ఒక పాత భావ చిత్రం కన్నడ మూలం: సుశీల ఆర్‌.రావ్‌ అనుసృజన: వి. కృష్ణమూర్తి

ఒక్కోమారు ఆత్మీయ బంధువుల మధ్యఏదో ఒక పరిహాసపు మాట వారిని చాలా బాధిస్తుంది. విననూలేక, అర్థం చేసుకోనూ లేక సంశయాలను సృష్టించి ఆత్మశోధనకు అది కారణమవుతుంది. చివరకంతా తేలిక పడి శాంత పరిస్థితిని కలిగించకనూ పోదు.

అమెరికాలో నివసిస్తున్న మమత ఆ రోజు తన తమ్ముడు ఆదిత్యతో ఫోనులో ఎప్పటిలాగే కుశలం విచారించినది. అనంతరం తమ్మునితో…. ‘ఇక నేను, మీ బావ గారు మనవూరికి వచ్చి సెటిల్‌ అవుదామని తీర్మానించాం. అపుడు అమ్మ నాన్నల జ్ఞాపకార్థం నాకొక వస్తువు కావాలి. అదినీవివ్వాలి. అదేమిటో నేనక్కడికి వచ్చినపుడు తెలుపుతా. ఇక ఫోను పెట్టనా? బై…బై’

‘ అక్కా, ఏమిటినీకు కావల్సినది?’ వెంటనే వచ్చినది అతడి ప్రశ్న.

‘నేనక్కడికి వచ్చినపుడు చెబుతా’ మరలా అదే ఉత్తరం. చెల్లెలు అపర్ణతోనూ మాటలిలాగే సాగినవి. అలా అడిగిన యిరువురికీ వారి ప్రశాంతతని ఆ మాటలు కలచివేసినట్ల నిపించినది.

వయసు మీరిన మమత అక్క, బావ త్రివిక్రమ్‌ విదేశం నుండి తమ వూరికి వచ్చే విషయం, అక్కడే నెలకొనాలన్న విషయం యీ యిరువురికీ ఏమీ ప్రత్యేకతని అనిపించలేదు. వారి కోసమనే ఒక సుందరమైన, విశాలమైన ఫ్లాట్‌నుకూడ కొనిపెట్టి వున్నారు. కాని… అక్క మాటలలోని అర్థం వీరిని ఒక పెద్ద ప్రశ్నగా వేధించినది. ‘అప్ప, అమ్మ జ్ఞాపకార్ధంఏమి కావాలక్కా’ అన్న వారిరువురి ప్రశ్నకూ ఆమెది సిద్ధంగా వుంచుకొన్న అదే’ జవాబు. ‘అచటికి వచ్చిన మీదట చెబుతా’! ఎన్ని మార్లు అడిగినా అదే ఉత్తరం! చేతికి శోభను కలిగించే మొబైల్‌కాని, దయ్యంలా వుండే కంప్యూటర్లు లేని కాలమది. దూరవాణి మూలకంగానే వీరికి చేరాల్సిన విషయం వీరికొక చురుకు ముట్టించినది.

అందువల్లనే తోడపుట్టిన వారికి ఎక్కడలేనికుతూహలం.

ఆ దంపతుల జీవితసాయంసంధ్యలో తానుజన్మించిన వూరిలోనే యిల్లు చేసి దీపమంటించి చివరి రోజులలో శాంత జీవితం కడపాలన్న, ప్రభలమైన కోరిక ఆమెకుండినది. అదే వారిని సప్త సముద్రాలకీ వైపున్న మట్టి తీరానికి ఆకర్షించింది.

అక్కడుంటున్న వారి స్నేహితులది ఏదో లెక్కాచారం.

‘ఈ కపుల్‌ లక్కీ, బాలెన్స్‌డ్‌ ఫామిలీ… ఒక ప్లన్‌, ఒక మైనస్‌ – ఒక మగ బిడ్డ, ఒక ఆడ కూతురు…యిద్దరు బిడ్డలు.’ అనేవారు. కొడుకు రాకేష్‌ కూతురు రమ్య – విదేశంలోనే స్వంత జీవితం నిర్మించుకొని సంభ్రమ సంతోషాలతో హాయిగా వుంటున్నారు. ఇద్దరూ, కన్నవారితో అక్కడే వుండమని చెప్పవలసినదంతా చెప్పి, వారిని ఒప్పించలేక ‘గుడ్‌ బై’ చెప్పేశారు.

