కొంతమందికి నాలుగు మాటల పరిచయ వాక్యాలు సరిపోవు. శాంత సుందరి గారికైతే మరీ!
కొడవటిగంటి వారమ్మాయి అంటే ఆమెని వేలం ఒక ఇంటి అమ్మాయిగానే చూడాల్సి వస్తుంది.
లేదూ, అందరి మన్ననలూ అందుకున్న స్నేహశీలి అంటే వేలం ఆమెని ఒక వ్యక్తిగానే చూడడం అవుతుంది.
ఇటీవలి కాలంలో అనువాదాన్ని ఒక యజ్ఞంగా తీసుకొని ఒక్క చేత్తో ఎన్నో తెలుగు రచనల్ని హిందీ లోకానికి పరిచయం చేసిన ఆమె అంకిత హృద యాన్ని మాత్రమే చెప్పు కుంటే, ఆమెలోని నిజమైన సాహిత్య తృష్ణని చిన్ని చెలమలో బంధించినట్టే.
శాంతమే సౌందర్యం అనుకుంటే ఆ ప్రశాంత సౌందర్యంలోంచి జీవన తాత్వికతని వెతికి పట్టుకున్న ఆదర్శ మూర్తిత్వం శాంత సుందరి గారు. వారితో కొన్ని క్షణాలు ఎవరికైనా అమూల్యమే. మీకు ూడా! ఈ కాఫీ కప్పులో వొదిగిన సృజన లోకాన్ని చూడండి.
శాంత సుందరి గారింట్లో మొదటి కాఫీ ఎన్నింటికి? ఎవరు కలుపుతారు?
కాఫీ ఒసాేరి బ్రేక్‌ఫాస్ట్ తో 6.30 – 7 మధ్యలో తాగుతాం. రెండో సారి కాఫీ అనేది చాలా అరుదుగా గణేశ్వర రావు గారు తాగుతారు. ఎన్నో ఏళ్లుగా అదే అలవాటు. కాఫీ కలిపేది నేనే.
ప్ర. కాఫీ తర్వాత ?
తరవాత రావు గారు వార్తలు చదవడం, నేను ఒక గంటసేపు ఏవైనా అనువాదం చెయ్యడం – అంటే ఉదయం 7-30 నుంచి 8-30 వరకు. ఆ తరవాత నిత్యకృత్యాలు, వంట, భోజనం.
ఇంతవరకు ఎన్ని పుస్తకాలు అనువదించారు ?
65 పుస్తకాలు – హిందీ తెలుగూ కలిపి.
హిందీ నించి తెలుగున్నిె ? తెలుగు నుంచి హిందీకి ఎన్ని ? అలాగే ఇంగ్లీష్ నించి తెలుగు న్నిె ? ప్రతి విభాగం లోనూ మీకు నచ్చిన ఒక పుస్తకం పేరు చెప్పండి.
తెలుగు నుంచి హిందీకి అచ్చయినవి 29 ; హిందీ నుంచి తెలుగు లోకి 11; ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి 23. ఇవికాక ఒకటి ఇంగ్లీష్ నుంచి హిందీ లోకీ, ఇంకొక పుస్తకం పిల్లల కథలు తెలుగులోనూ వచ్చాయి.
మీకు పూర్తిగా నచ్చితే గాని ఏ రచన కైనా అనువాదం చేపట్టరని విన్నాను. నిజమేనా ? మీకు నచ్చాలంటే రచనలో ముఖ్యంగా ఉండాల్సిన లక్షణాలు ఏవి ?
అనువాదకులకి పుస్తకాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడతాయి. ఇక రెండు భాషల్లో అనువాదం చేసే నాలాంటి వాళ్లకి రెండు వైపుల నుంచీ అభ్యర్థనలు ఉంటాయి. ఒక జీవితకాలంలో ఎవరైనా చెయ్య గలిగింది కొంతే.
కానీ నేను అనువాదానికి తీసుకునే రచనలో చూసే లక్షణాలు – విషయం సార్వజ నీనకంగా ఉండాలి, శిల్పంలో కొత్తదనం ఉండాలి. ఇక మూడోది సమాజానికి ప్రయోజనకరంగా ఉండాలి. ఒక్కోసారి ఒక సంస్కృతి లో విశేషంగా ఉండే లక్షణాలని సంపాదకులు ఇష్టపడతారు. గిరిజనులకి సంబంధించిన ‘టిహిలికి పెళ్ళి’ అనే మల్లిపురం జగదీశ్ కథ హిందీ అనువాదం నా బ్లాగ్ లో పెడితే హైదరాబాద్ నుంచి కొత్తగా వెలువడే హిందీ పత్రిక వాళ్ళు అడిగి మరీ తీసుకుని ప్రచురించారు.
