చాలాసేపటి నుండి తను చీకట్లోనే కూచోని వున్నట్లు అప్పుడు గ్రహించింది అనురాధ.
‘యింతసేపు యిట్లా చీకట్లోనే మొద్దులాగా అట్లే కూచున్నానే… ఎవరన్నా చూసింటే మాత్రం తిక్కది ఎవరో పాపం అనుకొనింటారు’
మెల్లిగా పైకి లేచి చీరకుచ్చిళ్లు సర్దుకుంది.
ఆలోచనల్లో వుండి దోమలు కుట్టినప్పుడు అంతగా పట్టించుకోలేదు కానీ, యిప్పుడు చూసుకుంటే దురద, మంట, దోమలు కుట్టిన చోట యింతెత్తు దద్దులుకూడా లేచాయి.
‘జీవితంలో మనుషులు చేసిన గాయాలూ, వాటి వల్ల రేగిన మంటల ముందు ఈ దద్దులు, దురద ఏ పాటిది?’ విషాదంగా నవ్వుకుంది అనూరాధ.
లైట్ వేయాలనిపించలేదు ఆమెకు. నీరసంగా అట్లే మళ్లీ మంచంపై వాలింది. మెసెజ్ అలర్ట్ వచ్చింది. దిగులుగా దాని వైపు చూసింది. వాల్ పేపర్ మీద అమ్మ ఫోటో జ్ఞాపకంగా మారిన అమ్మ. దిగులుతోనే కన్ను మూసిన అమ్మ.తనకు మరింత ఒంటరితనాన్ని మిగిల్చి వెళ్లిన అమ్మ.
‘తనకు ఫోన్ చేసి ఎలావున్నావు అని అడిగే వాళ్లు ఎవ్వరున్నారు? ఏదో, లేదనకుండా పెద్దెన్న మాత్రం ఆరునెల్లకు ఒక్కసారి ఫోన్ చేస్తుంటాడు. ఎప్పుడయినా బుద్ది పుట్టినప్పుడు మాత్రం ఖాళీగా వుంటే ఓ రెండు రోజులు వుండిపోవచ్చు కదా! వస్తావా అంటారు. మళ్లీ తను అక్కడే ఎక్కడ వుండిపోతుందో అనే భయం ఆయనతో అట్ల మాట్లాడిస్తుందేమో బహుశ.!’
చేతిలోకి సెల్లు తీసుకుంది.టైమ్ ఏడు యాభై. అత్త, మామ యిప్పుడే రారు, తొమ్మిది తర్వాతనే వాళ్లు వచ్చేది అని అనూరాధకు తెలుసు. గుడి మూసే టైమ్ అయినా రాకుండా గుళ్ళో ఏం చేస్తుంటారో అని మొదట్లో అనుకునేది. తర్వాత మెల్లి మెల్లిగా అర్థం అవ్వుతూ వచ్చింది. సోమవారం శివాలయానికి, గురవారం సాయిబాబాగుడికి, శనివారం వెంకటేశ్వరస్వామి గుడికి ఎందుకు పోతారో, ఎవర్ని కలవడానికి పోతారో అనూరాధకు స్పష్టంగా తెలిసిపోయింది. కాకపోతే చాలా ఆలస్యంగానే తెలిసింది. తెలిసినా ఎవర్ని ఏం అనాలో తెలియక, ఎవరికి చెప్పుకోవాల్నో దిక్కు తోచక పెదవి కొరుక్కుంటూ దుఃఖాన్ని దిగమింగటం అలవాటు చేసుకుంది. ఒక్క దుబారా మాట కూడా మాట్లాడని అత్త మామలతో ఎట్ల యుద్ధం చేయాలో ఎంత ప్రయత్నించినా అనూరాధకు సాధ్యం కాలేదు.