విక్రమ్‌ అక్కడే ఒక ఆఫీసులో ఉన్నతాధికారిగా ఉద్యోగం నిర్వహించి యీ లోపలే నివృత్తి పొందాడు. మమత సైకాలజీ ఎమ్‌.ఎ పట్టభద్రురాలైనప్పటికీ దానిని ఎపుడో మరచిపోయినది. అచ్చమైన గృహిణిగా వున్న ఆమె ఎపుడూ గృహకృత్యాలలో మునిగి వుండేది. సరళతలో యిరువురూ పరస్పరం పోటీ పడుతూ బింకం, బిగుమానం ఒకింతా లేనివారు, విదేశాలలో నివసిస్తున్నారని వ్రేలుపెట్టి చూపాల్సి పడేది.

ఇంతకు మునుపు మమత, విక్రమ్‌ సామాన్యంగా రెండు మూడు సంవత్సరాల కొకమారు తప్పకుండాస్వదేశానికి వచ్చి తమ స్వంత వూరికి పోవడం వాడుక చేసుకొన్నారు. ఇరువురి జన్మస్థలం ఒకటే అయినందున అదొక అనుకూలం. ఆప్త బంధువుల తియ్యటి సమావేశాలు. చేదు సన్నివేశాలలో మొదలైన హెచ్చు తగ్గులలో యీ వాడుక మారుతుండేది. స్వదేశానికి వచ్చినపుడల్లా దగ్గరి బంధువులు, స్నేహితులతో కలసి కబుర్లు, విహార యాత్రలు, మంచి మంచి సహవాసాలు…. యిలాంటి సంతోషాలను పంచుకోవడమేకాక ఏవైనా చిన్న చిన్న కానుకలు యిచ్చి మరికొంత ఆప్తతను పొందగలిగే వారి విధానమే అనన్యంగా వుండేది.

ఇలాంటి అక్క తనకేదో కావలంటూండడం, ఆదిత్య, అపర్ణలకు పెద్ద చింత, వారి మనోమధనాలకు గ్రాసమైనది. వారిలో ఒక విధమైన భావ సంచలనం, ఆత్మ శోధన ఆరంభమైనది. జాగృతమైన అలలు పీడించసాగినవి. ఈ విషయం గురించి ఆదిత్య యింటిలో వున్న నలుగురూ నాలుగు విధాలుగా ఆలోచించ సాగారు. తన భర్త నుండి విషయం తెలుసుకొన్న గాయత్రికి ఆశ్చర్యం. ‘ఉన్న ఒక పెద్దగా వున్న వారి పూర్వీకుల ఇల్లు, ఒకింత స్థలం… తనకేమీ వద్దని అన్నందుకే కదా అంతా భాగాలు పెట్టుకోవడమైనది? ఇపుడు వచ్చిన తనకూ కావాలంటే ఏం చేయడం?పోనీ, సరిగా తనకు ఏమి కావాలోచెబితే ఏమైపోతుంది? ఈ అనిశ్చిత పరిస్థితి, మనకిక్కడ టెన్షన్‌, ఒత్తిడి గెస్‌వర్క్‌… అన్నీ’. గాయత్రి ఆతంకం రోజు రోజుకు ఎక్కువైనది అడవి మంటలలాగా. ‘అలా ఏమీ కాదు. విడిచిపెట్టు… ఏమౌతుందో చూద్దాం’ అని ఆదిత్య మగవాడి కుండే ధైర్యంతో ఏమయ్యేది లేదని భార్యను ఓదార్చేవాడు. కాని లోలోపల అసహనపు సెగలేస్తూందేది. కూతురు సంగీతకు ఏదో గాబరా, మనసులో అలజడి. ”మేనత్త వచ్చి యీ పాత యిల్లు, స్థలం అడిగితే?’ అన్న సంశయపు దారం యీడ్చినది గీత. అందుకు ఆదిత్య – ‘అలాంటి దేమీ వారు అడుగకూడదు. ఏమీ వద్దని చెప్పి యిపుడు కావాలంటె ఎలా? అడిగినా యిచ్చేది లేదు.’…

