”అందమంటే సన్నబడటమేనా…?”

డా.జి. భారతి 

”హలో ఆంటీ బావున్నారా?” బస్‌స్టాప్‌లో నుంచుని బస్సుకోసం తపస్సు చేస్తున్న నేను ఒక్కసారి ఈ లోకంలోకి వచ్చి ప్రక్కకి చూశాను.  చిరపరిచితమైన గొంతూ, ఆ నవ్వూ. 

ఆ ముఖం ఎక్కడో చూసినట్లుంది.  ‘నేనాంటీ హేమని’ ‘ఓ… హేమావలిని! ఏంటిలా చిక్కిపోయావు! ఒంట్లో బాగుండటం లేదా?’ జవాబుగా ఆ ముఖం మీద ఒక చిలిపినవ్వు.

పచ్చగా బొద్దుగా ఉండే హేమావలిని ఎప్పుడూ నవ్వుతూ హుషారుగా ఉండేది.  ఈ నీరసపడ్డ చూపూ, నిగారింపు తగ్గిన శరీరం! ఆమె అని అనుకోటం కష్టం.  ‘జబ్బుగా కనిపిస్తున్నానా?’ చిలిపినవ్వు.  అవునీమె హేమే.  ”ఎందుకు ఇలా చిక్కిపోయావు డైటింగా”.  ”ఔనాంటీ ఎక్సర్‌సైజూ డైటింగూ.  బాగా సన్నబడ్డాను కదా?  12 కిలోలు తగ్గాను” అంది గర్వంగా.  కానీ ముఖం నీరసంతో పీక్కుపోయినట్లుంది.  ఎందుకొచ్చిన డైటింగు చెప్పు.

