ఏప్రిల్ సంచికలో అన్ని కథలు హృదయాన్ని కుదిపేవిగా వున్నవి.
వాటిలో నాకు కనిపించింది వినిపించింది స్త్రీ వాదమూ కాదు, దళిత వాదమూ కాదు. నేను చదువుకొన్నవాడిని కాదు గదా!..మానవతా వాదము.అన్నింటినీ మించిన వాదము.
దుర్గాబాయ్ దేశ్‌ముఖ్‌లో వుండిన అకుంఠిత కార్యదీక్ష నాకు ముక్తా జోడియాలోన ప్రకాశిస్తున్నది. వారి పాదధూళి నావంటివారికి శిరోధార్యము. మీకు, భూమికకు నా ఆశీస్సులు. ఆ కధల రచయిత్రులకు అభినందనలు.
విఏకె.రంగారావు, మద్రాస్
అమ్మా! మార్చి 2008 పత్రికలో మీ ఆవేదనను చదివినంక..మనస్సంతా కలి…కలి అయితుండగా..ఇది రాస్తున్నాను. నా వంతుగా సంవత్సర చందా పంపించాను. ఎడిటోరియల్‌లో మీ బాధను చూసి కళ్ల నీళ్ళు తిరిగాయి ఈ మన పత్రికతో అనుబంధం 1995 నుండి కంటిన్యూ అవుతోంది. పుట్టింటి పత్రికలాంటిది. నా వంతు ప్రయత్నంగా స్నేహితులకు..చందాలకై హెర్బల్ డైరీలకై ప్రోత్సహిస్తాను.
కొలిపాక శోభారాణి, సిరిసిల్ల
భూమిక ఏప్రిల్ సంచిక చూశాను.దుర్గాబాయమ్మగారిపై వ్యాసం చాలా సంతోషాన్ని కలిగించింది. రచయిత్రి, వేములపల్లి కృష్ణమూర్తి గారి భార్య అనుకుంటా. చింతామణి, దుర్గాబాయమ్మలు 1957లో నా 19వ ఏట మా కాలేజీ దర్శించిన సందర్భంలో నా ముందు రెండు నిమిషాలు ఆగి పరిచయం ఆయ్యాక ఒక సందర్భంలో నన్ను ఎమ్.ఏ పాసయి లెక్చరర్ కావాలని దీవించారు. అప్పుడు నేను బి.ఏ డిగ్రీలో మహారాజా కళాశాల విజయనగరంలో ఉన్నాను. ఇక భూమిక పత్రిక లభిస్తూనే ఉంటుంది. మీ సంపాదక వర్గం అంత లబ్దప్రతిష్టులు (నన్నెరిగినవారుకూడా!) చందా పంపిస్తాను.
డా. వి.వి.బి.రావరావు, న్యూఢిల్లీ
గతనెల సంచికలో మీ వ్యధను, బాధను చూసి మేము ఎంతో బాధపడ్డాం. ఆలోచించాం. ఒక గొప్ప ఆశయంతో మీరు నడుపుతున్న పత్రిక ఎంతో మందికి ఆలోచనను, అవగాహనను కలిగించేదిగా వుంది. మహిళల సమస్యలను తీర్చడానికి, వారికి ధైర్యాన్ని చెప్పటానికి మీరు చేస్తున్న కృషి ఎంతో మెచ్చుకోదగినది. నేను జీవితచందా పంపుతున్నాను. స్కూల్‌కు వెళ్ళడం, ఇంట్లో చూసుకోవలసిన బాధ్యతలు ఎక్కువగా వుండడంవల్ల అనుకున్నవి వెంటనే చెయ్యలేకపోతున్నాను. మేడం! మీలో వున్న ఉత్సాహం, చురుకుతనం చూసి నాకు సంతోషం, ఆశ్చర్యం కలుగుతాయి. మిమ్మల్ని చూసి హుషారు తెచ్చుకోవలసిన అవసరం ఎంతో వుందనినిస్తుంది.
