ఇవాల్టి అవసరం భగత్‌సింగ్

వి. ప్రతిమ

భగత్‌సింగ్ అంటే ఒక ఉత్సాహం
భగత్‌సింగ్ అంటే ఒక ఉత్తేజం
భగత్‌సింగ్ అంటే ఒక ఉద్వేగం

కులం, మతం, ప్రాంతం, భాష అన్న భేదం లేకుండా మొత్తం భరతఖండమంతా ప్రశంసించే గొప్ప వీరుడు, నిరుపమాన యెధుడు భగత్‌సింగ్…

అసలు భగత్‌సింగ్ రాజకీయ జీవితాన్నీ, అకుంఠిత దీక్షనీ, నిబద్ధతనీ, కార్యాచరణనీ మనం నిశితంగా పరిశీలించినట్టయితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది… ఇటువంటి వ్యక్తి నిజంగా జీవించాడా లేక ఒక కాల్పనిక కథానాయకుడా అని విస్తుపోతాం మనం.
దేశమాత దాస్యశృంఖలాలు త్రెంచడం కోసం గుండెలెదురొడ్డి నిలబడ్డ సాహసి భగత్‌సింగ్… స్వతంత్ర్య రాజ్యస్థాపన కోసం భారత ప్రజలంతా సుఖశాంతులతో, ప్రజాస్వామిక వ్యవస్థలో జీవించాలన్న ఆశయంతో సామ్రాజ్యవాదానికి, తెల్లదొరల పాలనకి వ్యతిరేకంగా ధ్వజమెత్తిన వీరుడు… స్వరాజ్య బాలుడు భగత్‌సింగ్… బాలుడు అని ఎందుకంటున్నానంటే ఇరవైనాలుగేళ్ళు కూడా పూర్తిగా నిండని నూనూగు మీసాల యవ్వనంలో తన జీవితాన్ని స్వాతంత్య్రం కోసం అర్పించిన సాహసి భగత్‌సింగ్…

మనందరికీ తెలుసు… జాతీయోద్యమ పోరాటంలో ఎంతో మంది వీరులు తమ ప్రాణాలర్పించారు… అసువులు బాసారు… అయితే వాళ్ళందరిలోనూ భగత్‌సింగ్ అమరవీరుడుగా భారతప్రజల హృదయాల్లో నిలిచిపోవడానికి కారణం… భగత్‌సింగ్ కేవలం ఒక వ్యక్తి కాదు… మహావిప్లవ శక్తి.
బాల్యం నుండే అతడి హృదయంలో స్వతంత్రేచ్ఛ నాటుకు పోయింది… తాత అర్జున్‌సింగ్ అతడికి దేశం పట్ల ప్రేమనీ, స్వతంత్రభావాల్నీ, అన్నిటికీ మించి నిజాయితీని నూరిపోసేవాడు… భగత్‌సింగ్ తండ్రి కిషన్‌సింగ్, పినతండ్రి అజిత్‌సింగ్ లిరువురూ జాతీయోద్యమ పోరాటంలో పనిచేసినవారే… పినతండ్రులిరువురూ జెయిల్లో వున్న సమయంలో పినతల్లుల్ని ఓదార్చేవాడు భగత్‌సింగ్… దేశంకోసం వాళ్ళు చేస్తోన్న పోరాటాన్నీ, త్యాగాలనీ వివరించి ధైర్యాన్నిచ్చేవాడు.

మూడేళ్ళ వయసులోనే గడ్డిమొక్కల్ని నాటుతూ బందూకుల్ని నాటుతున్నాననే వాడు… బ్రిటిషు ప్రభుత్వంతో పోరాటం చేస్తానంటూ జబ్బలు చరిచేవాడు…

జాతీయ, సమతాభావాల ప్రాతిపదికగా ఏర్పడిన ఆంగ్లోవేధిక్‌ పాఠశాలలో చదువుకుంటూ అతిచిన్న వయసులోనే వివిధ దేశాల పోరాట చరిత్రలను అధ్యయనం చేసి ఆకళింపు చేసుకున్నాడు.