సమకాలీన సాహిత్యంలో ఎవరి రచనల్ని మీరు ఎక్కువగా ఇష్టపడతారు ?
చాలామంది బాగా రాస్తున్నారు. ఒక్కరి పేరే అంటే చెప్పలేను. పెద్ద జాబితా తయారవుతుంది. ఒకటి మాత్రం నిజం. సగటున చూస్తే హిందీ కథా రచయితలకన్నా మనవాళ్ళు కొన్ని దశాబ్దాలు ముందుకి దూసుకుపోయారనే అనాలి.
మీకు అనువదించాలనిపించి అనువాదం చేయలేక పోయిన పుస్తకం లేదా రచన ?
కబీర్ దోహాలని తెలుగు చెయ్యాలని నేనూ, నా సాయంతో గిడుగు రాజేశ్వర రావు గారూ ఎంతో ప్రయత్నించాం. కానీ చెయ్యడం సాధ్యం కాలేదు. అలాగే శ్రీ శ్రీ కవితలని నాకు అనువాదం చెయ్యాలనిపించింది, ఢిల్లీ లో ఉండగా కొందరు పబ్లిషర్లు అడిగారు ూడా. కానీ ఆ మహాకవిని అనువదించలేకపోయాను. నా నా అనువాదం నచ్చలేదు. ఎందుకంటే అనువాదం అంటే పదకోశం చూసి మాటకి మాట రాయడం కాదు కదా. భావం, లయ, ఉద్వేగం, భాషా సౌందర్యం ఇన్ని విషయాలుంటాయి. ఇవన్నీ అనువాదంలో రావాలి – ముఖ్యంగా కవిత్వం అనువాదంలో.
సమాజంలో సాహిత్యం పాత్ర ఏమిటి ?
సమాజంలో సాహిత్యం పాత్ర నా ఉద్ద్దేశంలో ఎక్కువమంది చదువరులని తయారు చెయ్యగలగడం. కానీ దీనికి తల్లిదండ్రులూ, స్కూల్ యాజమాన్యం ూడా దోహదం చెయ్యాలి. ఊహ తెలిసినప్పటినుంచే సంగీతం, సాహిత్యం (వాళ్ల వయసుకి తగ్గట్టు ) పరిచయం చేస్తే ఈ నాడు సమాజం ఇంకోలా ఉండేదేమో! మనుషులు సరిగా ఉంటే సమాజం, దేశం, ప్రపంచం వాటంతట అవే సరైన దారిలో పడతాయి.
మీ మీద ప్రఖ్యాత రచయిత అయిన మీ నాన్నగారి ప్రభావం ఉందా ? ఉంటే ఎలాంటి ప్రభావం ?
నాన్నగారితో గడిపింది 20 ఏళ్ళు. ఆ సమయంలో నా చదువు సంధ్యలూ, సంగీత సాధనా, ప్రచార్ సభలో హిందీ పరీక్షలు రాయడం, ఇక ఆ రోజుల్లో పిల్లలకి ఎన్ని పనులున్నా ఆడుకోడానికి సమయం దొరిదిే కాబట్టి ఆటలూ. నాన్నేమో మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు రాత పనుల్లో నిండా మునిగి ఉండేవారు. అయినా మాతో గడిపిన ఆ కొద్ది సేపే మాకు రకరకాల విషయాలలో ఆసక్తిని కలిగించే విధంగా కబుర్లు చెప్పేవారు. ఆయన దృష్టి ఎప్పుడూ తనూ, తన రాతలమీద కాకుండా చుట్టూ ఉన్న ప్రపంచం మీదే ఉండేది. అదే నామీద ప్రభావం చూపి ఉండాలి. చదివినది సాహిత్యమే అయినా సైన్సు, చరిత్ర లాంటి విషయాలలో నాకు ఆసక్తి బాగానే ఉంది .
మీ జీవితం లోకి గణేశ్వరరావు గారి ప్రవేశం ఎలా జరిగింది?
