శాంతి కొరకు పొలికేక (A Cry for Peace) దీర్ఘ కవితకు మూలకవి ఐన నరేంద్ర మోహన్ దేశ విభజనకు పూర్వం లాహోర్‌లో జన్మించటం వలన కావచ్చు వీరు ప్రధానంగా దేశ విభజన, మతం, కులం, జెండర్ మొదలైన సమస్యలకు వ్యతిరేఖంగా అనేక ప్రక్రియలలో రచనలు చేసారు. భారతదేశంలో జరిగిన, జరుగుతోన్న సామాజిక, రాజకీయ సంక్షోభాలకు ప్రత్యక్ష సాక్షిగా, కళ్ళారా చూసిన అనుభవం నరేంద్ర మోహన్ గారిని ఈదిశగారచనలకు పురికొల్పింది.
శ్రీమతి పి. మాణిక్యాంబ (మణి) గారు గతంలో డా|| నరేంద్రమోహన్ గారి దీర్ఘ కవితల్ని ‘ఓచెల్లీ! బహిణా!’పేరున తెలుగులకి అనువదించి గ్రంధస్థం చేసారు. అందులో బహిణాబాయి తన ఆధ్యాత్మిక గురువుగా తుకారంనిస్వీకరించటాన్ని సహించక ఆమెపైన జరిగిన అత్యాచారాల్నీ, ఆ సందర్భంలో నాటి సామాజిక నేపధ్యాన్నీ హృదయంగమంగా అనువదించారు. దేశ విభజనలోని విషాదానుభూతిని చిత్రించిన ‘ఒక దహనకాండ’ అక్కడా – ఇక్కడా పేరున అనువదించిన కవితలో ఛిద్రమైపోయిన స్వాతంత్ర స్వప్నాలు, భూస్థాపితం అయిపోయిన మానవీయ కోణాల్ని కళ్ళ ముందు ఫ్రేము కట్టిస్తాయి. అనువాద రచనలో అనేక పురస్కారాలు అందుకొన్న మణిగారు A Cry for Peace పేరుతో ఇరోమ్ షర్మిలాపై డా. నరేంద్రమోహన్ రాసిన మరొక దీర్ఘ కవితను ‘శాంతి కొరకు పొలికేక’గా అనువదించారు. ఇందులో కూడా మూలంలో వున్న భావాన్నీ, రచయిత మనసులో సుడులు తిరిగే సంవేదనన్నీ, ఆవేశాన్నీ ఏమాత్రం కుంటుపడనీకుండా చాలా శ్రద్ధగా అంకిత భావంతో మాణిక్యాంబగారు అనువదించారు. ఒక్కొసారి అనువాదం కాకుండా తెలుగలో రాసిన స్వీయరచన అనే భావం కలిగేలా తెనిగించటం అభినందనీయం. ఎందుకంటే సాధారణంగా ఒక సంక్షోభాన్నీ, ఒక ఉద్యమాన్నీ కవిత్వీకరించేటప్పుడు ఒక్కొక్కసారి కవిత్వాంశ తగ్గి పూర్తి వచనం అయిపోయి నినాదప్రాయం అయ్యే అవకాశం ఉంది. అందుకే అటువంటి కవితల్ని కత్తిమీద సాములా అనువదించవలసి వస్తుంది. మూల రచయిత చెప్పిన భావం చెడిపోకూడదు, పూర్తి వచనంగా మారకూడదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అనువదించవలసి ఉంటుంది. ఆపనిని చాలా బాధ్యతతో మాణిక్యాంబ గారు నెరవేర్చారు.
2012 డిసెంబర్లో గౌహతీ లో జరిగిన తొమ్మిదవ చలన చిత్రోత్సవంలో షర్మిలాను కవయిత్రిగా పరిచయం చేసిన చిత్రం బరుణి ధోక్ ఛామ్ నిర్మించిన ‘దిసైలంట్ పొయిట్’ ప్రదర్శించబడింది. 2013లో ‘ఐరన్ ఇరోమ్, టు జర్నీస్’ అనే పేరున డాక్యుమెంటరీ నిర్మాత మిన్నీ వయిర్ రచించిన పుస్తకాన్ని విడుదలచేసారు. మణిపూర్ రాష్టానికి బయట ఐరోమ్ షర్మిలాపై ప్రచురించిన పుస్తకాలలో ” మూడో పుస్తకం కాగా తెలుగులోకి అనువదించిన ‘శాంతి కొరకు పొలికేక’ నాల్గవదిగా చెప్పవచ్చు.