”భూమిక కాదు నీవు అనామిక
వున్నాము మేమంతా నీ వెనుక
పీడిత స్త్రీలకు కావాలి నీ ఆలంబన
తీర్చాలి అబలల ఆవేదన
సబలగా మార్చడానికి తోడ్పడాలి నీ నివేదన
నీ కథలలో కనిపిస్తుంది స్త్రీల అంత:సౌందర్యం
నీ వ్యాసాలలో వినిపిస్తుంది మహిళల గంభీరస్వరం
నీ కవితలలో కనిపిస్తుంది ఆలోచనాభావం
మొత్తం మీద నీవంటేనే ఒక మహిళాగ్రంధం
స్త్రీవాద పత్రికగా నీవు నిలవాలి కలకాలం
తెలియజెప్పాలి అందిరికీ మహిళల గొప్పతనం
అందుకే ‘భూమికా’ కాదు నీవు అనామిక
వనజాక్షి, కడప
సామాన్య గిరిజన స్త్రీ సాహసజీవనాన్ని అక్షరదృశ్యం చేసిన ఎడిటోరియల్ ‘బడా కార్పోరేట్లను గడగడలాడిస్తున్న ”ముక్తా జోడియా” నేటి తరం వారందరూ తమ తమ స్థాయిల్లో కార్పోరేట్ నేరాల సంస్కృతితో పోరాటం చేయవలసిన ఆవశ్యకతనూ అందుక్కావలసిన ఆత్మధైర్యాన్నీ ఇస్తున్నది. ”భూమిక” కథల పోటీలో బహుమతి పొందిన కథలు మానవసంబంధాల ఆంశాలతో బాగున్నాయి. ”రూపాయిచొక్కా” కథలో రచయిత్రి ఎస్.శ్రీదేవి పెళ్ళిద్వారా స్త్రీలకి తప్పని వలస జీవితం, ఆ జీవితంలో అన్ని తలుపుల మూసుకుపోయి గాలాడక ఊపిరికొట్టుకులాడే పరిస్థితిని పర్యావరణం ప్రాజెక్టుల నిర్మాణం నిర్వాసితుల మానసిక జీవన పరిస్థితితో అనుసంధానం చేసి చక్కగా చిత్రీకరించారు. ”అమ్మా! బలలెల్లినాదో! ” కథలో రచయిత్రి తమ్మెర రాధిక ఆడపిల్ల జీవితంలో పెళ్ళి ద్వారా సంక్రమించే అణిచివేత..ఆర్ధిక ఘర్షణ వల్ల చితికిపోయే సామాన్య స్త్రీ.. సంసారిక జీవితంలోని హింసను ప్రతిఘటిస్తూ వైవాహిక సంబంధాన్ని తిరస్కరిస్తూ..తన స్వతంత్ర బతుకుకాంక్షను నిర్భయంగా ప్రకటించడం ఒక అనివార్యమైన మార్పుకు నాందిగా నిలిచింది.”మరకల్లో మెరుపులు” కథలో అక్కాచెల్లెలిద్దరూ ప్రమాదవశాత్తూ భర్తలను కోల్పోయిన విషాద పరిస్థితుల్లో అక్క భక్తి పూజల్ని ఆశ్రయిస్తే చెల్లెలు జీవితాన్ని సహచర్య స్నేహాలతో వెళ్ళదిసే మార్గం ఎంచుకోవడం ఒక విభిన్నఅంశం. పూజల్ని ఆశ్రయించిన యువతి సామాజిక అంతరాలను పాటిస్తూ౦టే ప్రాక్టికల్ జీవనశైలిలో పయనిస్తున్న యువతి మానవీయ హృదయ స్పందనలు కలిగి వుండటం కనిపిస్తుంది. చివరికి తమ పనిపిల్ల బాబును ప్రసవించి మరణిస్తే చెల్లెలు కరుణ ఆ పిల్లాడిని స్వంత పిల్లాడిలా పెంచుతుంటే అక్క శ్రావణి దులపిరించడం కానీ కొంతకాలం తరువాత మానవత్వం జాగృతమె ౖచెల్లెల్నీ పిల్లాడినీ స్వంతం చేసుకొని ఆదరించడం రచయిత్రి పుష్పాంజలి చిత్రీకరించారు.’నాకంటూ ఓ జీవితం’ కథను వాస్తవికంగా చిత్రీకరించారు ఎమ్. హేమలత. ఈ పితృస్వామిక సమాజం స్త్రీకి తనకంట జీవితం లేదనే శాసిస్తున్నది. స్త్రీ జీవితం అనేక పాత్రలోకి మూసలోకీ చీల్చబడి కుదించబడి మొత్తంగా సమాజానికి, కుటుంబానికి అనుక్షణం లోబడి ఉండాలని నిర్దేశించింది. 