అరణ్య
సామాజిక వ్యవస్థలో స్త్రీల పాత్ర ఎంతో ముఖ్యమైనదని తరతరాల సామాజిక పరిణామం నిరూపించింది. సమాజ గమనంలో, ఆధునిక తరాల అభివృద్ధి క్రమంలో మహిళల తోడ్పాటు ఎంత గణనీయమైనదో చరిత్ర నిరూపించింది.
తరతరాల పురుషాధిక్య భావజాలంలో, పురుష స్వామ్య సంస్కృతిలో అడుగడుగునా బానిసత్వంతో మగ్గుతూ వచ్చినా, సమాజం చూసే చిన్నచూపును పెద్దమనసుతో భరిస్తూ వచ్చినా, మహిళలు ఏనాడూ తమ అస్తిత్వాన్ని కోల్పోలేదు. తీవ్ర సామాజిక నిర్బంధాల మధ్య, కుటుంబ నియంత్రణల మధ్య కూడా క్రమంగా పుంజుకుంటూ తమ ఆవశ్యకతను గుర్తెరిగేలా చేశారు కానీ ఏనాడూ కను మరుగయ్యే స్థితికి చేరుకోలేదు. వారిని ఆ స్థితికి చేర్చడానికి పురుషస్వామ్యానికి కూడా శక్తి సరిపోలేదు. అయితే వేల సంవత్సరాల పరిణామక్రమంలో పురుష శక్తులేవీ చేయలేని పనిని ఆధునికీకరణ ముసుగులో ప్రపంచీకరణ చేయబోతుందన్నదే ప్రస్తుతం అందరినీ దిగ్భ్రాంతిపరిచే విషయం.
ప్రపంచీకరణకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ప్రభావితం కానివారు లేరంటే అతిశయెక్తి కాదు. నయా వలసవాదంగా, అమెరికనైజేషన్‌గా పిలవబడే ప్రపంచీకరణ ఆవిర్భవించిన తొలిరోజుల నుంచీ సామాజిక రంగాలన్నింటి మీద దెబ్బకొడుతూ వచ్చింది. ఆధునికీకరణ ప్రక్రియలోని సొగసులను పైపైన ప్రదర్శిస్తూ, లోలోపల ఆయ రంగాల మూలాలపైనే పంజా విసురుతూ వచ్చింది. అయితే తొలిరోజులలో ఈ ప్రమాదాన్ని ఎవరూ గుర్తించకపోయినా క్రమంగా దాని విశ్వరూపం తేటతెల్లమైపోయింది. ఒక్కొక్క రంగాన్ని దెబ్బతీస్తూ ఉంటే చేష్టలుడిగి చూడలేని ప్రజలు, క్రమంగా ఉద్యమబాట పట్టారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా దేశాల మధ్య మూలధనం, వస్తుసేవలతోపాటు వ్యక్తులు, ఆలోచనలు, మీడియా, సాంకేతిక పరిజ్ఞానం, టెర్రరిజం, వ్యాధులు, కాలుష్యాలు స్వేచ్ఛగా ప్రవహిస్తూ అక్కడి సంస్కృతులు, భావజాలం, ఆహారపు అలవాట్లు, జీవనశైలుల పైన దాడిచేశాయి. అందులో భాగమే స్త్రీలపై ప్రపంచీకరణ దాడి.