”మీ అత్త మామ దేవునిలాంటోళ్ళు… నిన్ను కన్న బిడ్డలెక్క కడుపులో దాచుకొని పెట్టుకున్నారు… ఎవ్వరుంటారు ఈ కాలంలో యిట్లాంటి అత్తమామలు?కొడుకు కోసం కోడల్ని తన్ని తగలేసే అత్తమామల్ను చూసినాం గాని కోడలు కోసం కొడుకునే యింట్లోకి రానీకుండా చేసిన అత్తమామల్ను మాత్రం ఎక్కడా చూడలేదు. ఎవ్వరూ చూసి వుండరు. పిల్లలు పుట్టకపోతే కొడుక్కి రెండో పెండ్లి చేస్తామని కోడల్ని బెదిరించే అత్తమామల్ని ఈ కండ్లతో కొల్లలకు చూసినాం. వాడు మొగోడు ఒకటి కాకుంటే నాలుగు పెండ్లిండ్లు చేసుకుంటాడు.నీకు బుద్ధి పుడితే ఈన్నే వుండు ల్యాకుంటేతట్టా బుట్టా సర్దుకొని యాటికి పోతావో ఆటికిపో అని కోడల్ను మెడబట్టి బయటకు గెంటేసే అత్తమామలకు ఈ లోకంలో కొదువలేదు. ఏమోలే దేవుడు నీకు ఒక పక్క ఆన్యాయం చేసినాయింగో పక్కయిట్లాంటి అత్తమామల్ను యిచ్చినాడు. ఏం చేస్తాం! దేవుని రాతను ఎవరు మాత్రం మార్చగలరు? యిచ్చినదాంతో తృప్తి పడాలా!” ఇంట బయట అత్తమామల గురించి పొగుడుతుంటే అనూరాధకు మొదట అలాగేఅనిపించేది.
‘నిజమే ఆ ముదనష్టపు ముండాకొడుకు మొసం చేసే పాయ… వాడు మొగం చూడకున్నా వీళ్లే కదా యింట్లో పెట్టుకొనిండేది! వీళ్ళు కూడా తనను యింట్లో నుండి బయటకు గెంటేసుంటే ఏం గతి?ఏదో వీల్ల పుణ్యానా యింతనీడ, తిండి దొరుకుతోంది. లేకపోతే వీధినా పడాల్సి వచ్చేది…’ అని అనూరాధ రోజు ఉదయం లేస్తూనే ఒకసారి, రాత్రి పడుకునే ముందు క్రమం తప్పకుండా గుర్తు చెసుకునేది. దేవుడు ఎక్కడో లేడు అత్తమామల్లోనే వున్నాడు అనుకునేది.
మామ షుగర్ పేషెంట్ అయితే అత్తేకేమో బీ.పి, కీళ్లనొప్పులు. ఆవిడ కూచుంటే లేవలేదు.. లేస్తే కూచోలేదు. ఆమె కూచోని వుంటే కూచున్న దగ్గరికి, నిల్చోని వుంటే నిల్చున్న దగ్గరికే అన్నీ సమకూర్చిపెట్టేది. ఉదయం బ్రష్ మీద పేస్టు వేసి యివ్వడం దగ్గర మొదలుపెట్టి రాత్ర ఇపడుకునేటప్పుడు మంచం దగ్గర మంచినీళ్ల చెంబు పెట్టడం వరకు అన్నీ సమయానికి అమర్చి పెట్టేది. చక్కెర లేకుండాకాఫీ, టీలు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు నిమిషాల్లో మామకు అందించేది.
మామ స్నేహితులు వస్తే వాళ్లకు చక్కెర వేసిన కాఫీ యిస్తే మామకువిడిగా చక్కెర లేకుండా యిచ్చేది. ”ఏమ్మా అనూరాధా…’ అని మామ పిలుపువింటూనే
”ఇదిగో మామా అయిపాయా… తెస్తున్న కాఫీ…” వురుకులు పరుగుల మీద తెచ్చి చేతికి అందించేది. అత్తకుఉప్పు, కారం, నూనె తక్కువ వేసే ఆమె అడిగిన కూరలు రెండు పూటలూ చేసి పెట్టేది. మామకేమో రాత్రి పూట అప్పటికప్పుడు వేడి వేడిగా జొన్న రొట్టెలు చేసి వడ్డించేది.
అత్త కోసం చప్పిడి పప్పుచేస్తే, మామ కోసం ఆకుకూర, పచ్చి మిరపకాయలు వేసి వేరేగా పప్పు వండేది.
ఆవిడకి బెల్లం వేసి కాకరకాయ తాళింపు చేస్తే, ఈయనకేమోచింతపండు వేసి కాకరకాయపులుసు కాచేది.
ఆమె కోసం పాయసం చేస్తే ఈయన కోసం వుద్ది వడలు వేయించేది. అనూరాధ తన కోసం అంటూ ఎప్పుడూ ఏమీ వండుకునేది కాదు. పథ్యం పంటలు పండి తను కూడా అవే తినడం అలవాటు చేసుకుంది. అత్తకు, మామకు యిష్టమైనవి ఏవి అంటే వెంటనే గుర్తుకు వస్తాయి కాని తనకు యిష్టమైనవి ఏవి అని గుర్తుచేసుకుంటే మాత్రం.
‘నాకు యిష్టమైనవా? ఎప్పుడూ? పెండ్లికి ముందా? తర్వాత?’ అని ఆలోచించాల్సి వస్తోంది అనూరాధకు.
