పోనీ తిను – చాసో

కళ్లు ఎవర్ని చూస్తున్నాయో! ఎందుకు చూస్తున్నాయో! రెప్పలు ఎత్తుతున్నాది దించుతున్నాది. నల్లగుడ్లు జీడిగింజల్లా గున్నాయి. తుమ్మెదల్లా పొడుస్తూ చూస్తున్నాయి, కదలదు. పిలిస్తే పలకదు. డిపార్టుమెంటల్‌ స్టోర్సు షట్టర్స్‌ పక్కనే షట్టరుని ఆనుకొని మొజాయిక్కు మెట్టుమీద, మొజాయిక్కు పోర్టికో క్రింద చాచుకుని స్వతంత్రంగా పడుకుంది, ఎవత్తో కాదు. మీరంతా ఎరుగుదురు. గుడిసేటు గున్నమ్మ.

షాపులన్నీ తెరిచేవేళ అవుతున్నాది. ఎండ తూర్పు నించి వ్యాపిస్తున్నాది. మేడల చివర్లు ఎండలో ఎర్రగా మెరుస్తున్నాయి.

పాచిపని చేసే మనిషి మూడు సార్లు వచ్చి వెళ్లింది. గున్నమ్మ లేవలేదు. పని మనిషి బాల్చీ, చీపురు, ముగ్గుడబ్బా పట్టుకొని షాపుకు వెళ్లి మెట్లు తుడుస్తుంది, కడుగుతుంది. కల్లాపు జల్లుతుంది. ముగ్గు పెట్టి వెళుతుంది.

”నెగు!” అని పాచిపని మనిషి గట్టిగా అరిచింది. అరుపులకే గున్నమ్మ లేచే స్థితిలో లేదు. ”బారెడు పొద్దెక్కింది!’ అని ఇంకా బిగ్గరగా అరిచింది. గున్నమ్మ వినిపించుకోలేదు. కాళ్లూ చేతులు ఎక్కడా కదలటం లేదు. కంటి పాపలు మాత్రం కదులుతున్నాయి. అటూయిటూ చూస్తున్నాయి.

”మంచి చోటే ఒచ్చిపడ్డాది.. ముసలమ్మా నెగు.” అని చెంబులో నీళ్లు మొహం మీద జల్లింది. నీళ్లు గున్నమ్మ మొహం మీద, బట్టల మీద, అరుగునిండా పడ్డాయి. గున్నమ్మ కదలలేదు. అది ఎలాగపడుకున్నది అలాగే పడుకుంది.

”నీ కిలాక్కాదు”. అని చీపురుతో రెండు పోట్లు పొడిచింది. గున్నమ్మ చలనం లేదు.అది ఈ లోకంలో ఉన్నట్లు లేదు. అపస్మారకం లోకి పొయినట్టే ఉంది.

”ఇంక నావల్ల కాదు.” అనుకుంది పాచి పనిమనిషి

”అది ఇంకేం నేస్తుంది.” అన్నాడు రోడ్డు తుడుస్తున్న మునిసిపల్‌ పనివాడు.

”నాయన్నాయన కొంచెం దాన్ని నెగ్గొట్టుదూ.” అన్నాది పాచిది.

”కనబడ్డంనేదా? రోగం ముంచు కొచ్చీసింది. అలాగొగ్గీ, అళ్లేసుకుంటారు.” అన్నాడు మునిసిపల్‌ పనివాడు.

నిన్న మొన్నటి దాకా గున్నమ్మ ముచ్చటగా ఉండేది. వయసులో ఎవరైనా గువ్వలా గుంటారు. గున్నమ్మ అరవై యేళ్లుపైబడ్డా గువ్వలాగే ఉంది.

ఆర్నెల్ల క్రితం ఊళ్లో పోలీసుపెద్దలు వ్యభిచార గృహాల మీద దాడి జరిపినప్పుడు పాతిక మంది పడుచులతో పాటు గున్నమ్మా పట్టుబడ్డాది. మేజిస్ట్రేటు ఏభై రూపాయలు జరిమానా వేస్తే ఎడంచేత్తో పారేసింది!