ఇటువంటి నేపధ్యంలోంచి వచ్చాడు కాబట్టే అతడిలో చిన్నతనంలోనే దేశంపట్ల ప్రేమ, స్వాతంత్య్ర కాంక్ష రగులుకున్నాయి.
తల్లి పెళ్ళి విషయం ప్రస్తావించి నప్పటికీ ‘తాత నన్ను దేశానికి వదిలేశాడు…’ అంట వివాహం మానుకుని ఢిల్లీ వెళ్ళిపోయి ఒక పత్రికలో చేరి స్వాతంత్య్రేచ్ఛతో రచనలు చేస్తుంటాడు.

”నాయనమ్మ నీ పెళ్ళి చూడాలంటోందనీ, అందుకని నీ పెళ్ళి నిశ్చయించాననీ రమ్మనీ” తండ్రి ఉత్తరం వ్రాసినపుడు భగత్‌సింగ్ ఆశ్యర్యపోతాడు.
‘మీ ఉత్తరం చదివి నేను ఆందోళన చెందాను.  మీవంటి దేశభక్తుడు, వీరుడు యిటువంటి అల్పవిషయాలు పట్టించుకుంటే యింక మామూలు మనిషి మాటేమిటి?…
మీరు నాయనమ్మ గురించి ఆలోచిస్తున్నారే కానీ, ముప్ఫయి మూడు కోట్ల ప్రజల తల్లి భారతమాత ఎంత కష్టంలో వుంది? అని ఆలోచించరేం?… మనం అందుకోసం సర్వస్వాన్నీ త్యాగం చెయ్యాలి.  నేను నా జీవితాన్ని మాతృభూమికి సంబంధించి ఉన్నతాశయాలకి అంకితం చేస్తున్నాను… అందువల్ల నాకు కుటుంబ సుఖాలు అనుభవించాలని లేదు… నాకు ఆ ఉత్తేజాన్నివ్వండి…” అంటూ తండ్రికి ఉత్తరం వ్రాస్తాడు.
అంత చిన్నవయసులోనే అంతటి ప్రగాఢమైన నిర్ణయధికారం, ధ్యేయం పట్ల దీక్ష, పట్టుదల కలిగివుండడం విస్మయాన్ని కలిగిస్తుంది.
ఏదయినా ఒక సమాజం గురించి, దేశం గురించి అవగాహన చేసుకోవాలంటే ముందుగా ఆ సమాజమూ, దేశమూ యొక్క సాహిత్యంతో పరిచయం కలిగి వుండడం ఎంతయినా అవసరం.  కారణం ఆ సమాజంలో నివసించే ప్రజల చైతన్యం ఆ సమాజం సృష్టించే సాహిత్యంలో ప్రతిబింబిస్తుంది గనక అంటాడు భగత్‌సింగ్…
రూసో, వాల్టేర్‌ సాహిత్యమే సృజించి వుండకపోయినట్టయితే ఫ్రాన్స్‌లో విప్లవమే జరిగివుండేదికాదు… టాల్‌స్టాయ్‌, కారల్‌వర్క్స్‌, మక్సింగోర్కీ వంటివారు ఏళ్ళతరబడి శ్రమించి నవ్యసాహిత్యం సృష్టించి వుండకపోయినట్టయితే రష్యాలో విప్లవం, సోషలిజాన్ని అమలుచేయడం జరిగి వుండేది కాదని భగత్‌సింగ్ వుద్దేశ్యం… అంటే ఏ దేశ పోరాటచరిత్ర అయినా సాహిత్యంతో ముడిపడి వుంటుందనీ, సాహిత్యమే పునాది అనీ అతడి నమ్మకం…
జైల్లో వుండగా అనేక నిర్బంధాలు, ఒత్తిడుల మధ్య నుండే కఠోరమైన దీక్షతో, విస్తృతమైన అధ్యయనాన్ని సాగించి, మార్క్సిజాన్ని లోతుగా ఆకళింపు చేసుకున్న భగత్‌సింగ్ అతిచిన్న వయసులోనే విప్లవ కార్యాచరణలో అసాధారణమైన మేధోసామర్ధ్యాన్ని ప్రదర్శించాడు.