సామ్రాజ్యవాదం నుంచి పుట్టిన ప్రపంచీకరణ ముందుగా సాంస్కృతిక రంగాన్ని తన అదుపులోకి తెచ్చుకుంటుంది. ప్రజల సంస్కృతి, సాంప్రదాయలను తనకు అనుకూలంగా మార్చుకోవటం ద్వారా వారిని మార్కెట్‌కు రప్పిస్తుంది. ఇందుకు అది ప్రధానంగా రెండు వర్గాలను ఎన్నుకుంటుంది. (1) ఆయ సమాజాల లోని ప్రజల దేశీయ సంస్కృతీ సంప్రదాయలను ధ్వంసం చేయటం (2) సంస్కృతీ సంప్రదాయలను రూపాంతరం చెందించి తనకు అనుకూలంగా మార్చటం. మనదేశంలో సరళీకరణ, ప్రైవేటీకరణలతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగి పోయింది. మీడియా స్వరూపమే మారి పోయింది. దేశవిదేశాల ఛానళ్లు గ్రామ గ్రామాన దర్శనమిస్తున్నాయి. వాటిద్వారా విశ్వవ్యాప్త సంస్కృతులు సులభరీతిన దిగుమతి అవుతున్నాయి. ఆధునికత విషయంలో మంచి కంటే చెడు ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అందుకే స్త్రీలను కించపరిచే కార్యక్రమాలు, అశ్లీలతతో కూడిన అంశాలు సమాజంపై సూటిగా ప్రసారమవుతున్నాయి. అందమే స్త్రీలయొక్క ప్రధానలక్షణమనే భావనతో కార్యక్రమాల నిర్మాణం జరుగుతున్నది. దేశీయ ఛానళ్లు కూడా అందుకు పోటీపడుతున్నాయి. సీరియళ్ల నిర్మాణంలో స్త్రీలను విలన్లుగా, కుటుంబాలను నాశనం చేసేవారిగా చూపించటం ప్రాతిపదికగా మారుతున్నది. మోసం, విద్వేషం, కుట్రలు, కుతంత్రాలు చేయటం స్త్రీల సహజ లక్షణమన్నట్లుగా, ఆయా పాత్రలలో వారిని జీవింపచేస్తున్నారు. తద్వారా స్త్రీలను అగౌరవపరిచే సందర్భాలు పుట్టుకొస్తున్నాయి. అత్తాకోడళ్లు, వదినా మరదళ్లు, తోటికోడళ్ళ మధ్య అసహజమైన యుద్ధవాతావరణాన్ని చూపిస్తూ బంధుత్వాలను ధ్వంసం చేస్తున్నారు. అలాంటి కార్యక్రమాలు చూడడం నేడు మేధావి వర్గంలోని మహిళలకు కూడా వ్యసనంగా మారిందంటే వాటి శక్తిని అర్థం చేసుకోవచ్చు. ప్రపంచీకరణ నేపథ్యంలో పాతకాలపు సినిమాహాళ్లు పోయి మల్టిప్లెక్స్‌లు, ఐమాక్స్‌లు పుట్టుకొస్తుండటం ఒక ఎత్తైతే, గ్లోబల్ ఫలితాల నేపథ్యంలో సినిమాల నిర్మాణం జరగటం మరొక ఎత్తు. లాభార్జన కోసం ప్రేమను విశృంఖలంగా చూపించిన నిర్మాతలు, కొత్తదనం కోసం ప్రేమను తిరస్కరిస్తే ఆడవాళ్లను చంపడాలు, యాసిడ్ పోయడాలు, గొంతు కోయడాలు వంటి భయంకర కథాంశాలతో ముందుకు వచ్చారు. వయస్సుతో నిమిత్తంలేని ప్రేమ కథాంశాలు యువతపైకి వదిలి ‘న్యూ జెనరేషన్’ కోసమేనంటూ సమర్థించుకుంటున్నారు. ఒకనాడు ప్రత్యేక ఆర్టిస్టులతో సాగే కాబరే డాన్సులు, అశ్లీల సన్నివేశాలు, అంగాంగ ప్రదర్శనలు నేడు సినిమాలోని ప్రతి పాత్రకూ వర్తింపచేస్తున్నారు. విదేశీసంస్కృతిని నరనరాన జీర్ణింప చేసుకుని అందుకు తగ్గట్టుగా సినిమాలు, సీరియళ్లు రూపొందిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు. అలా పెడదారి పట్టిన యువ కుల ఆకృత్యాలకు ఉన్మాదహత్యలు, ప్రేమ హింసల పేరిట అంతిమంగా బలవుతున్నది మహిళలే. మీడియా చేసే ఈ సాంస్కృతిక దాడికి కారణం ప్రపంచీకరణే.