65 ఏళ్లు దాటిన స్త్రీకైనా భర్త ద్వారా జీవన సహచర్యం, స్నేహం లభించని దుస్థితి ఉన్నది. దాన్ని అనుభవించి ఎదిరించి తన సేవాదృక్పధానికి సరిపోయే మార్గాన్ని ఎంచుకున్న సుమిత్ర నేటి మహిళాలోకానికి ఆదర్శం. మొత్తానికి బహుమతి పొందిన నాలుగు కథల నూతనత్వానికి స్వాగతం పలుకుతున్నవి. కధా కధన శిల్పం, వస్తువు కూడా సరిగ్గా అమర్చిన కధా రచయిత్రులకు అభినందనలు. సుభద్ర రమాబాయి అంబేద్కర్ జీవిత కథ పుస్తకాన్ని సమీక్షించిన తీరు స్త్రీ జీవితంలో అణగారిన స్వేచ్చా కోణాన్ని సృజిస్తూ కులం జండర్ ప్రశ్నల్ని లేవనెత్తింది. ఈ సందర్భంగా ఒక్క మాట గుర్తు చేసుకోవాలి. డా. అంబేద్కర్ నాడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన హిందకోడ్ బిల్లును బయటినుండి సమర్ధించిన ఏకైక జాతీయ నాయకురాలు దుర్గాబాయ్ దేశ్‌ముఖ్. ఆమె ‘ఫోటోను భూమిక ముఖచిత్రంగా వేసినందుకు సంతోషంతో అభినందనలు. రాగం భూపాలంలో పి. సత్యవతి రోజా పార్సెస్ చేసిన నల్లవారి హక్కుల పోరాటం గురించి విలువైన విషయాలు తెలిపారు. దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ జీవితానుభవాలను విస్తృతస్థాయిలో అందించిన వేములపల్లి సత్యవతిగారికి ధన్యవాదాలు. రిపోర్ట్‌లు ఇతర రెగ్యలర్ ఈర్షికలు బాగున్నాయి. ”మీ ఆయుధాలు మీరు తెచ్చుకోండి” కవిత పోరాట స్పూర్తినిస్తూ కొత్తగా వుంది.
అనిశెట్టి రజిత, వరంగల్
మళ్ళీ ప్రేమదాడులు మొదలైంది. ఒకే రోజు రెండు దాడులు ఈ దాడులు జరగడానికి మూల కారణం ప్రేమను ఫాంటసైస్ చేయడమే. ప్రేమకు విపరీతమైన ప్రాముఖ్యత ఇస్తున్నారు. మీడియా, సాహిత్య, ఆఖరికి ఆ సంఘటన జరిగిన తరువాత కూడా ప్రేమించడం తప్పుకాదు అని మాట్లాడుతున్నారంటే ప్రజలు ఎంత ప్రేమైకలోకంలో మునిగితేలుతున్నారో అర్ధమవుతుంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రేమ ఆకర్షణ. ఆ ఆకర్షణను మనం ప్రేమ అని నమ్మినప్పుడే మొదలవుతుంది కథంతా. మనకు ఎంతో మంది వ్యక్తుల పట్ల ఆకర్షణ కలుగుతుంది (అది అపోజిట్ సెక్స్ వ్యక్తులపైన అధికంగా కలుగుతుంది.) మనం ఒక వ్యక్తిపైన కలిగిన ఆకర్షణను ప్రేమగా నమ్ముతాం. దానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. ఈ ప్రేమ మహోన్నతమైనదని సినిమా, మీడియా ప్రజలలో ఒక భావనను రూపొందించాయి. ఫలితంగా తాను ఇష్టపడిన వ్యక్తి తాను అనుకున్నంత ఉత్తముడు కాదని అమ్మాయికి అర్ధమయినప్పుడు ఆ అమ్మాయి అతనిని వదులుకోవడానికి ఈ భావన అడ్డు వస్తుంది. నిజానికి అమ్మాయిలెవరూ కత్తులు, కటారులు ఎత్తుకొని అబ్బాయిలపైకి వెళ్ళలేదు. కాని అబ్బాయిలే ఎందుకలా చేస్తున్నారు. వాళ్ళను మృగాల్లాగా పెంచుతున్నాం కనుక, ఆ దారుణమైన దాడి జరిగాక కూడా కొందరు సైకియాట్రిస్టులు ఆ అబ్బాయిలపై జాలి చూపించడం. పరోక్షంగా అలాంటిసైకోలను ప్రోత్సహించడం. ఇలాంటివారే మనోహర్లను, సందీప్‌లను తయారు చేస్తున్నారు.
