరో రెండు వుత్తరాలు రాసాము. వాటిని పోస్టు చేసాను. వాళ్ల జవాబుకోసం ఎదురుచూపులు.
”ఇలా ఎంతకాలం? ఇదేం వుద్యోగం?” నిరుత్సాహంగా అడిగింది అవని.
ఇక్కడా మనుషులున్నారు. విల్లమ్ములు పట్టుకుని తిరిగే కోయవాళ్ళు, గంపల్లో ఏవో వెసుకుపోతుండేవాళ్ళు, తరుచుగా కనిపిస్తుంటారు. సరైన వస్త్రధారణ తెలీని, నాగరికత లేని మనుషులు. వాళ్ళసలు మన తోటివాళ్ళలా అనిపించరు.
సైట్లో తరుచుగా వీళ్ళగురించిన ప్రస్తావన వస్తుంటుంది.
”చక్కగా ఇళ్ళుకట్టించి, పొలాలిచ్చి బతకమంటే బతకరట ఈ మూర్ఖజనం. ఈ నేల వాళ్ళదని విడిచిపెట్టి వెళ్ళమని గొడవ. విల్లమ్ములు పట్టుకుని యుద్ధానికి బయల్దేరినట్టు వచ్చారట పట్టాలిచ్చేరోజు” సుందర్ చెప్పాడు.
”ప్రాజెక్టు పూర్తైతే కొన్ని లక్షల ఎకరాలకి నీరు దొరుకుతుంది. పంటలు పెరుగుతాయి. తిండికొరత తగ్గుతుంది” అన్నాడు రావు.
”దేశం బాగుపడాలంటే ఇలాంటివాళ్ళే ఆటంకం. చదువూ సంధ్యాలేని మూర్ఖజనం. వంటినిండా బట్టల్లేకుండా చదువుసంధ్య ల్లేకుండా ఎలా వున్నారో చూడండి” నిరసనగా అన్నాడు రాహుల్.
వీళ్ళందరికీ దేశం వున్నపళంగా అమెరికాగా మారిపోవాలని వుంటుంది. అక్కడి డాలర్ల, అక్కడి సదుపాయాలు ప్రలోభపెడుతుంటాయి. కానీ ఎట్ హూజ్ కాస్ట్ అనే ప్రశ్నకి వచ్చే జవాబు అంత ప్రమోదంగా వుండదు. అమెరికా రెడ్‌ఇండి యన్స్‌ని ఏం చేసిందో అడగాలి. ఆస్ట్రేలియా అక్కడి ట్రైబల్స్‌ని ఎలా వేటాడి చంపిందో చెప్పమనాలి. ఇక్కడిను౦చీ ఈ కోయలు తమదని నమ్ముకున్నవన్నీ వదులుకుని ఎక్కడికో వెళ్ళిపోయి తమది కాని జీవన శైలిలో అయిష్టంగా బతుకుతుంటే ప్రాజెక్టు ఆయకట్టువలన వేరే కొందరు రైతులు బాగుపడతారు. దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. నాకెక్కడో అసంతృప్తి మొదలైంది.
మా టీమ్‌లీడర్‌తో అన్నప్పుడు అతను చిన్నగా నిట్టూర్చి-
”నిజానికి ఇంతంత పెద్దపెద్ద ప్రాజెక్టులవీ అవసరం లేదనుకుంటా. మనకి చెఱువులు చాలా వున్నాయి. వాటిని మరమ్మత్తు చేసి, కబ్జాలు తొలగిస్తే చాలు. కానీ ఎవరు వింటారు? ప్రాజెక్టు కట్టడం ప్రభుత్వానికి అవసరం. కాంట్రాక్టు మన కంపెనీ మనుగడకి అవసరం. ఉద్యోగం మనకి అవసరం” అన్నాడు.
వందేళ్లేనా బతకని మనిషి తన అహంకోసం, వెయ్యేళ్ళేనా నిలబడని తన సంస్కృతికోసం ప్రకృతినీ తోటివాళ్లనీ బాధపెడుతున్నాడు! ఇలా అనిపించాక నాకు చేస్తున్న వుద్యోగం మీద ఆసక్తి తగ్గిపోయింది.