  ఇదివరకు చక్కగా వుండేదానివి కన్నుల పండువగా.  ”మీ తరం ఆడవాళ్ళంతా ఇంతే.  సన్నగా ఉండటంలో అందం లేదనుకుంటారు.  కానీ సన్నబడటం ఆరోగ్యానికి కూడా మంచిదేగా?” ఈ ప్రశ్నకి జవాబు లేదు.  సన్నబడటం కొన్ని ఆరోగ్య సమస్యలకి మంచిదే కానీ సన్నగా ఉన్నంత మాత్రాన, బలవంతాన సన్నబడ్డంత మాత్రానా ఆరోగ్యం వృద్ధిపొందదు.  ఆడవాళ్ళ కొవ్వు పిరుదుల్లోనూ, తొడల్లోనూ చేరుతుంది-  ఇది సాధారణంగా హాని చెయ్యని కోలెస్టరాల్‌ అనీ మగవాళ్ళ కొవ్వు నడుంలో, పొట్టలో చేరుతుంది-  ఇది హానికరమైన కొలెస్టరాల్‌ అనీ అంటారు.  హార్ట్‌ ఎటాక్‌లు వచ్చేది దీనితోనే.  అంటే సన్నబడటం మగవారి ఆరోగ్యానికి మంచిది అని అర్థం చేసు కోవచ్చు.  చక్కగా గుమ్మడికాయలాగా ఉన్న పొట్ట మీద షర్ట్‌ టక్‌ చేసుకుని బెల్టుతో ఆ పెద్దపొట్టని ఊర్ధ్వ అర్ధగోళం, అధో అర్ధగోళంగా విభజిస్తూ నిశ్చింతగా తిరిగే మగవారిని చూస్తే అసూయ కలుగుతుంది.  వాళ్ళకి సన్నబడాలనే తాపత్రయం లేదా?  ఆడవాళ్ళకేనా నాజూగ్గా, సన్నగా ఉండాలనే నిర్బంధం?  ఎందుకు?  చివరికి 7, 8 ఏళ్ళ ఆడపిల్లలు కూడా ‘స్వీటొద్దు ఆంటీ లావవుతాం’ అంటే నిర్ఘాంతపోవాల్సి వస్తోంది.  లావుగా ఉన్న ఆడపిల్లల్ని కాలేజీల్లో, స్కూళ్ళల్లో, బస్సుల్లో అన్నిచోట్లా ఎంత వెక్కిరింతగా చూస్తారో! ఎంత హేళన చేస్తారో అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది.  అసలే ఆడవాళ్ళకి అందంగా ఉండాలనే తాపత్రయం ఎక్కువ.దీంతో సన్నగా లేకపోతే అందంగా ఉండలేమనే అభిప్రాయం పాతుకుపోయింది.
మన దేవాలయల్లో శిల్పాలుగా, చిత్రాలు గానీ చూస్తే వాళ్ళేం సన్నగా ఉండరు.  చక్కగా బొద్దుగా అన్ని అవయ వాలు తీర్చిదిద్దినట్లుంటాయి.  అంటే ఆ కాలంలో సన్నదనం అందం అనుకునేవారు కాదన్నమాట.  ఇప్పటికీ ”చక్కనమ్మ చిక్కినా అందమే” అనే సామెత వింటే సన్నదనం అందంగా ఉండదనే భావం అంతర్గతంగా అందులో ఇమిడి ఉందని తెలుస్తుంది.  అందమైన ఆడవాళ్ళ కోసం ఎప్పుడూ వెతుక్కునే వాళ్ళలో నేనూ ఒకదాన్ని.  సన్నగా ఉన్నవారికంటే ఒక పిసరు లావుగా ఉన్నవారే నా కంటికి నచ్చుతారు.  పాత సినిమాల్లో భానుమతి, ఎస్‌. వరలక్ష్మి, సావిత్రి అందర బొద్దుగా కంటె కాస్త ఎక్కువగా మొద్దుగా గూడా వుండేవారు.  కానీ నిగనిగలాడే వాళ్ళ చెంపలూ, చక్కటి ఆ చిరునవ్వులూ వాళ్ళ ముఖాల్ని వెలిగించేవి.  ఆ అందం ఇప్పటికీ కళ్ళలో మెదుల్తోంది చెక్కుచెదరకుండా.  ఈ సన్నదనం కోసం తిండి పూర్తిగా మానేసి, మంచం పట్టిన వాళ్ళున్నారు.  అన్నం తినకపోవటం ఒక జబ్బని మనం గుర్తించాలి.  సరిగ్గా ఆకలి వేళకి తినకుండా ఏ 4 గం||లకో అన్నానికి కూర్చుంటే అన్నం తినబుద్ధి కాదు.  ఇలా రెండు మూడు రోజులు గడిస్తే అన్నం వంక చూస్తేనే డోకొచ్చినట్లవుతుంది.  