‘అసలు నీకు యిష్టమైనేటివి ఏంటివి అని నన్ను అడిగేవాళ్లు ఎవరున్నారు…?’ అనూరాధకు కళ్లల్లో నీళ్ళు తిరిగాయి.
‘వీటికి మాత్రం తక్కువ లేదు… పుట్టినప్పటినుండి చచ్చే దాకా తోడుగా వుంటాయి…’ తన మీద తనే విసుక్కుంది అనూరాధ.
చెవి పక్కనే దోమలు ఘీ అని శబ్దం చేస్తుంటే చిరాగ్గా పైకి లేచి లైట్ వేసింది. వెలుగు ఒక్కసారిగా కళ్ల మీద పడటంతో కనురెప్పలు రెండు మూడు సార్లు ఆడించింది. బద్దకంగా వొళ్లు విరుచుకుంటూ చుట్టూ చూసింది. కంప్యూటర్ టేబుల్ మీద కాగితాల కట్ట మీద దృష్టి పడింది. డిటిపి చేసి ప్రింటవుట్ తీసి పెట్టిన పేపర్లు. ప్రొద్దునికి అంతా కరెక్షన్ చేసి యివ్వాలి అని గుర్తుకు వచ్చింది అనూరాధకు.
‘ముఖం కడుక్కొని కాఫీ తాగితే తప్ప ఈ మూడ్ నుండి బయట పడలేను. ఎన్ని దినాలని ఏడ్చేది…?’ జడ విప్పుకుంటూ గదిలోనుండి బయటకు వచ్చింది.
దేవుని గదిలో జీరో బల్బు వెలుగుతోంది. చమురు అయిపోవడంతో అత్త గుడికి పోయే ముందర అంటించిన దీపం ఆరిపోయింది.
ప్రతి శుక్రవారం యిల్లు కడిగి తుడవాలి అన్న విషయాన్ని అనూరాధ అత్తగారింటికి వచ్చిన మొదటి రోజే నేర్చుకున్న తొలి పాఠం. ఆ పాఠానికి సంబంధించిన వుప శీర్షీకల్లో భాగంగా దేవుని పఠాలు తుడవటం… కుంకుమ, పసుపు బొట్టు పెట్టటం, పూలుకొని అయినా సరే దండలు కట్టి పటాలకు వేయటం, దేవుని గదిలో వున్న ఇత్తడి సామాన్లతో పాటు వున్న ఒకటి రెండు వెండి సామాన్లను చింతపండుతో తళతళ మెరిసేట్టుగా తోమటం లాంటివి వరుసగా తడబాటు లేకుండా చకచక ఎలా చేయాలో ఎలాంటి బోధన, శిక్షణ లేకుండానే నేర్చుకుంది అనూరాధ. ఇంటి ఇల్లాలు పూజలు చేస్తే యింటిల్లిపాదికి పుణ్యం దక్కుతుందనే సూత్రాలు అనూరాధ చిన్నతనం నుండే వింటూ వచ్చింది.
ఇంటి పనులు ఒక్కొక్కటి చేతులు మారి అత్త చేతుల్లో నుండి ఇంటి కోడలుగా తన చేతిలోకి ఎప్పుడు వచ్చాయో అనూరాధ జ్ఞాపకాల్లో మరుగున పడివున్నప్పటికి వాటిని అప్పుడప్పుడు తువ్వకుంటూనే వుంటుంది. ఇంటిపనులను అత్త తనకు ఎందుకు అప్పగిస్తోందో అనూరాధ మొదట్లోనే అర్థం చేసుకోగలిగింది.
‘నేను ఈయనకు భార్యను ఈయనకు ఏం కావాల్నో చూసుకోవాల… టైమ్‌కు అన్నీ అందివ్వాల… ఇది నా బాధ్యత. ఇంతటితోనే అయిపోదు కదా! ఈయనకు భార్యను, వీళ్లకు కోడల్ను! కోడలు అన్నాక యింట్లో పనులు చేయకుండా వుండేకి ఎట్లవుతుంది… నేను కాకపోతేయింకేవరు చేస్తారు?’ ఎలాంటి సంకోచాలు లేకుండానే యింటి పనులకు సంబంధించిన బాధ్యతను భుజాల మీద వేసుకుంది.
అవే ఇంటిపనులల్లో కొన్ని ఇప్పుడు తన చేతుల నుండి ఎలా జారిపోతున్నాయో ఎందుకు జారిపోతున్నాయో అనూరాధ మొదట్లో అర్థం చేసుకోలేకపోయింది.