దాని సంపాదన అంతాయింతా కాదు.అరవై యేళ్ళదీ పాతికేళ్ల పడుచులా తయారయేది. పాతికేళ్ల ఈడు కుర్రాళ్ళు ఎగాదిగా చూసేవారు. ఎవర్ని పిలవాలో, ఎప్పుడు పిలవాలో, ఎక్కడ పిలవాలో, ఎలాగ పిలవాలో దానికి తెలుసు. అది ముసల్దో, ముతకదో కనబడేది కాదు. గున్నమ్మ పిలిచిందా గుడిసెలోకి దూరవలసిందే!

గున్నమ్మ గురించి చెప్పాలంటే బుచ్చిబాబు మాట చెప్పెయ్యాలి. వో సాయంకాలం రెండేళ్ల క్రితం బుచ్చిబాబుని గున్నమ్మ గుడిసెలోకి ఈడ్చుకుపోయింది. కళ్ళు పొరలుకమ్మి బుచ్చిబాబు దాని వెంట గుడిసెలోకి దూరిపోయాడు! అందరికి తెలిసిపోయింది. వీధిని పడిపోయాడు. తాగుబోతులకీ, వ్యభిచారులకీ సిగ్గా, లజ్జా? ఇహ్హీహ్హీ, అని నవ్వేశాడు. ఆ బుచ్చిబాబే ఇప్పుడు మన పట్టణానికి చైర్మెన్‌! ఏమిటీ అని అడక్కండి.అదంతే!

అలాంటి గున్నమ్మ ఒక్క నెల రోజుల్లో ఆర్చుకుపోయింది. వయస్సు బైటకొచ్చీసింది.మంచం పట్టేసింది. మరి గడప దాటలేదు. ఏ జబ్బు ప్రవేశించిందో కాలూ చెయ్యీ కట్టి పడేసింది.

అంతకుముందు రోజు సాయంకాలం టీ నీళ్ళు తెప్పించుకు తాగింది. గుడిసెలోనే పడుకుంది. తెల్లారి చూస్తే డిపార్ట్‌మెంటల్‌ స్టోర్స్‌ మెట్టుమీద పడి ఉంది.

జనం ఆగిపోతూ వచ్చారు. వాళ్ళకి అక్కరలేంది లేదు.

పద్దుల గుమాస్తాగారు-అదే గుమాస్తాగారు పెద్ద తాళాలు పట్టుకువచ్చారు. షాపు తెరవాలి అడ్డంగా గున్నమ్మ పడుకుని ఉంది. షట్టరుని ఆనుకొని బోర చాచుకొని శవంలా పడుకుంది. షట్టరు తాళంకప్ప దాని తల దగ్గరుంది.

చాలా షాపులు తెరిచేశారు. కొందరు తెరుస్తున్నారు. మేడ చివరి భాగాన్ని ఎండ తెల్లబడి కళ్ళల్లో పడుతున్నాది. సేల్సు అమ్మాయిలు, అబ్బాయిలు వచ్చేశారు. అంతా ముసిల్దాన్ని లెమ్మని కేకలు వేశారు.

అది ఈ లోకంలో ఉందో లేదో అపస్మారకంలో ఉన్నట్టే ఉంది. కాళ్ళూ, చేతులూ ఏ మాత్రం కదలడం లేదు. కళ్లు మాత్రం తెరుస్తున్నాది. మూస్తున్నాది. నల్లగుడ్లు కుంకుడు గింజల్లా అటూ యిటూ కదులుతున్నాయి. వెతుకుతున్నట్లు చూస్తున్నాయి. ఎవరిచేతనైనా గున్నమ్మని ఎత్తి తీయించవలసిందే. తనంత తాను లేవదు.