ప్రధాన మతాలేవైనా, వాటిలోని నియమనిబంధనలు తరతరాలుగా స్త్రీలను పూర్తిస్థాయిలో అణిచివేశాయన్నది నగ్నసత్యం. మనదేశంలోని ప్రధానమతమైన హిందూమతంలోని తిరోగమన నియమావళి కారణంగా నేటికీ స్త్రీలు సరైన జ్ఞానం దిశగా ఆలోచించలేకపోతున్నారు. అలాంటి కఠోర మతనియమాలను మార్చగల శక్తి ప్రపంచీకరణకుంది. ఆ దిశగా ప్రయత్నం చేస్తే మత పునాదులనే తొలగించగల సత్తా దానికుంది. కానీ మత సారాంశాలలోని చెడు అంశాలను, అభివృద్ధి నిరోధక అంశాలను ప్రోత్సహిస్తూ, మంచి అంశాలను పక్కనబెట్టే దిశగా ప్రపంచీకరణ పావులు కదిపింది. మతాలలోని సాంప్రదాయక భావజాలాన్ని ఉపయెగించుకుని, ఆ పునాదిపై తన వ్యాపారాన్ని విస్తరించుకుంది. బాణామతి, దొంగబాబాలు, మూఢ నమ్మకాలు, పూజలు, ముసుగుపద్ధతులు, విగ్రహారాధనలు వంటి అవలక్షణాలను తొలగించే ప్రయత్నం చేయకుండా వాటినే తన ధనార్జనకు సాధనంగా వినియెగించుకుంది. ప్రజలలోని మతపిచ్చిని ఆసరా చేసుకుని మతపరమైన కార్యక్రమాలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. అయితే ఈ ప్రమాదకర ధోరణికి, స్వతహాగా తొందరగా స్పందించే గుణమున్న స్త్రీలే ఎక్కువగా ప్రభావితమయ్యారు. సంపాదనలపై తరతరాల పేటెంట్ తీసుకున్న పురుషులు మాత్రం ఈ మత ఆధిపత్య గ్లోబల్ ధోరణులకు లొంగలేదు. ఈ నయా గ్లోబలైజ్డ్ మతభావజాలం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నది.
ప్రపంచీకరణలోని పెడ ధోరణులు నేడు ఉన్నతవర్గాల మహిళలను తీవ్రంగా ప్రభావపరుస్తున్నాయి. 1990వ దశకంలో ప్రారంభమైన గ్లోబలైజేషన్ వల్ల మహిళలు ఉన్నత ఉపాధి, ఉద్యోగ రంగాలలోకి రావటం ప్రారంభమైంది. ఇది మహిళల పురోగమనానికి నిదర్శనమే అయిననూ, దీని ద్వారా వారి ఆలోచనా విధానాలు, మానసిక స్థితిగతులు పూర్తిగా మార్చివేయబడ్డాయి. కాసుల వెంట తీసే పరుగులలో స్త్రీత్వం ఛిద్రమైంది. కంపెనీలలో లైంగిక వేధింపులు, శారీరక పురుషాధిపత్యాలు, కార్యాలయ పెత్తనాలు తగ్గకపోగా ఉద్యోగినులకు మల్టీనేషనల్ సంస్కృతులు అలవాటవుతున్నాయి. వీకెండ్ పార్టీలు, పబ్ కల్చర్, డ్రింక్ కల్చర్‌ల దిశగా ఈ ధోరణులు మహిళలను ప్రేరేపిస్తున్నాయి. భోగలాల సత్వం పెరిగింది. తల్లిదనం, అమ్మదనం, స్త్రీత్వం వంటి పదాలను స్త్రీలకు ఆపాదించి పురుషవర్గం స్త్రీలను కుటుంబ బానిసను చేసింది. అయితే స్త్రీలకు ఆ కుటుంబ బందీఖానా నుంచి విముక్తి కలిగిస్తూ స్త్రీపురుషులను సమానంగా కుటుంబ నిర్వహణలో భాగస్వాములను చేయాల్సి ఉండగా, ప్రపంచీకరణ ప్రకృతి సహజమైన తల్లీబిడ్డల అనుబంధాన్నే తెంచివేసింది. తల్లీబిడ్డల అనురాగంలోను, సంబంధాల లోను తండ్రిని పాల్గొనేలా చేయాల్సి ఉంటే, ప్రపంచీకరణ ఫలితాలు మాత్రం తల్లీబిడ్డల మధ్య సంబంధాలకు గండికొడుతూ వాటిని నాశనం చేస్తున్నాయి. దీని ఫలితంగానే తల్లితనం కొరవడిపోయింది. కేరీర్‌లో ఎదగాలనుకునే వారికి తల్లితనం ఒక అడ్డుగా ఉంటుందనే అభిప్రాయం తలెత్తుతున్నది. తమ సహజాతాలకు విరుద్ధంగా వర్కింగుమదర్స్ ప్రవర్తిస్తున్నారు. అమ్మతనం ఉన్నతవర్గాల స్త్రీలకు నామమాత్రమైపోయింది. మార్కెట్ నేడు తల్లితనాన్ని నిర్దేశిస్తున్నది. తద్వారా తల్లికి, బిడ్డకు మధ్య అంతరాలు, విభజనరేఖలు పెరుగుతున్నాయి. ఆప్యాయత, అనురాగాలు కనుమరుగవుతున్నాయి. పితృస్వామిక ప్రపంచంలో బిడ్డల ఆలనాపాలన, పోషణలను తండ్రులు పట్టించుకోరు. తల్లే బిడ్డలను పెంచి పెద్దచేయలి. పురుష స్వామ్యం తండ్రి, బిడ్డల అనురాగాన్ని కబళించివేస్తే, ప్రపంచీకరణ ఆ బిడ్డలను తల్లికి కూడా దూరం చేసింది. నేటి చైల్డ్‌కేర్ సెంటర్లు గ్లోబలైజేషన్ పుణ్యమే. అసంఘటిత రంగంలోని, శ్రామిక సెక్షన్‌లలోని స్త్రీలు కూడా శారీరకశ్రమలు చేస్తారు. కానీ వారిని ప్రపంచీకరణ కబళించలేదు కనుక గ్రామీణ ప్రాంతాలలో నేటికీ కొంతనైనా అమ్మతనం జీవించి ఉన్నది. ఈ పరిస్థితులకు ఉన్నత వర్గ స్త్రీలను తప్పుపట్టాల్సిందేమీ లేదు. తప్పుపట్టాల్సిందల్లా ప్రపంచీకరణ దుష్ఫలితాలనే.
ప్రధానంగా వ్యవసాయదేశమైన భారతదేశంలో అరకొరగానైనా కొన్ని పథకాలను ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నాయి. ఆయ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని పాలకవర్గాలు కలలు కంటుంటాయి. అయితే ఆచరణలో అవన్నీ తీవ్ర ప్రతికూల ఫలితాలనిస్తుండటం వల్ల కనీసంగానైనా జరగాల్సిన ప్రయోజనం మొత్తానికే మృగ్యమైపోతున్నది. ఏ పథకమైనా పట్టణాలకు దగ్గరగా ఉన్న గ్రామాలకే, అదీ అరకొరగానే అందుతుంది. మారుమూల ప్రాంతాలకు పథకాలకు సంబంధించిన కనీస అవగాహన కూడా ఉండదు. గ్రామీణ ప్రాంతాలలో అక్షరాస్యత చాలా తక్కువగా ఉంటుంది. అందులోనూ మహిళల శాతం మరీ తక్కువ. అందుకే గ్రామీణస్త్రీలు కూలిపనే జీవనాధారంగా, స్వంతభూమిలేక, ఉన్ననూ భర్తల పురుషపెత్తనం వల్ల, స్వంతభూమిలోనే కూలీలుగా బతుకు వెళ్లదీస్తున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి మరింతగా దిగజారింది. ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలపైనా, సంక్షేమ కార్యక్రమాలపైనా, మొత్తంగా ప్రభుత్వం పైననే ప్రపంచీకరణ తీవ్ర ప్రభావం చూపుతున్నది. తద్వారా ఆయా పథకాలు, కార్యక్రమాలు సంపన్నవర్గాలను మరింత సుసంపన్నం చేసేందుకే ఉపయెగపడుతున్నాయి. పేదవాళ్ళను కొట్టి పెద్దవాళ్ళకు పెట్టే దిశగా ప్రభుత్వాలను ప్రపంచీకరణ శాసిస్తున్నది. ఫలితంగా పేదరికంలో మగ్గుతున్న అనేకవర్గాలవారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రైతు ఆత్మహత్యలు, చేనేత ఆత్మహత్యలు, ఆకలిచావులు, వలసచావులు ఈ కోవలోనివే. గ్లోబలైజేషన్ పేదవారికి మేలుచేసేదే అయితే, ఆర్థిక సంస్కరణలు పేదలకొరకే అయితే అవి ప్రవేశపెట్టాక ఈ ఆత్మహత్యలు, మరణాలు పెరగడానికి కారణమేమిటి? గ్రామీణ మహిళలకు సాధికారత, విద్య, పాలనా భాగస్వామ్యం ఒనగరితే పెరుగుతున్న అంతరాలకు, పేదరికపు చావులకు కారణాలను ఏమని విశ్లేషిస్తారు?
నేటి ప్రభుత్వాల దృష్టిలో అభివృద్ధి అంటే హైటెక్‌సిటీలు, రింగురోడ్లు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, కాన్సెప్ట్ స్కూళ్లు, కార్ల కంపెనీలు, ఫ్యాబ్‌సిటీలు. అందుకోసం అవి వేలాది ఎకరాల సాగుభూమిని కారుచౌకగా ఆయ కంపెనీలకు అందిస్తున్నాయి. దాంతో గ్రామాలలో సిరులు పండించే భూములను పోగొట్టుకుని అన్నదాతలు ఆకలికేకలు పెడుతున్నారు. సమస్యల వలయం నుంచి బైటపడలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ఆ కుటుంబ భారాన్ని మోసే బాధ్యత మహిళలపై పడుతుంది. సరైన తిండి కూడా తినలేని స్థితిలో వ్యాధుల బారిన పడటమే కాకుండా అప్పుల బాధ, పేదరికం, ఆకలి మంటలను తట్టుకొని, కుటుంబభారం మోయటం కష్టమై స్త్రీలు తమ కిడ్నీలను, రక్తాన్ని, చివరకు కన్నపిల్లలను కూడా అమ్ముకుంటున్నారు. మరికొందరు ముంబై, పూణే, హైదరాబాద్, కలకత్తాలలో వ్యభిచార వృత్తిని సాగిస్తున్నారు. ఎయిడ్స్‌లాంటి వ్యాధుల బారిన పడి జీవితాలు చాలిస్తున్నారు. ఏ మత్తుపానీయాలు తమ కుటుంబాలు నాశనమవడానికి కారణమయ్యయో వాటినే అమ్మి కడుపు నింపుకోవలసిన దుస్థితి అనేక స్త్రీలకు దాపురించింది. గంజాయి, నాటుసారా, గుడుంబా వంటి నిషేధిత పదార్థాలు అమ్మి జైళ్ల పాలవుతున్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రత్యక్షంగా అర్థరాత్రి వరకు నడివీధులలో తలుపులు బార్లా తెరిచి, పేర్లు కూడా తెలియని విదేశీ కంపెనీల మత్తుపానీయాలు అమ్మబడుతుంటే దాన్ని ‘రాయల్టీ’గా పరిగణిస్తూ, పొట్టకూటికోసం గుట్టుచప్పుడు కాకుండా పరిమితంగా అమ్ముకుంటున్న పేదస్త్రీల చర్య