సత్యవతి గారూ, నమస్కారం. ‘భూమిక’ మే నెల సంచికలో శ్రీమతి జూపాక సుభద్ర గారి వ్యాసం ‘తాళితెంచు శుభవేళ, చదివాక, ఈ ‘తాళి’ గురించి నా ఆలోచనలు కొన్ని పంచుకోవాలనుకుంటున్నాను.
వివాహ బంధం స్త్రీ పురుషులిద్దరి మధ్య ఏర్పడుతున్నప్పుడు స్త్రీకి మాత్రమే ఒక గుర్తింపుగా ”తాళి” కట్టాలనడం, పురుషుడికి ఏమీ అవసరం లేకుండా వదిలెయ్యడం వారి అసమానత్వాన్ని ఎత్తి చూపినట్లవుతోంది. అలాగే, భర్త పోయినప్పుడు ఆ ‘తాళి’ ని తెంపడం, ఆమెని విధవరాలిగా ముద్రవేసినట్లు చేయడం, పురుషుడికి భార్య పోయినా ఏమార్పు లేకుండా వదిలెయ్యడం అన్యాయం. నేను ఆధార్ కార్డు కోసం వెళ్ళినప్పుడు అప్లికేషన్ ఫార్మ్‌లో ‘మేరీటల్ స్టేటస్’ అన్న చోట ‘మేరీడ్’ అని రాశాను. వేరే అవసరమైన చోట భర్త పేరు రాశాను. అక్కడున్న ఆఫీసు అతను నన్ను ‘భర్త రాలేదే’మని అడిగాడు. ”లేరు పోయారు” అన్నాను. ”అయితే ఇక్కడ ‘విడో’ అని రాయవలిసింది” అన్నాడు దబాయిస్తున్నట్లు. నేను రాయలేదు. ఆ తరువాత, మా స్నేహితురాలి (ఆమె అంత క్రితమేపోయింది) భర్తని అడిగాను – ఆయన అప్లికేషన్ ఫార్మ్‌లో ‘విడోయర్’ అని రాశారా అని. ”లేదు, ఎందుకు?” అన్నాడు! పూర్వపు రోజుల్లో కొన్నేళ్ళ పాటు ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ‘సతీసహగమనం’ అనే దురాచారం ఉండేది. ‘తాళి’ ని తెంపటం అన్ని చోట్లా ఇంకా కొనసాగుతోంది. ఈ దురాచారాన్ని రూపుమాపడానికి మరో మహోద్యమానికి పూనుకునేందుకు బదులు, ”మొగ్గలోనే తుంచేసినట్లు” అసలు ‘తాళి’ కట్టే ఆచారాన్ని తొలగించి, రిజిష్టర్డ్ వివాహం చేసుకుంటే మంచిది కదా. కావాలనుకున్నవాళ్ళు ఉంగరాలూ, దండలూ మార్చుకోవచ్చు.
– అబ్బూరి ఛాయాదేవి, హైదరాబాదు.