* * *
నా దినచర్య క్రమబద్ధంగా మారింది. ఉదయాన్నే లేవటం . . . జాగింగుకి వెళ్ళటం . . . వచ్చేసరికి వేడివేడిగా టిఫి¦ను . . . తిని తయారై సైటుకి వెళ్ళటం . . . మళీ మధ్యాహ్నం భోజనం . . . రాత్రి ఏవేళకో ఇల్లు చేరటం . . . అవని ఇంటిమీద బెంగపడుతోందన్న విషయాన్ని గుర్తించ లేనంత బిజీ షెడ్యూలు.
ఆ రోజు అలాగే . . . వుదయాన్నే జాగింగుకి వెళ్ళాను. చుట్ట వున్న ప్రకృతి ప్రలోభపెడుతుంటే చాలా దూరమే వెళ్ళాను. దార్లో ఒకరిద్దరు కోయవాళ్ళు నాకెదురుపడ్డారు. వాళ్ళు నన్ను చూసి భయంభయంగా తప్పుకుని వెళ్ళిపోయారు. ఇంకా కొంచెం వెళ్ళాక ఇంక వెనక్కి తిరుగుదామని తిరగబోతుంటే హఠాత్తుగా వచ్చి నా ఎదురుగా నిలబడ్డాడొక యువకుడు. నల్లగా పోతపోసిన ఇనుప విగ్రహంలా దృఢంగా వున్నాడు. చేతిలో విల్లమ్ములున్నాయి. చూపులు తీక్షణంగా వున్నాయి. నన్ను చూసి ఏదో అన్నాడు. అర్థమవలేదు. బాణాన్ని నా గెడ్డం కొనకి ఆనించి మళ్లీ ఏదో అన్నాడు. ఆ తర్వాత ఇంక ఆలోచించక నన్ను బొమ్మని తిప్పినట్టు తిప్పి నాషర్టు ఇప్పి తీసేసుకున్నాడు. నేను తెల్లబోయి చూస్తూ ఆ చర్యకి అర్థం ఏమిటాని ఆలోచిస్తుంటే రూపాయ బిళ్ళ నా చేతిలో పెట్టి నవ్వుకుంటూ వెళ్లిపోయాడు.
నడిచినంతదూరం మీదేమీ లేకుండా తిరిగొచ్చాను. చాలా ఇబ్బందిగా అని పించింది. సిగ్గు, అవమానం కలిగాయి. ఎవరతను? ఎందుకలా చేసాడు? షర్టు కాలని ఇలా చేస్తే రూపాయి ఇవ్వట మేమిటి?”షర్టేది?” నన్ను చూడగానే అవని అడిగిన మొదటి ప్రశ్న. ”దార్లో ఎవరో చలికి వణుకుతుంటే ఇచ్చాను” అబద్ధం చెప్పాను. తను నమ్మింది. అందులో నమ్మకపోవటానికి ఏమీ లేకపోవటంతో. ”అలా ఇవ్వకండి. ఇంటికి రమ్మని చెప్పండి” చిన్నపిల్లవాడికి చెప్పినట్టు చెప్పింది. నేను తలూపానుగానీ ఇంకా ఆ సంఘటన నా మెదడుని తినేస్తూనే వుంది.
అలాంటివే ఇంకో రెండు సంఘ టనలు . . . సుందర్‌ని దారికాసి అతని సెల్ లాక్కున్నారట. . . ఇలాగే రూపాయి చేతిలో పెట్టి. పాతికవేలు ఖరీదు చేసే ఫారిన్‌పీస్. చాలా ఫీచర్స్ వున్నాయి అందులో. వాడకపోతే పాడైపోతుందని రోజూ ఛార్జిచేసి గేమ్స్ ఆడుతుంటాడు. ఎంపీత్రీ ప్లేయరుగానూ, కెమేరాగానూ వాడు తుంటాడు. రాహుల్ కళ్ళద్దాలు పోయాయి. అతనికి టూపాయింటు ఫైవ్ బైఫోకల్. మళ్ళీ కళ్ళద్దాలొచ్చేదాకా చాలా ఇబ్బందిపడ్డాడు.
???
