ఉనికి

కె.వాసవదత్త రమణ

”అమ్మా!” సుధ పిలుపుకి గదిలో మూల కూర్చున్న నేను కళ్లు విప్పాను. ”ఏంటమ్మా! నువ్వే ఇలా అయిపోతే, మేమంతా ఏమైపోవాలి చెప్పు?” తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ బేలగా అంది సుధ!

నాలోని అమ్మ మనస్సు కరిగింది. తనను దగ్గరగా రమ్మన్నట్టుగా చేయి చాపాను. దగ్గరగా వచ్చి నా గుండెల్లో ఒదిగిపోయి సుధ నిశ్శబ్దంగా ఏడ్చేసింది! నేను తన తల నిమురుతూ అలాగే ఉండిపోయాను.

కాసేపటికి అదే తేరుకుని, ”అమ్మా! మనం రేపే విజయవాడ వెళ్లిపోదాం! ఇక నుంచి అందరం కలిసి అక్కడే ఉందాం!” అంది అర్థింపుగా! అభావంగా సుధ కేసి చూసాను.
ఇంతలో సుధ భర్త గోపాల్‌ లోపలికి వస్తూ, ”అత్తయ్యగారూ? మావయ్యగారు ఇలా హఠాత్తుగా చనిపోవడాన్ని మీరు జీర్ణించుకోవడం కొంచెం కష్టమే కాని! ఏం చేస్తాం చెప్పండి! ఏదీ మన చేతుల్లో లేదు కదా! మీరే కొంచం ధైర్యం తెచ్చుకోవాలి, తప్పదు! అలాగే రేపే మన ప్రయాణం! మీరు మాతోపాటే వస్తున్నారు, అంతే! ఇంకేం ఆలోచన పెట్టుకోకండి?” నా వంక జాలిగా చూస్తూ అన్నాడు!
నేనేం జవాబు చెప్పలేక అలాగే కూర్చుండిపోయాను!నా మనసులో ఎన్నో ఆలోచనలు తిరుగుతున్నాయి, ఏవేవో గతాలు, ఎన్నెన్నో జ్ఞాపకాలు, ఏమిటీ జీవితం? నాకో అస్థిత్వం లేదా? నాకో ఉనికి లేదా? నేనో ప్రేక్షకురాలిగా, ఈ మలుపుల్ని ఇలా  గమనించడమేనా? నా జీవితం గురించి నేను నిర్ణయాలే తీసుకోలేనా?
సుడిగుండంలో నావలా ఉన్న మన స్థితిలో అలాగే చూస్తుండిపోయాను వాళ్ల కేసి! కళ్ల ముందు గతం మెదిలింది.
*    *    *
”అక్కా! చూడవే, సీత నా జడ ఎలా లాగిందో, అంతా రేగిపోయింది” ఫిర్యాదుగా అంది పద్మ!

”అక్కా! పద్మ మాటలేం నమ్మకు? అసలు అదే, నా చింత గింజలన్ని చెల్లాచెదురు చేసి ఇలా పారిపోయి వచ్చింది!” వెనకే వచ్చిన ఆరేళ్ల సీత ఆరిందాలా చేతులు తిప్పుతూ అంది!
”ష్‌! గొడవ చేయకండి? ఈవాళ కార్తిక సోమవారం కదా, అమ్మ పూజ చేసుకుంటుంది. అసలే ఉపవాసంతో ఉంది. రండి, గబగబా ముందు ఇల్లు సర్ది తులసికోట చుట్టు ముగ్గులు పెట్టేద్దాం?” హుషారు చేసాన్నేను? ”ముగ్గు” అన్న మాట వినగానే ఇద్దరికి మంత్రం వేసినట్లయ్యింది, అప్పటి వరకు ఉన్న వాళ్ల గొడవ కాస్త మర్చిపోయి ఇద్దరు కలిసిపోయారు.
చేరో చీపురు తీసి క్షణాల్లో ఇల్లంతా శుభ్రం చేసారు. నేను చెత్త ఎత్తేసి నీళ్లు అందిస్తుంటే దొడ్లో నీళ్లు చల్లి, చెరో కొబ్బరిచిప్ప తీసుకుని నిండా తెల్లటి ముగ్గు పిండి పోసుకుని చక్కగా ముగ్గులు పెట్టారు.
నీరును పీల్చుకున్న నేలలో మట్టివాసన పైన తెల్లని రంగవల్లులు కంటికి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి.