మా పెళ్లి పెద్దవాళ్ళు కుదిర్చినదే కానీ ఆదర్శంగా జరిగింది. గణేశ్వర రావు గారు ఢిల్లీ లో పనిచేసేవారు. మా పిన్ని ూడా ఢిల్లీలోనే ఉద్యోగం చేసేది. తన ఆఫీసులో పని చేసే ఒకావిడ మా పిన్నికి ఈయన విషయం చెపితే మా పిన్ని మా అమ్మకి చెప్పింది. ఆయన తరపున పెద్దలు సొంతవాళ్ళు ఎవరూ లేరు. మా అమ్మకీ నాన్నకీ 1945 లోనే రిజిస్టర్ మారేజీ జరిగింది. మాదీ అంతే. మర్నాడు రిసెప్షన్ ఇచ్చారు. చిట్టిబాబు వీణ కచేరీ పెట్టించారు – అన్నట్టు ఒకప్పుడు నేను ఆయన ఏకలవ్య శిష్యురాలిని!
అంటే ఒకప్పుడు వీణ వాయించే వారా? ఎలాంటి సంగీతాన్ని ఇష్ట పడతారు? పాడతారు కూడానా ?
అవును. ఏడో ఏట వీణ నేర్చుకోడం మొదలుపెట్టాను. నా కన్నా వీణ ఎత్తుగా ఉందని మావాళ్ళు సరదాకి ఎగతాళి చేసేవాళ్ళు. ముగ్గురు టీచర్లు మారారు. ఆరేడేళ్ళు – మధ్యమధ్య గాప్స్ తో – నేర్చుకునేసరికి పదహారేళ్ళు వచ్చాయి. స్వామినాథ అయ్యర్ అనే ఆయన నా ఆఖరి గురువు. చాలా బాగా నేర్పారు, కానీ నాలో వీణ పట్ల అసలైన ఆసక్తి కలిగింది మొదటిసారి 1963 లో చిట్టిబాబు గారి వీణ కచేరీ విన్నప్పుడు. ఆయన మద్రాస్ లోనే ఉండేవారు కాబట్టి ఒక్క కచేరీ ూడా వదలకుండా అన్నిటికీ వెళ్ళేవాళ్ళం. అలా వినికిడి జ్ఞానం తోనే చాలా పాటలు నేర్చుకున్నాను. అందు ఏకలవ్య శిష్యురాలిని అన్నాను.
మీ సాహిత్య ప్రస్థానంలో, అనువాద అనుసృజనల్లో రావు గారి పాత్ర ?
నా అనువాద కృషిలో రావుగారి పాత్ర చాలా ముఖ్యమైనది. ఆయన సహకారమూ, ప్రోత్సాహమే కాదు, నా పని తన పనే అన్నంత మమేకం అయిపోయి సాయం చేస్తారు. సలహాలూ, విమర్శలూ (తెలుగులో అనువాదాల వర పరిమితం) ఉంటాయి కాబట్టి చిన్న చిన్న పోట్లాటలూ ఉంటాయి – అంటే ఏకాభిప్రాయానికి రాకపోవడం ఉంటుంది. కానీ తన సహాయం లేకపోతే నేను ఇన్ని పుస్తకాలు రాయగలిగేదాన్ని కాదు.
మనం వనపర్తి వెళ్ళినపుడు మీరు కనపడగానే అక్కడ తిరుగుతున్న పిల్లి పిల్లలు అమాంతం మీ ఒళ్లోక్కిె గారాలు పోయాయి, ఎందుకని ?
చిన్నప్పట్నుంచీ పిల్లులంటే అమితమైన ప్రేమ. చాలా కాలం పిల్లుల్ని పెంచాం – లిబియా వెళ్లినప్పుడైతే ఇంట్లో మూడు తరాల పిల్లులు ఉండేవి ! జంతువులకి ఉండే 6th sense వల్ల వాటిని ఎవరు ప్రేమిస్తారో తెలుస్తుందిట. అందు అవి అంత సులభంగా నా ఒళ్లోకి ఎక్కాయి .
ఇవాల్టి తెలుగు సాహిత్యాన్ని ముఖ్యంగా కథానిక, కవిత, ఈ రెంటినీ జాతీయ, అంతర్జాతీయ సాహిత్యం తో పోలిస్తే మీమేనిపిస్తుంది ?