అతడి మిత్రులు కానీ, సహచరులు కానీ, సమకాలీనులు గానీ ఎవరు భగత్‌సింగ్ గురించి మాట్లాడాల్సి వచ్చినా ముందుగా అతడి విస్తృతమయిన, లోతయిన అధ్యయనాన్ని గురించి ప్రస్తావించందే మరే మాటా మాట్లాడకపోవడం విశేషం… చినిగిపోయిన అతడి కోటు జేబులో కూడా తప్పనిసరిగా ఒక పుస్తకం వుండేది.  మరో అరగంటలో తాను ఉరికంబం ఎక్కాల్సి వుండగా అప్పటికి తాను చదువుతుండిన లెనిన్‌ జీవితచరిత్రను పూర్తి చేయడమే కాకుండా తనని తీసికెళ్ళడానికి వచ్చిన జైలరుకి ఒకటి, రెండు పేజీలు చదివి విన్పిస్తాడు… అంతటి గుండెనిబ్బరం, సాహిత్యప్రేమ, స్వాతంత్య్రేచ్ఛ కలిగినవాడు భగత్‌సింగ్.
జాతీయోద్యమ పోరాటకాలంలో రెండుదారులుగా సాగిన స్వాతంత్య్ర సమరంలో అహింసావాదానికి మహాత్మా గాంధీ ప్రతినిధిగా నిలిస్తే విప్లవవర్గానికి భగత్‌సింగ్ ప్రతినిధిగా నిలుస్తాడు.
గాంధీ వందేవతరం అని పిలుపునిస్తే ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ అంటూ భగత్‌సింగ్ ప్రజలని ఉత్తేజపరుస్తాడు. అంతమాత్రం చేత భగత్‌సింగ్ హింసావాది అని మనం అనుకుంటే పొరపడినట్లే. విప్లవమంటే కేవలం బాంబులూ, పిస్తోళ్ళూ మాత్రమే కాదని భగత్‌సింగ్ అభిప్రాయం.
బ్రిటిష్‌ సామ్రాజ్యంలో అసెంబ్లీ మీద బాంబు విసిరినపుడు ఒక్కరు కూడ మరణించకుండా నిరపాయకరమైన బాంబుని ఉపయెగిస్తాడు.
ఉద్యమాన్ని అణిచివేయడం కోసం ప్రజలకంటితుడుపు చర్యగా రెండు చట్టాల్ని తీసుకొస్తున్నామంటూ వైశ్రాయి ప్రకటించిన సందర్భంగా ఒక నిరసనగా, తమ వ్యతిరేకతను తెలియజేయడం కోసమే తామా బాంబులు విసిరినట్లుగా చెప్పుకుంటాడు.
”నేను టెర్రరిస్టును కాను… ఒక విప్లవకారుడ్ని… నా రాజకీయ జీవితంలోని ప్రారంభదినాల్లో తప్ప నేనెన్నడూ టెర్రరిస్టుగా లేను.  టెర్రరిస్టు పద్ధతుల ద్వారా మనం సాధించేదేమీ వుండదని నా పూర్తి నమ్మకం.”
పార్టీ సైనిక విభాగం ఎటువంటి అత్యవసరం పరిస్థితులనయినా ఎదుర్కోవడానికి అవసరమైన ఆయుధాలను సిద్ధం చేసుకుని రాజకీయ కార్యక్రమ నిర్వహణకి అండగా వుండాలే తప్ప సైనిక విభాగం స్వతంత్రంగా వ్యవహరించకూడదు’ అని సూచిస్తాడు.