అందరం ముఖాలు కడుక్కుని తయారయ్యి వచ్చేటప్పటికి అమ్మ తులసికోట చుట్టురా దీపాలు వెలిగించింది. హారతి ఇచ్చి, నక్షత్రానికి అందర్ని దండం పెట్టుకోమంది. ఆ సన్నటి చలిగాలి, కొబ్బరి ఆకుల నీడలు, నిశ్శబ్దంగా ఉన్న దొడ్డి అప్పుడే ఆవరిస్తున్న చీకట్లో నక్షత్రాలు తళుకుమని మెరుస్తుంటే, ఆ మెరుపంతా మా చుట్టు ఆవరించి, చుట్టు ఉన్న దీపాల్లో ప్రతిఫలించి మాలో భక్తితోపాటు అనిర్వచనీయమైన ఆనందపు అనుభూతిని నింపాయి!
అమ్మ వంట పూర్తి చేస్తూ ‘బ్రహ్మ మురారి సురార్చిత లింగం’ అంటూ మొదలుపెట్టగానే అందరం అందుకున్నాం. అది అవగానే అమ్మ ఇంకో రెండు కీర్తనలు పాడింది. ఎప్పుడు వచ్చారో తెలియదు కాని నాన్నగారు నిశ్శబ్దంగా మా వెనకే వచ్చి కూర్చున్నారు.
ముందుగా సీతే పసికట్టింది. అందరం సైగ చేసుకుంటూ అమ్మకి చెప్పనేలేదు. కాసేపటికి అమ్మే వెనక్కు చూసి నాన్నను గమనించి అందంగా సిగ్గుపడింది. అయినా పాట ఆపకుండా, గ్లాసులో మంచినీళ్లు తెచ్చి ఆయన ముందు గడపకివతలగా పెట్టింది.
నాన్నగారు స్నానం చేసేలోగా అందరం అరటి ఆకులు పరిచి మంచినీళ్లు పెట్టేసాం! అమ్మ  కొసరి కొసరి వడ్డిస్తుంటే, వేడిగా ఉన్న అన్నం రుచిగా ఉన్న పదార్ధాలు రోజు కంటే ఎక్కువగానే తిన్నాం!
”ఓ అరగంట చదువుకుని అప్పుడు పడుకోవాలి!” అమ్మ మృదువుగా హెచ్చరించింది, నేను ఆకులు పడేయడానికి వెళ్తూ ఉంటే! అలాగే అని బుర్ర ఊపినా పుస్తకాలు ముందేసుకునేటప్పటికే నిద్ర తూగుతూ కళ్ల మీదకు వచ్చేస్తోంది, అందరికి!
అలాగే పాఠాలు వల్లె వేస్తూ కూర్చున్నాము. అమ్మ మడిబట్ట విడిచి తెల్లని వాయిల్‌ చీర కట్టుకుని నాన్నగారి పక్కకు చేరి తమలపాకులు అందిస్తూ, నా కేసి చూసి, ”వాసంతి ఇలా రా!” అంది. నన్ను దగ్గరగా తీసుకుని నా చెంపలు ఆప్యాయంగా రాస్తూ, ‘ఏవండీ? వాసంతి పెద్దదయి పోతోంది? నేను పూజ, వంట పూర్తి చేసే లోపు ఇల్లంతా సర్దేసి, పద్మను, సీతను ఓ ఆట ఆడించేసింది!” అంటూ గలగలా నవ్వింది.
నేను సిగ్గుతో ముడుచుకు పోయాను. నాన్నగారు ప్రేమగా నా వంక చూసి, ”అది మేష్టారి కూతురే! అందరిని క్రమశిక్షణలో పెట్టి పాఠాలు నేర్పేయగలదు” అన్నారు గర్వంగా!
నా బాల్యం చాలా చాలా మధురమైంది. ఇప్పటికీ ఆ స్మృతులన్నీ నాకు సజీవ పరిమళాలే! గోదావరి ఒడ్డున ఉన్న చిన్న పల్లెటూరు మాది. పచ్చటి చేలతో, కనుచూపు మేర వరకు కనిపించే కొబ్బరి చెట్లతో రమ్యమైన ప్రకృతికి మా ఊరు, తరిగిపోని ప్రేమాభివనాలకు మా అమ్మా, నాన్నగారు మారు పేరు!