”చెట్లకు నీళ్లు నువ్వే పోస్తాండు. బిందెలు, బక్కట్లు ఎత్తడానికి మీ మామ చేత అయ్యేదికాదు. అంతగా కావాలంటే పూలు మీ మామ కోస్తాడులే…”
”నువ్వు బట్టలు మడతపెట్టుపో… నేను దేవుని ముందర దీపం పెడ్తాను…”
”పొద్దనికి జొన్న రొట్టె, మొట్టిక్కాయకూర కావాలట మీ మామకి… అవి పొద్దున్నే వొలుచుకుంటూ కూచోనికి నీకు యాడయితాది…? దేవుని పఠాలకు బొట్లు నేను పెడతా గాని, నువ్వు ఆ పని చూసుకోపో…”
”కార్తీక మాసం అంతా వాకిలి దగ్గర, దేవుని ముందర దీపారాధన నేనే చేస్తాలే…”
అత్త చేతులతో దేవునికి పెట్టే దూపదీపనైవేద్య కార్యక్రమాలు కార్తీకమాసంలో మొదలయి, ధనుర్మాసంలో కూడా కొనసాగి మాఘమాసం వరకు పొడిగించబడ్డాయి.
‘దేవుడంటే మాత్రం ఈమెకు ఎక్కడ లేని వొపిక వస్తాది… వృద్దాప్యంలో భక్తి పెరగడం అంటే యిదేనేమో…’ అని మొదట్లో అనుకున్నా, మనసులో మాత్రం అనూమానంగా వుండేది.
‘భార్యగా ఎప్పుడో డిలీట్ అయిపోయాను. వీళ్లు నన్ను యింకా కోడలు అనుకుంటున్నారో లేదో తెలియదు. బయటకు మాత్రం ఏమి చెప్పరు. ఈ యింటి మనిషిని కాకుండా అయిపోయానా? ఇంటి పనులు మాత్రం వుబ్బరంగా చెప్పి మరీ చేయించుకుంటారు. పూజ మాత్రం చేయనీవ్వరు. నేను చేస్తే ఫలితం దక్కదు అనుకుంటున్నారా? ‘అత్త, మామ తనను దూరం పెడ్తున్నారేమో అనే భయం అనూరాధను ఎప్పుడూ వెంటాడుతూనే వుండేది. దానితో ఆమెకు తెలియకుండానే అత్త, మామ చేతలు, మాటలు గమనించడం, వాటి గురించి ఆలోచించటం మొదలు పెట్టింది. అత్త, మామ యిద్దరు కలిసి బయటకు పోయేటప్పుడు బిరువాకు తాళాలు వేసుకొని, తమతో పాటు తీసుకొని పోవటం…. వాళ్లిద్దరు మాట్లాడుకునేటప్పుడు అనురాధ అటువైపుగా వస్తే ఠక్కున మాటలు మార్చడానికి యిబ్బంది పడటం… యివన్నీ అనూరాధకు ముల్లు గుచ్చుకున్నట్టుగా అనిపించేది. దానికి తోడు యింతకు ముందు అయితే
”కోడలు చేసింది… కోడలు తెచ్చింది” అనేమనిషి యిప్పుడు ”ఆమె చేసింది… ఆవిడ తెచ్చింది” ఆనటం చాలాసార్లు అనూరాధ దృష్టికి వచ్చింది. ఆరునెలల నుండి అనూరాధకు అనుమానం బలపడుతూ వచ్చింది. ఇంతకు ముందు అనుమానాలుగా వున్నవి యిప్పుడు వాస్తవాలుగా కళ్ల ముందు కనిపిస్తున్నాయి. అత్త, మామలను నీలదీసి అడగాలంటే అభిమానం అడ్డువచ్చేది. అడిగితేనిజం చెప్తారో లేక ”అవును! మా యిష్టం! నీకోసమని ఎంత కాలం కొడుకుకు దూరంగా వుంటాం… నువ్వు పరాయిదానివి. నిన్న గాక మొన్న వచ్చిన దానివి. వాడు రక్తం పంచుకొని పుట్టినోడు… వాడు ఎక్కువయితాడా? నువ్వు ఎక్కువవుతావా?” అని ఎక్కడ అంటారో అనే భయం కూడా అనూరాధకు వుండేది.