”మునిసిపల్‌ పనివాళ్లు ఉంటారు. వాళ్లని తీసుకురండి. వాళ్లకి టీ నీళ్ళుకిచ్చేద్దాం.” అన్నారు తెగించి పద్దుల గుమాస్తాగారు జనం ఊరుకోరు.

”పద్దుల గుమాస్తాగారు చెప్పేరు.అలాగ్గా చెయ్యండి.” అన్నారు.జనంలోంచి ఎవరో.

”ఎవరా మాట అన్నదీ?” అంటూ కోపంతో మండిపడి పోయారు గుమాస్తాగారు పద్దుల గుమాస్తా అంటే ఆయనకి వల్లమాలిన కోపం. ఊరంతా పద్దుల గుమాస్తాగారని పేరు పెట్టేశారు. ఆ మాట అంటే ఆయనకి చిర్ర. ఆయన్ని మేనేజరుని చెయ్యలేదని అసలు లోపల ఉన్న మంట. ”పెద్ద గుమాస్తాగారూ” అన్నారు. మరెవరో. అలాగనండి మర్యాద ఇవ్వకపోతే ఎలాగ తగలడను? అన్నారు. గుమాస్తాగారు మునిసిపల్‌ పనివాళ్లు వచ్చారు. ”ఆ వచ్చారా? చూడండి. ఆ ముసలమ్మని అక్కణ్ణుంచి లేవనెత్తి కాస్త పక్కగా రోడ్డుమీద పడుకోబెట్టాలి” అన్నారు. ”చావ సిద్ధంగా ఉంది. ఎవరి షాపు ముందు పెట్టేద్దామనుకున్నావు” అని ఎవరో గద్దించారు. ”అలాగేనండి. నాకూ తెలుసు. మా షాపు పక్క కాస్త ఎండగా పెట్టిస్తాను. సరేనా?” అన్నారు గుమాస్తాగారు.

‘చూడండి. ఎక్కడకొచ్చి తిష్టవేసిందో? ఊళ్లో ఇంకెక్కడా చోటులేనట్టు. ఇది దానబ్బ సొంతం అయినట్టు!” అన్నారు. గుమాస్తా గారు. డిపార్ట్‌మెంటల్‌ స్టోర్స్‌ చాలా ఖరీదైన సిమెంట్‌ కాంక్రీటు బిల్డింగు. దాని చుట్టూ చుట్టబెట్టి అరుగు ఉంది. ఇలాంటి అసంద ర్భపు వాళ్ళు జేరకుండా అరుగులకి రంగు రంగు గాజు పెంకులు సిమెంటులో బిగియించారు. బిల్డింగ్‌ చుట్టూ మణుల వడ్డాణంలా గుంటుంది. అలాంటిది ఈ ముసిలి గున్నమ్మ మొజాయిక్కు మొట్టు మీద మొజాయిక్కు పోర్టికో కింద హాయిగా పడుకుంది. చోటు ప్రశస్తంగా ఉంది చేరుకుంది.

”ఇంకా ఆలోచిస్తారేం? తీసి వారగా రోడ్డుమీద పడెయ్యండి.” అన్నారు గుమాస్తాగారు. ముసిల్దొకత్తి ముందు కొచ్చింది. గున్నమ్మ ఈడుంది. ”రోడ్డువార ఏల? కాలవ వొర దానికి గుడిసె ఉంది. దాని గుడిసెలో దాన్ని పడేయ్యండి.” అన్నాది.

చెప్పావుకావు! ఇకనేం. చూపించు ముసలమ్మా! దాని గుడిసెక్కడో పడేస్తారు! అన్నారు. గుమాస్తాగారు మునిసిపల్‌ పనివాళ్ళు ముందుకి రాలేదు. నిలబడిపోయారు. గుమాస్తాగారి నోట్లోంచి పలుకు రాలేదు. అందుకు చూస్తున్నారు.