*    *    *
నేను టెన్తు చదువుతుండగా మా దూరపు బంధువు రంగమ్మ అత్తయ్య మా యింటికి వచ్చారు. మా నాన్నగారు తాతగారికి ఒక్కడే కొడుకు అవ్వడం వల్ల మాకు పెద్దగా బలగం లేదు. బంధువులు తక్కువే! వస్తూనే పెద్దగా అరుస్తూ ”ఏవిట్రా సూర్యనారాయణ” ఆడపిల్లల్ని చదివిస్తున్నారట. ఇదెక్కడయినా మన ఇంటా వంటా ఉందా? ఒకళ్లు కాదు ఇద్దరు కాదు, ముగ్గురు ఆడపిల్లలను  కన్నావు! ఆడపిల్ల అంటేనే గుండె మీద కుంపట్లు కద?” అంది. నాన్న ఏదో అనేలోపే  అమ్మో!” సరేలే, అస్సలు నేను వచ్చిన విషయం విను ముందు! నేనో మంచి సంబంధం పట్టుకు వచ్చాను నీ పెద్దదానికి! వెంటనే మనం వెళ్లి మాట్లాడి దానికి ముందు మూడు ముళ్లు వేయించేద్దాం!  కనీసం ఒక బాధ్యతైనా నాకు తీరుతుంది?”
నేను అమ్మ వంక బెంగగా చూసాను, ‘చిన్నపిల్ల’ అంటూ అమ్మ ఏదో చెప్పబోతుంటే ఆవిడ కొట్టిపారేసింది, ”చాల్లే ఊరుకో కమలా! నీకేం తెలియదు” అంటూ నాన్నకి సంబంధం వివరాలు చెప్పింది. వింటూనే, ”అక్కా! పెద్ద కుటుంబం. ఇద్దరు అన్నదమ్ములు, ముగ్గురు ఆడపిల్లలు, ఉమ్మడి కాపురం. వాసంతి అవస్థ పడుతుంది” నాన్న అయిష్టత చూపారు.
కాని అత్తయ్య పట్టు విడవలేదు! ”ఆడపిల్లలురా! వాళ్లు నీకు గుదిబండలేరా బాబు!” అంటూ గొడవ పెట్టేసి మరీ పెళ్లి చూపులకి ఒప్పించింది.
ఎప్పుడు ‘ఆడపిల్లలు’ అంటూ హీనంగా మాట్లాడే ఆవిడ్ని చూస్తే నాకు భలే కోపం వచ్చేది. ఓసారి పద్మ, సీత ఆడుకుంటుంటే పద్మ గౌను కొంచెం పైకి జరిగి ఉండటం చూసుకోలేదు! కాని అత్తయ్య చూసింది! అంతే కళ్లెర్ర చేస్తూ, ‘ఏమే, బొత్తిగా సిగ్గు లేదే నీకు! ఆడపిల్లవి, ఒంటి మీద బట్ట ఎక్కడుందో చూసుకోలేవు. మా చిన్నతనంలో మా పిన్ని ఓసారి ఇలాగే నన్ను చూసి వంటింట్లోకి వెళ్లి పొయ్యిలో అట్లకాడ బాగా కాల్చి తొడ మీద ఎర్రగా వాత పెట్టింది, మళ్లీ ఆ తప్పు చేయకుండా! మీ అమ్మకి ఆడపిల్లల పెంపకమే తెలీదు. ఆడముండల్ని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి!” ఈసడింపుగా ఉంది.
పద్మతోపాటు అందరం బిక్క చచ్చిపోయాము. ఈ ఆడామగా తేడాలేమిటో ఇంతవరకు మేము ఎప్పుడు చవిచూడలేదు. ఆడదానికి ఆడదే శత్రువేమో అనుకున్నాను, ఆవిడ పెడసరి ధోరణికి! కాని ఆడదానికి మగాడు కూడా శత్రువే అని చక్రవర్తితో పెళ్లి అయ్యాక కాని నాకు తెలిసి రాలేదు. నా జీవితం పూలపల్లకి నుంచి ఎగిరి ముళ్లకంపలోకి వచ్చి పడ్డట్టయ్యింది!
*    *    *
కాపురానికి వెళ్లగానే మా తోడికోడలు అన్ని పనులు టకటకా నాకు అప్పచెప్పేసింది, ”నాకు ఓపిక లేదంటూ అంతా నువ్వే చూసుకోవాలి” అంటూ.
మా తోడికోడలికి ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. వాళ్లు మూడు పూటలా తింటూనే ఉంటారు. చదువుసంధ్యలు అస్సలే లేవు.
బావగారు ఎప్పుడు ఏ రాత్రికో వస్తే అప్పుడు అన్నం పెట్టాలి. మా అత్తగారికి, మావగారికి అన్ని సమయానికి అమర్చి పెట్టినా ఎప్పుడు సణుక్కుంటనే ఉంటారు. పని వాళ్లకి అన్నాలు పెట్టాలి. దొడ్లో రెండు గేదెల పని చడాలి! రెండు నెలల కాపురం నాకు ఇరవై ఏళ్ల నరకాన్ని అనుభవంలోకి తెచ్చింది. చాకిరి చేసి, చేసి సన్నగా పుల్లలా అయిపోయాను నేను!