దాంతో తినటం మానేస్తారు.  బాగా ఆకలేసి బలవంతాన తిన్నా, అలవాటు తప్పిన జీర్ణకోశం హర్తాళ్‌ చేస్తుంది.  తిన్న తిండి అప్రయత్నంగా వమనం అవుతుంది.  ఈ జబ్బుని ఆనోరెక్సియా నెర్వోసా (Anorexia nervosa) అంటారు.  కొంతమంది ఆహారం తీసుకున్న తరవాత, బలవంతాన వమనం చేసుకుంటారు.  ఇదీ సన్నబడేందుకు ఉపాయమే.  ఈ రకంగా అలవాటుపడ్డాక ఆహారం జీర్ణకోశంలో ఇమడదు.  తిన్న తరవాత దానంతటదే వాంతి రూపంలో బయటికొస్తుంది.  ఈ జబ్బుని బులీమియ (Bulimia) అంటారు.  ఒకప్పటి బ్రిటిష్‌ యువరాణి ప్రిన్సెస్‌ డయనా ఈ జబ్బుతో బాధపడుతూ ఉండేది.  ఆమె అందం, నాజూకుతనం జగద్విఖ్యాతమే కదా?  కానీ కొన్ని ప్రశ్నలు వేధిస్తూ ఉంటాయి.  సన్నదనం అందమా?  అది ఆడవాళ్ళకే అవసరమా?  మన డాక్టర్లు వెంటనే ”నో, నో, నో. లావుగా ఉండటం వల్ల గుండె జబ్బులూ, డయాబెటీస్‌ వంటి వ్యాధులు వచ్చే అవకాశం చాలా ఎక్కువ.  సన్నగా ఉండటం ఆరోగ్యానికి మంచిది” అని వాదిస్తారు.  ఆరోగ్యం కోసమే అయితే మగవారెందుకు సన్నబడటానికి ప్రయత్నించరు?  ఎందుకంటే సన్నబడాలను కోటం అందానికే, అది ఆడవాళ్ళకే ముఖ్యం!
ఒక అమెరికన్‌ సైకాలజిస్టు ఈ విషయం మీద పరిశోధన చేసింది.  ఆమె బులీమియ, అనోరెక్సియా జబ్బులు ఉన్నవారికి వైద్యం చేసేది.  ఆమె తెలుసుకున్నదేమంటే సాధారణంగా ఎవరో వారి జీవితంలో ముఖ్యమైనవారు, సన్నగా ఉండాలనీ లావుగా ఉండటం అసహ్యమనే అభిప్రాయం కలిగిస్తారు.  ఉదాహరణకి ఒక బులీమియ రోగి తల్లి లావుగా ఉండేది.  ఆమె తండ్రి తల్లిని ఎప్పుడ వ్యంగ్యంగా విమర్శిస్తూ ఉండేవాడు.  ఈమెకి చాలా చిన్నతనంలోనే లావుమీద అసహ్యం కలిగింది.
     వోగు (Vogue) అనే ఒక మాగజైన్‌లో మోడల్స్‌ చిత్రాలను ఒకావిడ పరిశీలించింది.  1948, 50ల వరకూ మోడల్స్‌ కాస్త బొద్దుగా ముద్దుగానే ఉండేవారు.  ఆ తరవాత సన్నగా ఉన్న మోడల్స్‌కి గిరాకీ పెరిగింది.  ఇంకా ఈ కాలానికి మనకి కంప్యూటర్‌ దైవంలాగా సాక్షాత్కరించింది.  ఇప్పుడు కొన్ని అలంకరణ వస్తువులు మోడల్సు చిత్రాలు చూస్తే, తెలిసేదేమంటే ఒక పన్నెండేళ్ళ పిల్లాడి కాళ్ళూ, పద్దెనిమిదేళ్ళ పిల్ల ముఖం, ప్రౌఢస్త్రీ శరీరం కలిపి కంప్యూటర్‌ మీద మోడల్‌ని తయరుచేస్తారని విన్నాను.  అంటే మనం చూసే ఆ అందగత్తె నిజంగా ఈ భూప్రపంచంలో ఎక్కడా లేదన్నమాట.  ఆ క్రీమ్‌ల వాటిలాగానే ఈ మోడల్‌ కూడా ఏదో ప్రయోగశాలలో తయారయిందని అర్థమవుతుంది.  ఈ సుందరాంగిని చూసి మతులు పోగొట్టుకుని, అన్నాహారాలు మానేసే యువకులను చూసి జాలిపడాలా? కోప్పడాలా?