అమ్మవాళ్ళ దగ్గిర్నుంచీ మేం రాసిన వుత్తరాలకి జవాబులు వచ్చాయి.
”ఈ వుత్తరాలేమిటి? టెక్నాలజీ పెరుగు తుంటే సదుపాయాలు అందు బాటులోకి రాకుండా పోవటం హాస్యాస్పదం గా వుంది. మీరిద్దరూ ఎలా వున్నారు? కొత్త వాతావర ణానికి అలవాటుపడ్డారా? నీ సంగతిసరే, బైటికెళ్ళి నలుగుర్లో తిరిగే మనిషిని. అవని ఎలా వుంది? తనకి కాలక్షేపం ఎలా జరుగుతోంది? వాళ్ళ మ్మ నాన్నగారు అదే బెంగపడుతున్నారు, ఇక్కడ పదిమంది మధ్యని అలవాటుపడ్డ పిల్ల అక్కడ వంటరిగా ఎలా వుండగలుగుతోందని. ఉద్యోగంలో పడి తనని నిర్లక్ష్యం చెయ్యకు. జవాబు రాయటం కాదు, దగ్గిర్లో వున్న సిటీకి వచ్చి ముందు ఫోన్ చేసి మాట్లాడు. వీలునిబట్టి నేనో నాన్నో, వాళ్ళవాళ్ళో వస్తాం. పెళ్ళి పనుల్లో తిరిగేసరికి పెద్దమ్మకి కీళ్ళనొప్పులు బాగా ఎక్కువయ్యయి. మంచం దిగలేక పోతోంది. నేను రావటం డౌటేగానీ నిన్ను చూడాలని మనసు కొట్టుకుంటోంది. మంగ బాగానే వున్నానని ఫోన్ చేసింది. కానీ కొంచెం దిగులుపడుతున్నట్టుగా వుంది. తప్పదు మరి. పెళ్ళన్నాక అంతే. ఫోన్ చెయ్యి – అమ్మ”
ఆ వుత్తరం చూసాక నాకు ప్రాణం లేచి వచ్చినట్టైంది. ఎన్నిసార్లు చదువు కున్నానో!
”ఎంతకాలం మనమిక్కడ వుండాలి? విసుగ్గా అనిపిస్తోంది” అంది అవని.
”అప్పుడే? కనీసం రెండేళ్ళు” నవ్వాను.
”నావల్లకాదు. మీకేం? సైట్లోకెళ్ళి పోతారు. రోజంతా ఒక్క దాన్నే. బోర్ కొడుతోంది.”
”చుట్టుప్కలవాళ్ళతో ఫ్రెండ్షిప్ చెయ్యి.”
”ఒక గంటా రెండుగంటలు. అంతకు మించి గడిపేంత అనుబంధం మనకీ వాళ్ళకీ ఎక్కడుంది? ఆకాసేపేనా చీరలు, నగలే . . . ఎవ్వరికీ ఇంకో టేస్ట్‌లేదు.”
”పోని జాబ్ మానేసి నీ ఎదురుగా కూర్చోనా?” మళ్ళీ నవ్వాను.
”జాబ్ వమానేసాకకూడా ఇక్కడే వుంటా మా? చాల్లెండి తెలివి” తను నవ్వింది.
ఆ ఆదివారం మా ఆఫీసు వేను వెళ్తుంటే ఇద్దరం సిటీదాకా వెళ్ళి వాళ్ళవాళ్ళతోటీ మావాళ్ళతోటీ మాట్లాడాము.
”ఉద్యోగం అన్నాక తప్పవురా, ఈ తిప్పలు. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి చెయ్యలి. గవర్నమెంటు వుద్యోగాల్లో వుండి మేం మాత్రం చెయ్యలేదా మూడేళ్ళకొకసారి ట్రాన్స్ఫర్ చేసేసేవారు. ఇక్కడ నాలుగైదు బ్రాంచిలుండటంవలన ఇప్పుడుకదా, కాస్త నిలదొక్కుకున్నది?” అన్నారు నాన్న.
అమ్మ అవనితో మాట్లాడింది. అవని తల్లిదండ్రులతోకూడా మాట్లాడాము. వాళ్ళ నాన్నగారు వచ్చి చూసి వెళ్తానన్నారు.