ఈ పని బాధ కన్నా నన్ను అమితంగా గాయపరిచింది చక్రవర్తి ప్రవర్తన! నేనో మనిషినని, అతనికి భార్యనని ఆ విషయం – అతనికి ఏ మాత్రం పట్టలేదు. ఇంట్లో ఉన్న అనేక వస్తువులలో నేనో వస్తువును! ముఖ్యంగా ‘ఆడ’ వస్తువును! ఆ చులకన భావం పదే పదే అతని మాటల్లో ధ్వనించేది.
”పక్కలో పడుకోవడానికే ఆడది” అన్న ఆలోచన అతని నరనరాల్లో జీర్ణించుకుని పోయింది. అతనికే కాదు, ఆ ఇంట్లో అదే భావం అందరి మాటల్లో వినిపించేది. ఇల్లంతా ప్రతిధ్వనించేది!
”ఓసేయ్‌, ఏమేవ్‌, ఏయ్‌, ఎక్కడ చచ్చావే?” లాంటి చీదరింపు పదాలు ఆడ శబ్దాలకి వర్తించేవి.
”ఏరా నాన్నా, మగమహారాజు, బంగారు తండ్రి, కన్నా!” లాంటి – ఆప్యాయపు పలుకులు ‘మగ’ శబ్దాలకు వర్తించేవి.
ఓసారి స్నానానికి తోడికోడలు కూతురు వెళుతంటే, ”లక్ష్మీ, నువ్వుండవే, నేను చేస్తాను ముందు?” అని చిన్నవాడు రవి అంటుంటే, ”ఆహా! ముందు నేనే చేస్తాను!” అందా అమ్మాయి.
అంతే! వెంటనే మా బావగారు, ”రవి నువ్వు చేసి రారా ముందు? నువ్వు ఆగవే లక్ష్మి! ఆడముండవి. తెల్లారగానే స్నానం చేయొద్దు?” అంటూ ఆ పిల్ల మీద కళ్లెర్ర చేసాడు!
రవి గర్వంగా తలెగరేస్తూ స్నానానికి వెళ్లాడు! పాపం లక్ష్మి బిక్కముఖంతో నిలబడిపోయింది. ఇంతా చేసి ఆరేళ్ల పసిది లక్ష్మి! ఆ సంఘటనకి నా మనస్సు విలవిల లాడిపోయింది!
పిల్లలు పుట్టినప్పట్నుంచి ఆడా, మగా తేడా నూరిపోయడమే ఇంట్లో అందరి ప్రధాన ఉద్దేశ్యం! చివరికి ఆడవాళ్లు కూడా అదే బాట! అదే నన్ను మరీ గాయపరిచేది!
ఒక్కసారి ఉండపట్టలేక ఓ సందర్భంలో చక్రవర్తితో అనేశాను, ”మీ ఇంటి పద్ధతి ఏమి బాగోలేదు!” అని అంతే! నా చెంప చెళ్లుమంది, నా కళ్లు బైర్లు కమ్మాయి!
”ఆడదాన్ని కాలి కింది చెప్పులా చూడమన్నారందుకే! టెన్తు వెలగపెట్టావుగా, విప్లవాలు లేవదీస్తావా ఇంట్లో!” కళ్లలో నిప్పులు కురిపిస్తూ అన్నాడు.
నేను పుట్టి బుద్ధి ఎరిగాక ఎప్పుడ పల్లెత్తు మాట పడలేదు. దెబ్బా తినలేదు! అతని భయంకర చూపులు నన్ను వణికించేసాయి. తెల్లవారేటప్పటికి నాకు ఒళ్లంతా నొప్పులతో పెద్దపెట్టున జ్వరం వచ్చేసింది.
”రెండు రోజుల ముచ్చట తీరింది! అన్నీ దొంగ వేషాలే! పని ఎగగొట్టడానికి!” నేను లేవలేదని మా తోడికోడలు రోజంతా దెప్పుతూనే ఉంది
”ఎవ్వన్నా తిన్నావా, మందు లేసుకున్నావా” అని కూడా ఎవ్వరూ అడగలేదు. నా గురించి అసలు ఎవ్వరికీ పట్టింపేలేదు. ఆ బాధ కన్నా ఇంకా అసహ్యం వేసింది, చక్రవర్తి ప్రవర్తన! రాత్రి జ్వరంలో పడి ఉన్న నన్ను పశువులా అతను ఆక్రమిస్తూ ఉంటే!
