తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్య,ఇంటర్ విద్య,ఉన్నత విద్య, సాంకేతిక వృత్తి విద్యలు అన్నీ ప్రయివేటీకరణ కోరల్లో చిక్కుకుని ఉన్నాయి. గత మూడు దశాబ్దాలుగా విద్యారంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తూ వచ్చిన విధానాల వలన క్రమక్రమంగా ప్రభుత్వ విద్యారంగం కుదించుకునిపోతూ,ప్రయివేట్ విద్య పెరిగిపోతూ వచ్చింది.1991 నుండి ప్రపంచీకరణ విధానాలు వచ్చిన తరువాత విద్యారంగంలోకి కార్పోరేట్ పెట్టుబడులు ప్రవేశించి విధ్యను అంగడి సరుకుగా మార్చివేసాయి. చంద్రబాబునాయుడు కాలంనుండి ప్రపంచ బ్యాంక్ విధానాలు విచ్చలవిడిగా అమలైనందువలన విద్యారంగంలో కూడా పరిస్థితులు దిగజారుతూ వచ్చాయి. రాజశేఖర్‌రెడ్డి ఫీజు రియంబర్స్‌మెంట్ పథకాన్ని అమలుచేసి ప్రజాధనాన్ని ప్రయివేట్ యాజమాన్యాలకు తర్పణ చేశారు.వీటన్నింటి ఫలితంగా ప్రభుత్వరంగంలోనూ, ప్రయివేట్ రంగంలోనూ అనేక అంతరాలతో కూడిన విద్యారంగం రూపొంది, ఉన్నవారికి విద్య, లేనివారికి అక్షరాస్యత అనే స్థితి వచ్చింది. మరీ లేనివారు బడిమెట్లు ఎక్కడమే కష్టంగా మారింది.
దేశంలోని బాలబాలికలందరికి 1960 నాటికే నిర్భంధోచిత విద్యను అందించాలని రాజ్యాంగం చెప్పినా మన పాలకులు దాన్ని అమలుచేయలేదు 6 నుండి 14 ఏళ్లలోపు బాలబాలికలకు విద్యను 2002లో ప్రాథమిక హక్కుగా చేసి అందుకోసం 2010 నుండి విద్యాహక్కు చట్టాన్ని తెచ్చినా ప్రభుత్వ పాఠశాలలకు కావలసిన వసతులను ప్రభుత్వాలు సమకూర్చలేదు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన బాలబాలికలు పెద్ద సంఖ్యలో డ్రాపవుట్లుగానే మిగిలిపోతున్నారు.
మన రాష్ట్రంలో ఇంటర్ విద్యలో ప్రయివేట్ యాజమాన్యాలది ఆడింది ఆటగా, పాడింది పాటగా ఉంది. లక్షల రూపాయలు కుమ్మరించి ర్యాంకు ల బందిఖానాలో వేస్తే తప్ప మోక్షంలేని పరిస్థితి వచ్చింది. ఉన్నత విద్యలోకి, సాంకేతిక, వృత్తి విద్యల్లోకి విదేశీ కార్పోరేట్ పెట్టుబడులు భారీగా రావడానికి వీలుగా భారత ప్రభుత్వం గ్యాట్స్ ఒప్పందంలో చేరబొతున్నది. విదేశి విశ్వవిద్యాలయాలు మన దేశంలోకి రావడానికి వీలుగా చట్టాలను చేస్తున్నది.మన భూమి,మన ఖనిజాలు,మన నీరు,మన విద్యుత్తు,మన రవాణా సౌకర్యాలు,మన చట్టాలు- ఏవి మనవికాని పరిస్థితి వచ్చింది. మన యువత మేధస్సు కూడా మనది కాకుండా పోతుంది. అన్ని వనరులు అన్ని చట్టాలు, బహుళ జాతి సంస్థల పేరుతో తరించిపోతున్నాయి.