???
ఇళ్ళబైట వుండే సామాన్లు మాయ మౌతున్నాయి. బకెట్లు, చెప్పులు, ఏవీ వదలటంలేదు. వాటిస్థానంలో రూపాయి బిళ్ళలుంటున్నాయి.
”ఎత్తుకెళ్తే ఎత్తుకెళ్లారు, ఈ రూపాయి బిళ్ళలివ్వటమేమిటి మనదగ్గిర్నుంచీ వాటిని కొనుక్కున్నట్టా? దొంగవెధవలు . . . పోలీసు కంప్లెయింటిస్తే సరి! తిక్క వదుల్తుంది” సుందర్ మండిపడ్డాడు, ”వాడీపాటికి నా సెల్‌ఫోన్‌ని ఏ బాదంకాయలాంటిదో అనుకుని పగలగొట్టేసి వుంటాడు”
కంపెనీ సెక్యూరిటీగార్డ్స్ షర్టుమీద షర్టుచొప్పున నాలుగుషర్టులు తగిలించుకుని, మెళ్ళో సెల్‌ఫోన్, కళ్ళద్దాలు, ఇంకా ఏవేవో వేళ్ళాడేసుకుని తిరుగుతున్న ఒక యువకుడిని బలవంతంగా తీసుకొచ్చి మాముందు నిలబెట్టారు. నా షర్టుకూడా అతని వంటిమీదే వుంది. కోపంగా ఏదో అంటున్నాడు. . .అరుస్తున్నాడు. . .గుప్పెడు రూపాయి బిళ్ళలు మామీదికి విసిరికొట్టాడు. అతని మాటలు అర్థంకాకపోయినా సౌంజ్ఞలద్వారా గ్రహించాను, డబ్బు ఎరగా చూపించి వాళ్ళభూమి లాక్కుని వాళ్ళని వెళ్ళగొడు తున్నామనేది అతడి భావన. డబ్బిచ్చి వాళ్ళభూమి బలవంతంగా లాక్కుంటున్నాం గాబట్టి అతడే డబ్బిచ్చి మా వస్తువులని బలవంతంగా లాక్కుంటున్నాడు.
అది ఒక నిరసన. . .ఒక నిస్సహా యత. . .ఇంత అమాయకంగా ఈ నేలమీద ఇంత మమకారాన్ని పెంచుకుని బతుకున్న వీళ్ళని ఎక్కడికో వెళ్ళిపోయి ఎలాగో ఒకలా బతకమనడం అమానవీ యంగా అనిపించింది నాకు. ఎంత డబ్బి చ్చినా జీవనశైలినుంచీ వలసపోయి ఎలా బతకగలరు, వీళ్లేకాదు, ఎవరేనా? ఇది డబ్బుకీ అభివృద్ధికీ సమాజం మనుగడకీ మాత్రమే సంబంధించిన విషయంకాదు. మనిషి మనుగడకీ, అతని మూలాలకీ, సంస్కృతికీ, సామూహికజీవనానికీ సంబంధించి ఇంకెన్నిటినో అనుసంధా నించుకున్న విషయం.
నాకెందుకో ఆ క్షణాన అమ్మ గుర్తొచ్చింది. అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు తనకళ్లలో కనిపించే అనిర్వచనీమైన ఆనందం. . .ఎంత కన్నకూతుర్లా చూసు కున్నా ఆడపిల్లకి పుట్టింటిమీదే మమకారం. . .అనే బామ్మ దెప్పిపొడుపు గుర్తొచ్చాయి. అదే బామ్మ మేము అంతకుముందు ఖాళీచేసి వెళ్ళిన ఇంట్లో తను పాతిన మొక్కలకి ఎవరేనా నీళ్లు పోస్తున్నారా లేదాని బెంగ పడటం గుర్తొచ్చింది. ఏడుస్తూ అత్తవారింటికి వెళ్ళిన మంగ గుర్తొచ్చింది. దిగులుని కళ్ళలో దాచుకునే అవని గుర్తొచ్చింది. ఇవ్వన్నీ మనిషి అప్రమేయంగా పెంచుకునే మమకారాలు.