మాత్రం చట్టం కళ్లకు నేరంగా కనిపిస్తున్నది. ప్రపంచీకరణ కార్పొరేట్ రంగాన్ని ఎంతగా విస్తరింపచేసిననూ, ఇప్పటికీ గ్రామాలలో సరైన వైద్య సదుపాయాలు లేవు. నాటువైద్యులు, మంత్రతంత్రాలు, తాయెత్తులు, విభూదులు ఇప్పటికీ గ్రామీణ వైద్యవ్యవస్థను శాసిస్తున్నాయి. ప్రసవం సమయంలో కూడా ఇప్పటికీ మంత్రసానులే దిక్కవుతున్నారు. తరాతరాలుగా వేళ్లూనుకు పోయిన జోగినీ, బసవినీ దురాచారాలను కూడా ప్రపంచీకరణ సురక్షితంగా కాపాడుతున్నది. పైగా మూఢనమ్మకాలకు మహిళలను బలిగావిస్తూ సజీవదహనాలు, మలమూత్రాలు తాగించటం, గ్రామ బహిష్కరణ వంటి చర్యలను ఆపడానికి ప్రపంచీకరణ సుతరామూ ఇష్టపడటం లేదు. నిరక్షరాస్యత, బాలికా అవిద్య, వెనకబాటు తనం, కులవివక్ష, బాల్య వివాహాలు, అధికసంతానం, గర్భసమస్యలు మొదలగు సమస్యలన్నింటినీ గ్లోబలైజేషన్ అలాగే కొనసాగిస్తూ వస్తున్నది. అయితే ప్రపంచీకరణ తెచ్చిన ఒకేఒక మార్పు ఏమిటంటే ఆయా సమస్యలపై వ్యాపారం చేసేలా బడా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించటం.
పదిహేడు సంవత్సరాల ప్రపంచీ కరణ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే అది కేవలం పురుషస్వామ్యాన్ని నిలబెట్టడానికే ఆరాటపడుతున్నది. సమాజంలో పురుషస్వామ్యం ఏర్పరచిన వికృతపునాదిని మరింత పటిష్టపరచడానికే ఉవ్విళ్లూరు తున్నది. ఆ సంస్కృతి మూలాలపైనే వ్యాపార బీజాల్ని నాటి దేశాంతరాల, ఖండాంతరాల లాభార్జనలను పోగుచేసు కోవడమే లక్ష్యంగా చేసుకుంటున్నది. పురుషాధిక్య ప్రపంచ పునాదుల్ని మరింత బలోపేతం చేయడానికే పూనుకుంటున్నది. ఇది కొనసాగితే మరికొన్ని శతాబ్దాల పాటు పురుషస్వామ్యం తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. ఎరిక్ హాబ్స్‌మన్ అనే చరిత్రకారుడు ఇలా అంటాడు ”18వ శతాబ్దంలో రాజు మరణించాడు, 19వ శతాబ్దంలో దేవుడు మరణించాడు, 20వ శతాబ్దంలో మనిషి మరణిస్తున్నాడు”. ప్రపంచీకరణ పెత్తనంతో మున్ముందు దీనికి మరొక వాక్యాన్ని జోడించుకోవచ్చు. ”21వ శతాబ్దంలో మానవులలో స్త్రీజాతే ఎక్కువగా మరణిస్తున్నది” అని. ఈ ప్రమాదాన్ని చేరుకోకముందే ప్రపంచీకరణ విధ్వంసాన్ని ప్రతిఘటించవలసిన అవసరముంది. ‘ప్రపంచం ఒక కుగ్రామం’గా మారటంలోని ప్రమాదకర ఆలోచనావిధానంపైన దాడి చేయాల్సిన అవసరముంది. సామ్రాజ్యవాద విషపుత్రికగా జన్మించిన ప్రపంచీకరణకు వ్యతిరేకంగా విశాలమైన ఫెమినిస్టు ఉద్యమాలు నిర్వహించుకోవటమే ప్రస్తుతం అందరి ముందున్న ఆవశ్యక సందర్భం.