అసలు విప్లవం అన్న పదానికి నిజమైన అర్థం చెప్పినవాడు భగత్‌సింగ్… విప్లవం అంటే ప్రస్తుతం వునికిలో వున్న బానిస, అస్తవ్యస్థ వ్యవస్థను కూకటివేళ్ళతో పెకలించి పారేయడం… దాని స్థానే సోషలిస్టు వ్యవస్థను నెలకొల్పడం అంటే సమాజాన్ని పునర్నిర్మించడం అన్నవట… అంటే సరికొత్త విధంగా మార్క్సిజం పునాదిగా మన ఆదర్శాలకు వ్యావహారిక రూపం యివ్వడం అంటూ… లక్ష్యం, ఈనాడు నెలకొనివున్న పరిస్థితులు, కార్యాచరణ అన్న మూడు అంశాల గురించిన స్పష్టమైన అవగాహన విప్లవకారుడు కలిగివుండాలనీ, విప్లవమంటే హింస, బాంబులూ, పిస్తోళ్ళు కాదని భగత్‌సింగ్ స్పష్టం చేస్తాడు.
‘టెర్రరిజమనే క్లిష్ట సమస్య మీద స్పష్టమైన అభిప్రాయన్ని ఏర్పరచుకుందాం రండి’ అంట బాంబుల్ని దుర్వినియెగ పరచకూడదనీ, సన్మార్గంలో వుపయోగించాల్సిన అవసరాన్ని గురించి పిలుపునిస్తాడు..
అసెంబ్లీ మీద బాంబు వేసినపుడు తప్పించుకునే వీలూ, అవకాశమూ వున్నప్పటికీ స్వచ్ఛందంగా అరెస్టవుతాడు… కోర్టునతడు ఒక రాజకీయ ప్రచార వేదికగా తయరుచేసుకోదలిచాడు… అందుకే స్వచ్ఛందంగా లొంగిపోయి చరిత్రాత్మకమైన వాంగ్మూలాన్ని కోర్టులో యివ్వడం జరిగింది.
అసెంబ్లీ బాంబుకేసు సందర్భంగా భగత్‌సింగ్, అతడి సహచరుడు బటుకేశ్వరదత్తు యిద్దరూ అరెస్టవుతారు… ఆ సందర్భంగా భగత్‌సింగ్ కోర్టులో యిచ్చిన వాంగ్మూలం చరిత్రలో విస్మరింపలేనిది…
”సమగ్రమైన మా వాంగ్మూలాన్ని అధ్యయనం చేస్తే తేలేదేమిటంటే మా దృష్టిలో దేశం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో వుంది… ఈ దశలో దిక్కులు పిక్కటిల్లేలా హెచ్చరించాల్సిన అవసరం వుంది… మాకు తోచిన రీతిలో మేము ఏప్రిల్‌ ఎనిమిదవ తేదీ 1929న అసెంబ్లీలో రెండు బాంబులు విసిరాం… అవి పేలడం వల్ల అతికొద్ది మందికి స్వల్పమైన గాయలు తగిలాయి… ఛాంబర్‌లో గందరగోళం ఏర్పడింది… ప్రేక్షకులూ, సభ్యులూ అసెంబ్లీలోంచి బయటికొచ్చారు… నలుగురయిదుగురికి చిన్నచిన్న దెబ్బలు… ఒక బెంచీ మాత్రం కాస్త దెబ్బతిని పోయింది… తప్పించుకునే సావకాశం వున్నప్పటికీ నేనూ, నా సహచరుడు బటుకేశ్వరదత్తూ స్వచ్ఛందంగా లొంగిపోయాం.