ఇటువంటి పరిస్థితిలో రాష్ట్రంలో కొత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కెసిఆర్ కెజి నుండి పిజి వరకు ఉచిత విద్యను ఇస్తామని అంటున్నారు. కామన్‌స్కూల్ విధానాన్ని అమలుచేస్తానని అంటున్నారు. విద్యారంగంలో ప్రయివేట్ యాజమాన్యాలు మాత్రం ఉండవని మాత్రం చెప్పడం లేదు. ఒక ప్రయివేట్ పాఠశాలలో, కళాశాలలో ఉండటానికి ఉచిత విద్యను ఇవ్వడానికి మధ్య పోనగదు అలాగే ప్రయివేట్ పాఠశాల, ఆ మాటకొస్తే కెసిఆర్ స్థాపిస్తామని చెపుతున్న ఆశ్రమ పాఠశాల, కామన్‌స్కూల్ పరస్పరం భిన్నమైనవి. అన్ని పాఠశాలలను ఒకే యాజమాన్యం కిందికి తెచ్చినంత మాత్రాన అది కామన్‌స్కూల్ కాబోదు.ఒక గ్రామంలోని ఒక ఆవాసంలో బాలబాలికలందరు వారి ఆర్థిక, సామాజిక స్థితిగతులతో నిమిత్తంలేకుండా ఒకే పాఠశాలలో చదువుకున్నప్పుడే అది కామన్‌స్కూల్ అవుతుంది. అలాగే రాజశేఖర్‌రెడ్డి మాదిదిగా ఫీజురియంబర్స్‌మెంట్ విధానాన్ని అమలుచేసి ఉచిత విద్య అంటే కుదరదు. ప్రభుత్వ పాఠశాలలను, కళాశాలలను, విశ్వవిధ్యాల యాలను అన్ని విధాలుగా బలోపేతం చేయాలి. అవసరమైనంత మేరకు కొత్తవాటిని స్థాపించాలి. తెలుగు భాషా, సంస్కృతులు గురించి మాట్లాడి, ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పిస్తానని అనడం భాషాపరంగా సాంస్కృతికంగా, విద్యా విషయికంగా శాస్త్రీయమైనది కాదు.
విద్యాపరిరక్షణ కమిటీ మనరాష్ట్రంలో 1989లో ఏర్పడి,గత 25 సం||లుగా విద్యారంగంలో నిరంతరాయంగా పనిచేస్తున్నది. విద్యారంగంలో పాలకులు ప్రవేశపెడుతున్న అన్ని ప్రజా వ్యతిరేక విధానాలను అది ప్రతిఘటిస్తూ వచ్చింది. చంద్రబాబునాయుడు కళాశాల విద్య నుండి సామాజిక శాస్త్రాలను తొలగించాలని చూచినప్పుడు విద్యా పరిరక్షణ కమిటీయే అడ్డుకున్నది. కొఠారి కమీషన్ సూచించిన విధంగా కామన్‌స్కూల్ అమలుచేయాలని పాఠశాల స్థాయిలో ప్రతి తరగతికి ఒక గదిని నిర్మించాలని,ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని, మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత మెరుగు పరచాలని, పేద విద్యార్థులు చదువుకోవడానికి కావలసిన వాటిన్నంతటిని ఉచితంగా సమకూర్చాలని డిమాండ్ చేస్తున్నది.
2009లో హైదరాబాద్‌లోనే ఏర్పడి అఖిల భారత విద్యాహక్కు వేదిక దేశవ్యాప్తంగా పేద కుటుంబాల నుండి వచ్చే పిల్లలందరికి ప్రమాణాలతో కూడిన విద్యను సమానత్వ ప్రాతిపదిక మీద ఉచితంగా అందించాలని డిమాండ్ చేస్తున్నది. విద్యా రంగంలోకి వ్యాపారం మాత్రమే కాకుండా ఆధిపత్య హిందూ మతతత్వ భావజాలం కూడా రాకూడదని కాని ఇప్పుడా ప్రమాదం పెరిగిందని ఆ ప్రమాదాన్ని ఎదుర్కోవాలని విద్య, ప్రజాస్వామిక, లౌకిక భావజాలాన్ని కలిగి ఉండి, జ్ఞానాన్ని అందించేదిగా ఉండాలని కోరుతున్నది. దేశంలో నెలకొని ఉన్న అసమానతలు దోపిడి పీడనలు, హింస పోవడానికి అందుకు తగిన విధంగా కామన్ విద్యావ్యవస్థ ఉండాలని అఖిల భారత విద్యాహక్కువేదిక దేశ ప్రజలందరి తరపున పాలకులు అడుగుతున్నది. అందరికి సమాన విద్యను అందించలేని విధంగా విద్యావ్యాపారాన్ని అరికట్టలేని విధంగా ఉన్న ఇప్పటి విద్యహక్కు చట్టాన్ని రద్దుచేసి కామన్‌స్కూల్ విధానాన్ని అమలుచేసే విధంగా కొత్త చట్టాన్ని తేవాలని కోరుతున్నది.
