ఆయన ఓ మహాకవి అని ఆనాడు తెలియదు.. నేడు… దేశాన్ని ప్రేమించేవారంతా ఆయన ఆశయానికి అంకితం కావాలన్న ఆరాటం…- ఝాన్సీ కె.వి. కుమారి

కాలేజీ యాజమాన్యానికి తెలుసు… తెలుగు శాఖాధిపతులకు తెలుసు… మిగిలిన పెద్దలందరికీ, కొంతమంది సీనియర్‌ విద్యార్థులకూ తెలుసు. కనుకనే ఆనాటి ఆ కార్యక్రమానికి ఆయనను ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. కాని, మాకు అంటే నాలాంటి చాలామంది విద్యార్థులకు ఆ మహాకవిని గురించిగాని, ఆయన రాసిన కావ్యాల గురించిగాని, అప్పటివరకు ఆయన అందుకున్న మహాసన్మానాలను గురించిగాని… ఏమీ తెలియదు.

మా చేతులతో ఆయన మెడలో పూలదండలు వేయించారు. ఆయన చేతులమీదుగా మాకు బహుమానాలిప్పించారు.

ఆయనను గురించి కాలేజీ ప్రిన్సిపాల్‌, లెక్చరర్లు, కొందరు పురప్రముఖులు మాట్లాడారు. ఆయన కూడా పద్యాలు పాడారు… మాటలెన్నో చెప్పారు. చాలాబాగున్నాయనిపించింది. అప్పుడర్థమైంది… ఆయన ఓ మహాకవి అని! గొప్ప గొప్ప కావ్యాలు రాసి, ఎన్నెన్నో ఘనసన్మానాలు అందుకున్నారని! గండపెండేరాన్ని తొడిగించుకుని, కవి కోకిల, కవిసామ్రాట్టు, కవితావిశారద బిరుదులు పొందారని! ఏనుగుపై ఊరేగింపబడిన ‘పద్మభూషణు’డనీ! కేంద్రసాహిత్య అకాడమీ అవార్డునందుకున్న గుర్రం జాషువా కవిగారని!!

ఇన్ని సన్మానాలు ఆయన చేసిన కలం యుద్ధానికి. కులంపై చేసిన పోరాటానికి. మానవత కోసం పడిన ఆరాటానికి. కాని ఆనాటికి అంతగా సమాజంపైగాని, సాహిత్యంపైగాని అవగాహన లేదు… నాకు తోచినదేదో రాయడం, స్కూలు, కాలేజీ మేగజైన్లలో ప్రచురితమైనప్పుడు ఆనందించడం మాత్రమే ఆనాటి పరిస్థితి.

అవి నేను బి.ఏ. సెకండియర్‌ చదువుతున్న రోజులు. ఏలూరు సెయింట్‌ థెరీసా కళాశాల తెలుగుశాఖ వారు తెలుగుశాఖ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఆ ఉత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన సభకు ముఖ్యఅతిథిగా ‘నవయుగకవి చక్రవర్తి’ మహాకవి జాషువా గారిని ఆహ్వానించారు. కళాశాలలోని అన్ని శాఖల అసోసియేషన్‌ల ప్రధానకార్యదర్శులు ముఖ్యఅతిథిగారికి పూలదండలు వేయాలి. తెలుగు సబ్జెక్టులో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ముఖ్యఅతిథిగారి చేతులమీదుగా బహుమానాలు అందుకోవాలి. ఇదీ ఈనాటి కార్యక్రమం.

ఇంగ్లీషు లిటరరీ అసోసియేషన్‌ ప్రధానకార్యదర్శిగా ముఖ్యఅతిథికి పూలమాల వేసే అవకాశం నాకు లభించింది. బైబిలు అసోసియేషన్‌ ప్రధానకార్యదర్శిగా కూడా జాషువా కవిగారి కంఠసీమను మరో పూలదండతో అలంకరించే మరొక అవకాశం కూడా నాకు లభించింది. కవిగారికి ఆహ్వానాలు, సన్మానాల అనంతరం ప్రసంగాల పరంపర.

సెయింట్‌ థెరీసా కళాశాల ప్రత్యేకత ఏమిటంటే కాలేజీలో ఏ కార్యక్రమం జరిగినా పురప్రముఖులు అందరూ కార్యక్రమానికి విచ్చేస్తారు. కొందరు వేదికను అలంకరిస్తారు, ప్రసంగాలు బాగా సాగుతాయి, చివరికి ముఖ్యఅతిథిగారి ప్రసంగం. అనంతరం బహుమానాలందుకోవడం, ముగింపులో సాంస్కృతిక కార్యక్రమాలు.