ప్రభుత్వాన్ని హెచ్చరించడం ఎంతో అవసరమన్పించి మాత్రమే మేమీ పని చేశాం…
‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ అన్న నినాదాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు… పిస్తోళ్ళూ, బాంబులూ ఎప్పటికీ విప్లవాన్ని తీసుకురాలేవు. ఇంక్విలాబ్‌ ఖడ్గం భావాల సాన మీద పదునెక్కుతుంది… ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ అన్న నినాదాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి…”
‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ ‘సామ్రాజ్య వాదం నశించాలి’ అన్న రెండు నినాదాలకూ చాలా లోతయిన వివరణ కూడ ఈ వాంగ్మూలంలో యివ్వడం జరిగింది…
”కలం, గళం ఈ రెండూ ప్రచారానికి రెండు ప్రధాన సాధనాలు. భగత్‌సింగ్ ఈ రెండింటినీ కూడ విజయవంతంగా ఉపయెగించుకున్నాడు.  పుస్తకం చేత లేకుండా భగత్‌సింగుని ఊహించలేం… అతడికి వ్రాయడమంటేనూ, చదవడమంటేనూ మహాయిష్టం… ఆంగ్లంలో అతడు వ్రాసిన వ్యాసాలూ, కోర్టు ప్రకటనలూ, కరపత్రాలూ మున్నగునవి అతడి చక్కటి శైలికి నిదర్శనాలు… కోర్టులో భగత్‌సింగ్ చేసిన ప్రకటన ఆనాడే ప్రపంచ ప్రసిద్ధమైన పత్రంగా రూపొందింది” అంటాడు భగత్‌సింగ్ సహచరుడు, మిత్రుడు అయిన శివవర్మ…
మొత్తం మీద కోర్టునతడు ఒక రాజకీయవేదికగా ఉపయెగించుకున్నాడు..
*       *         *
భగత్‌సింగ్ సామ్రాజ్యవాదానికీ, దోపిడీకి మాత్రమే కాక భగవంతునికీ, మతానికీ కూడ వ్యతిరేకే… అతనెప్పుడూ తనను నాస్తికుడుగానే అభివర్ణించుకునే వాడు… విస్తృతాధ్యయనం అతడి భావాలను మరింత దృఢపరిచి వుండొచ్చు.
”భగవంతుడనేవాడు సర్వశక్తి సంపన్నుడయివుంటే అన్యాయం, అత్యాచారం, పేదరికం, దోపిడీ, అసమానత్వం, బానిసత్వం, రోగాలూ, యుద్ధాలూ మొదలగువాటిని ఎందుకు అంతం చేయడు?… వీటన్నింటినీ అంతం చేయగలిగే శక్తి వుండి కూడా మౌనంగా వున్నాడంటే అతడ్ని మంచి భగవంతుడని అనలేం… అతడిలో వీటిని రూపుమాపే శక్తి లేదంటే అతడిని సర్వశక్తి సంపన్నుడని ఎలా అనగలం?” అంటూ పార్టీ సీనియర్‌ నాయకుడయిన ఫణీంద్రదాస్‌తో వాదనకు దిగుతాడు…
ఈ మాటలు చదూతుంటే మనకి పావెల్‌ తల్లి గుర్తుకొస్తుంది.  మొదట భగవంతుడ్ని ఎంతగానో నమ్మిన అమ్మ… ఆ తర్వాతి క్రమంలో నిజంగా దేవుడనే వాడుంటే ఈ దోపిడీ, పీడనలనీ, పేదల మీద జరుగుతోన్న అన్యాయలనీ చూస్తూ వూరుకుంటాడా?… అలా వూరుకుంటే నిజంగా అతడు మంచి భగవంతుడేనా?… అంటూ వితర్కంలో పడ్డ విషయం జ్ఞప్తికొస్తుంది… అది వేరే సంగతి.