”పొమ్మని చెప్పరు? చేసేవి మాత్రం అన్నీ చేస్తుంటారు. ఇంట్లో ఒక మనిషి వుంది అన్న విషయాన్ని మరిచిపోయినట్లు వుంటారు. మరి నన్ను ఎందుకు వీళ్లతో పాటు వుంచుకున్నట్టు? నాతో చాకిరి చేయించుకోడానికి వుంచుకున్నారా? యిప్పుడు ఆ అవసరం లేదనుకుంటున్నారేమో! నేను లేకుంటే ఈ పాటికి వాళ్లు ఈ యింటిలోనే కాపురం చెస్తాందురేమో! కొడుకును కోడల్ను, మనుమన్ని యింట్లోనేపెట్టుకోడానికి నేను అడ్డం అయింటాను. అందుకే బహుశ వదిలించుకోవాలనుకుంటున్నట్టు వుంది. వాళ్లకు వదిలించుకోవాలని వుంది కాబట్టి ఆధార్ కార్డు కోసం యిద్దరే పోయి ఫోటో దిగినారు. మాట మాత్రం కూడా అనలేదు. ఆధార్ కార్డు అంటే కుటుంబం అంతా కలిసి ఒకేసారి తీయించుకోవాల. నాతో పాటు పోతే, ఏమని చెప్పాలా? కోడలు అని చెప్పాలా! అప్పుడు గ్యారంటిగా కొడుకు ఎక్కడ అని అడుగుతారు. అట్ల చెప్పుకోకూడదనే యిద్దరే పోయినారు… ఆ కొడుక్కి వేరే సంసారం వుంది. ఆధార్ కార్డు కూడా వేరేది వున్నింటుంది. అన్నీ విషయాలు కనుక్కున్నాకనే ఏం చేయాలా అని ఆలోచించుకొనే ఈ పని చేసింటారు. ఎంత గుండెలు తీసిన బంట్లు… కోడుకు పుట్టనే లేదనుకుంటాం… నువ్వే మా కూతురు అనుకుంటాం అన్నమనుషులు వీళ్లేనా? యింత నిర్దాక్షిణ్యంగా మనిషిని వదిలిపెట్టేస్తారా? ‘గొంతు పూడుకుపోయింది అనూరాధకు. పెదవిని పంటితో నొక్కిపెట్టి బలవంతంగా కళ్ళల్లో నీళ్లు తిరగకుండా ఆపుకుంది. గుండెలు మండుతున్నాయి. ‘ప్రేమ యిస్తే అంతకు మించిన ప్రేమ దొరుకుతుంది అంటారే. భార్యగా నేను ఏం తక్కువ చేశాను! అట్ల యింకొకరి మీద యిష్టం వున్నవాడు నన్ను ఎందుకు చేసుకోవాలా? యిద్దర్ని మోసం చేసినట్టే! ఈ మొగోడు అంటే ఆమెకు పిచ్చి ప్రేమ అంట! ఆ ప్రేమను వదులుకోలేక పోయినాడంట! వినేవాళ్లు వుండాలకాని, ఎన్ని కథలు అయినా చెప్పగలరు! రేపు యింకొకరు ఎవరన్న వచ్చి నిన్ను చాలా ఏండ్ల నుండి మూగగా ప్రేమిస్తున్నాను. నా ప్రేమను కాదనకు అంటే అప్పుడు కూడా వదులుకోలేక, కాదనలేక చేసుకుంటాడేమో దరిద్రుడు. ఇతగాన్ని ఒకన్నే అని ఏం లాభం? ఈ సెకండ్ హ్యాండోన్ని చేసుకునేవాళ్లను అనాలా? అక్కడ ఒకరోజు యిక్కడ ఒకరోజు గడిపేటోన్ని చూస్తే ఏం అనిపించదా! అన్నీ మరిచిపోయి యారోజుకు ఆ రోజు కొత్తగా బతకాలంటే సాధ్యమేనా? నిలదీసింటేనే కదా అసలు విషయం బయట పెట్టింది. ఎప్పటి నుండి ఈ బాగోతం నడిపినాడో మాత్రం చెప్పలేదు. ఛీ….పోనీ దరిద్రం!యింకా ఎంత కాలం జరిగిపోయినదాన్ని తలచుకుంటూ కుములుతా వుండేది.నా తప్పు ఏముంది అని యింతగాఏడ్చాలా? తప్పు చేసిండేటోడు మాత్రం పెండ్లాన్ని, కొడుకును కూచోబెట్టుకొని బైకులో ఝామ్మని షికార్లు చేస్తాండాడు. తాళి కట్టిన పెండ్లాము బతికి వుందా చచ్చిందా అని కూడా కాబట్టని మనిషి! ఎవరెట్ల చస్తే నాకేంలే అనుకొనింటాడు. నా సుఖం నాకు ముఖ్యంఅనుకునే జాతి. ఛీ! ఆ మనిషి గురించి ఆలోచించడం వేస్ట్. ఆ కొడుకుకు తగ్గ తల్లిదండ్రులే వీళ్లు… అవసరం వున్నప్పుడు కోడలు, బెదిరిస్తేనేమో కూతురు కంటే ఎక్కువ అంటారు. నోరు ఎత్తకపోతే పనిమనిషి! వీళ్లకు చేసినంతగా అమ్మకు కూడా ఏ రోజు చేయలేదు. వీళ్లను నమ్మి అమ్మతో పోకపోతిని. ఒకవేళ పోయింటే అమ్మ యింకా కొంత కాలం బతికేదేమో! తల్లిని గుర్తు చేసుకుంటుంటే కన్నీళ్లు జలజల రాలాయి. ఎంత ఆపుకుందామన్నా కన్నీళ్లు ఆగలేదు అనూరాధకు.