*    *    *
అమ్మా, నాన్న కలసి మధ్యలో ఒక్కసారి వచ్చారు నన్ను చూడటానికి, పుల్లలా అయిపోయిన నన్ను చూసి ఇద్దరూ చాటుగా కన్నీరు పెట్టుకున్నారు! ”నాలుగు రోజులు మా అమ్మాయిని తీసుకెళతాము!” అమ్మ అర్థింపుగా అడిగింది మా అత్తగారిని.
పెడసరంగా మా అత్తగారు ”ఆ హాయిగా తీసుకెళ్లండి! మళ్లీ మాత్రం పంపకండి. ఎరక్కపోయి ముష్టి సంబంధం చేసుకున్నాం!” అంది. ఇక అందరు తలో మాటలన్నారు. అమ్మ, నాన్న నిస్సహాయంగా చూస్తుండిపోయారు!
”నా సంగతి ఇక మర్చిపోండి! కనీసం చెల్లాయిల్ని చదివించి వాళ్ల జీవితాల్నైనా చక్కదిద్దండి!” కన్నీళ్లతో వాళ్లని సాగనంపాను.
*    *    *
ఆనందపడాలో, విచారపడాలో తెలియని వార్త! ”నేను తల్లిని కాబోతున్నాను”.
కాని నాకు పోటీగా, మా తోడికోడలు కూడా పొట్ట వేసుకుని నలుగురి పిల్లల్ని వెంటేసుకుని తిరుగుతుంటే నాకు మరీ ఎబ్బెట్టుగా అనిపించింది. మా అత్తగారు ఇంటెడు చాకిరి చేయడానికి ఇబ్బంది అవుతుందని నన్ను పురిటికి కూడా మా ఇంటికి పంపలేదు. నేనెంత బలహీనంగా ఉన్నా నాకు రబ్బరు బొమ్మలాంటి పాప పుట్టింది.
‘ఆడపిల్ల’ అనగానే ఇంట్లో అందరూ ముఖాలు చిట్లించుకున్నారు. చక్రవర్తి కనీసం పాపని చూడటానికైనా రాలేదు. బహుశ ఏ పేకాటలోనో, స్నేహితులతో, తాగుతూనో ఉండిపోయారేమో?
కాని మర్నాడు వచ్చీ రాగానే పాపను కనీసం చూడనైనా చూడకుండా, బలహీనంగా పుట్టిన మా తోడికోడలు కొడుకును మటుకు ఎత్తుకుని చక్రవర్తి దగ్గరకు తీసుకుంటుంటే, నాకెందుకో ఒళ్లంతా భగ్గుమంది. కత్తి తీసుకుని అతన్ని పొడిచేయాలనిపించింది. నా ఆవేశానికి, నిస్సహాయత తోడై ఏడుపులోకి దిగింది. పాపని పక్కలో వేసుకుని కుళ్లి కుళ్లి ఏడ్చాను.
కాసేపటికి లేత పాదాలలో పాప నన్ను తాకుతూ ఉంటే మనస్సుకి కొంచెం ఉపశమనంగా అనిపించింది. మాతృత్వపు మధురిమ అన్ని బాధల్ని తాత్కాలికంగా పక్కకి నెట్టేసింది.
*    *    *
చక్రవర్తి తాగుళ్లు, తిరుగుళ్లు ఎక్కువయ్యాయి. పొరపాటున ఏదన్నా అన్నా, ”నోర్ముయ్‌! ఎక్కువగా వాగకు, నువ్వేమన్నా పెట్టి పోషిస్తున్నావా? మక్కెలిరగదంతాను జాగ్రత్త?” అతని మాటలకి శరీరం, మనస్సు అన్నీ బండబారి పోయాయి.
పాప సుధకి ఏడాది వెళుతుండగా, పావని పుట్టింది!
”వాసంతికి వాళ్ల పుట్టింటి వాళ్ల పోలికరా! వాళ్ల అమ్మలా అందరూ ఆడపిల్లలేరా చక్రవర్తి! నీకు వంశోద్ధారకుడు లేడేమోరా” ఎవరో పోయినట్టు, మా అత్తగారి ఏడుపులు, మా తోడికోడలి వెక్కిరింపు నవ్వులు, చక్రవర్తి నిరసనలు నన్ను పాతాళంలోకి కృంగదీసాయి. ఇంట్లో అందరూ నన్ను ఇంకా హీనంగా చూడటం మొదలుపెట్టారు.