”వాళ్లకేమిస్తారో చెప్పండి. త్వరగా కానివ్వండి.అది చావ సిద్దంగా ఉంది.” అని వొకరు సలహా ఇచ్చారు.

”ఎం కావాలో మీరే చెప్పండి. చెప్పారుకారేం? అన్నారు గుమాస్తాగారు.

”ముగ్గురం ఉన్నాం. పదిహేను ఇప్పించండి.” అన్నాడో పనివాడు.

”పదిహనే!” అని కళ్ళు తేలేశారు గుమాస్తాగారు.

”గుడిసేటు గుడసెలకి ఇక్కణ్ణుంచి దాన్నెత్తుకెళ్ళొద్దూ?” అన్నాడు పనివాడు.

”ఆర్రూ రూపాయలిస్తాను, తలో రెండు”

”మావల్లకాదు.” అన్నాడు పనివాడు.

”రూపాయి తగ్గేది లేదు.” అన్నాడు మరో పనివాడు. పక్కషాపు ఆర్యవైశ్యులవారు గమనిస్తున్నారు. కలుగజేసుకున్నారు.

”ఏమయ్యో, నిన్నటి నుంచి ధనిష్టాపంచకం. తెలిసిందా? పది రూపాయలిస్తారు పడేయ్యండి.” అన్నారు ఆర్యవైశ్యులవారు.

”ప్రొప్రయిటరుగారు ఏమంటారో! వారి కత్తికి రెండు వేపులా వాడి ఉంటుంది. అంత డబ్బు ఎందుకిచ్చావూ? అనవచ్చు. వెధవ డబ్బు ఎందుకిచ్చేశావు కావు అనవొచ్చు. మధ్య నా కొచ్చింది నక్కచావు” అన్నారు గుమాస్తాగారు.

”ఏమీ అండు. ధనిష్టాపంచకమయ్యా. ఏమర్రా! తీసుకుపోండి. పది ఇచ్చేస్తారు.” అన్నారు వైశ్యులవారు.

”సరే, పదీ ఇస్తాను నేననలేదు కాని వారన్నారు. వారి మాట ప్రకారం తీసుకుపోయి. ఇక్కడా అక్కడా కాదు దానికి గుడిసె ఉందిట, ఆ గుడిసెలో పడెయ్యండి.” అన్నారు గుమాస్తాగారు వారి భయం సబవైనదే. డిపార్టువెంటల్‌ స్టోర్సు ప్రొప్రయిటర్‌ శ్రీ జనగ్నాథస్వామిగారు పాతికేళ్ళ కుర్రాడు. గుమాస్తాగారికి డెబ్బయ్యోపడి వచ్చింది. ఆయన వయస్సు ఆలోచనకి ఈయన వయస్సు ఆలోచనకి పొసగదు. శ్రీ జగన్నాథస్వామి తండ్రిగారు రంగనాయకులుగారైతే, గుమాస్తాగారెంతంటే అంతా వొప్పుకునేవారు. మాటకి విలువ ఇచ్చేవారు. ఆయన చచ్చి స్వర్గాన ఉన్నారు. కుర్రకారు పెత్తనం వచ్చిపడ్డాది. ఆ మునిసిపల్‌ పనివాళ్ళు అడుగు వెయ్యలేదు.

”పది రూపాయలిస్తామంటే తెగులా? మనిషిని కాస్త దూరం తీసుకెళ్లడానికి?” అన్నాడు గుంపులోంచి ఓ న్యాయవాది. న్యాయవాది అంటే ప్లీడర్‌ కాదు న్యాయం చెపుదామనుకున్నవాడు.

”ఆ పదీ పుచ్చుకొని తమరే పడెయ్యండి. పదిహేనుకి చిల్లిగవ్వ తగ్గం” అన్నాడు పనివాడు.

”చూశారా చూశారా! వాళ్ళ బుర్ర తిరుగుడు. నెత్తి మీదున్నాయిరా మీకళ్లు!” అన్నారు న్యాయవాదిగారు.