విద్యారంగంలో ప్రజలకు మేలుచేసే విధానాలు రావాలంటే, ప్రజలు చైతన్యవంతులై ఒక బలమైన విద్యారంగ పోరాటాన్ని నిర్మించడం తప్ప మరొక మార్గంలేదని భావించిన అఖిల భారత విద్యాహక్కు వేదిక 2014 నవంబర్ 2వ తేది నుండి డిసెంబర్ 4వ తేది వరకు అఖిల భారత విద్యాపోరాట యాత్రను జరపాలని నిర్ణయించింది. అమానుషమైన సైనిక బలగాల ప్రత్యేకాధికారాల చట్టం రద్దుకావాలని డిమాండ్‌తో మణిపూర్‌లో ఇరోంషర్మిలచాను అనే అనే మహిళ 2-11-2010 నాడు ఆమరణ నిరహారధీక్షను ప్రారంభించి పట్టుదలతో ఇంకా దాన్ని కొనసాగిస్తున్నందు వలన ఈ యాత్ర దేశంలో వివిధ రాష్ట్రాల్లో నవంబర్ 2 నాడు ప్రారంభమవుతున్నది.1984లో జరిగిన భోపాల్ విషవాయువు దుర్ఘటనకు వ్యతిరేకంగా న్యాయం కొరకు కొనసాగుతున్న ప్రజల పోరాటాన్ని గౌరవిస్తూ ఈ యాత్ర ముగింపును డిసెంబర్ 4నాడు భూపాల్‌లో పెట్టడం జరిగింది.
మన రాష్ట్రంలో ఈ యాత్ర నవంబర్ 2 నాడు హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్దనున్న తెలంగాణ అమరవీరుల స్థూపం ముందు ఉదయం 10గంటలకు ప్రారంభమవుతుంది.అక్కడి నుండి పాదయాత్ర ద్వారా నిజాం కళాశాలకు చేరుకుంటుంది.నిజాం కళాశాలలో మధ్యాహ్నం వరకు బహిరంగ సభ జరుగుతుంది. యాత్రకు సంబంధించిన ఈ ప్రారంభ కార్యక్రమంలో అన్ని జిల్లాల నుండి ఉపాధ్యాయులు అధ్యాపకులు,విద్యార్థులు వివిధ ప్రజా సంఘాలకు చెందినవారు. ప్రజలు పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
యాత్రకు సంబంధించిన ఈ ప్రారంభ కార్యక్రమం అయిపోయిన తరువాత ఆ రోజు మిగిలిన సమయంలో 3వ తేదినాడు హైదరాబాదు జిల్లాలో యాత్ర జరుగుతుంది.ఆ తరువాత వరుసగా మహబూబ్‌నగర్ (4-5 తేదిలు) రంగారెడ్డి (6వ తేది) మెదక్(7-8 తేదిలు)నిజమాబాద్ (9-10 తేదిలు) అదిలాబాద్ (11-12 తేదీలు) వరంగల్ (15-16 తేదీలు) నల్గొండ (17-18 తేదీలు) ఖమ్మం (19-20 తేదీలు) జిల్లాల్లో యాత్ర జరుగుతుంది.ఈ యాత్రలో ఒక రాష్ట్రబృందం,ఒక జిల్లా బృందం,ఒక సాంస్కృతిక బృందం కలిసి పర్యటిస్తాయి.
దక్షిణ భారతదేశంలోని అయదు రాష్ట్రాలలో పర్యటించడానికి ఉద్దేశించిన జోనల్ బృందం నవంబర్ 21 నుండి 27 వరకు తెలంగాణ రాష్ట్రంలో పాల్గొంటుంది.ఈ బృందం వరుసగా ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం ఇల్లందు,ఖమ్మం (21వ తేది) నల్గొండ జిల్లాలో సూర్యపేట, నకిరేకల్, నల్గొండ (22వ తేది)మహాబూబ్‌నగర్ జిల్లాలోని అచ్చంపేట,వనపర్తి మహబూబ్‌నగర్ (23వ తేది) మెదక్‌జిల్లాలో సంగారెడ్డి,మెదక్ సిద్దిపేట, (24వ తేది) వరంగల్ జిల్లాలో జనగాం, తొర్రూర్,హనుమకొండ(25వ తేది) కరీంనగర్ జిల్లాలో హుజూరాబాద్ రామగుండం,కరీంనగర్ (25 వ తేది) హుజూరాబాద్, రామగుండం,కరీంనగర్ (26వ తేది) నిజమాబాద్ జిల్లాలో నిజామాబాద్,ఆర్మూర్ మరియు ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్,అదిలాబద్ (27వ తేది)లలో పర్యటిస్తుంది.ఈ పర్యటనలో జోనల్ బృందంతో పాటు ఒక రాష్ట్ర బృందం ఒక జిల్లా బృందం పాల్గొంటాయి.