జాషువా గారి గళం కోకిలగళమే. వారు పద్యాలు పాడుతుంటే సభ ఆనందంతో ఆహ్లాదభరితమై చప్పట్లు మార్మోగాయి. ఆనాటి కార్యక్రమంలో తరువాతి అంశం తెలుగులో అత్యధిక మార్కులు సాధించినవారు ముఖ్యఅతిథి నుండి బహుమానాలందుకోవడం. ఆ జాబితాలోనూ నేను ఉన్నాను!

నేను ఇంగ్లీషు లిటరేచర్‌ స్టూడెంట్‌ను అయినప్పటికి తెలుగులో ఫస్టుమార్కులు – మాక్లాసులో నావే! హైస్కూల్లో నన్ను భయపెట్టి, బెదిరించిన లెక్కలు బి.ఏ.లో లేవు గనుక దాదాపు అన్ని సబ్జెక్టుల్లోనూ ఫస్టు  మార్కులు నావే కావడంతో సెకండియర్‌, ఫైనలియర్‌లో కూడా ఫస్టు ర్యాంకు నాదే. వరుసగా రెండు సంవత్సరాల్లో జరిగిన అన్ని పరీక్షల్లో ఒకే స్టూడెంటుకు టాప్‌ ర్యాంక్‌ రావడం అప్పట్లో ఆ కాలేజీలో ఓ చరిత్రను సృష్టించింది. మా ఇంగ్లీషు మాష్టారు కవి, రచయిత కొండముది శ్రీరామచంద్రమూర్తిగారు ”ఝాన్సీకి రాణి అంటే ఒఠ్ఠిమాటలు కాదు… ఫస్టుర్యాంకులు” అని ఓ సభలో అంటే కాలేజీలో అదే ఓ నినాదమయ్యింది.

నామీద అదే అభిమానంతో, ఆప్యాయతతో తరువాత కాలంలో కొండముది మాష్టారు నా మొదటి కవితాసంకలనం ‘నిశ్శబ్దరాగా’నికి ‘లయ’ శీర్షికతో తన అభిప్రాయం రాయగా, డా|| సంజీవ్‌దేవ్‌గారు ‘శ్రుతి’ అంటూ ముందుమాట రాసారు. వారిరువురికి ఎప్పటికీ నా మనోవాకాలు.

”డా|| భండారు అచ్చమాంబ మెమోరియల్‌ క్యాష్‌ ప్రైజ్‌ తెలుగులో అత్యధిక మార్కులు సాధించిన కుమారి ఝాన్సీ.కె.వి. కుమారికి” మైకులో ప్రకటన రాగానే చప్పట్లు మార్మోగాయి. జాషువా కవిగారి చేతులమీదుగా 501/- రూ|| ఉన్న కవరు, సర్టిఫికెటు అందుకోవడం మరపురాని జ్ఞాపకం! ఆనాటి మరొక విశేషం సాంస్కృతిక కార్యక్రమాల్లో మాది ఒక ప్రోగ్రామ్‌ ఉండడం. మా క్లాస్‌మేట్‌ జోసిఫిన్‌ అలెగ్జాండరు ఐడియా అది. ఆ ఐడియా మా ప్రిన్సిపల్‌ సిస్టర్‌ జోసిఫిన్‌ గారికి బాగా నచ్చింది. మాకు కావల్సిన అన్ని సాంకేతిక సదుపాయాలు వారే స్వయంగా దగ్గరుండి కల్పించారు. ”గాయపడిన సైనికుల కవాతు”! దానికి దర్శకబాధ్యతలు నావే. గాయపడటం అంటే కొందరు కాళ్ళుపోయినవాళ్ళు. కొందరు చేతులు, కళ్ళు, ఆయా అవయవాలను యుద్ధాల్లో కోల్పోయిన

వాళ్ళు కవాతు చేయడం. దీన్ని హాస్యానికి – విద్యార్థుల్ని నవ్వించడానికి ఉద్దేశించాం. నిజంగానే పిల్లలు, పెద్దలు పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. నటించినవాళ్ళు రెచ్చిపోయారు. మెచ్చుకోళ్ళన్నీ నా మెడలో పడ్డాయి. అందరి ఆనందం మిన్నంటింది. నాటి కార్యక్రమాల్లో నెంబర్‌వన్‌గా అదే అందరి మన్ననలను పొందింది…