”రామాయణంలో పిడకల వేటలా వచ్చిన వాళ్లు వచ్చినట్లుండరు. సరే త్వరగా తీసుకుపొండి. ఆర్య మీరడిగిన పదిహేనూ ఇస్తారు.” అన్నారు. వైశ్యుల వారు.

”ఇదిగో వారు చెపుతున్నారు. పదిహేను ఇస్తాను. పడెయ్యండి.” అన్నారు పద్దుల గుమాస్తాగారు.

అప్పటికి మునిసిపల్‌ పని వాళ్లు మెట్టు దగ్గరకు వెళ్ళారు. ముసిల్దాని మొహంలోకి చూశారు.

”ఓరిదిరా గుడిసేటు గున్నమ్మ! ఎలాగై పోయిందో! ఇంతింత బుగ్గలతో గునగునలాడుతూ ఉండేది.” అన్నాడు పనివాడు.

”ఔన్రా! గున్నమ్మ. ఎప్పుడూ కొప్పుమీద కొప్పంతెత్తు పువ్వులు ముడిచేది” అన్నాడు రెండో పనివాడు.

”దీన్ని ఎలాగ ఎత్తడం?” అన్నాడు మూడో పనివాడు.

”నాబంనేదు. తాటాకు సాప తెప్పించండి” అన్నాడు మూడో పనివాడు.

”ఇప్పుడు చాపెక్కడోస్తుంది? త్వరగా సుళువుచేసి తీసుకుపొండి.” అన్నారు వైశ్యుల వారు.

”చాప మీద జార్చి ఎత్తుకెళ్లాలి. లేకపోతే ఏళ్లాడిపోతుంది. ఇక్కడ నుంచి కాలవొడ్డుకి ఎళ్ళొద్దా?” అన్నాడు మూడో పనివాడు.

”సాప తెప్పించండి” అన్నాడు రెండోపనివాడు. వాళ్ళు మెట్టు దిగిపోయారు.

”ఖర్మ ఖర్మ! ఒరే సైకిలు మీద గభాల్నవెళ్లి చాపకొనుక్కురా. తాటాకుల చాప” అని డబ్బులిచ్చి షాపులో కుర్రాణ్ణి పంపించాడు గుమాస్తా గారు.

”సిక్కి సెల్యమైపోయింది!” అన్నాడు ఓ రిక్షావాడు.

”గొప్పగా బతికిందిలే. కట్టని కోకలేదు. ఎళ్లని సినిమానేదు.” అన్నాడు మరో రిక్షావాడు.

”ఈఁ” అని గున్నమ్మ పళ్లు బిగించి పిడికిళ్లు బిగించి పెద్ద మూలుగుడు మూల్గింది.

”మరణ వేదన” అన్నాడొకడు.

”’నారాయణ!నారాయణ!” అన్నాడింకొకడు.

”వెళ్లి దాని చెవుల్లో అను.” అన్నాడు మరో ప్రక్కవాడు. రోడ్డంతా దుర్గంధం వ్యాపించింది.

”చూడు చూడు!” అన్నాడు మునిసిపల్‌ పనివాడు. అంతా పరీక్షగా చూశారు. గున్నమ్మ కళ్లు చూస్తూనే ఉన్నాయి.

”కళ్లు నిలబెట్టేసింది!” అన్నాది గున్నమ్మ ఈడు ముసలమ్మ.

”గూడొదిలేసింది!” అన్నాడు జనంలో తాత్వికుడు.

”’అనుకున్నంతా అయింది!” అన్నారు ఆర్యవైశ్యులవారు.

”ఏమిటి సాధనం?” అన్నాడు గుమాస్తాగారు

”ఏముంది? అనాధప్రేత సంస్కారం!” అని వెళ్లేరు ఆర్యవైశ్యుల వారు.