వీరి డిగ్రీలు రద్దుపరచడం, వీరు ఏ ప్రభుత్వ రుణం కాని ప్రభుత్వోద్యోగం కాని పొందడానికి అనర్హులని ప్రకటించిననాడు ఇలాంటి రాక్షసులు కొంతైనా భయపడతారు.
వై.ద్రాక్షాయిని, శ్రీకాళహస్తి
ఒక పత్రిక నిర్వహణ భుజాలపై కెత్తుకోవడం కత్తిమీద సాములాంటిది అందునా విశేషంగా ఒక స్త్రీవాద పత్రికను నిర్వహించడం, మిగతా అన్ని స్త్రీ వాద సమస్యలను ముట్టుకొని చేతులు కాల్చుకోవడం లాంటిదే. నిజాయితీగా ఈ బాధ్యతను నిర్వహిస్తున్న మీకందరికీ నా శుభాకాంక్షపూరిత ప్రశంసలు.
ఐతే భూమిక ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభం దృష్ట్యా మీరడగపోయిన నా అభిప్రాయాలు కొన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను.
ఒకటి – భూమికకి సరైన సర్క్యులేషన్ లేదు. అందుకు కారణాలు అన్ని వర్గాల, కనీసం ఇంటలెక్చువల్స్‌ని అలరించే అన్ని అంశాలు భూమికలో లేవు. ప్రస్తుతం స్త్రీలు టెక్నాలజీ పరంగా ముందుకు దూసుకుపోతూ రాజకీయ రంగంలో లేక ఆయా అంశాలలో చొరవ చూపుతూ ప్రపంచం నలుమూలలా (వివిధ రంగాలలో సినిమా రంగంతో సహా) జరిగే విశేషాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారన్న విషయం మనందరకీ తెలిసిందే.
ఎ) గాసిప్స్ కాకున్నా ఒకటి రెండు పేజీలు తెరమరుగైన తారలను గురించి కానీ లేక ప్రస్తుతం బాగా టాలెంట్ ఉన్న భూమిక (సినీ నటి) లాంటి అమ్మాయిలకు గానీ, లేక అనేక సమస్యలను ఎదుర్కొని కూడా తన స్థానం నిలదొక్కుకొని విజయవంతమైన ఖుష్‌బూ లాంటి వారికి గాని కేటాయిస్తే బాగుంటుంది కదా.
బి) సర్క్యులేషన్ లేకపోవడానికి మరొక కారణం ”స్త్రీ వాద పత్రిక” అని ఉండటం అని డాక్టర్ రోషిణి గారు మొన్న మీటింగులో అంగీకరించారు. ప్రస్తుతం పురుషులను చైతన్యవంతులను చేస్తూ స్త్రీ అభివృద్ధికి చేయూతనిచ్చే పథం వైపు మళ్లించడం కూడా మన బాధ్యతే. ఎప్పుడైతే ‘స్త్రీ వాద పత్రిక’ అన్న విషయం చూశారో అప్పుడే వాళ్ళు దీన్ని పక్కన పడేసే ప్రమాదం ఉంది.
సి) ఎప్పుడైతే పత్రిక సర్క్యులేషన్ పెరిగిందో అప్పుడే పత్రికకు మరిన్ని యాడ్స్ లభించగలవు.
డి) చాలామంది ఎడిటోరియల్ బోర్డ్ వారి రచనలు (లే) పత్రికలో ప్రచురిత మవుతున్నాయ్. గమనించారా. అలాగే ఒకే ఇష్యూలో ఒకే రచయిత్రిచే విరచితమైన రెండు ఆర్టికల్స్ ప్రచురితమవుతున్నాయ్ (ఏదో ఒక రూపంలో)
ఎఫ్) ‘చైనా మహిళల లాంగు మార్చ్’ లాంటి ఆర్టికల్స్ చాలా బావుంటాయి. రీడర్స్ డైజెస్ట్‌లో లాగా నిజంగా జరిగినవి. నిజాయితీ కలిగినవి సేకరించిగానీ లేక కొందరి సొంత అనుభవాలను (వారే రాసి పంపితే) ప్రచురించుట గానీ బావుంటుంది.