భగత్‌సింగ్ అభిప్రాయంలో మతం అన్నది పాలకుల చేతిలో దుడ్డుకర్ర వంటిది… ప్రజలకు రాజకీయ పరిజ్ఞానం లేకుండా చేయగలిగే ఒక మత్తుమందు మతం అంటాడతడు.
ఇవన్నీ యిప్పుడు కొత్త విషయాలు కాకపోవచ్చును కానీ ఒక శతాబ్దం ముందు పద్దెనిమిదేళ్ళు కూడా నిండని ఒక కుర్రవాడు వెలిబుచ్చిన అభిప్రాయాలు అనుకుంటేనే ఆశ్చర్యమేస్తుంది…
*      *       *
యువత మీద భగత్‌సింగ్ కి గొప్ప విశ్వాసం వుంది…
విప్లవకారుని జేబులోని హేండ్‌ గ్రెనేడ్‌లా, కుట్రదారుని మొలకి వున్న తోలు పట్కాకి వేలాడుతోన్న గుళ్ళు లోడు చేసిన పిస్తోలులా అత్యంత పదునైన శక్తులు యువతలో వుంటాయని… వాటిని సరయిన మార్గంలోకి నిర్దేశించి నడపగలిగిన శక్తి మనిషి కలిగి వుండాలనీ కోరుకునేవాడు.
దేశం కోసం రక్తతర్పణ యువకులు తప్ప వేరెవరూ చేయలేరని, యువకులలో నిద్రాణమైవున్న పదునైన శక్తులను ప్రేరేపించాల్సిన బాధ్యత నాయకులదేనని నమ్మేవాడు…
‘ఓ భారతీయ యువకుడా ఏమిట్మా మొద్దు నిద్ర?  లే ! కళ్ళుతెరిచి చూడు.  ఎదురుగా తూర్పుదిక్కు ఎలా సింధూరం పులుముకుందో! ఇహ ఎక్కువసేపు నిద్దురపోకు… నిద్రపోదలచుకున్నావా శాశ్వతనిద్రలోకి వెళ్ళిపో… అంతేగానీ కాలపురుషుని ఒడిలో నిద్రపోతావేం?  మాయ, మోహం, మమకారం అన్నీ విడిచి గర్జించు దేశంకోసం’ అంటాడు.  ‘కన్నీటిబొట్టు మీద ఒట్టుపెట్టి దేశమాత కష్టాలను తొలగించు’ అంటాడు.
శతాబ్దం కిందట భగత్‌సింగ్ ‘సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వ్యవస్థ యిక అంతిమక్షణాలు లెక్కబెడుతోంది, నేను రేపు జీవించి వుండక పోయినప్పటికీ నా భావాలు కడవరకూ సామ్రాజ్యవాద దోపిడీదారులను వెంటాడుతనే వుంటాయి’ అంటాడు.
ఇవ్వాళ సామ్రాజ్యవాదం ఎలా మర్రిచెట్టులా మనదేశంలో వేళ్ళను పాతుకుని ఊడల్ని దించేసిందో చూస్తే నిర్వీర్యమై పోతోన్న యువత శక్తుల్ని భగత్‌సింగ్ ఎలా మేల్కొలిపేవాడు… కర్తవ్యాన్ని ఎలా బోధించే వాడు?…
ఇవ్వాల్టి యువతలోకి భగత్‌సింగ్ ని ఎలా ఆవాహనం చేయాలి?… భగత్‌సింగ్ లోని లోతయిన అధ్యయనం, దేశంపట్ల ప్రేమ, అకుంఠిత దీక్ష, పట్టుదల, ఉత్తేజం ఈనాటి యువతకి అత్యంత అవసరం.