మనరాష్ట్రంలో యాత్ర ముగింపు కార్యక్రమం 27వ తేది సాయంత్రం 5గంటలకు ఆదిలాబాద్ పట్టణంలో జరుగుతుంది. తదనంతరం యాత్ర వెంట ఉన్న ఉద్యమ కాగడాను మహారాష్ట్ర సహచరులకు అందిచడం జరుగుతుంది.
అఖిల భారత స్థాయిలో యాత్ర ముగింపు కార్యక్రమం డిసెంబర్ 4వ తేదిన భోపాల్‌లో జరుగుతుంది. ఉదయం 10గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పెద్ద ఊరేగింపు,బహిరంగసభల రూపంలో ఈ కార్యక్రమం ఉంటుంది.ఒక రోజు ముందు 3వ తేదినాడు భోపాల్‌లోనే భోపాల్ విషవాయు దుర్ఘటన బాధితులకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో ఉదయం 10 గంటల నుండే పెద్ద యెత్తున కార్యక్రమం ఉంటుంది.ఈ రెండు కార్యక్రమాల్లో ముఖ్యంగా 4వ తేదినాటి కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్రం నుండి ఎవరైనాసరే,ఎంతమంది అయినా సరే రావచ్చును.
ప్రజలకోసం మెరుగైన విద్య ప్రజల కోసం సమానమైన విధ్య ప్రజల కోసం ప్రభుత్వ రంగంలో విధ్య కొరకు దేశంలో జరుగుతున్న ఈ బృహత్తర విధ్యా పోరాటాన్ని నడిపించడానికి అఖిల భారత స్థాయిలో రాష్ట్రాల స్థాయిలో జిల్లాల స్థాయిలో యాత్ర నిర్వాహణ కమిటీలు ఏర్పడ్డాయి.మన రాష్ట్రంలో ఈ పోరాట యాత్రకు వందకుపైగా ప్రజాసంఘాలు సంఘీభావాన్ని ప్రకటించాయి.కమిటీల్లో చేరాయి.యాభై మందికి పైగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల సంఘీభావాన్ని ప్రకటించారు. కమిటీల్లో చేరారు. ప్రజల గురించి ఆలోచించేవారు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా సరే ఏ పనిలో ఉన్నాసరే అపూర్వమైన ఈ విధ్యాపోరాట యాత్రకు సంఘీభావాన్ని తెలియజేయవలసిందిగా యాత్రలో పాల్గొనవలసిందిగా,మీకు వీలైన పద్దతిలో యాత్రకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
డిమాండ్లు :
1. ప్రతి ప్రాథమిక పాఠశాలకు అనుబంధంగా శిశు సంరక్షణ మరియు విద్యా కేంద్రాన్ని (ఇసిసిఐ) స్థాపించాలి.
2. ప్రతి ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక గది,ఒక ఉపాధ్యాయుడు,విద్యార్థుల సంఖ్య 100 దాటిన పాఠశాలలో అదనంగా ప్రదానోపాధ్యాయుడు ఉండాలి. ప్రాథమికోన్నత, సెకండరీ పాఠశాలలో తరగతికి ఒక గది, సబ్జెక్టుకు సెక్షన్‌కు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ఎజెన్సీ ప్రాంతాల్లో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిని పాటించకూడదు.
3. విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాలలన్నింటికి ఆట స్థలాలను, మరుగుదొడ్లను నీటి సౌకర్యాన్ని తాగునీటిని, గ్రంధాలయాలను ఏర్పాటుచేయాలి ప్రతి పాఠశాలకు ఆఫీస్ అసిస్టెంట్‌ను ఒక స్వీపర్‌ను, ఒక వాచ్‌మెన్‌ను నియమించాలి.
4. పదవ తరగతి వరకు ప్రభుత్వరంగ పాఠశాలల్లోని విద్యార్థులందరికి మధ్యాహ్నం మరింత పుష్టికరమైన ఆహారాన్ని ఉదయం అల్పాహారాన్ని సాయంత్రం ఫలహారాన్ని అందించాలి. పాఠ్యపుస్తకాను, నోట్‌పుస్తకాలను, యూనిఫాంలను పాఠశాలలను తెరిచిన వెంటనే అందించాలి. ఉన్నత పాఠశాలల విద్యార్థులకు సైకిల్‌లు ఇవ్వాలి.