     మరోసంగతి.  50ల నుంచీ మోడల్సు సన్నగా ఉండటం ఎందుకు జరిగింది అని ఆలోచిస్తే ఆనాటి దేశరాజకీయ పరిస్థితుల్ని గమనించాల్సి వస్తుంది.  అప్పటికి రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది.  అంతవరకూ యువకులూ, ఆరోగ్యవంతులూ యుద్ధంలో పోరాడటానికి వెళ్తే, దేశంలో ఇంట్లోనే దిగబడ్డ స్త్రీలు అన్ని పనులూ, పరిశ్రమలూ, వ్యాపారాలూ నడపాల్సి వచ్చింది.  వారు అన్నీ బాగానే చేశారు.  యుద్ధం నుంచి ఇంటికొచ్చిన ఈ మగవారికి వారి ఆడవాళ్ళు ఇంత సమర్ధవంతంగా అన్నీ నిర్వహించటం ఊహించరాని విషయమైంది.  ఇది మగవాళ్ళ ఆధిపత్యానికి పెద్ద సవాలుగా మారింది.  ‘అందం’ గురించిన అభి ప్రాయాలు మారాయి.  ‘స్త్రీత్వంకల స్త్రీలు’ గిరాకీలో కొచ్చారు.  నాజూగ్గా, మాటిమాటికీ ఫెయింట్‌ అయ్యే ‘అసలు సిసలు స్త్రీలు’ తయారుకావాలసిన అవసరం ఏర్పడింది.  ఇదంతా మగవారు బుద్ధిపూర్వకంగా చేసిన కుట్ర కాదు.  కానీ వారి మనస్సుల్లో అంతర్గతంగా ఉన్న ఆలోచనలు, అలాంటి మోడల్స్‌ని మాత్రమే ఎన్నిక చేసేట్లు చేసి వుంటాయి.
             ఒక బులీమియ రోగి చరిత్ర వింటే ఈ విషయం అర్ధమవుతుంది.  ఆమె ఒక కంపెనీలో పెద్ద ఉద్యోగంలో ఉంది.  పనిచేస్తున్న ప్రతిక్షణమూ అమూల్యమే.  ఈ బులీమియ వల్ల ఆమె ప్రతి గంటకీ వాంతి చేసుకునేది.  దానివల్ల అనేకసార్లు బాత్‌రూమ్‌కి వెళ్ళటం, వాంతి చేసుకోటం బాత్‌రూమ్‌ వాసన కొట్టకుండా జాగ్రత్త తీసుకోటం, చెదిరిన మేకప్‌ సరిచేసుకోటం – ఇవన్నీ 15 లేదా 20 నిముషాలు పట్టేది.  దానివల్ల ఆమె పనిచేసే సమయం తగ్గిపోవటం.  ముఖ్యమైన పనులు సమయానికి చేయలేకపోవటం, మొదలైనవి.  ఆమె సమర్ధతను దెబ్బతీశాయి.  ఉద్యోగంలో ఆమె క్రిందికి జారితే ఒక పురుషునికి ఆస్థానం దక్కింది.
             అందం ఆడవాళ్ళని బలహీనుల్ని, ఇతరుల మీద ఆధారపడేవాళ్ళనీ చేస్తుంది.  ఇంకా అందానికి సంబంధించిన అనేక విషయాలు గుర్తుకు వస్తున్నాయి.  మా మేనల్లుడు షోగ్గా బాబ్డ్‌హెయిర్‌ లాగా జుట్టు పెంచుకున్నాడు.  ఎప్పుడూ తలెగరేస్తూ మాట్లాడేవాడు.  వాడి తలతోపాటు జుట్టు గడా ఒక ఎగురు ఎగిరేది.  వాడూ ఎన్ డీ ఎలో సెలక్టయి ఆర్మీలో చేరాడు.  సెలవుకి ఇంటికొచ్చినప్పుడు వాడి ముఖం పూర్తిగా మారిపోయినట్లు అనిపించింది.  ‘ఏమయిందిరా?’ అనడిగితే ‘జుట్టు’ అని తల చూపించాడు.  ఆ షోగ్గాడి జుట్టు 1 సెం.మీ. సైజుకి కత్తిరించి ఉంది.  ఆర్మీలో ఇదే హేర్‌స్టైలు ఫాలో కావాలి అన్నాడు.  ”ఎందుకో?” జుట్టు పొడుగ్గా ఉంటే ఎవడి చేతికైనా మన జుట్టు దొరికిందంటే మన పని ఖాళీ.  అంతేగా.  అందుకని ఎవరూ పొడుగుజుట్టు పెంచుకోకూడదు.
       ఆ మాటలు వింటుంటే నాకు జ్ఞానోదయం అయినట్లయింది.  మన ఆడవాళ్ళం పొడుగాటి జుట్టుకోసం ఎంత తాపత్రయపడతామో తెలియందేముంది?  ఇది పట్టుకు కొట్టటానికి భర్తకు సౌకర్యంగా ఉంటుందని అసలు ఉద్దేశం అన్నమాట.  అందుకనే గాబోలు పొడుగుజుట్టు అందాల్లో చేర్చారు.