జాతీయ భాషలన్నిటిలోనూ నేను రచనలు చదవలేదు. అన్ని భాషలలోనూ గొప్ప రచనలూ, మంచి రచనలూ, పనికిమాలిన రచనలూ ఉంటాయి. కానీ హిందీ తెలుగు భాషల్లోనే ఎక్కువ అనువాదాలు చేస్తాను కాబట్టి మనదే పై చెయ్యి అని బల్లగుద్ది చెప్పగలను. నేను చెప్పడమే కాదు, మన కథలు హిందీలో చదివి హిందీ పత్రికా సంపాదకులూ, పాఠకులూ ఇలాంటి అభిప్రాయం వెలిబుచ్చిన సందర్భాలు లేకపోలేదు.
మీ బాల్యం గురించి కొంచెం చెప్పండి.
నా బాల్యం ఊహ తెలిసినప్పటినుంచీ చాలా హాయిగానే గడిచిపోయింది. నాన్నకి తలిదండ్రులు చిన్నప్పుడే పోయారు అందుకని అమ్మమ్మా, తాతా మాత్రమే తెలుసు. వాళ్లకి మొదటి మనవరాలిని. మా మేనమామ కొమ్మూరి సాంబశివరావు, ఇద్దరు పిన్నమ్మలూ, అమ్మమ్మా, తాతా అందరూ నన్ను తెగ గారాబం చేసి పాడుచేస్తున్నారని నాన్నకి కోపంగా ఉండేదని అమ్మ చెప్పింది. అమ్మాయిలు ూడా అన్ని ఒడిదుడుకులనీ తట్టుకుంటూ, ఎదుర్కుంటూ బతకాలని అనుకునే వ్యక్తి మా నాన్న. కానీ నాకు దేనికీ లోటు లేకుండా – ప్రేమించే కుటుంబసభ్యులతో సహా – గడిచిపోయిందనే అనాలి. చదువూ, సంగీతం, ఆటలూ పెళ్లి అయేదాకా అదే జీవితం. ఆ రోజుల్లో చదువులు, స్కూళ్ళూ concentration camps లాగ ఉండేవి కావు. పైగా మా ఇంట్లో అయితే మార్కుల విషయం (ర్యాంకులు అప్పట్లో లేవు ) పెద్దగా పట్టించుకునేవారు కాదు. All round development కే స్కూళ్ళూ, తల్లిదండ్రులూ ూడా ప్రాధాన్యం ఇచ్చేవారు.
మా అమ్మా నాన్నా మాకు మరొక పెద్ద ఉపకారం చేశారు – రిషివాలీ స్కూలు పద్ధతిలో అడయార్ theosophical society నడిపే బాలభారతి అనే స్కూల్లో మమ్మల్ని చేర్పించారు. అది స్కూలులా కాకుండా గురుకులంలా ఉండేది. ఒక్కొక్క విద్యార్థినీ వ్యక్తిగతంగా ఎలా ఎదుగుతున్నారని చూసేవాళ్ళు. మార్కులూ, ర్యాంకులూ
ఉండేవి కావు. జవాబులు తప్పయితే వాటిని సరిదిద్దడమే. మూడో ఫారం (ఏడో తరగతి) దాకా ఇక్కడ చదివాను. ఇలాంటి స్కూళ్ళకి ఫండ్స్ దొరక్కుండా పోయి దాన్ని మూసేశాక రామకృష్ణ మిషన్ వాళ్ళ శారదా విద్యాలయం లో చేరాను.
చిన్నతనం లో నాకు తగిలిన అతిపెద్ద దెబ్బ నా పదో ఏట ఆరేళ్ళ మా తమ్ముడు హఠాత్తుగా చనిపోవడం – మృత్యువుని చూడడం అదే మొదటిసారి !
‘ఇంట్లో ప్రేమ చంద్’ని మీరు హిందీ నించి అనువదించారు.’ ఇంట్లో కుటుంబరావు’ గారి గురించి ఏమైనా చెప్పండి.