కానీ తరువాత తెలిసింది… జాషువా కవి అన్నమాట… అది అందరికీ పెద్దషాక్‌! అందరి కళ్ళు తెరిపించిన గొప్ప సత్యం. నాకైతే ఈనాటికీ గుండెలో గుచ్చుకొనే ముల్లు! నిజానికి నన్ను ఈ దేశాన్ని గురించి ఆలోచింపచేయడానికి ఆరంభం ఆనాటి వారి మాటే…!! ‘గాయపడిన సైనికుల కవాతు’ వంటిదే ‘కులం’, ‘అంటరానితనం’ అనే గాయాలతో నెత్తురోడే దేశంలో ప్రగతి చేసే కవాతు. మనదేశ పరిస్థితికి సిసలైన ప్రతిబింబం! దర్శకురాలి దర్శకత్వ ప్రతిభను అభినందిస్తున్నాను అన్నారు జాషువాగారు. అది కవి హృదయం! ‘కులమతాల గీతల పంజరంలో’ బందీ కాని విశ్వనరుని హృదయం! హృదయమున్నవారికి కన్నీటి ప్రవాహం!!

ఆనాటి ఆ సభలో మూడుసార్లు వేదికనెక్కి కవిగారికి అతి సమీపమైన ఏకైక విద్యార్థిని నేను. నాకు తెలియని ఆలోచననిచ్చి గొప్ప మెప్పునిచ్చిన జాషువాగారికి ధన్యవాదాలు చెప్పుకొనే అవకాశం నాకు రాలేదు. అప్పుడది తెలియని అమాయకత్వం… ఇప్పుడది పులకించే జ్ఞాపకం. కర్తవ్యాన్ని ప్రబోధించిన మధురక్షణం.

కొన్ని సంవత్సరాల తర్వాత విజయవాడ ఆకాశవాణిలో బాధ్యతలు నిర్వహించేరోజుల్లో నాస్తిక కేంద్రంతో పెరిగిన అనుబంధాలలో లవణం గారు (ఇటీవలనే కీర్తిశేషులైనారు… వారికి నా నివాళి), సమరంగారు, మైత్రి అక్కయ్య, సరస్వతి ఆంటీ, హేమలత గార్లతో ఈ జ్ఞాపకాలను పంచుకోవడం ఓ అనుభూతి. చెన్నుపాటి విద్య అక్కయ్య అప్పట్లో లోక్‌సభ సభ్యులుగా ఉండేవారు. మా కుటుంబ సభ్యులుగా వాళ్ళంతా మాతో కలిసిపోయేవాళ్ళు. వాళ్ళు నిర్వహించే సభలన్నింటిలో నేను ముఖ్యవక్తను కావడానికి కారణం మా అందరి ఆశయం ఒక్కటే… మూఢనమ్మకాలు, మూర్ఖత్వాలు లేని సమసమాజ నిర్మాణం!

ఆకాశవాణి విజయవాడ నుండి నిజామాబాదుకు ట్రాన్స్‌ఫర్‌ అయ్యాము నేను, నా భర్త నల్లూరి బాబూరావుగారు. వర్ణి గ్రామంలో జోగిని దురాచార నిర్మూలన, పునరావాస కార్యక్రమాలను ‘సంస్కార్‌’ పేరుతో ‘చెల్లి నిలయం’ ద్వారా నిర్వహిస్తున్న హేమలతా లవణం గారిని కలిసి ఆ కార్యక్రమాలన్నీ రికార్డు చేసి రేడియో ద్వారా ప్రసారం చేశాం. ‘మధురకవి శ్రీనాథ’ గుర్రం జాషువా గారి కుమార్తె హేమలత గార్ని వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడించకుండా ఎలా వదలగలం?

‘మా నాన్నగారు – విశ్వనరుడు’ శీర్షికన ఎనిమిది ఆదివారాలు రాత్రి 8.00 గం|| నుండి 8.30 గం||ల వరకు ధారావాహిక ప్రసారం ఏర్పాటు చేశాం. వారిని పరిచయం చేసే బాధ్యతతో పాటు ఆ ధారావాహిక నిర్వహణా బాధ్యతలను నాటి సంచాలకులు నాకే అప్పగించడం జాషువా కవిపై నాకున్న అభిమానానికి బహుమానమేమో! ఆ ధారావాహిక ఆయన సాహిత్యాన్ని నాకు క్షుణ్ణంగా పరిచయం చేసింది.