అతనిదగ్గిర్నుంచీ విలువైన వస్తువుల్ని తీసుకుని బట్టలుమాత్రం విడిచిపెట్టి బాగా బెదిరించి వదిలేసాం.
* * *
”విసుగేస్తోంది . . .” అనేవట అవనినుంచీ చాలా తరుచుగా వింటున్నాను. షాపింగుమాల్స్, ఫ్రెండ్సు, పార్టీలు, బంధువులమధ్య సందడిగా వుండే అవని ఈ నిరామయఏకాంతాన్ని భరించలేకపోతోంది. తనలో వుద్రేకం కనిపిస్తోంది. మా పని వేగం పుంజుకోవటంతో నేను తనతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను.
ఒక్కొక్కరోజు పగలంతా సైటులో చేసిన పనిని సమీక్షించుకోవటానికి రాత్రిపొద్దుపోయేదాకా ఆఫీసులో వుండిపోతున్నాను. మొత్తం పనిని చిన్నచిన్న ప్రాజెక్ట్స్‌గా విడగొట్టి మాకు ఎసైన్‌చేసారు. కొంత వ్యవధిని నిర్దేశించారు. ఇచ్చినపనిని మాకిచ్చిన టైమ్‌కి పూర్తిచేసి చూపిస్తే ఇన్‌సెంటివ్‌లుంటాయి. అందుకోసమని పోటీగా పనిచేస్తున్నాము. ఇంకా ఆకర్షణీయమైనది . . . ప్రాజెక్టు తొందరగా పూర్తైతే యీ అరణ్యవాసంలోంచీ బైటపడచ్చని.
* * *
అక్కడివాళ్ళని స్థలం వదిలిపెట్టి వెళ్ళమని మరోసారి దండోరా వేసారు. వాళ్లని బలవంతంగానేనా తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాళ్లుకూడా పెద్ద ఎత్తుని ప్రతిఘటిస్తున్నారు. ఆఫీసుల్నీ క్వార్టర్సునీ ముట్టడించారు. మమ్మల్ని కదలనివ్వకుండా బాణాలతో కాపలా కాస్తున్నారు. ప్రభుత్వం పోలీసులని దింపింది. వాతావరణం వుద్రిక్తంగా మారింది.
టీవీలో ఈ వార్తలు చదివి కంగారు పడి అవని తండ్రితో కలిసి నాన్న వచ్చారు.
”ఏమిట్రా, ఈ గొడవంతా? మరేం భయం లేదుగా?” నాన్న అడిగారు. మీడియా ప్రచారం చేసినంత భయంకరమైన పరి స్థితులు లేకపోవటంతో కాస్త తెరిపినపడ్డారు.
”నేనిక్కడ వుండను. పిచ్చెత్తిపోతుంది. మీతో వచ్చేస్తాను” తన తండ్రితో అంది అవని. నేను, నాన్న ఏమైనా అనుకుంటా మేమోనని ఇబ్బందిగా చూసాడాయన. అసలే వంటరితనం. . .ఆపైన తన లేకపోతే? వూహించలేకపోయాను. ”రెండు రోజులు నేనూ సెలవు పెడతాను. ఇద్దరం వెళ్దాం” అన్నాను.
”నేనిక్కడ వుండలేనంటున్నానా?” గట్టిగా అరిచింది అవని. తన గొంతు చాలా వుద్రేకంగా వుంది. కళ్ళు మెరుస్తున్నాయి. పిడికిళ్ళు బిగుసుకున్నాయి. పళ్ళు బిగ బట్టింది. అందరం తెల్లబోయి చూసాము.
”అలాగేనమ్మా! వచ్చేద్దువుగాని” నాన్న తనని శాంతింపచేసారు.
తన పరోక్షంలో ఆ విషయంమీద చర్చించుకున్నాము.
”అమ్మాయి ఆరోగ్యం దెబ్బతిన్న ట్టుంది. కొన్నాళ్ళు తీసుకెళ్ళడమే మంచిది. ఇలాంటిచోట్ల కోయవాళ్ళు మందులూ మాకులూ పెడతారంటారుగానీ, వంటరితనాన్ని మించిన అనారోగ్యం మనిషికి మరేదీ లేదు” అన్నారు నాన్న.
