కొండేపూడి నిర్మల
రూపాయి మంచినూనె
పోయించుకున్నప్పుడు
సీసా అవమాన భారంతో తాడుకి ఉరేసుకుంటుంది.
ముప్పావలా ఉల్లిపాయలు
కొయ్యకముందే కళ్ళలో నీళ్ళు తెప్పిస్తాయి.
పదణాల పప్పుబద్దలు
పదేళ్ళనాడు పట్వారీ కాడ తాకట్టు కారణంగా నీళ్ళు వొదులుకున్న
మేలిమి బంగారు కాసులకి మించి వుండవు
అర్థ రూపాయి చింతపండు
అరచేతిలో చాలక పెట్టుకున్న
గోరింటాకు చందమామలా వుంటుంది.
– 1990, ఉదయం – పత్రికలో చదివినప్పుడు ఎవరబ్బా ఈ కవి ఇంతబాగా రాసాడు అని అసూయ వేసింది. ఏదో ఒక సభలో కలిసినప్పుడు అదే చెప్పాను. అదే శీర్షిక కవితా సంపుటికి పెట్టినప్పుడు ఆశ్చర్యంగా అనిపించింది. పాఠకుల స్పందనకి కవి ఇచ్చిన గౌరవానికి అది ఒక తార్కాణం.
కవితలో వాస్తవికత, భావ గాంభీర్యం గురించి చెప్పుకోవాల్సిన పని లేదు. కవి జీవితంలో స్పందనలో, ఆలోచనలో చరిత్ర వుంటుంది. ఇప్పుడు కూడా అట్టడుగు వాడి జేబు అలాగే వుంది. సరుకుల ధర మూడు రెట్లు పెరిగింది. ”ఆవిడపై అలిగి పోతానా..” అని ఇంకో కవిత వుంది. భార్యపై వచ్చిన కోపం, అది తగ్గుతున్న దశలో వుండే ఒక గుంజాటన కవి చాలా సహజంగా వర్ణించాడు. ఉద్యమాన్ని గౌరవించడం వేరు. మమేకమై పరితపించడం వేరు. స్త్రీ వాదానికి సంబంధించిన హేతుబద్ధత చాలా మందికంటే దగ్గరగా అందుకున్నాడు భూదేశ్వరరావు
వైవిధ్యభరితమైన వస్తువుల్ని ఎంపిక చేసుకోవడం ఇతని ప్రత్యేకత. ”సింథటిక్కు గుసగుసలు” – ఇలా ప్రారంభమవుతుంది.
”గుడ్డ వద్దు
గుడ్డ కర్టెన్ల కోసం కదమ్మా?
ఇవాళ పిల్లొచ్చి గుడ్డను వెక్కిరిస్తున్నది
ఇన్నాళ్ళకు భారతీయ వస్త్ర ప్రపంచం
ఓ కొత్త విషయాన్ని కంటున్నది
చచాచిచీ చానెళ్ల పుణ్యమాని
ఇప్పుడు మందం గోడల్ని కూల్చడమే కాదు
కర్టెన్లనీ కాల్చేయాలి…
నిన్నటి వస్త్ర బహిష్కరణోద్యమం నివురును నేడు తప్పక రాజేయల్సిందే…
ఈ గుడ్డే కదా
త్రివర్ణ పతకమై
మన గగన వీధుల్ని సదా వెలిగిస్తుంది.
అంగడి చక్రం మీద దొర్లిపడి నలిగిపోతున్న అనేక అంశాల్లో ఒకటైన అతి సున్నితమైన వస్తువుని, రహస్యమైన బాధనీ పెద్ద కాన్వాసుమీద ఆవిష్కరించాడు కవి.
ఈ సంపుటిలో మొదటి కవిత ”అమ్మ ఒడి అంగడిగా…” ఇవాల్టి అమ్మకపు వికృత వ్యవస్థమీద చెంపదెబ్బ.
అమ్మతనం ఒక భావజాలానికే పరిమితమై మిగిలిందనే సంగతి ఇక్కడ అందరితో బాటు లకుమ కూడా మర్చిపోయాడనిపిస్తుంది. అమ్మకంలో తల్లులకి మిగులుతున్నది ఏమీ లేదు, నింద, కడుపు కోత తప్ప. ఇంత వికృత ప్రపంచం నించి ఏ అమ్మ అయినా తన ఒడి మాత్రం దక్కించుకోగలదా? అలా ఎలా ఊహిస్తారు? ఆమెకేమైనా శక్తులున్నాయ? మాయల మరాటీనా? ముగ్గురు పిల్లలకి తిండి పెట్టుకోవడానికి ఒక బిడ్డని అమ్ముకుంటోంది. అందుకు సిగ్గు పడాల్సింది తల్లి కాదు. ఆమె నుంచున్న భూమి. ప్రాణం లాగా, వనం లాగా, గర్భ సంచీ కూడా ఒక కాసుల సంచీ ఇవాళ. అది కత్తిరించి డబ్బుగుంజుకుంటున్న డాక్టర్ల సాక్షిగా ఆమె నిస్సహాయ. బంజారా హిల్సు బంజారాలవి కానట్టే ఆమె అవయవాలూ ఆమెవి కాదు.
గోరింటాకు చందమామ పండిన క్రమంలో…. ”లేడీ టైపిస్టు” లాంటి పాత వస్తువులతో పాటు ”ఒక ఇన్కమింగు, ఒక ఔట్గోయింగు”. రంగు వొలికిన విషాదం, అత్తరు సాయిబు, ఒక నాగేటి చాలూ అనేక శవ పేటికలూ, ఇండోపాకు హైకూలు, ఎ డార్కు పోయెము అబౌటు క్రూసేడు, లాంటివి బావున్నాయి. సంపుటి లెక్కపెడితే 47 కవితల 47 కన్నీటి బిందువుల్లా అనిపించింది.
ఔను. లకుమ మన చేతిలో గోరింటాకు పెట్టినంత శ్రద్ధగానూ పద్యం రాశాడు. ప్రతి ఒక్కరి వ్యక్తిగత లైబ్రరీలోను దాచుకోవాల్సిన మంచి పుస్తకం ఇది. అందుకు అభినందనలు.