అన్ని బాధల్లో మంచి కబురు ఏమిటంటే మా ఇద్దరు చెల్లాయిలకి మంచి సంబంధాలు కుదిరి పెళ్లిళ్లు జరగడం! చాలా కాలానికి పుట్టింటికి వచ్చిన నన్ను చూసి ఇంట్లో అందరూ సంబరపడిపోయారు. నా ఊరు, నేను పుట్టి పెరిగిన ఇల్లు, నా వాళ్లు – ఆ నాలుగు రోజులు మళ్లీ నే చిన్నప్పటి వాసంతి నయ్యాననిపించింది

*        *        *

మా అత్తగారు, మావగారు ఏడాది తేడాగా పోవడంతో ఇంట్లో పెను మార్పులు వచ్చాయి. అన్నదమ్ములు ఆస్తుల పంపకాల్లో తేడాలు వచ్చి మాట మాట అనుకుని విడిపోయారు. చక్రవర్తి అప్పులకి అతని వాటాగా వచ్చిన పొలం అంతా జమ అయిపోయింది. ఇంటి మీద వాటా మటుకు డబ్బు రూపంలోకి మారి అతని చేతిల్లో పడింది.
 ఇద్దరు పిల్లలతో, ఏడో నెల కడుపుతో అద్దె ఇంట్లో నా జీవితంలో ఇంకో అంకం మొదలైంది. కొద్ది రోజుల్లోనే ఆస్థి డబ్బు రూపంలోకి చేతికి వచ్చింది కాస్తా అతని విలాసాలకి రెక్కలు వచ్చి ఎగిరిపోయింది. ఉద్యోగం డబ్బులతో ఇల్లు గడవాల్సిన పరిస్థితి చక్రవర్తిని పిచ్చివాడ్ని చేసేసింది.
ఓ రాత్రి ”దరిద్రం మొఖం దానా! నీతోనే, నీవల్లే అంతా నాశనం పట్టింది నాకు, ఆస్థి పోయింది, డబ్బు పోయింది. అంతా ఆడపిల్లల్నే కంటున్నావు. అసలు ఈసారైనా మగాడ్ని కంటావా?”
తాగిన మైకంలో, కోపంతో నన్ను ఒక్క తోపు తోసేసాడు. ఆ దెబ్బకు గోడకు గుద్దుకుని అలాగే నేలకు ఒరిగిపోయాను! అప్పుడే నాకు ప్రాణం పోవాల్సింది!
రక్తపు మడుగులో పడి ఉన్న నన్ను పక్కవాళ్లు ఆస్పత్రిలో చేర్చారు! బిడ్డ కడుపులో చనిపోవడంతో నా ప్రాణానికి ప్రమాదం ఏర్పడి గర్భసంచి తీసేసారు!
మెలుకువ రాగానే ”ఎందుకు బ్రతికానా!” అని కుళ్లి కుళ్లి ఏడ్చాను!. ”ఈ బాధల్ని భరించలేను, నన్ను తీసుకెళ్లిపో దేముడా!” అని దిక్కులు పిక్కటిల్లేల్లా అరిచాను! నీరసంతో నాకు స్పృహ తప్పేసింది.
మెలకువ వచ్చేటప్పటికి బిక్కు బిక్కుమంట ఇద్దరు పాపలు నాకేసి భయంగా చూస్తూ ఏడుస్తున్నారు!
జాలితో నా తల్లి హృదయం ద్రవించి పోయింది. ”కన్నందుకు తండ్రి ఎలాగా పట్టించుకోడు, నేను పోతే వీళ్లకు అసలు దిక్కెవరు? వాళ్లేం పాపం చేసారు?”
అందుకే అప్పుడే నిశ్చయించుకున్నాను.
”నేను బతకాలి! నా కోసం కాకపోయినా నా పిల్లల కోసమైనా బతకాలి. ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు పడ్డా వాళ్లని చదివించి ప్రయెజకులను చేయాలి! నేను పొందలేని స్వేచ్ఛ వాళ్లు పొందాలి! వాళ్లకో మంచి జీవితాన్ని నేను సృష్టించాలి” అని!
తర్వాత నాకు ఇంకో విషయం తెలిసింది! నా కడుపులో చనిపోయింది మగపిల్లాడని! అప్పుడు చూడాలి చక్రవర్తి ముఖం! వాడు పుట్టి బతికి ఉంటే ఇంకో మూర్ఖపు చక్రవర్తిని తయరుచేయకుండా ఆ దేముడే కాపాడాడని నాకెంతో ఆనందం కలిగింది!