ఇరోమ్ షర్మిలా సామాజిక కార్యకర్తేకాక రచయిత్రి కూడా. అనేక సందర్భాలలో ఆమె కవితలు రచించింది. 1958లో భారత ప్రభుత్వం అమలులోకి తెచ్చిన సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం మణిపూర్‌లో 1980 నుండి అమలులోకి వచ్చింది. ప్రజలపై, స్త్రీలపై సాయుధ దళాలు జరుపుతోన దాడులకు నిరసనగా ఆనాటినుండి ఆ చట్టాన్ని ఉపసంహరించాలన్న ఒకే ఒక్క కోర్కెతో ఇరోమ్‌షర్మిలా గత 15 సంవత్సరాలుగా నిరాహార దీక్ష కొనసాగిస్తూనే ఉంది. అనేకసార్లు ప్రభుత్వం ఆమెదీక్షను భగ్నం చేయటానికి ఆత్మహత్యానేరాన్ని మోపి ఆమెను నిర్భంధించి తిరిగి విడుదల చేస్తూనే ఉన్నారు. అంతేకాక బలవంతంగా ముక్కుకు అమర్చిన ట్యూబు ద్వారా ద్రవ ఆహారం పంపే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.
ఇరోమ్ షర్మిలాపై రాసిన ఈ కవితలో ఆమెకు ప్రజలు పట్లగల నిబద్ధతనీ, ఆమెకు గల సంకల్ప బలాన్నీ ప్రతిభావంతంగా ప్రతిపాదించారు కవి. ప్రజల మీదా, మహిళల మీదా జరుగుతోన్న దాడుల పట్ల షర్మిలాకు గల చింతన, సామాజిక స్పృహ, దృఢ సంకల్పమూ పాఠకులకు అవగాహన కలిగిస్తుంది. ఇందులో
ఎవరువాళ్ళు / ఎవరి ఆజ్ఞతో వేల మందిని కాల్చి పారేశారు. నూతులు శవాలతో నిండిపోయాయి/ అక్కడా, ఇక్కడా కూడా గోడలమీద తుపాకీ కాల్పుల గుర్తులు / అక్కడా ఇక్కడాకూడా జలియాన్ వాలాబాగ్ కానీ / మలోమ్ కానీ” అంటూ
1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ మారణహోమం ఉదంతంతో 1994-2004 మధ్య మలోమ్‌లో ప్రజలపైన, మమిళలపైనా జరిగిన దాడికి పోలిక కల్పించారు.
”జీవించే హక్కు గురించి / సంఘర్షణ చేస్తూ
భయానికి ఎదురొడ్డి / మాట్లాడుతోన్న గొంతు
నిశ్వబ్దాన్ని చీలుస్తూ / మౌనంగా బాధతో అకేక / ఆ స్త్రీ ఎవరు”
అనే పంక్తులతోపాఠకులకు షర్మిలాని పరిచయం చేస్తారు కవి. షర్మిలా ఆకుపచ్చని బాల్యాన్ని ఎలా అనుభూతించిందో చాలా చక్కగా చెప్తారు.
”పక్షిలా స్వేచ్ఛగా / అడ్డూ ఆపూలేకుండా ఎగిరేదాన్ని
చెట్ల చర్మంతో,ఆ కులతో పూవులతో
రంగు రంగుల బొమ్మలు చేసేదాన్ని
గాలి పటాల్లా ఎగరేసేదాన్ని / కొండ మీదకి వెళ్ళే దాన్ని
అక్కడ నుండి తీసుకువచ్చేదాన్ని / ఎన్నో పక్షుల గొంతులు, గంధాల్ని”
కొండ కోనల్లో తిరిగే షర్మిలా ఎదిగిన తర్వాత ప్రజలకు దగ్గరైన జీవన విధానాన్నీ కవితలో వివరించే క్రమంలో –
”పత్రికలలో కాలం దాసేది / అణచివేతలకు విరుద్ధంగా
మానవ హక్కుల కోసం / పోరాడుతూ ఉండేది”
నిరాహారదీక్షని ఆయుధంగా చేసుకొని నిలబడింది” అని ఆమె దీక్షని అక్షర బద్ధం చేశారు.