        మనం వేసుకునే వస్త్రాలు తక్కువవా?  శరీరం అంతా బాగా కప్పుకోవాలి.  అంతవరకూ బాగానే వుంది.  కర్మకాలి ఎవడన్న దుండగుడు వెంటపడ్తే గబాగబా పారిపోగలమా?  సినిమాల్లో చూస్తుంటాం ఆ చీర కొంగు ఏ చెట్టుకో చిక్కుకునో, లేకపోతే కుచ్చిళ్ళు కాళ్ళకి అడ్డంపడో ఆ పిల్ల క్రింద పడుతుంది.  ఆ దుష్టుడి చేతిలో చిక్కటానికిది చక్కని వీలు.  అదే పాంటూ షర్టూ తొడుక్కునే పద్ధతి ఉంటే వేగంగా పరిగెత్తకలిగేది.  వాడి చేతిలో చిక్కేది కాదు గదా.  అంతే కాకుండా మన బట్టలు సున్నితమైన నూలుతో తయారుచేస్తారు.  అవి చప్పున చిరిగిపోయే అవకాశం గూడా ఎక్కువే.  చెప్పులో? చాలా అల్పంగా ఉండి ఇట్లే తెగిపోతాయి.  గబగబా నడవటానికి పరిగెత్తటానికీ అవి మాత్రం పనికిరావు.  కాస్త గట్టిగా నిలబడాలని కొంచెం బండచెప్పులో, ముతకచీరలో కొనుక్కుందా మంటే మన కుటుంబసభ్యులూ, స్నేహితులే కాక, షాపులో సేల్సుమాన్‌ దగ్గర్నుంచి ప్రొప్రయిటర్‌ దాకా అడ్డం పడతారు.  మన ఆడవాళ్ళ ‘ఆడతనం’ రక్షింపబడాలి గదా?
          ఆడవాళ్ళకి కాళ్ళనొప్పులూ, నడుంనెప్పులూ, తలనెప్పులు ఎక్కువగా ఎందుకొస్తాయి?  వారి ఆహారం, దుస్తులు, తదితర వస్తువుల కారణం కాదు గదా!  ఇది పరిశోధించవలసిన విషయం.  ముఖ్యంగా ఆఫీసుల్లో పనిచేసే ఆడవాళ్ళు చాలామంది నడుంనెప్పితో బాధపడుతుంటారు.  వాళ్ళు కూర్చునే కుర్చీలు ఒకసారి చూడండి.  అవి వారికేం సుఖంగా ఉండవు.  కాళ్ళు నేలమీద ఆనితే వీపు వెనకాల ఆనదు.  వీపు సుఖంగా ఆన్చి కూర్చుంటే కాళ్ళు వేళ్ళాడుతుంటాయి.  వీరు సుఖంగా కూర్చునే ఏర్పాటే వుంటే ఈ నడుం బాధలు తగ్గుతాయేమో.  వంటింట్లో ఆడవాళ్ళు కూడా గంటలు గంటలు నిలబడి పనిచేస్తూ ఉంటారు.  ఆ వంటింట్లో ఒక సోఫానో, ఈజీఛైరో వేసుకుంటే వారికి అంత శ్రమ ఉండదు గదా!  నేనొకసారి వంటింట్లో సోఫా వెయ్యమని అడిగితే, కార్పెంటర్‌, కంట్రాక్టరు, మేస్త్రీ అందర్నీ మించి మా ఆయన ఒకటే నవ్వు.  ఇది నవ్వాల్సిన విషయమా.  అందుకని యిప్పుడు కూర పోపులో వేసి బెడ్‌రూ౦లో పోయి పడుకుంటా.  మాడువాసన గదిలోకొస్తే లేచొచ్చి స్టవ్‌ ఆర్పేస్తా.  ఏం చెయ్యను?  అసహాయురాల్ని!
        ఒక మౌలికమైన ప్రశ్న వెయ్యకుండా ఉండలేం.  అసలు ఆడవాళ్ళు అందంగా ఉండాలని ఎందుకనుకుంటారు.  ఆడవాళ్ళ అందాన్ని పొగుడ్తుంటే వాళ్ళు ఆకాశంలో ఎగిరిపోతున్నట్లుంటారు.  ఈ కాస్తకేనా? కాదు.  ఆడవాళ్ళ అందానికి మగవాళ్ళు ఆకర్షితులౌతారు.  స్త్రీలు పురుషుల మీద ఆధారపడి జీవించాల్సిందే కదా?  అందుకని ఎంత అందంగా ఉంటే పురుషుడు ఆ స్త్రీని అంత ఆదరించి ప్రేమిస్తాడని వీళ్ళ ఆశ.  కానీ ఆశలన్నీ ఫలిస్తాయా?  స్త్రీపురుషులిద్దర ఒకరి మీద ఒకరు ఆధారపడని రోజు వస్తే యీ అందం స్టాండర్డు ఏలా మారుతుందో.  కవుల గాయకుల, ఆడవాళ్ళ అందాన్ని గానం చేసే అవకాశం లేక ఏమయిపోతారు?