ఇంట్లో కుటుంబరావు గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. ఇంటా బయటా ఆయన ఒ రకంగా ఉండేవారు. హిపోక్రసీ, అనవసరమైన మొహమాటాలూ ఉండేవి కావు. ఎవరి జోలికీ వెళ్ళేవారు కాదు – అసలు దానికి సమయమే ఉండేది కాదు. ఎవరి గురించైనా చులకనగా కాని, వెటకారంగా గాని మాట్లాడడం నేనెప్పుడూ వినలేదు. అసలు ఇంకొకళ్ళ గురించి గాసిప్ చేసే స్వభావం కాదు ఆయనది. ముందే చెప్పినట్టు, చివరి కొన్నేళ్ళు తప్ప ఎప్పుడూ బోర్లా పడుకుని రాసుకుంటూనో, ూర్చుని ఏదైనా పుస్తకం చదువుకుంటూనో కనిపించేవారు. మా అమ్మా నాన్నలకి ఉన్న పుస్తకాలు చదవడమనే అలవాటే వారసత్వంగా మాకు ూడా వచ్చింది.A Child learns by imitating elders అంటారు కదా !
ఇక నాన్నకి వంట చెయ్యడం హాబీ. రాసి రాసి అలసిపోతే వంటింట్లోకి వచ్చి ఏవైనా ఐటవ్స్‌ు చేసేవారు. బండ పచ్చడి ూడా చేసేవారంటే ఆశ్చర్యపోతారేమో !
మీకు ఎంత మంది పిల్లలు? ఏం చేస్తున్నారు ? వాళ్ళని పెంచే క్రమంలో మీకు గర్వంగా లేదా గొప్ప సంతోషంగా అనిపించిన క్షణాలేవైనా గుర్తుంటే చెప్పండి.
మాకు ఇద్దరు అమ్మాయిలు – అరుణ, సత్య. ఇద్దరూ అమెరికాలో ఉన్నారు. సొంత పిల్లలు పైకొచ్చినా, ఏమైనా సాధించినా సంతోషమే తప్ప గర్వం ఉండదనుకుంటా. ఇద్దరూ బాగా చదువుకుని ఆరోగ్యంగా, సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. వాళ్ళు పాతిళ్ళే తరవాత అమెరికా వెళ్ళడం వల్ల అనుకుంటా, జీవిత విలువలని కోల్పోలేదు. ఆచరణలో భక్తీ, పూజలూ అవీ లేకపోయినప్పటికీ, నిజాయితీగా ఉండడం, ఎవరికీ హాని చెయ్యకపోవడం, వీలైనంత సహాయం చెయ్యడం, డబ్బుకీ, ¬దాకీ, చివరికి తాము సాధించిన వాటికి కూడా గర్వపడక పోవడం ఇంట్లో నేర్చిన గుణాలే.
అరుణ, సత్య ఏ రంగాల్లో స్థిరపడ్డారో చెప్తారా? ఇద్దరిలో ఎవరికైనా సాహిత్య సృజనలో గాని, పఠనంలో గాని ఆసక్తి ఉందా ?
అరుణ మోటరోల కంపెనీలో 10 సంవత్సరాలు పనిచేసి జూన్ చివర్లో రిజైన్ చేసింది. ప్రస్తుతం చిత్రకళలో పోస్ట్ graduate కోర్స్ చేస్తోంది. మంచి చిత్రకారిణి కావాలన్నది తన లక్ష్యం. పదో ఏటినుంచే చిత్రాలు వెయ్యడంలో ఆసక్తి ఉండేది తనకి .
సత్య ఒక palliative careసంస్థలో పనిచేస్తోంది. అమెరికా వెళ్ళాక హాస్పిటల్ మేనెజ్‌మెంట్‌లో MBA, ఇంకా కొన్ని కోర్సులూ చేసింది. ఇండియాలో తను బయాలజీలో పోస్ట్ graduation చేసింది. భరతనాట్యం నేర్చుకుని అరంగేట్రం ూడా చేసింది.
ఇద్దరూ పుస్తకాలు చదువుతారు. సత్య ఒకప్పుడు ఇంగ్లీష్‌లో నెట్లో ఏవో ఆర్టికల్స్ రాసేది .
మనకు మంచి అనువాదకుల కొరత ఉందన్నది తెలిసిన విషయమే. మీకు వచ్చే రెండేళ్ళ దాకా తీరిక దొరకని పని ఉందని చెప్పారు. ఇంత ఎడతెగని పని ఉండగా, ఇంటినీ, సాహిత్య వ్యాసంగాన్నీ ఎలా సంబాళించగలుగుతున్నారు ?