నిజామాబాద్‌ పట్టణంలోనూ, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ 1991 నుండి 97 వరకు జాషువాగారి జయంతులు, వర్థంతుల సభలను నిర్వహించేందుకు స్థానిక అరుంధతీయ సంఘం ఎల్‌.ఎస్‌. రావు గారిని, అంబేద్కర్‌ యువజన సంఘాలను ప్రోత్సహించాం. అంతకుముందు ఈ విశ్వనరుని సాహితీ యాత్రను గురించి ఆ ప్రాంతాల ప్రజలకు అంతగా తెలియదని స్థానికులు చెప్పేవారు. ఆయా సభలకు బాబూరావుగారు అధ్యక్షత వహించగా, ఇతర సాహితీవేత్తలు, నేను వక్తలుగా కలెక్టరుగాని, మంత్రులుగాని, ప్రజాప్రతినిధులుగాని ముఖ్యఅతిథులుగా ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహించాం, పాల్గొన్నాం.

మరోవైపు ఆకాశవాణి ద్వారా జాషువాగారి ఖండకావ్యాలను, సంపూర్ణ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేందుకు ఆయా అంశాలపై చర్చా  కార్యక్రమాలు, ప్రసంగాలు, పరిచయాలు ప్రసారం చేశాం. జోడుగుర్రాల స్వారీలా ఎంతో ఉత్సాహంగా, ఉద్వేగంగా సాగిన ఆ కాలంలో ఎందరో యువకవులు జాషువా గారి సాహిత్యాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. బాబూరావుగారి సలహాతో ఎల్‌.ఎస్‌. రావుగారు ‘అరుంధతీయ వాణి’ అనే పత్రికను స్థాపించి జాషువా సాహిత్యాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళారు.

‘వార్త’ దినపత్రికలో నేను కాలమ్‌ నిర్వహిస్తున్న రోజుల్లో 2000 సం|| నుండి 2003 సం|| వరకు జాషువా సాహిత్యంపై రాసిన కాలమ్స్‌ పాఠకులనుండి మంచి స్పందనను అందుకున్నవి.

ఆకాశవాణి వరంగల్లులోను, హైదరాబాదులోను ఎన్నో కార్యక్రమాలను ప్రసారం చేశాం. ‘జాషువాకలం-అసమానతలపై ఎక్కుపెట్టిన అగ్నికణం’, ‘విశ్వనరుడు- ఒకే ఒక్కడు’ వంటి శీర్షికలతో కార్యక్రమాలను ప్రసారం చేశాం. జాషువాగారికి అనుంగు శిష్యులుగా పెరిగిన పి.జె. ఆనంద్‌గారిని ఆహ్వానించి వారి జ్ఞాపకాలను ప్రసారం చేశాం. ప్రొఫెసర్‌ ఎస్వీ. సత్యనారాయణగారు, పాడేటి జాన్సన్‌ గారు వంటి ప్రముఖులతో వేర్వేరు అంశాలపై సింపోజియమ్‌లు ఏర్పాటు చేశాం.

మహాకవి కొంతకాలమైనా తన సేవలు అందించిన ఆకాశవాణి సంస్థలో నేను, నల్లూరి బాబూరావు గారు పనిచేయడం – వారి సాహిత్యాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళగలగడం ఒక గొప్ప కర్తవ్యాన్ని నిర్వహించిన సంతృప్తి.

2010లో స్థానిక పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించిన ‘జాషువా వ్యక్తిత్వం-సాహిత్యం’ జాతీయ సెమినార్‌లో ‘జాషువా దృక్పథంలో క్రైస్తవం’ అనే అంశంపై పత్ర సమర్పణ చేయమని ప్రొ. కె. ఆనందన్‌ గారు కోరినప్పుడు – మరోసారి జాషువా సాహిత్యాన్ని సమగ్రంగా దర్శించే అవకాశం నాకు లభించింది. 2011లో తెలుగు అకాడమీ వారు ప్రారంభించిన ‘డా|| గుర్రం జాషువా పరిశోధన కేంద్రం’ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం ఒక అనుభవం.