అతడి మాటలు ముందే మంటలాగా…నిప్పులవలె వుండినది. ఇందుకు ఇంజనీరింగ్‌ విద్యార్ధి. తన అనుమానం ముందుకు పెట్టాడు. ‘నాన్నా… అన్నట్లు. నా రూములో వుండే యీ టేబుల్‌, మడిచే పలక పట్టీలున్న కుర్చీ అత్తకు చాలా యిష్టమని అంటుండేవాడివి. అత్త ఎం.ఎ. చదివేటపుడు తాత ఆమె కోసం తెప్పించినవట. అత్తకు ఎం.ఎ.లో ర్యాంకు విషయం, అన్ని సంగతులు మీరు చెప్పి వుంటిరి. తాత జ్థాపకార్ధంవుండనీ అని వీటినేమైనా అడుగుతారా?’ – అని రాగం తీసినవాడు మరలా అన్నాడు – ‘అయితే…’

‘అయితే ఏమిటి?’ గాయత్రి నేరుగా ప్రశ్నించినది.

‘ఏమీ లేదు. ఇపుడు అవి నాకు చాలా యిష్టం. కాని అత్త అడిగితే యిచ్చేస్తా…. నాకెలాంటి చింతలేద’ని అన్నాడు.

‘ఔనన్నా, నువ్వొక మొద్దువి. విదేశాల నుండిఇ వచ్చేవారెవరైనా అలాంటి వాటిని అడుగుతారా?’ సంగీతకిలకిల మని నవ్వుతూ అపశృతి పలికినది.

‘నీకేం తెలుస్తుంది మహారాణీ?’ అప్ప అమ్మ జ్ఞాపకార్ధమని చెప్పినది కదా అత్త? అలాంటివి అడుగకూడదని ఏమైనా వున్నదా?’

‘అలాగే అన్నా. అడిగితే యిచ్చేసేయి.నాకేమిటి?’

‘అలాగే, అలాగే… అన్నా చెల్లెలి జగడం యిక చాలు’ – తండ్రి గడుసు మాటలతో ఒకరినెకరు చూసి పైకినవ్వుతూనే మౌనం వహించారు వారిరువురూ. మరలా కొద్ది రోజులు ఆ యింటి వాళ్ళ మనో మథనం కొనసాగినా ఎలాంటి నవనీతం ఉబికి రాలేదు.

‘ఇక ఎవరూ యీ విషయాన్ని ఎక్కడా మాట్లాడకండి. అక్క, బావ వచ్చాక మీదట యీ విషయం నేనే ప్రస్తావిస్తా’ ఆదిత్య సుగ్రీవాజ్ఞ చేశాడు వారితో.

చెల్లెలు అపర్ణాకు కూడ అదే ఆదేశం చేశాడు ఆదిత్య. అలాగే జరిగినది.

…………..

అటు అపర్ణకూ ఏదో ఒక రకమైనఅసహనం. చల్లగా, మాయిగా వుంటున్న భర్త మధుకర్‌, కుమార్తెలు శమ, ఉమలను చూచినపుడల్లా తనలోని బాధ ఎక్కువౌతుండేది. తనలోని చింతించ సాగినది ఆమె.

‘కాదు, ఇండియాకు వచ్చి తమ యింటిలోనే సెటల్‌ కావాలని, వేరే ఎలాంటి కోరికా నాకులేద’ని చెబుతూ వచ్చిన మమత అక్కకు యిపుడు వున్నకున్నట్టే పోంగి వచ్చిన కొత్త కోరికేముంటుంది? అమ్మ జ్ఞాపకార్ధమనిఏదైన అమ్మ వేసుకొంటుండిన పాత ఆభరణమా?అమ్మ వద్ద వున్న ఆభరణాలన్నీ నాకు చేరిన వన్న విషయం గురించి ఎవరి నుండి ఎలాంటి తకరారు కూడ వుండలేదు. అయితే యిప్పుడు అక్కకు కావాల్సినదేమిటి?’ అలా ఆలోచిస్తూ కూర్చొన్న ఆమె ముందు అమ్మ ఆభరణాలు ఒకటొకటే తన ఊహల్లోకి వచ్చి చకచకామనిఎగిరిపోయినది. కొన్ని ఆభరణాలు మెరుస్తూ ఆమెను ఆకట్టుకొన్నవి. జువెలర్స్‌ షాపులో కూర్చొని నగలు చూస్తున్నటువంటి మన స్థితి ఆపర్ణది! ఏ ఆభరణాన్ని వదలి పెట్టడం? ఆ సమయం వచ్చినపుడు చూచుకొందాం’ అని తలచినది.

