(తుళ్ళూరు పరిసర ప్రాంతాలు రాజధానినగరంలో భాగంగా జరుగుతున్న మార్పులకు స్పందిస్తూ)
ఉండేవి… చిన్న గుడిసెలు, ఇరుకైన రోడ్లు, ఆ గతుకుల రోడ్లపై ప్రశాంతంగా కదిలే ఎడ్ల బండ్లు.
ఆ ఎడ్ల బండ్లపై రైతు, రైతుతో పాటు గడ్డి, ఆహారం, అతనికి, తన కుటుంబానికి కాస్తంత సంస్కారం, కొద్దిగా అణుకువ.
ఇంకా ఉండేవి పచ్చనైన చెట్లు, చెట్లపై పక్షులు, పక్షుల జీవితాల్లో సంతోషం, పక్షులు ఎగరడానికి విశాలమైన ఆకాశం.
ఇక అందమైన గడ్డినేల, నేలపై జంతువులు, ఆ జంతువులకు కొంత స్వేచ్ఛ.
ఇంకా ఉండేవారు మానవులు, మంచి మానవులు, నిస్వార్ధమైన, కపటంలేని మానవులు, పవిత్రభావం, సోదర భావం కలిగిన మానవులు. కాని ఆ మానవులలో కొన్ని మూఢవిశ్వాసాల, పిచ్చి నమ్మకాలు, అనాగరికత . . .
నమ్మకాలైతే పోయాయి . . .
నాగరికత కూడా వచ్చింది.
కానీ ఎన్నిటినో దూరం చేసింది.
పోయాయి. అన్నీ పోయాయి. గుడిసెలు పోయాయి. ఇరుకైన రోడ్లూ పోయాయి. గతుకుల రోడ్లపై ఎడ్ల బండ్లూ పోయాయి. దానిపై వెళ్ళే రైతు పోయాడు. వారి సంస్కారమూ పోయింది. విశాలమైన ఆకాశమూ ఇరుకైపోయింది. అందులో ఎగిరే పక్షులూ పోయాయి.
వాటి సంతోషాలు పోయాయి. అవి జీవించడానికి ఉన్న చెట్లూ పోయాయి. ఇంకా పచ్చనైన నేల పోయింది. నేలపై జంతువులూ పోయాయి. జంతువుల స్వేచ్ఛా పోయింది. ఎత్తైన కొండలు నునుపైపోయాయి.
మంచి మానవులు చెడ్డవారైపోయారు. స్వార్ధంగా, కపటంగా మారిపోయారు. సోదరభావం కూడా పోయింది . . .
మార్పు వచ్చింది. చాలా మార్పు వచ్చింది. నింగిని తాకే భవనాలు, విశాలమైన రోడ్లు, బైకులు, కార్లు, లారీలు, పెద్ద ట్రక్కులు కానీ వీటితో పాటు ఎన్నో ప్రమాదాలు.
రోడ్డుపై ఎన్నో యాక్సిడెంట్లు, ఎంతో ప్రాణ నష్టం.
ఇలాంటి మార్పు ఎవరికి అవసరం?