నా మనస్సు పొరల్లో పిల్లాడు పోయినందుకు తల్లి మనస్సు తల్లడిల్లినా, ఎందుకో చక్రవర్తి మీద ఏదో తెలియని విజయం సాధించినట్టుగా ఏదో సంతోషంగా ఉంది!
కొద్ది రోజులకే నాన్నగారికి సీరియస్‌గా ఉందని కబురు వచ్చింది. ఏడుస్తూ పిల్లల్ని తీసుకుని బయలుదేరాను! నాన్నగారు ఇంటి కాగితాలు అమ్మచేత నాచేతిలో పెట్టించారు!
”వాసంతీ ! మిగతా ఇద్దరి పిల్లల్ని చదివించి పెళ్లిళ్లు చేసాను. కానీ నీకు సరి అయిన న్యాయం చేయలేకపోయాను. నా తప్పును ఇప్పుడు సరిదిద్దుకోలేను! కనీసం నీ పిల్లలకయినా ఈ ఇల్లు మిగులుతుందని నీ పేరున వ్రాసాను. అమ్మ తదనంతరం అంతా నీదే!”
”నా పెన్షన్‌లో మిగిలిన డబ్బు, డిపాజిట్లు చెల్లెళ్లకు చెందేలా వ్రాసాను! మీ ఆయనకు మటుకు ఇప్పట్లో తెలియనివ్వకు? అదీ తగలేస్తాడు.” నాన్నగారు ఆయాస పడుతూ చెప్పి చేతిలో చెయ్యి వేయించుకున్నారు.
రాలిపోయే ఆకుల్లో ఉన్నారు ఇద్దరు! కాని ఇద్దరి కళ్లలో ఏదో నిశ్చింత!!
”కనీసం కట్టుకున్న వాడు దాన్ని తన్ని తగలేసినా వాసంతికి ఇల్లు అయినా అట్టే పెట్టా అని! కనీసం పిల్లల్ని పెట్టుకునైనా అది బతకగలుగుతుందని!”
*    *    *
నాకు వంట చేయడం వచ్చు. బట్టలు కుట్టడం వచ్చు. ఇంక నేను ఎందుకు అతని మీద ఆధారపడాలి? నాన్నా, అమ్మ పోయాక అద్దె డబ్బులు కూడా తోడయ్యాయి. బొటాబొటిగా సంసారాన్ని నడిపాను. సుధ, పావని ఇద్దరు పిజి పూర్తి చేసారు. ఇద్దరికీ మంచి ఉద్యోగాలు వచ్చాయి. పెళ్లిళ్లు జరిగాయి! ఆయన వ్యసనాలన్నీ భరిస్తూ, రాజీపడుతూ అలాగే జీవితాన్ని నెట్టుకువస్తున్నాను!

”ఇక ఈ జీవితం ఇంతే, ఇలా రాసిపెట్టి ఉంది” అని గడుపుకుంటూ ఉంటే గుండెపోటుతో హఠాత్తుగా ఆయన పోవడంతో మళ్లీ నా బతుకు ప్రశ్నార్థకమైంది!
*    *    *
తెల్లవారింది! గతం నుంచి వర్తమానంలోకి వచ్చాను! సుధతో నేను రావటం లేదని నా నిర్ణయన్ని ధైర్యంగా ప్రకటించాను!
నా నిర్ణయనికి సుధ, పావని ఎంతో బాధపడ్డారు! పుస్తెలతో సహా, ఇంటి సామానులు ఇద్దరికీ సమానంగా పంచేసాను! వాళ్లు వెళ్లేటప్పుడు ఒక్క మాటే చెప్పాను!
”నా గురించి దిగులు వద్దు! మీ జీవితం, మీ ఇష్టం తలెత్తుకుని ధైర్యంగా బతకండి!”
”మీరు ఆనందంగా మీ కోసమే మీరు బతకండి!” ఎప్పుడూ చూడని అమ్మ కొత్త రూపాన్ని ఆశ్చర్యపోతూ చూసారు వాళ్లు!
*    *    *
ఉన్న ఇల్లు ఖాళీ చేసి నా పుట్టింటికి చేరుకున్నాను. ఇల్లు చిన్న మరమ్మత్తులు చేయించి అందులోకి దిగిపోయాను. అద్దె వాళ్లకు నాకో గది ఇస్తే చాలంటే ఒప్పుకున్నారు. ఖాళీ చేయకుండానే మిగతా గదుల్లోకి సర్దుకున్నారు!