‘ఎంత ఏడ్చినా కన్నీళ్లు మాత్రం యింకిపోవు. యింకా వూరుతూనే వుంటాయి. కన్నీళ్లతో మనుషుల మనసులను కరిగించాలనుకోవడం అంత బుద్ది తక్కువ పని యింకొకటి వుండదు. ఎక్కడో ఒకచోట పుల్ స్టాప్ పెట్టవలసిందే. పోయిన అమ్మ ఎటూ రాదు! యిక ఈ కొంపలో నుండి ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా బయట పడాల. అమ్మ చెప్పినట్లు ఆరోజే చేసింటే, ఈ ఊడిగం తప్పేది… కన్నీళ్ళతో కాలయాపన తప్పేది. ఈ బలవంతపు వొంటరితనం వుండేది కాదు. ఈ పాటికి నా బతుకేదే నేను బతుక్కుంటాంటిని. దేశం ఏమీ గొడ్డు పోలేదు ఛీ… ఎంత తెలివి ల్యాకుండా బతికినాను. గడ్డపారలు కొట్టుకుపోయింటే గుండుసూదులు కోసం ఏడ్చినట్టుంది. జీవితంలో ఎంతో కోల్పొయినదాన్ని, ఈ వెధవ ఆధార్ కార్డు కోసం. ఈ కొంపలో పనిమనిషి స్థానం కోసం గింజుకోడం ఏంది అసలు? యింతటితో పీడ పోయింది అనుకుంటే సరి. అదే ఆధార్ కార్డ్ వున్నింటే ముందులాగే వీళ్లకు జీవితకాలమంతా వూడిగం చేయాల్సి వచ్చేది. తలకాయ యిప్పుడు పనిచేస్తాంది. అమ్మ ఆలోచించిన మటుకు కూడా ఆలోచించలేకపోయినానే! డిగ్రి చదివికూడా తలకాయను మోకాళ్ళల్లో పెట్టుకొని బతికినాను. వీళ్ల మాటలు ఎట్ల నమ్మితి? కొడుకుకే కానిదాన్ని అయినప్పుడు, యింక వాల్ల అమ్మ నాయనకు అయినదాన్ని ఎట్లయితాను? యింత చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోలేనంత గుడ్డిదానిగా ఎట్ల తయారు అయినాను? అమ్మ ఎంత కరెక్టుగా చెప్పింది! పెండ్లి చేసుకొని రెండేళ్లు కాపురం చేసినోడే సంబంధం తెంచుకొనిపోతే, యింగా ఈ ముసిలోళ్లతో ఏం సంబంధమని వుంటాండావు… యాదో ఒకరోజు నిన్ను బయటికి పంపీడం మాత్రం కాయం. కళ్లు తెరిచి లోకాన్ని చూడమ్మా! నిన్ను కని, చదివిచ్చి, పెండ్లి చేసిండేది ఇట్ల ఏడ్చుకుంటూ బతికేదానికి కాదు. ఏమీ కానోళ్లకు ఊడిగం చేసే ఖర్మ నీకు ఏం పట్టింది. దిక్కులేంది ఏం చేసుకుంటుంది. నోరు మూసుకొని పడింటాదిలే అని అనుకుంటాండారేమో! నేను బతికే వుండాను… నో! నీ సామాన్లు అన్నీ సర్దుకోపో పోదాం… మీ అన్న వదినకు నేను చెప్తాలే! నువ్వు ఆ భయం పెట్టుకోవాకు… మసూరికి పోయినాకా వీళ్ల కథ చూస్తాము… నిన్ను ఈ రకంగా గోడాడిచ్చినోన్ని వూరికే యిడ్చిపెట్టకూడదు. వాని ఉద్యోగం వూడగొట్టిచ్చి, జైల్లో పెట్టిస్తే గాని సిగ్గురాదు గాడ్ది కొడుక్కి! అనూరాధకు తల్లి ఏడ్పు, కోపం, తిట్టిన తిట్లు పదే పదే గుర్తు చేసుకుంటోంది. అంతా నిన్నా, మొన్నా జరిగినట్టుగా వుంది. రెండేండ్లు గడిచిపోయినా అప్పుడు అయిన గాయం యింకా పచ్చి పచ్చి గానే వుంది. పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా దినాల తరబడి తను ఏడుస్తుంటే, అగ్గి మీద గుగ్గిలం అయ్యి గొంతు జీరపోయేట్లుగా అరుస్తూ, అత్త, మామ మీద యింతెత్తున ఎగిరి పడిన తల్లి రూపం అనూరాధ ఎప్పటికి మరచిపోలేదు.