భారతదేశాన్ని దేశ ప్రజలను ప్రేమించి ఆ ప్రజల దుర్భర జీవితాలను చూసిన కవిగారి కళ్ళు జలపాతాలనుకుంటే, వాటిని నిప్పుకణికల అక్షరాలుగా మార్చి ”రవ్వలు రాల్చెదన్‌, గరగరల్‌ పచరించెద నాంధ్రవాణికిన్‌” అని ఎలుగెత్తిన నవయుగ కవిచక్రవర్తిని గురించి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా|| సి. నారాయణరెడ్డి రాసిన మాటలు జాషువా కవి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తాయి : ”జాషువా కవిత్వం చిందించే కరుణరసం ఉత్తకన్నీళ్ళది కాదు, ఉప్పెనలు దాచుకున్నది. జాలితో జావగారేది కాదు, జ్వాలలను ఎదలో ముడుచుకున్నది. అది ప్రార్థనాత్మకమైనది కాదు, ప్రతిఘటనపూర్వకమైనది. జాషువా కరుణరసంలోంచి వీరరసాన్ని పొంగించిన కవి. అతడు చిందించే కన్నీళ్ళు అగ్నిగోళాలు. అవి దేబరించేవి కావు, గూబలను గుద్ది పలకరించేవి.” ‘విశ్వనరుడ నేను’ అని నినదించిన జాషువా గారి పద్యం ”కులమతాలు గీచుకొన్న గీతల జొచ్చి/ పంజరాన గట్టు వడను నేను/ నిఖిలలోక మెట్లు నిర్ణయించిన నాకు/ తరుగులేదు విశ్వనరుడ నేను” ఎప్పటికీ మన సమాజానికి ఒక సవాలే! నేటికీ భారతీయులు కులమతాల గీతల్లోనే బందీలై ఉండడం చూసి కవి హృదయం ఎంత దుఃఖిస్తుందో… ఈ దేశప్రజల బలహీనత అయిన కులాన్ని ”లక్ష సబ్బులకు కూడా” తొలగిపోదని కవిగారు స్పష్టంగా ప్రకటించారు. ”జాషువా గారు తెలుగుకవి మాత్రమే కాదు, అఖిలభారత ‘రాష్ట్రకవి’. మైథిలీ శరణగుప్త, గురుదేవులైన రవీంద్రులు, సుబ్రహ్మణ్యభారతి వంటి మహనీయుల కోవకు చెందినవారు. మహాకవి జాషువాగారిది విశ్వజనీనమైన దృష్టి…” అన్న దాశరథి గారి అభిప్రాయాన్ని చదివినప్పుడు ఆ మహాకవితో లభించిన కొన్నిక్షణాల అనుబంధం రవీంద్రునితోనో, సుబ్రహ్మణ్యంతోనో లభించినంత ఉద్వేగం గుండెలో ఉప్పొంగుతుంది. 2011లో గుర్రం జాషువ పరిశోధనా కేంద్రం స్థాపించినప్పటినుండి ఆయన పుట్టినరోజున నిర్వహించే కవి సమ్మేళనాల్లో వరుసగా పాల్గొనే అవకాశం నాకు లభించడం యాదృచ్ఛికమని నేననుకోవడం లేదు.

విశ్వనరుడైన జాషువా మనందరి నాలుకలమీద జీవిస్తూ మనలోని మానవతను వెలికితీసి, మనం ఒక్కొక్కరం విశ్వనరులుగానే ఎదగాలని తపించారు. అందుకే ఆయన నమ్మకంగా అన్నారు తనకు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డును తెచ్చిపెట్టిన ‘క్రీస్తుచరిత్ర’ కావ్యంలో… ”ఏసుక్రీస్తు కృతి నేర్పున్‌ విశ్వసౌజన్యమున్‌” అని!

ఐరోపాలో పునురుజ్జీవానికి (రినేజాన్స్‌), ప్రపంచసాహిత్యానికి, పీడింపబడుతున్న ప్రజల విడుదలకు, ప్రజాపాలనకు, చట్టాలకు, ప్రభుత్వాల రాజ్యాంగాలకు, న్యాయశాస్త్రానికి మానవతా పునాదిగా ఉండి, ‘బలవంతుడిదే రాజ్యం- బలహీనుడిది నిత్యబానిసత్వం’ అనే నిరంకుశ దోపిడీవాదం గుండెలో మానవీయ దీపాలను వెలిగించిన ”నిన్నువలె నీ పొరుగువాని ప్రేమించు” అన్న క్రీస్తు ఏసు మాటలు, భారతగడ్డ మీద మనిషిని మనిషిగా గౌరవించి, అంటరానితనమనే అమానుషాన్ని నిర్మూలించి, సమానతను స్థాపిస్తాయన్న ఎంతగొప్ప ఆశతో, నమ్మకంతో జాషువా కవి ‘క్రీస్తుచరిత్ర’ రాశారో!

అవార్డులెన్నో వరించాయి… కానీ కులం కరడుగట్టిన గుండెలు మాత్రం కరగలేదు.