జి) ఇంతకు ముందు లాగా మాలతీ చందూర్ గారి ఇంగ్లీష్ నవలకు తెలుగు సమీక్షలు కూడా చాలా బాగుంటాయి. ప్రస్తుతపు ఆధునిక ఇంగ్లీష్ నవలలు కూడా కొన్ని బాగానే ఉన్నాయ్. వాటి సమీక్షలు కూడా ప్రచురించవచ్చు.
భూమిక పత్రిక నిర్వహించే స్త్రీ వాద కథల పోటీలో పురుషులకెందుకు స్థానం లేదు. స్త్రీల కష్టాల, కన్నీళ్లూ, పురుష రచయితలర్థం చేసుకోలేరా? స్త్రీ పురుషుల మధ్య సాంఘిక జీవనం సామరస్యంతోనే సాధ్యం కాబట్టి అలా మనల్ని మనం సెపరేట్ చేసుకోవాలా?
హెచ్) గైనికాలజికల్ సలహాలు లేదా సెక్స్‌పరంగా స్త్రీ ఎదుర్కొనే సమస్యలను సమాధానాలనిచ్చే (డాక్టరు ద్వారా) శీర్షిక ఒకటి చాలా అవసరం. దీనిపై ఆర్టికల్స్ అవసరం. లేదా చందూర్ గారిలా నిర్మొహమాటమైన సమాధానాలనిచ్చే ఎవరితోనైనా కనీసం నిర్వహిస్తే బాగుంటుంది కదా. ఒక మంచి సీరియల్ కూడాఅవసరమే కదా! ”భూమిక” చాలా మంచి పత్రిక. నేను చాలా గౌరవిస్తాను అని నాతో మొన్న వకుళాభరణం రామకృష్ణగారన్నారు. ఇటువంటి పత్రిక మూతపడడం గాని స్థాయి దిగజారడం గాని భరించలేము సహించలేము… అలా వీల్లేదు.
మీరందరూ కలిసి కూర్చొని ఒక నిర్ణయానికి రండి. భూమికను సర్వాంగ సుందరంగా మరింత ‘కంప్లీట్’ గా తీర్చిదిద్దండి అని వేడుకొంటున్నాను. నాకు అర్హత లేకపోయినా ఏదో అంతర్లీన ఆవేదన ఈ ఉత్తరం రాయిస్తోంది.
పుష్పాంజలి, చిత్తూరు
భూమిక చదువుతుంటే మిమ్మల్ని చూసినట్లే అనిపిస్తుంది. ఇంత మంచి పత్రిక వుందని నాకు ముందు తెలియనే తెలియలేదు. రిటైరయ్యాక మళ్లీ ఆంధ్రభూమితో సంపర్కం పెంచుకుందామని పత్రికలు తెప్పించుకుంటూ, ఒకసారి ఉపద్రష్ట అనూరాధ గారితో ఫోన్‌లో మాటల సందర్భంలో అడిగాను ”కొత్త పత్రికలు ఏమి వస్తున్నాయె నాకు తెలియదండీ! మీరుచెప్పగలరా? అని ఆవిడ ”భూమిక, పత్రిక అని రెండు మంచివి ఉన్నాయండీ”అంటూ మీ పత్రిక అడ్రస్సూ,రమణగారి పత్రిక అడ్రస్సు ఇచ్చారు. అప్పుడే నేను భూమికతో పరిచయమయి ఆ పత్రికలో అన్ని పేజీల్లోనూ నా ప్రాణం ఉందా అన్నంత దగ్గరయ్యాను. అంత చక్కగా దాన్ని నడపడంలో మీరు ఎన్ని శ్రమల కోర్చారో ఎంత కష్టపడ్డారో మీ మార్చి 2008 సంపాదకీయం చదివాక నాకర్ధమయింది. మీతో పాటు తప్పక చెయ్యి కలుపుతాను. భూమికను బ్రతికించడానికి ఉడతాభక్తిగా నాకు తోచినంత సహాయం చేస్తాను. ఇతర దేశాల మహిళల గురించి, వారి స్థాయి గురించి, వారి జీవన విధానాలు, వారి కుటుంబ పరిస్థితులు, అందులో మహిళల స్థానం అవన్నీ కూడా నాకు తెలియనివి ఎన్నో భూమికలో తెలిసాయి. ”హాట్సాఫ్‌టు యు” ఒకోసారి తెలుగు మాటలకంటే ఇంగ్లీషు మాటలు ఎక్కువ అర్ధాన్నిస్తాయేమో!
బి.బాలాదేవి, భువనేశ్వర్