క్షణాలు పరుగులు తీస్తుంటాయి.
వాటితోపాటు ఉరకలెత్తలేని మనసు
ఈడ్చుకుంటూ పోతుంటుంది.
కాలానికి మునుముందుగా
కదిలిపోలేని మనసు
తనలో జడత్వాన్ని నింపుకుంటుంది.
ప్రగతిశీలం మందగించి అది
తన చుట్టూ తానే తిరుగుతుంటుంది.
అప్పుడప్పుడు స్తంభించిపోయిన
వాయు వాహినులు
గాఢంగా ఊపిరి పీల్చుకుని
కదిలిపోయినప్పుడే
సృష్టిలోని చలన ప్రవృత్తి సమధికమవుతుంది.
కాలం ఒక్కుమ్మడిగా పైకు బికినప్పుడు
కునికిపాట్లు పడుతున్న మనసుకు
కొరడా కొసలతో చరిచినట్లవుతుంది
ఎన్నివేల మైళ్ళ దూరం
అలా అలా సాగిపోయినా
కడలి తరగల అడుగులు అలసిపోవు.
ఇప్పుడు తాము ఎక్కడున్నామని
అవి వెనుకకు తిరిగి చూసుకోవు.
ప్రవాహ గుణాన్ని తనలో నింపుకున్నామనసు
ముందు చూపు కోల్పోతే
అది మడుగులా
అక్కడి కక్కడే నిలిచిపోతుంది.
పరుగులు తీసే క్షణాలను
ఎప్పటికప్పుడే వెనుకకు నెట్టుతూ
పురోముఖంగా విశ్రమించే మనసు
కాల విజేతగా నిలిచిపోతుంది.