ఆలోచిస్తే యివ్వాళ విద్యార్థి సంఘాలనేవి వున్నాయా? విద్యార్థులంతా కలిసి సంఘాలుగా ఏర్పడ్డం… సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావడమనేది జరుగుతోందా?… ఒకప్పుడు మాతృభమి శృంఖలాలు తెంచడం కోసం జాతీయ పోరాటంలో వీరోచితంగా భాగస్వామ్యం వహించిన విద్యార్థి సంఘాలు, మహాసభలు, ప్రాణార్పణల కాలంనుండి అసలు విద్యార్థి సంఘాలే లేకుండా పోతోన్న ఈ పరిస్థితుల దాకా మనం ఎడారిలో నడిచి వచ్చాం?… ఏ మైలురాయి వద్ద వీటన్నింటినీ జారవిడుచు కున్నాం?… వీటన్నింటి వెనుకా జరుగుతోన్న కుట్ర ఏంటి?…
మన భాషనీ, మన సంస్కృతినీ, మనుషుల మధ్య ప్రేమానుబంధాలనీ కూడా మనకు కాకుండా చేసేస్తోన్న అసలు శత్రువెవరు?… ఆనాటి సామ్రాజ్యవాద వ్యతి రేక చైతన్యాన్ని యువతకు అందనీయకుండా చేస్తోన్న దుర్మార్గులెవరు?…
దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి యువతను ఉత్తేజపరిచే శక్తుల్ని ఎలా అందచేయలి… భగత్‌సింగ్ అవసరం యివ్వాల్టి యువతకి ఎంతగానో వుంది…
ఉరికంబం ఎక్కడానికి కొంచెం ముందు భగత్‌సింగ్ అక్కడున్న ఒక ఆంగ్ల మేజిస్ట్రేటుని చూచి ‘మేజిస్ట్రేట్‌ సార్‌, మీరు నిజంగా అదృష్టవంతులు… ఒక భారతీయ విప్లవకారుడు తన మహత్తరమైన లక్ష్యసాధన కోసం నవ్వుతూ ఎలా ప్రాణాలర్పిస్తున్నాడో చూసే అవకాశం మీకు దొరికింది’ అని చెప్తాడు.
1931 మార్చి 23న సంధ్యా సమయాన్ని తలుచుకుంటే ఏ భారతీయుడి కయినా గుండె గొంతులో కొస్తుంది… నిర్ణయించిన తేదీ కంటే ఎంతో ముందుగా, చరిత్రలో ఎన్నడూలేని విధంగా సంధ్యాసమయంలో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌ ముగ్గురినీ బ్రిటిష్‌ ప్రభుత్వం ఉరితీసి హింసావాదాన్ని తీర్చుకుంది…
ఈ దేశంలోని కోటానుకోట్ల మంది పీడితులకు మానవోచితమైన నిండు జీవితాన్ని యివ్వడం కోసం, ప్రజాస్వామిక మైన నూతన వ్యవస్థను స్థాపించడం కోసం సమిధలయిపోయిన ఎందరో వీరుల త్యాగఫలాన్ని మనం ఏ విధంగా అను భవిస్తున్నాం?…
కామ్రేడ్‌ సుందరయ్య చెప్పినట్లు
”చిరునవ్వులతో ఉరికంబాలెక్కిన విప్లవకారులందరినీ సదా మనం దృష్టిలో వుంచుకోవాలి.  వారేమీ ఆకాశాన్నుండి వూడిపడిన అసాధారణ శక్తులు గల మనుష్యులు కాదు… మనందరివంటి సాధారణ మానవమాత్రులే… వారి జీవిత చరిత్రలను చదివి ఉత్తేజం పొందండి…”
నిజంగా భగత్‌సింగ్ బతికి వున్నట్టయితే మేధావులన్నట్లు భారతావనికి ఒక లెనిన్‌ వుండేవాడు… భరతఖండంలో సోషలిజాన్ని స్థాపించి వుండేవాడు… సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వ్యవస్థని తరిమికొట్టి వుండేవాడు మనదేశం నుండి…
ఇంకా ఎంతోమంది భగత్‌సింగుల్ని తయరుచేసి వుండేవాడు.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.