5. పాఠశాల స్థాయి వరకు విద్యార్థులు చదువుకుంటేనే తమ కుటుంబంతో పరిసర సమాజంలో కలిసి ఉండేలా చూడాలి. అనివార్యమైన చోట మాత్రమే హాస్టళ్లు ఉండాలి. అన్ని సామాజిక వర్గాలకు కలిసి సమీకృత హాస్టళ్లు ఉండాలి.
6. కెజి నుండి పిజి వరకు ప్రమాణాలతో కూడిన విద్యను సమానత్వ ప్రాతిపాదిక మీద ప్రభుత్వ విద్యాసంస్థల ద్వారా అందించాలి.
7. కొఠారి కమీషన్ సూచించిన విధంగా రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి 30% నిధులను కేటాయించాలి.
8. ప్రభుత్వ, ప్రయివేట్ రంగాలలో పాఠశాల స్థాయి వరకు విద్యను మాతృభాషలో భోధించాలి. ప్రాథమిక పాఠశాలల్లో భాషల భోధనకు శిక్షితులైన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా నియమించాలి.
9. ప్రభుత్వ పాఠశాలలు,కళాశాలలు ఉన్న చోట ప్రైవేట్ పాఠశాలలను, కళాశాలలను అనుమతించకూడదు. ఆంధ్రప్రదేశ్ విద్యాహక్కు చట్టం (1982) వెలుగులో తీసుకొచ్చిన జీవో.నెం 1ను (1994) పటిష్టపరిచి అమలుచేసి ప్రైవేట్ పాఠశాలలను నియంత్రించాలి.
10. ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యం పేరుతో ప్రభుత్వ నిధులను ప్రైవేట్ కార్పోరేట్ పాఠశాలల,కళాశాల యాజమాన్యాలకు ఏ రూపంలో కూడా ధారాదత్తం చేయకూడదు. ప్రైవేట్ విద్యాసంస్థలను నియంత్రించడానికి తీసుకొచ్చిన జీవోలను కఠినతరం చేసి నిర్ణీత కాలంలో ప్రైవేట్ కార్పోరేట్ పాఠశాల,కళాశాలలను రద్దుచేసి కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టాలి.
11. ఉన్నత విద్యారంగంలో విదేశి పెట్టుబడులను అనుమతించడానికి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఎనమిది బిల్లులను వెనక్కితీసుకోవాలి. ప్రపంచ వాణిజ్య సంస్థలో ఉన్నత విద్యను చేర్చడానికి దాఖలు చేసిన సంసిద్ధతలను వెనక్కి తీసుకోవాలి.
12. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలకు, విశ్వవిద్యాలయాలకు నిధుల కేటాయింపు పెంచి రెగ్యులర్ ప్రాతిపదికన నియమాకాలను జరిపి ప్రమాణాలతో కూడిన విద్యను సామాజిక శాస్త్రాలతో సహా అందించాలి. స్థానిక అవసరాలను తీర్చగల సమగ్రత్వంతో ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వ నిధులతో స్థాపించి నడపాలి.
13. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి విశ్వవిద్యాలయాన్ని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేటట్లు అభివృద్ది చేయాలి. అందుకు కావలసిన నిధులు, సౌకర్యాలు ప్రభుత్వం తప్పని సరిగా కల్పించాలి. అలాగే ఆ జిల్లాకు సంబంధించిన ఆర్థిక రాజకీయ, సాంస్కృతిక రంగాలన్నింటిలో బౌద్ధిక, నైపుణ్య అవసరాలను తీర్చే మేధోకేంద్రంగా ఆ విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్దాలి.
14. పాఠ్యాంశాలను హిందూ మతత్త్వ భావాల నుండి అగ్రకుల ఆధిపత్య భావజాలం నుండి విముక్తి చేయాలి. అలాగే లింగ,ప్రాంత, భాషా ఆదిపత్య భావనల నుండి యితర మతతత్త్వ భావనల నుండి కూడా విముక్తి చేయాలి. ప్రజాస్వామ్యం లౌకికవాదం, శాస్త్రీయ దృక్పధం వంటి విలువలను పెంపొందించే విధంగా, అసమానతలకు అంతమొందించి వైవిధ్యాలను గౌరవించే విధంగా విద్యా విధానాలను అభివృద్ధి చేయాలి.