నిరంతర నిరాహార దీక్షలో వడలిపోతోన్న కుమార్తెను చూసి తల్లి –
”ప్రతి క్షణం కొత్త రూపంలో / మృత్యువుని కౌగలించుకుంటున్నావు
చూడలేను నీ సంతాపాన్ని” అంటూ ఆవేదన పడుతుంటే ఇరోమ్ మాత్రం సడలని సంకల్పంతో..
”నువ్వే నేర్పావుగా / కష్టాలని ఎదుర్కోవాలని
అందరి వాళ్ళం కావాలని / గోడలు మేడలు కూల్చి / పైపైకి ఎగరాలని” అంటుంది.
షర్మిలా నిరాహారదీక్షని భగ్నం చేయటానికి ఆస్పత్రిలో చేరుస్తారు. మాస్పటల్ అంతా నీరవ నిశ్శబ్దంలో మునిగిన సందర్భంలో తల్లి ఆమెని చూసి తల్లడిల్లిపోతుంది.
”పూవులా విరిసేదానివి / మృత్యువులో జీవితం వెతకటం మొదలెట్టావ”ని కుమిలిపోతోన్న తల్లిని చూసి షర్మిలా-
”నువ్వే నేర్పావుగా అమ్మా / భయాన్ని అధిగమించటం
మృత్యువు జీవితాల తెరలను దాటటం” అంటూ తల్లికి ధైర్యం చెబుతుంది షర్మిలా. ఇరోమ్ షర్మిలా అంతటాధృఢ చిత్తురాలు కావటానికి తల్లి పెంపకమే కారణమనే విషయం పాఠకులకు అవగాహన కలిగిస్తుంది.
”చట్టం పేరుతో / నిరపరాధుల రక్త ప్రవాహం చూస్తున్నాను.
ఇక్కడ నన్ను / జీవితం మృత్యువు మధ్యన అతికించేసారు” అని షర్మిలా ఆ మారణహోమాన్ని చూసి ఉద్విగ్న మనసుతో ఆవేదన చెందుతుంది.
డా|| నరేంద్రమోహన్ నాటకకర్త కావటం వలనా, నాటక ప్రక్రియ పట్ల అభిరుచి కలిగి ఉండటం వలనా దీర్ఘ కవితల్లో కూడా నాటకీయ పద్ధతిలోనే సంభాషణలతో అల్లటం ఒక ప్రత్యేకతగా చెప్పాలి.
ఇందులో కూడా రాజ్యాన్ని మహాబలిగా చిత్రించి, కవి తనను మూర్ఖానంద్ పాత్రగా మారి వ్యంగ్య ధోరణిలో షర్మిలా ఉద్యమ కథని అక్షరీకరించారు డా|| నరేంద్రమోహన్
కవితలో – ”శవాన్ని చట్టాల దుస్తుల్లో కప్పేశారు”
”గాఢం అవుతన్న నిశ్శబ్ధాన్ని వెలిగిస్తూ
ఏకాంతాన్ని ప్రతిధ్వనిస్తూ నాలో ఉన్న కవి” వంటి పంక్తులే కాక
”ఆమె ముక్కు మీద / రాళ్ళు పొదిగినట్లు/ మీ దయా దృష్టిలాంటి పైప్”అని వజ్రంలా మెరుస్తున్న ముక్కు పుడకగా వర్ణిస్తారు. ఈ విధమైన అద్భుతమైన కవిత్వీకరణలు దీర్ఘ కవితలో అక్కడక్కడ మెరుస్తూ పాఠకుడిని ఆకట్టుకుంటాయి.
”సువాసనలు నింపుతూ / అనేక పాత్రలలో / ఇమిడిపోయిన ఇరోమ్” పంక్తులతో ఇరోమ్ షర్మిలా ఛాయని ఆమె దృఢ సంకల్పంలోని సువాసనని గుర్తించిన కవి నరేంద్ర మోహన్ అయితే, అంతే నిబద్ధతతో ”ఛాయ-సువాసన”గా వర్ణిస్తూ తెలుగులోకి అనువాదం చేసారు శ్రీమతి పి. మాణిక్యాంబ. ఒక ఉక్కు మహిళ జీవితాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేసినందుకు మాణిక్యాంబ గారికి అభినందనలు.