”గూటిలో సిలకేదిరా”

సిన్నన్న

గూడల్ల సినబోయెరా”

అని పాడుకుంటూ పోయాడు తాత్వికుడు.

సైకిల్‌ మీద వెళ్లిన కుర్రవాడు చాప పట్టుకువచ్చాడు.

”నూకలు సెల్లిపోయినాయి. సచ్చింది ఆనాడు పురటాలు సావు సచ్చిందా? సావనేదు.” అన్నాది గున్నమ్మ ఈడు ముసలమ్మ.

పాతికేళ్ల క్రితం గున్నమ్మ పురుడురాక రోజుపూట గిలగిల కొట్టుకుని తెలివి తప్పిపోయింది. ఆస్పత్రికి తీసుకెళితే కడుపు కోసి తల్లిని బిడ్డని వేర్పాటుచేశారు.

అప్పుడు బతికేసింది. ఇప్పుడు డిపార్టుమెంటల్‌ స్టోర్సు మొజాయిక్కు మెట్టుమీద మొజాయిక్కు పోర్టికో కింద చచ్చిపోయింది. శవంలా లేనేలేదు. బతికున్నట్టే ఉంది. రెండు కళ్లు జ్యోతుల్లా వెలుగుతూ రెప్పవాల్చకుండా చూస్తున్నట్టె ఉన్నాయి.

వార్త వెళ్లింది. గుడిసెల వాళ్లు ఈనీశారు. మొయిన్‌రోడ్డు వెనక మురికి కాలువ పొడవునా గుడిసెలే. అందులో వో గుడిసె గున్నమ్మది. గుడిసెల నిండా గులగుల్లాడుతూ నులక మంచం పగుళ్లలో నల్లుల్లాగ! గుడిసేట్లే వచ్చిపడ్డారు.

వో నడివయస్సు గున్న మీదికెళ్లి పడిపోయి శోకాలు మొదలుపెట్టింది.

”ఎంత పని చేసినావే గున్నమ్మా. ఇంక మాక్కనబడవే గున్నమ్మ? నీ గుడిసె నీకుండగా దిక్కుమాలిన చోట సచ్చినావే గున్నమ్మా!” అంటూ రాగం తీసింది. దాని గొంతుకతో కలుపుతూ మరి ముగ్గురు ఏడుపులు మొదలెట్టారు. దాంతో గున్నమ్మ చావు, చావు కళ కట్టింది. అదృష్టవంతురాలు గున్నమ్మ ఒంటరిదైనా ఏడ్చేవాళ్లు ఉన్నారు. మీద పడి ఏడుస్తున్నారు. అందరికీ తలలో నాలుకలాగుండేది. ఉపకారపు బుద్దితో ఉండేది. కారొచ్చింది. డిపార్టుమెంటల్‌ స్టోర్స్‌ ప్రొప్రయిటర్‌ శ్రీ జగన్నాథస్వామి గారు వచ్చారు. ఆ గందరగోళంలో దిగారు. పద్దుల గుమాస్తాగారు ఎదుటకెళ్లారు.

”బాబూ! కొంప మునిగింది. గుడిసేటు గున్నమ్మట! మన షాపు మెట్టు మీద చచ్చింది!” అని చెప్పారు. శ్రీ జగన్నాథస్వామిగారు దిగి చూశారు. ఆయన మాత్రం ఏమి చేయగలరు?

”గున్నమ్మట!” ఎవత్తో గున్నమ్మ! మన నెత్తిని చుట్టుకుంది. అన్నాడు పద్దుల గుమాస్తాగారు

”గున్నమ్మ!” గున్నమ్మని శ్రీ జగన్నాథస్వామివారు బాగా ఎరుగుదురు. పొద్దున్నే శ్రీజగన్నాథస్వామిగారి నెత్తిని చుట్టుకొంది.