‘అమ్మ కోపం చూసేకదా ఈ ముసిలోడు కొత్త డ్రామా మొదలు పెట్టింది.కొడుకును చెడమడ నోటికి ఏదొస్తే అది తిట్టేసినాడు. మాకు యింత చెడ్డ పేరు తెచ్చేటోన్ని కొడుకు అని చెప్పుకోవాలంటే చానా సిగ్గయితాంది. బంగారట్ల పెళ్లాన్ని వదిలి ఎవరో ఆ కులం గాని దాన్ని పెండ్లి చేసుకుంటాడా? యిట్లా కొడుకు వుంటే ఎంత! ల్యాకుంటే ఎంత…! కొంపలోకి కాలు పెట్టనియ్యను. ఏమనుకుంటాండాడో వాడు! ఒక్క నయాపైసా కూడా వానికి ఆస్తి యియ్యను. ఈ పాపను మేము ఎప్పుడు కోడలు అనుకోలేదు. మా కూతురాకట్లా చూసుకుంటాండాం. ఇట్లా పాపను గాలికి వదిలేస్తామా! పెద్దదానివి, పరిస్థితులను అర్థం చేసుకొని పోతాండాలా… ఈ రోజు ఎంత కాదనుకొని పోయిన తాళి కాటిన పెండ్లామే పెండ్లామయితాదికాని ఎవరో ఎట్ల అయితారు! వాడు యింతపని చేస్తాడనిమేము కల్లో కూడా అనుకోలేదు. కొంచెం వొపిక పట్టు… తొందరపడద్దు. యాదో ఒకరోజు నీకూతురు దగ్గరికి రాకుండా పోతాడా? కేసు పెట్టాలనుకుంటే పెట్టండి! నేను ఎట్టి పరిస్థితిలోనూ అడ్డం చెప్పను. అయితే ఒకటి ఆలోచించిలా! యిప్పుడు కనుక కేసు పెడితే అనూరాధ మీద మరింత ద్వేషంపెరుగుతుంది. అసలుకే మోసం వస్తాది. నిదానంగా నచ్చచెప్తాం… అనూరాధను ఈన్నే వుండనివ్వు…’ యిప్పుడు ఆ మాటలు తలుచుకుంటుంటే అనూరాధకు వొళ్లు మండిపోతోంది. ఎదురుగా వుంటే తల పగలగొట్టాలన్నంత కోపం వచ్చింది.
‘దుర్మార్గుడు! ఎంత నాటకం ఆడినాడు. కేసు ఎక్కడ పెడ్తారో అని భయపడి అట్ల చెప్పింటాడు. కొడుకు ఎక్కడ జైలు పాలవుతాడో అనే భయం వున్నింటుంది. కొడుకు జీవితం ప్రశాంతంగా వుండాలనుకొనింటాడు. కొత్త పెళ్లాం మోజు అయిపోతే కొన్ని రోజుల తర్వాత అయినా ఇక్కడికి వస్తాడు అని అనుకున్నాడో లేకపోతే నేను సర్దుకుంటే కొడుకును ఇద్దరు పెండ్లాలతో కాపురం చేయించాలనుకున్నాడో ఏమో! ఎవరికో ఒకరికి పిల్లలు కాకుండా వుంటారా అని అనుకోండచ్చు. ఇద్దరు కూడబలుక్కొని ఎమనుకున్నారో కాని మొత్తానికి కొడుకుకు మాత్రం జీవితంలో ఎలాంటి ఘర్షణ లేకుండా జేసినారు. కొడుకు సుఖానికి ఏం అడ్డం రాకుండా చేసినారు. యింకొక వైపు తమకు ఏమీ కష్టం లేకుండా వుండడానికి, జీతం, భత్యం లేని తనలాంటి తిక్కదాన్ని యింట్లో పెట్టుకొని చాకిరి చేయించుకున్నారు. యింత నమ్మకంగా, కావాల్సినవి నిమిషాల్లో అందించే మనిషి ఎన్ని వేలు పోస్తే మాత్రం దొరుకుతుంది? తన కోసం అంటూ వాళ్లు ఒక్క రూపాయి ఖర్చు పెట్టింది లేదు. మరీ మాట్లాడితే తన జీతమే అంతో యింతో వీళ్లకూ, యింటికి ఖర్చు పెట్టింది. యిప్పుడు ఏడ్చి ఏం లాభం? ఈ మాత్రం తెలివి ఆనాడే వుంటే