మరుసటిరోజు ముగ్గురు వెళ్ళి పోయారు. నేను ఒక్కడినీ మిగిలాను. ఇక్కడి వాతావరణంలో వుద్రిక్తత ఇంకాస్త పెరిగింది. వాళ్ళు బాణాలు వెయ్యడందాకా మేము గాల్లోకి కాల్పులు జరపడందాకా వచ్చాము.
అవని పదేపదే గుర్తొస్తోంది. తనది కాని ఈ స్థలంలో భిన్నమైన జీవనశైలిలో ఇమడలేకపోయిన అవని. . .ప్రేమలు, మమకారాలమధ్య ఎంతో సెక్యూర్‌గా వున్న తనే సమూలమైన ఈ మార్పుకి తట్టుకోలేక పోతే . . . ఈ నిర్వాసితులు? ఉన్నచోటు, అలవాటైన జీవనశైలి వదులుకుని మరోలా బతకాలి. ఈ స్వేచ్ఛ, స్వతంత్రం వుండకపోవచ్చు. లేదా, నాగరీకులమోసంలో వీళ్లే కోల్పోవచ్చు. వీళ్లకి పరిహారం బాగానే ముడుతుండవచ్చు. కానీ దాన్ని వినియోగించుకునే నేర్పరితనం ఎక్కడిది? వీళ్ల బాగోగులు చూసేవాళ్ళెవరు? వెరసి ఇక్కడ స్వతంత్రంగా బతుకుతున్న వీళ్ళంతా ఏం కాబోతున్నారు? వలస కూలీలా? దేశద్రిమ్మరులా? తమనిలా చేస్తే ఈ వ్యవస్థని వీళ్ళు క్షమిస్తారా?
నేను చదువుకున్న చదువుపట్లా చేస్తున్న ఉద్యోగంపట్లా నాకు గొప్ప విరక్తి కలిగింది. మనిషి మనిషిలా తనకి నచ్చినట్టు బతకడానికి అవకాశంలేని దీన్న నాగరికతని ఎలా అనుకోను?
సిటీ వెళ్లి నాన్నతో మాట్లాడాను. ”అవని ఎలా వుంది?” ఆతృతగా అడిగాను ముందు.
”ఇంకా అలాగే వుంది. సైకియా ట్రిస్టుకి చూపించాను. హిస్టీరిచూ అన్నాడు. మందులు వాడితే తగ్గు తుందన్నాడు. ఐనా ఇంతదాకా వచ్చేదాకా ఎలా వూరు కున్నావు?” నాన్న కోప్పడ్డారు.
”ఎక్కడ నాన్నా? నాకు రోజంతా పనే” గిల్టీగా అనిపించింది.
”అడవిలో కాబట్టి తట్టుకోలేక పోయింది. అదే అమెరికాలోనైతే హేపీగా వుండేదనుకుంటా. ఏమిటో . . .ఈ కాలం పిల్లలు . . .” తన గొంతులో నిరసన. అమె రికాలో కూడా ఇంటిమీది బెంగ వుంటుంది. . .ఉమాకి వున్నట్టు. కానీ తప్పనిసరిగా భరించటం.
”అక్కడి గొడవలెలా వున్నాయి?” నాన్న అడిగారు.
”అలాగే వున్నాయి. వాళ్ళకిది జీవన్మ రణసమస్యకాబట్టి బాగానే పోరాడుతున్నారు. మాపని సాగనివ్వటంలేదు. పగలుకట్టినవి రాత్రి కూలగొట్టేస్తున్నారు. వాళ్ళకి బైటినుంచీకూడా మద్దతుంది.”
ఇద్దరిమధ్య కొద్దిసేపు మౌనం.
”నాకెందుకో ఈ వుద్యోగం నచ్చటం లేదు నాన్నా! వీళ్లని బలవంతంగా ఇక్కడి నుంచీ వెళ్ళగొట్టి ఇక్కడొక ప్రాజెక్టు కట్టి ఇంకెవరికో లాభం చేకూర్చడాన్ని నేను సమర్థించలేకపోతున్నాను. మరొకరి ఇష్టానికి వ్యతిరేకంగా వాళ్ళ వ్యక్తిగత, సామాజిక జీవితాల్లోకి చొచ్చుకుపోయి వాళ్ళని వెళ్ళగొట్టడం నాకు బాధని కలిస్తోంది” అన్నాను.