చివరికి వారందరూ కాచి కూర్చొన్న రోజు రానే వచ్చినది. ఏర్‌పోర్ట్‌లో వేచివున్న వారందరికి కుతూహలపు లక్షణాలు.

‘అక్కను ఎవరూ యిక్కడ ప్రశ్నించకూడదు… సమయం చూచి నేనే అడుగుతా’ నని మరొక మారు తన ఆదేశం జ్ఞాపకం చేశాడు ఆదిత్య అందరివైపు చూస్తూ. ‘అలాగే’ నని అంగీకరించినది అపర్ణ మరోకమారు. దూరపు ఆకాశంత పక్షిలాగ ఎగురుతున్న విమానం ఎదురుగా వచ్చి దిగినది. తెరచిన వాకలి మెట్ల నుండి ప్రయాణీకులు ఒక్కొక్కరూ దిగుతుండగా, వేచివున్న వారికండ్లకు దక్కినది. అవరోహణపు భంగిమలో వున్నవారి ప్రియమైన చూపులు. చిరు నవ్వులతో శాంతి దూతల వలెవున్న దంపతులిరువురూ చేయి వూపుతూ మెల్లగా మెట్లు దిగుతున్నారు. ఇచట వున్నవారు వేగపు నడకతో వారివద్దకు వెళ్ళారు. ఆదిత్య ఆ పెద్ద దంపతులకు పూలహారం వేసి చేతులు కులికాడు.సంప్రీత్‌ ఫోటో క్లిక్‌ చేశాడు.

‘ఏమిటిదంతా కొత్తగా’ అంటున్న అక్క ముఖం ఎర్రబడగా మందహాసంతో కూడిన, కొద్దిగా పులకితురాలైన ఆమె సిగ్గు చెందిన భావమది.

‘అక్కా…’ దగ్గరికి వచ్చిన అపర్ణ అక్కను అక్కుకు చేర్చుకొంటునే అన్నది ‘రండి బావా’. అంతలో సక్రమంగా సామాన్ల నన్నిటినీ తెచ్చుకొన్నారు. విక్రమ్‌ మధుకర్‌ సహకారంతో. అక్కడ వున్న వారి చేతిలో ఒక్కొక్క భారాన్ని తగిలించాడు మధుకర్‌.

‘అందరూ మా యింటికి వెళ్దా’ మని ఆదిత్య ముందుకు నడిచాడు. రెండు కార్లు గమ్యం వేపు కదిలినవి. అదే పూర్వకాలం యిల్లు.. కొద్ది మార్పుల శోభతో కొత్తదేమోనన్నట్లు మెరుస్తున్నది. ఇంటి వైపు కన్నులు పోనిస్తున్న ఆదిత్య లోలోపలే విర్రవీగాడు తన యిల్లు చూచి.

‘రండి అక్కా, రండి బావా’ అన్న ఆదిత్య యజమానిగా వారికి స్వాగతం పలికాడు.

‘అందరూ లోపలికి రండి’ గాయత్రి అన్నది.

ఎదురుగా వున్న గోడమీద గంధపు హారంతో అలంకరించుకొని అందరివైపు ఆప్తచూపులు కురిపిస్తున్నారు, రంగనాధం, సీతమ్మ దంపతులు. అదివారి వివాహం రోజున తీసిన భావ చిత్రం. నవజీవితపు సిగ్గుతో, మందమాసపు ముఖ ముద్రతో నల్లటి మీసాలతో వున్న నాన్న, పట్టు చీరలో అమ్మ, మమత అర క్షణం తలవంచి చేతితో నమస్కరించి అలాగే నిలబడిపోయినది. వెనుకనే వచ్చిన విక్రమ్‌ ఆభంగిమకు శరణయ్యాడు. తరువాత చిన్న వారందరూ ఆ ముగ్దతకు లోబడినట్టు అనుకరణపు అనుమాయులయ్యారు!

లోపలి గదిలో అతిధి సత్కారపు రంగు రంగుల కిటికీ తెరలు. ఫలహారం, ఆప్తుల కుశలోపరి, పరస్పరం మాటలు, చిరునగవుల హాస్యలాస్యం… అన్నీ ఉప్పెంగిన సముద్రంలాగా. సమయం గడుస్తున్నట్లే అంతా ప్రశాంతం. జలజల పారుతున్న మెల్లని ధ్వని అపుడు ఆదిత్య నేరుగా విషయానికి వచ్చాడు.