గున్నమ్మ ఎప్పుడూ శ్రీ జగన్నాథస్వామిగారి షాపులోనే బట్టలు కొనుక్కొనేది. కౌంటర్‌ దగ్గర నిలబడిపోయి వెయ్యి వెటకారాలాడుతూ వెయ్యి బేరాలాడేది. స్వామి మాత్రం ఎప్పుడూ పైసా తగ్గించలేదు. డబ్బు ఇచ్చేసేది. ఒక మాట మాత్రం అని వెళ్లిపోయేది.

”తగ్గించవా?పోన్తిను!” అనేది. ఎప్పుడూ కొసకామాట అనేది. ఆ కొసమాట శ్రీజగన్నాథస్వామిగారికి గుర్తుకు వచ్చింది.

”దాన్నవతలికి పంపితే కాని షాపు తెరవలేం.” అన్నారు గుమాస్తాగారు.

”ఇంక షాపు ఏం తెరుస్తాం! దీనికోసం షాపు ముయ్యవలసిందే! ఎక్కడా చోటు లేనట్టే ఇక్కడ చచ్చింది!” అన్నారు శ్రీ జగన్నాథస్వామిగారు.

గున్నమ్మ ఈడు ముసల్ది తోసుకువచ్చింది.

”చోటు నేకకాదు. నెత్తిన కొరివి పెట్టే కొడుకువని ఇక్కడి కొచ్చి చచ్చింది. నువ్వు గున్నమ్మ కొడుకువి. మీ బాబు పెంచినాడు.” అన్నాది ముసలమ్మ. ముసలమ్మ ముందుకు వచ్చి చెప్పకుండా ఉండలేకపోయింది. దానికి నిజం తెలుసు. చెప్పేసింది.

శ్రీ జగన్నాథస్వామిగారు నిలువునా నీరైపోయారు.

ఎదరుగా ఉన్నది తన తల్లా? తలకి కొరివిపెట్టే కొడుకని వచ్చిందా?

ముసిల్ది అన్నమాట నిజమే. శ్రీ జగన్నాథస్వామి దత్తుడు. రంగనాయకులుగారు పిల్లలు లేక ఆసుపత్రిలో నుంచి పురుటి గుడ్డుని తెచ్చుకున్నాడు గున్నమ్మ దగ్గరే! గున్నమ్మకి నూరు రూపాయలు, చీరా యిచ్చాడు.

కుల, మత వర్గ రహిత సమాజం గుడిసెట్ల సంతానం. అందుకే రంగనాయకులు గారు సాభిప్రాయంగా శ్రీ జగన్నాథస్వామి పేరు పెట్టేరు. అటువంటివి ఆమోదించేవాడు దేశంలో ఆ దేముడొక్కడే!

శ్రీ జగన్నాథస్వామికి తాను దత్తుణ్ణని తెలుసు. ఆస్పత్రి నుంచి తెచ్చుకున్నారనీ తెలుసు. గున్నమ్మ తన తల్లా? తన కొట్టుకు వస్తూనే ఉండేది. గున్నమ్మ కొసమాట గుర్తుకి వస్తూ కంపించి పోయాడు.

”తగ్గించవా? పోన్తిను!” అంటూ వెళ్లేది!

”పోన్తిను, చుట్టూ పోన్తిను!” అతని బుర్రని చుట్టేసింది.

గున్నమ్మ అక్కడ చచ్చిపోవడానికి రాలేదు! నెత్తిన కొరివిపెట్టే కొడుకని రాలేదు. ఆఖరిసారిగా కొడుకుని చూసుకోడానికి వచ్చింది. బతుల్లా చూసుకుంటూనే ఉంది. ఆఖరికి కొడుకుని చూడకుండా చచ్చిపోయింది.

ఆ కొడుక్కోసం దాని కళ్లు వెతుక్కుంటూ, వెతుక్కుంటూ నిలబడిపోయాయి. ఆ కళ్లు కొడుక్కోసం చూస్తూనే ఉండి పోయాయి. చూస్తూనే ఉన్నాయి….

 

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.