బాగుండు. పాపం! వీళ్లను నమ్మొద్దు అంటూ అమ్మ నెత్తిన నోరు పెట్టుకొని మొత్తుకొని చెప్పింది… ప్చ్.. తను నోరు విప్పితేనా! ఎక్కడో మూలలో చిన్న ఆశ. రెండు సంవత్సరాలు ఒకే యింట్లో, ఒకే గదిలో ఒకే మంచంపై గడిపిన దినాలు గుర్తు రాకుండా వుంటాయి? వస్తాడు… తాళి కట్టిన భార్యను, తల్లిదండ్రులను వదిలి ఎంత కాలం దూరంగా వుంటాడు అనే ఆశ ఆ రోజు యింత పని చేసింది. ఆ ఆశనే అమ్మ వెంట పోకుండా చేసింది. అప్పుడే అమ్మతో పాటు వెళ్లిపోయి, కేసు పెట్టింటే కాళ్ల బేరానికి వచ్చిండునేమో… నా తిక్క కాకపోతే భయాలతో, బెదిరింపులతో కాపురాలు ఎంతకాలం నిలుస్తాయి? అయినా తిరిగి తన దగ్గరికి వస్తాడు అని ఎట్ల ఆశ పడింది? యింకొకదాన్ని ముట్టుకొని పిల్లల్ని కనిండే దరిద్రుడి కోసమా తను ఎదురు చూసింది? ఛీ… ఛీ యింత కంటే సిగ్గుమాలిన తనం యింకొకటి వుంటుందా? ఎవరి శరీరంనో తడిమిన ఆ చేతులు మళ్లీ తన శరీరాన్ని కూడా తడమాలి అని ఎట్ల కోరుకుంది? అదంటే నీతి, నియమం లేని పశువు తిరిగి వస్తే చాలు.. ఏదోరకంగా సంసారం నిలబడితే చాలుఅని ఎలా అనుకోగలిగింది? అంత దరిద్రంగా ఎట్ల ఆలోచించగలిగింది? ఇప్పుడు ఆ ఊహనే భరించరానంత అసహ్యంగా వుంది.’ వొంటిపైన పాము పిల్ల జరజర పాకినట్లుగా వులిక్కిపడింది. అనూరాధ. కంపరంగా లేచి నిల్చోని చీర దులుపుకుంది. తల తిరిగినట్లయ్యింది. కళ్ళు మూసుకొని కాసేపు మంచంపై అలానే కూర్చుంది. నీరసంగా వుంది. అంతకు మించి ఆకలిగానూ వుంది.
టైమ్ ఎనిమిది యాభై. యింకొక పది పదహయిదు నిమిషాల్లో వాళ్ళు వస్తారు.
ఆ పూటకు జొన్న రొట్టెలు, ఉప్పు, కారంలేని కూరలు చేసి వొపిక కాని ఆసక్తి కాని అనూరాధకు ఎంతమాత్రం లేదు. ముఖం కడుక్కొని వంటింట్లోకి పోయింది. తోడు వేయటానికి వుంచిన పాలను మీగడతో పాటు అట్లే గటగట తాగేసి మూతి తుడుచుకుంది. టేబుల్ మీద వున్న ఆరటి పళ్లల్లో పెద్దవి రెండు తీసుకొని కంప్యూటర్ ముందు కూచుంది. టైపు చేస్తూనే అరటి పండ్లు మెల్లిగా తినేసింది. కడుపుతో పాటు మనసు కూడా శాంతించినట్టుగా వుంది.తొక్కలను కిటికిలోనుంచి చెట్లల్లోకి బలంగా విసిరింది. నేల మీద పడకుండా కొమ్మల మధ్య యిరుక్కొని విచిత్రంగా వేలాడాయి. కళ్లు చిట్టించి కాసేపు చెట్టు వైపు తదేకంగా చూసింది.కిటికిని పూర్తిగా తెరిచింది. చల్లని గాలి ముఖానికి తగిలేసరికి కాస్తా హాయిగా అనిపించింది. అనూరాధకు.
బయట ఆటో ఆగిన శబ్దం. కీ బోర్డు మీద కదులుతున్న వేళ్లు కొన్ని క్షనాలు ఆగి, తిరిగి కదిలిఆయి. ఎలాంటి యుద్ధానికి అయినా సిద్ధంగా వుండటానికి తనను తాను తయారు చేసుకుంటోంది అనూరాధ.