‘ఇపుడు చెప్పక్కా, నాన్న అమ్మ జ్ఞాపకార్ధం ఏం కావాలి నీకు?’

‘చెబుతా.. దానికి మొదలు నాతొటే ఒక పని బాకీ వున్నది. అది అయిన మీదట చెబుతా… అలా కానీనా?’

మమత జవాబుకై వేచి వుండలేదు. మూలలో వుంచిన సూట్‌ కేసుల వద్దకు వెళ్ళి తన దగ్గరకు యీడ్చుకొన్నది. ప్రక్కలో వున్న విక్రమ్‌, దానిలో వుండి ఒక్కొక్క పాకెట్‌ బయటికి తీసి ఆమె చేతికివ్వసాగాడు. ఆ ప్యాకెట్లలో వున్న క్యామరా, డ్రెస్‌, పర్‌ప్యూమ్‌ బాటిల్‌, వాచ్‌ – యిలాఒక్కొక్క కానుక అక్కడ వున్న వారి చేతి కందినవి.

‘ఓహా, ఎంత బాగున్నది… థాంక్స్‌’ – రకరకాల పదాలతో ధన్యవాదాల మధ్య సంగీత మాటలు విభిన్నంగా వున్నవి. ఆమె చూపులు మాత్రం ఆత్తవైపే!

‘మీరు గిప్ట్‌ ఒక్కొక్కరికి యిస్తున్నపుడు అమృతం పంచుతున్న మోహిని లాగా కనబడ్డారత్తా’ అని అన్నది.

‘ఔనా చిట్టీ! నీదీ ఒక మంచి కల్పనే! అందుకు థాంక్స్‌! మంద హాసపు ముద్రతో మమత అంగీకరిస్తూ అన్నపుడు ఆదిత్య వెంటనే కోపపు మూర్తే అయ్యాడు.

‘చాళ్ళనీ అధిక ప్రసంగం మాటలు.అక్క ఏదో చెబుతున్నది. ఊరికే వుండండి. నీవు చెప్పక్కా’

‘ఆ, చెబుతా… నీయింటి ముంగిటిలో గోడపై వేసినవున్న అమ్మా నాన్నలు వివాహంనాటి ఫోటో నాకు కావాలి. అదొకటేచాలు, యిస్తావా?’

‘ఇస్తా… కానినీకు ఆ ఫోటోనే ఎందుకు కావాలి? వాటి లాంటి వేరేఫోటోలున్నవి కదా నీవద్ద?’

‘ఆదిత్యా, ఆ ఫోటో అంటే నాకు చాలా యిష్టం. వారిరువురి ముఖంలో ఎత్తి కనపడే నూతన జీవితంగురించి సంప్రీత్యత్వం. పరస్పరం భరోసా యీస్తూన్నట్టు వెచ్చని భావాలు. ఆ చిరునవ్వు – యీవి అన్నీ నాకు చాలా యిష్టం. వారిరువురూ మనకందరికీ వీడ్కోలు చెప్పి ఎన్నో ఏళ్ళు గడిచాయి. అయినా నేను వారి తియ్యటి జ్ఞాపకాలకు ఎలా వీడ్కోలు చెప్పను?’ ఒక క్షణం తన మాటలు ఆపి మరలా అన్నది మమత.

‘ఆ ఫోటోనాకు యిస్తావు కదూ?’

‘అలాగే అక్కా.. ఖచ్చితంగా’అన్నాడు ఆదిత్య. ఆ మాటలు విన్నవారు ఆశ్చర్యపోయారు!

వానలేక బీటలుపడ్డ నేలకు, నీఱి బుగ్గ నుండి నీటి బిందువులు చిమ్మినట్టు అందరి హృదయాలలో హర్షపు భావనలు కలుగసాగినవి. పరిసరాలకు చైతన్యం కలిగినట్టు… అటూ యిటూ పారిన సంతృప్తితోకూడిన దృష్టి….. చిరునవ్వుల మెరుపులు… చల్లగాలిలాంటి నిర్మలమైన భావం. మాటల వెండి వెలుగులయినవి అక్కడ. చుట్టూ బంగారు, బంగారు, ఎటుచూసినా బంగారే!

Share
This entry was posted in గల్పికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.