‘భారతీయులందరూ నా సహోదరులు’ అని నినదించే పాఠశాలల ప్రతిజ్ఞ-భావిభారత పౌరుల గుండెల్లో పాదుకొనే వాతావరణం- కారంచేడు, చుండూరు, వేంపేట, ఖైర్లాంజీ, లక్ష్మింపేట, ముజఫర్‌నగర్లుగా విస్తరించుకుపోతున్న దేశంలో – ఆశించగలమా? కాలం పరిభ్రమిస్తూనే ఉంది… ‘కులమతాల పంజరంలో/గట్టువడను నేను’ అని ఖచ్చితంగా ఎలుగెత్తే ‘విశ్వనరులు’ భారతరాజ్యాంగం ప్రకటిస్తున్న స్వేచ్ఛా, సమానత్వం, సోదరభావాలతో నిండిన నేలగా ఈ దేశాన్ని రూపించేదెప్పుడు?

కళాశాలలో మహాకవితో ముఖాముఖిగా అతిసమీపంగా లభించిన అనుభూతితో ప్రారంభమైన యాత్ర ఇంత సుదీర్ఘ పయనమవుతుందని ఎన్నడూ ఊహించలేదు. ఆనాడు ఆయనను గురించి ‘ముఖ్యఅతిథి’ అని తప్ప, ఎక్కువేమీ తెలియదు. ఆ మహాకవి తన కలంతో ప్రారంభించిన కులమతాల అసమానతల నిర్మూలనా కార్యక్రమాన్ని ఎందరెందరో కవులతోపాటు, నేనూ నా కలం ద్వారా కొనసాగించగలగడం ప్రారంభంలోనే ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఫలితం. గమ్యం చేరేవరకు అంటే కులరహిత సమాజాన్ని ఆవిష్కరించేవరకు ఈ ‘కలం యుద్ధం’ కొనసాగించాల్సిందే.

జాషువాగారిని, వారి ఆశయాలను, ఆలోచనలను, విస్ఫుటించే సత్యాలను, దుర్మార్గాలపై, అబద్ధాలపై ఎక్కుపెట్టిన బాణాలను ఎంతగానో అభిమానించి, వారి సాహిత్యాన్ని బహిరంగ సాహితీ సభల ద్వారాను, ఆకాశవాణి ద్వారాను, పత్రికలద్వారాను ప్రజల్లోకి తీసుకువెళ్ళడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను.

2011లో పద్మభూషణ్‌ డా|| గుర్రం జాషువా పరిశోధనా కేంద్రం ప్రారంభోత్సవంలో ఏర్పాటుచేసిన కవిసమ్మేళనంలో నేను వినిపించిన కవిత ‘జాషువా, మేం… విషనరులం!’ నుండి చిరుభాగం-

”విశ్వనరుడ నేను అని ఎంత ఉత్తుంగ ధ్వని చేశావు

పద్దుల్లో, హద్దుల్లో, గీతల్లో, గుడ్డిరాతల్లో

కుంచించుకుపోయి, బంధించుకున్న మా మెదళ్ళు

గుభిల్లుమనేలా మానవతా మహాశిఖరమై నిలిచావు

……………………………………………………

అంటరానిపదం అంతుచిక్కలేదు నీకు

అర్థమైన తరువాత… పోటీకి నిలబడలేని

భావదారిద్య్రానికి జాలిపడ్డావు…

యుద్ధానికి సిద్ధమయ్యావు

కవితా ఖడ్గాన్ని ఎదలో ధరించావు

కావ్య సైన్యంతో ఖండఖండాలుగా కదం తొక్కావు

……………………………………………………

కానీ మేం చూడు, శత్రువుతో యుద్ధం మాని

సూయిసైడు బాంబుల మవుతున్నాం

మమ్మల్ని మేమే ముక్కలుగా నరుక్కుంటున్నాం

……………………………………………………”

ఆనాడు ఆయన ఓ మహాకవి అని తెలియదు… నేడు ఆ ‘విశ్వనరుని’ కల సాకారానికే మన దేశంలోని కలాలన్నీ అంకితం కావాలన్నదే నా ఆరాటం. ఇంకా ఎంత కాలం ‘కులం’ తోనే బతుకుదాం? కులాన్ని చంపేసి భారతీయులుగా ఎప్పుడు పునరుత్థానులమవుతాం?

ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రశ్న… మనందరి హృదయాలకు… సమాధానం ఉందా??

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.