నిద్ర లేవడం దగ్గర్నుంచి నిద్రపోయే దాకా – భోజనం, విశ్రాంతి తీసుకోవడం, టీవీ చూడడం – సమయపాలన పాటిస్తే మనకి పని చేసుకునేందుకు బోలెడంత సమయం చిక్కుతుందని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ప్రస్తుతం బాధ్యతలు తగ్గాయి కాబట్టి ఇంటినీ, రచనా వ్యాసంగాన్నీ సంబాళించుకోవడం అంత కష్టమనిపించడం లేదు. పధ్ధతి ప్రకారం పని చేసుకుంటూ పోతే అది సులభమే. చిన్నప్పట్నుంచి క్రమశిక్షణ అలవాటు. రావుగారిది ూడా అదే పధ్ధతి కాబట్టి సులువుగా అమలు చెయ్యగలుగుతున్నాం.
ఇంట్లో ఉండి అనువాద వ్యాసంగం కొనసాగిస్తున్నా మీరు ఖచ్చితమైన పని వేళలు పాటిస్తారంటారు?
అవును. నేను పొద్దున్నే 5.30 – 6 మధ్య లేస్తాను. 7 లోపల బ్రేక్ ఫాస్ట్ అయిపోతుంది. ఆ తరవాత దాదాపు గంట, గంటన్నర తీరుబాటే. మళ్ళీ మధ్యాన్నం 3 గంటలనుంచీ సాయంత్రం 6 వరూ పనేమీ ఉండదు. ఆ సమయం చక్కగా సరిపోతుంది. భోజనం తరవాత, అది లంచ్ అయినా, డిన్నర్ అయినా సామాన్యంగా ఇక కలం పట్టుకోను. ఆ సమయం చదువుకోడాని టాేయిస్తాను. రోజుకి 4-5 గంటలు రాస్తే సరిపోదా? అన్నట్టు ఆదివారం కలానికి పూర్తి సెలవు !
చిత్తు ప్రతి లేకుండా మీరు తిన్నగా ఫెయిర్ కాపీ రాసేస్తారని విన్నాను. నిజమేనా ?
కథలూ, నవలలూ లాంటి వచన రచనలైతే తిన్నగా ఫెయిర్ రాస్తాను. తరవాత ఒక రీడింగ్ ఇస్తే తప్పులు దిద్దుకోడం వీలవుతుంది. అదే కవిత్వం అయితే ముందు రఫ్ రాస్తాను. మళ్ళీ ఫెయిర్ చేసేప్పుడు ూడా మెరుగులు పెట్టాల్సి వస్తుంది చాలాసార్లు. తెలుగులో నేను చేసే అనువాదాలకి రావు గారు ఎడిటర్, విమర్శకులు. ఒక్కోసారి ఇద్దరికీ ఏకాభిప్రాయం కుదరదు. అప్పుడు కొంచెం ఆగి ఆలోచించి ముందుకు సాగుతాను. ఇద్దరిలో ఎవరిది రైట్ అనిపిస్తే అదే ఫైనల్.
ఇంతవరకు పొందిన పురస్కారాలు ?
ఇంతవరూ అందుకున్న పురస్కారాలు మూడు.
మొదటిది 2005 లో ఢిల్లీ లోని సంస్థ – భారతీయ అనువాద్ పరిషద్ వారు ఇచ్చిన, డా.గార్గీ గుప్త ‘ద్వివాగీశ్ పురస్కార్.’ రెండు భాషల్లో తగినన్ని అనువాదాలు చేసినవాళ్లకి ఈ పురస్కారం ఇస్తారు.
రెండోది సలీం రాసిన కాలుతున్న పూలతోట నవలకి నేను చేసిన హిందీ అనువాదానికి గాను ఢిల్లీ లోని జాతీయ మానవహక్కుల సంఘం ప్రథమ బహుమతి అందజేసింది (వార్తా పత్రికల్లో మానవ హక్కులకి సంబంధించిన విషయాల పై చేసిన అనువాదాలను పురస్కారానికి గాను ఆహ్వానించారు). ఇది 2009 లో వచ్చింది .
మూడోది మన రాష్ట్రం ఇచ్చిన పురస్కారం. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు 2011 లో నా అనువాద కృషికి ఇచ్చిన పురస్కారం.
మీలో మీకు నచ్చనిదేమిటి ?