”ఇందులో అనేకాదు, ఏ వుద్యోగం లోనూ ఆత్మసంతృప్తి వుండదు. డబ్బుకోసం . . .భుక్తికోసం నేనీ పని చేస్తున్నాను, ఇలా చెయ్యడం తప్ప మరో మార్గంలేదు అని ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒకచోట అనిపి స్తూనే వుంటుంది. మనం స్వాతంత్య్రాన్ని ఎప్పుడు కోల్పోయామో తెలీదుగానీ కోల్పో యమని మాత్రం తెలుసు” అన్నారు నాన్న.
”నేనీ జాబ్ వదిలేసి వేరేది చూసు కుందామనుకుంటున్నాను.” నా అభి ప్రాయాన్ని చెప్పాను.
”నీది సివిల్. అంత తేలిగ్గా ఇంకోచోట ఇంత జీతంతో ఇంకో వుద్యోగం వస్తుందను కోను. రిమోట్‌ఏరియాలో వుంటున్నందుకు రెట్టింపు జీతం ఇస్తున్నారు. నీ చదువుకి చాలా ఖర్చైంది. ఉషకీ, లక్ష్మికీ పెళ్ళిళ్ళు చేసినందుకు అప్పులయాయి. అవి తీర్చాలి. మంగపెళ్ళికి కూడా కొంత సర్దవలసి వచ్చింది. ఇప్పుడు అవని వైద్యానికీ మందు లకీ బాగానే ఖర్చౌతుంది. పెట్టాలి కూడా. లేకపోతే మీ మామగారిముందు పరువు పోతుంది. రేపు నీకు పిల్లలు కలుగుతారు. నిలకడగా వుండి నాలుగు డబ్బులు సంపా దించుకోవాలిగానీ చేస్తున్న వుద్యోగం వదిలేసి ఏం సాధిస్తావు? కొత్తగా దొరికే వుద్యోగం మాత్రం ఈ కార్పొరేట్ కల్చర్లో నీకు నచ్చినట్టుంటుందా?” తన గొంత మెత్తగా వున్నా అందులో వాస్తవాన్ని తెలియజేస్తున్న కాఠిన్యం వుంది. ”నిర్ణయధి కారం మన చేతుల్లో లేదు. ఎవరికో అనుకూలంగా వుండే నిర్ణయాలు ఎక్కడి నుంచో వెలువడతాయి. అవి మనమీద రుద్దబడతాయి. ఆమోది స్తూనో తిరస్కరి మోనోనైనా నువ్వు వాటిని పాటించక తప్పదు బతకాలిగాబట్టి. . . .” ఫోన్ పెట్టేసారు.
అవని ఇంక ఇక్కడికి రాకపోవచ్చు. ఇద్దరం చెరోచోటా వుంటూనేనా సంపాదించ వలసిన అవసరం. ఉమా అక్కడ, వాడి భార్య పుట్టింట్లో. అమ్మానాన్నా ఎప్పుడూ విడి విడిగా లేరు. ఎప్పుడు మొదలైందిలా? నా చుట్టూ ఏదో బిగుసుకుంటున్నట్టుగా అని పించింది. అది రూపాయి. అందులో నేను ఇరుక్కుపోయాను. దాన్ని ఇప్పలేను. అందులో వుండలేను. నన్నేకాదు, అవని . . .ఉమా. . .వాడి భార్య . . .అందర్నీ చుట్ట్టేస్తోందది…ఎక్కడో మారుమూల అడవుల్లో బతుకుతున్నవాళ్ళదగ్గిర్నుంచీ రూల్‌మేకర్సు కాని రూల్‌బ్రేకర్స్ కానీ కాలేని నాలాంటి సామాన్యులదాకా.
అస్సలు బాగోలేదండీ ఈ కధ. ఏమీ అనుకోకండి ఇలా రాస్తున్నందుకు. కొంత వరకూ చదివాక, ఇక ముందుకు సాగలేక పోయాను. అస్సలు నచ్చలేదు.
– స్వాతి