Share
This entry was posted in కధానికలు. Bookmark the permalink.

8 Responses to ”అందమంటే సన్నబడటమేనా…?”

  1. విజయలక్ష్మి says:

    చాలా చాలా బాగా రాశారండి.ఈరొజుల్లొ అమ్మాయిలు సన్నగ అవ్వడానికి ఎన్నెన్ని కష్టాలు పడుతున్నారొ చక్కగా చెప్పారు.

  2. ramadevi says:

    చాలా బాగా రాశారు.

  3. koresh says:

    మీరు ఆసించిన రొజులు వ చ్చ యి కుడాను సాఫ్ట వెరు ఉద్యొగా ల పున్యమా అని

  4. రాజేంద్ర says:

    ఈ వ్యాసాన్ని రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ చేర్చే దారి కనిపెట్టండి

  5. Sunitha says:

    చాలా బాగుంది భారతి గారు మీ ఇంటిలొ ఎమొ గాని మా ఇంటిలొ వంటింటిలొ సొఫా వెయించు కుంటా నండి

  6. Anonymous says:

    చా లా బగా చెపారు…..ఈ కాలమ అమ్మయలకు………..

  7. Phani says:

    ఇన్ని రోజులూ ఎలా మిస్సయ్యానబ్బా? అబ్బబ్బబ్బబ్బా! ఏం విశ్లేషణ,ఏం విశ్లేషణ!! చావగొట్టారండీ భారతిగారూ. మగాళ్ళు సన్నబడ్డానికి ప్రయత్నించరనీ, లావుగా వున్న ఆడపిల్లలు మాత్రమే హేళన చెయ్యబడతారనీ ఒక్క ముక్కలో తేల్చేశారన్నమాట. మేడంగారూ, అయితే మీకు ప్రతీ జిమ్ములోనూ ఆడవాళ్ళుమాత్రమే కనిపిస్తారన్నమాట. మీరు ఎప్పుడైనా ఉదయమే లేచి అలా ఒక లుక్కేస్తే ఆడవాళ్ళు మాత్రమే మార్నింగ్ వాక్ లు చేస్తూ కనిపిస్తారన్నమాట. ఆవు వ్యాసం రాసినట్లు ఎలాంటి టాపిక్ లోనయినా మగవాళ్ళని దుమ్మెత్తి పోయడం మీకు బాగా అలవాటనుకుంటా. అసలు సన్నబడటమనే టాపిక్ క్రింద చీరలూ, జుట్ల ప్రస్తావన దేనికో నాకర్థం కాలేదు. కావాలంటే మీరూ సమ్మరు క్రాపు చేయించుకోండి, ఎవడొద్దన్నాడు? పాంట్లూ షర్టులేం ఖర్మ, చాలామంది అమ్మాయిలు అంతకన్నా తక్కువ బట్టలేసుకునే తిరుగుతున్నారు కాబట్టి మీరా విషయంలో బాధపడక్కరలేదు. మీ ఊళ్ళోని ఆఫీసుల్లో ఆడవాళ్ళు కూర్చునే కుర్చీలు ప్రత్యేకంగా తయారు చేసి వేస్తారా మేడం? పేజీ నిడివి పెంచుకోవటానికి రాసిన సోదే ఎక్కువ ఇందులో. అసలు దీనికింత బారు విమర్శ కూడా అనవసరం.

  8. sudhakar says:

    లావుగా ఉన్న వారంతె నాకు చ్హాలా ఇష్తము
    మీరు బాగా వ్రాసారు

    అంతెకాక లావు గల్వవారూఒకైత అంద్గగ
    వుతారు
    నాకు తెలుగు త్య్పు రాదు
    ఖమించంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.