నాలో నాకు నచ్చనిది చొరవ తీసుకోలేక పోవడం. కొత్తవాళ్ళని చూస్తే కొద్దిగా జంకుతాను. పరిచయం పెరిగి వేవ్ లెంగ్త్ కుదిరితే జీవితాంతం ఆ స్నేహాన్ని వదలను. అలాగే ఇంట్లో వాళ్ళ విషయంలో నాకు ఓర్పు తక్కువ. చటుక్కున కోపం వస్తుంది – కానీ అంతే త్వరగా పోతుంది ూడా. ఈ విషయంలో ూడా మార్పు కోసం ప్రయత్నిస్తున్నాను.
ఇన్నేళ్ళ జీవితం లో మర్చిపోలేని అనుభవం ?
ఎప్పటికీ మర్చిపోలేనిది బాధాకరమైన సంఘటన – మేము లిబియాలో దాదాపు అయిదేళ్ళు ఉండి, 1980 జూలై 31 న ఇండియా కి తిరుగు ప్రయాణం అయాం. మూడు వారాలు యూరప్ లో పర్యటించి 23 న వెనక్కి చేరుకోవలసి ఉంది. మేము ఢిల్లీ లో 22 రాత్రి దిగాం. మర్నాడు మద్రాసు ప్రయాణం. మద్రాసు ఎయిర్ పోర్ట్ లో దిగగానే నాన్న ఎలా ఉన్నారని మా తమ్ముణ్ణి అడిగాను. వాడు నా చెయ్యి గట్టిగా పట్టుకుని తల అడ్డంగా ఆడించాడు. అంతే, విషయం అర్థమైనా ఇంటికి చేరుకొని అమ్మని చూసేదాకా ఒక్క చుక్క కన్నీళ్లు రాలేదు. నాన్న 17 ఆగస్టు సాయంత్రం పోయారు. మాకు కబురు పెట్టేందుకు మార్గం లేదు. యూరప్ లో మేం ఎక్కడున్నామో ూడా ఎవరికీ తెలీదు. 1979 సెప్టెంబర్లో చివరిసారి చూశాను నాన్నని ! ఆయన కోసం ఏవేవో పట్టుకొచ్చాను .
అమితమైన సంతోషాన్నిచ్చిన క్షణం ?
B.A. రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు హిందీ మాతృభాష కాని విద్యార్థులకి తమిళనాడులో అన్ని విశ్వవిద్యాలయాలూ వ్యాసరచన పోటీ నిర్వహించాయి. ప్రశ్నపత్రంలో వ్యాసాలతో బాటు హిందీ వ్యాకరణానికి సంబంధించిన ప్రశ్నలు ూడా ఉన్నాయి. అందరితోబాటు నేనూ రాశాను. ఎందుకోగాని పని చెయ్యడమే తప్ప ఫలితాలకోసం ఎదురుచూడడం అనేది నాకు చిన్నప్పట్నించీ లేదు.
మేలో కాలేజీ సెలవలు. ఒకరోజు నా క్లాస్‌మేట్, గీత అనే అమ్మాయి అంత ఎండలో మా ఇంటికి పరిగెత్తుకుని వచ్చింది. తనకి ఎలా తెలిసిందో అడగలేదు కానీ ఆ పరీక్షా ఫలితాలు తెలిశాయనీ, నాకు ప్రథమ బహుమతి వచ్చిందనీ అమితానందంతో చెప్పింది. తను అరవ అమ్మాయి. తను ూడా పరీక్ష రాసింది. తనకి ఏ బహుమతీ రాలేదు. అయినా నాకు వస్తే తన వచ్చినట్టు సంబరపడిపోయింది! అప్పుడు ఆ విషయం గమనించానో లేదో కాని 50 ఏళ్ల క్రితం జరిగిన ఆ సంగతి ఇంకా గుర్తుండిపోయింది. అది స్నేహం గురించి నాకొక గొప్ప సత్యాన్ని ూడా తెలియజేసింది.
ఇది నాకు జీవితంలో వచ్చిన మొట్టమొదటి బహుమతి !