ఇప్పుడు ఇది నా ఇల్లు, నా ఊరు. ఈ భావన నాకెంత సంతృప్తినిస్తోందో మాటల్లో వర్ణించలేను.! మొగుడు పోయినా మొండిగా ఉందనుకుంటారు అందరూ అన్న భయం నాలో ఏ కోశానా లేదు. బహుశా ఇది నేను అనుభవిస్తున్న స్వేచ్ఛ ఇచ్చిన ధైర్యమేమో?
”అయినా నేను మంచిగా తలవంచి బలిపశువులా నిలబడితే నన్ను ఆదుకోగలిగిందా ఈ లోకం? నా మొగుడు నన్ను వీధిలోకి లాగి నడిరోడ్డు మీద కొడుతుంటే అడ్డుకోగలిగిందా ఈ సమాజం?”
వెలుగుతున్న దీపపు ప్రతిభ, అందం అందరికి కనిపిస్తుంది మగాడి సంపాదనగా, మొగుడి అండగా! కాని అది వెలగడానికి సహకరించిన ఆడదాని సహనం, ఓర్పు దీపం కింద నూనెలా ఎవ్వరికీ కనపడదు! కాలిమసైపోయిన ఆడదాని కోరికలు వత్తిలో ప్రతిబింబించడం ఎవ్వరిని బాధపెట్టదు!
”ఆడదే జగతికి ఆధారం”, ”ఆడదే సృష్టికి ఆధారం!” అంటూనే మరి ఆడదాని ”ఉనికే” పట్టించుకోని ఈ సమాజాన్ని ఏం చేయాలి???
నాకు లేత రంగులంటే చిన్నప్పట్నుంచి చాలా ఇష్టం! కాని నా ఇష్టాలతో అందరూ నచ్చినట్టు ఆడుకున్నారు. ‘ఆడదానివి, మట్టీ, మసీ అన్ని అంటుతాయి’ అంటూ మా అత్తగారు అన్నీ ముదురు రంగు చీరలే కట్టించేది.
ఇప్పుడు చక్రవర్తి పోతూ నాకిచ్చిన అదృష్టం – తెలుపు రంగు! తెలుగు, గులాబీ, పసుపు, ఆకాశం రంగు ఇలా నాకు నచ్చిన చీరలు కట్టుకుంటే నా కంటికి నేనే ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తున్నాను! నా వయసు సగానికి తగ్గిపోయిందనిపిస్తోంది.
చుట్టుపక్కల నలుగురి పిల్లల్ని పోగేసి నాకు వచ్చిన చదువు నేర్పడం మొదలు పెట్టాను! ఫీజు తీసుకోకపోవడంలో చాలా మంది పిల్లలు చేరారు నెమ్మదిగా! వద్దంటున్నా వినకుండా వాళ్ల దొడ్లో కూరలో, గేదెపాలో, పెరుగో ఇలా ఏదో ఒకటి ఇచ్చేసి పోతారు వాళ్ల తల్లిదండ్రులు కృతజ్ఞతతో! క్రమంగా ఊళ్లో అందరికి నేనెంతో అభిమానపాత్రురాలినయ్యాను!
పూజ చేసుకుంటూ కీర్తనలు పాడుతంటే, అద్దెకున్న ఆవిడ ఆశ్చర్యపోతూ, ”ఎంత మంచి గొంతండీ మీది!” మా పిల్లలకి నేర్పండి సంగీతం పాఠాలు”, అంది. నవ్వేస్తూ!
”ఎన్నో ఏళ్లకు నేను గొంతెత్తి పాడుతున్నాను! మాట్లాడుతున్నాను! నవ్వగలుగుతున్నాను! స్వేచ్ఛగా నా ఉనికిని గుర్తించేలా జీవించగలుగుతున్నాను!”
”ఇన్నాళ్లూ అందరి కోసం బతికాను! ఇప్పుడు, నా కోసం, నా సంతోషం కోసమే బతుకుతున్నాను!”

అమ్మ వంట పూర్తి చేస్తూ ‘బ్రహ్మ మురారి సురార్చిత లింగం’ అంటూ మొదలుపెట్టగానే అందరం అందుకున్నాం. అది అవ్వగానే అమ్మ ఇంకో రెండు కీర్తనలు పాడింది. ఎప్పుడు వచ్చారో తెలియదు కాని నాన్నగారు నిశ్శబ్దంగా మా వెనకే వచ్చి కూర్చున్నారు.

 

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

One Response to ఉనికి

  1. ఈ కథ చాలా బాగా ఉంది. ఈ కథను తమిళంలో అనువదించాలని అనుకుంటున్నాను. రచయిత/ రచయిత్రి చిరునామా, ఫోన్ నంబరు తెలుపగలరు.
    గౌరి కృపానందన్
    044 4551 1580

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.