దీనికి కొనసాగింపుగా , బహుమతి ఇచ్చేవారి షరతుల ప్రకారం 500 రొక్కం ఇచ్చి, మిగతా 500 రూపాయలూ ఉత్తరదేశ యాత్ర చేసి వచ్చి టిట్‌ె చూపిస్తే ఇస్తామన్నారు. అప్పుడు ఢిల్లీ , బెనారస్ వగైరా పర్యటించి వచ్చాం. ఢిల్లీలో రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగాయి –
మొదటిది నాకు ఇష్టమైన హిందీ కవులని కలుసుకున్నాను. రావ్‌ు ధారీ సింహ్ దినకర్, హరివంశ్ రాయ్ బచ్చన్ , జినేంద్ర కుమార్ , విష్ణు ప్రభాకర్ – ఈ నలుగురినీ కలుసుకున్నాను. వీరి నలుగురికీ మద్రాసు వచ్చాక ఉత్తరాలు రాసి కృతజ్ఞతలు తెలిపాను. ఒక్క బచ్చన్ మాత్రమే జవాబు రాశారు (ఆ ఉత్తరం నా దగ్గర ఇంకా భద్రంగా ఉంది !). పైగా నా హిందీ చాలా బావుందనీ, అనువాదాలు చెయ్యమనీ సూచించారు అందులో. రెండోది మొదటిదాని కన్నా ముఖ్యమైనది ఇది. ఆ సందర్భం లోనే రావు గారితో నా పెళ్లి దాదాపు నిశ్చయమైంది !
Any regrets?
పెద్దగా regrets అంటూ ఏమీ లేవు కానీ 63 లో botany లో సీట్ రాలేదని 3 నెలలపాటు మనోవ్యాధికి గురయి చాలా బాధపడ్డాను. అది కాకపొతే ఏదైనా పరవాలేదు అనే ఉద్దేశంతో నాన్న సలహాతో హిందీ లిటరేచర్ తీసుకున్నాను. కానీ చూడండి అదే నాకు ఎంతో మేలు చేసింది ! అప్పట్నుంచీ లేనిదానికోసం బాధపడేకన్నా ఉన్నదాన్ని వీలైనంత బాగా ఉపయోగించుకోవాలి అనేది నా సిద్ధాంతం అయింది. అయినా శ్రమ, కృషి తోబాటు సరైన అవకాశాలు ూడా దొరకాలి. నువ్వు నమ్ముతావో లేదో, అనువాదం చేసేప్పుడూ, M.A. చదువుకునేప్పుడూ ఎందరో నా అనువాదాన్ని విమర్శిస్తూ సమస్యల్ని సృష్టించారు. కానీ ఒక్కసారి ూడా మహాకవి బచ్చన్ రాసిన ఉత్తరం చూపించి, ఇప్పుడేమంటారు? అని అడగాలన్న ఆలోచనే రాలేదు నాకు ! అసలు హైదరాబాద్ వచ్చా దాన్ని బైటికి తీసి కొంతమంది స్నేహితులకి చూపించాను. అంత అమాయకంగా, మూర్ఖంగా అనాలేమో, ఉండేదాన్ని.
మీరేది కోరితే అది తీరే అవకాశం వస్తే ఏం కోరుకుంటారు?
పిల్లలకి చిన్నప్పట్నుంచే సంతోషంగా, సంతృప్తిగా బతకటం నేర్పించాలి. అటువంటి మార్పు సమాజంలో రావాలి. నా ఉద్దేశంలో ఈరోజు చిన్నపిల్లలు తమ బాల్యాన్ని కోల్పోతున్నారు. దాన్ని వాళ్లకి తిరిగి అందజేయాలి. అలాంటి అవకాశం వస్తే ఇదే కోరుకుంటాను.
అడిగిన ప్రశ్నలన్నిటికీ స్పష్టంగా, వివరంగా జవాబులుచ్చిన శాంత గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ”శాంత సుందరి గారూ, ప్రతిభావంతులైన తెలుగు అనువాదకుల్లో ఒకరైన మిమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండీ ! తెలుగు సాహిత్యాన్ని జాతీయ వేదిక మీద ప్రదర్శిస్తూ అనువాద ప్రక్రియలో మీరు చేస్తున్న నిరంతర కృషికి ంద్ర సాహిత్య అకాడెమీ, పురస్కారమిచ్చి మిమ్మల్ని గుర్తించాలనీ , తెలుగువారందరి తరఫునా కోరుకుంటూ సెలవు!” అన్నాను.
చిరునవ్వుతో ”నాగలక్ష్మీ, నా రచనలకి ఇంత ప్రాముఖ్యాన్నిచ్చి సారంగ తరపున నా ఇంటర్వ్యూ తీసుకున్న నీకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు!” అన్నారు నన్ను సాగనంపుతూ.
(సారంగ వెబ్ మ్యాగజైన్ సౌజన్యంతో)