”ఎవరి అందం ఎవరికి ఆనందం?”

పోడూరి కృష్ణకుమారి

 

చేతిలో ఉన్న వీక్లీలోకి చూస్తూ నిట్టూర్చింది మీనాక్షి.  చదువుతున్న కథ పేజీ మధ్యలో పెద్ద బాక్స్‌ కట్టి ఓ నటి బొమ్మ.  దానికింద ఏదో వివరణ ఉన్నాయి.

  అలా పేజీలో ఉన్న మేటరుకి సంబంధం లేకుండా మధ్యమధ్యలో బాక్స్‌ ఐటమ్స్‌ వెయ్యడం పత్రికల్లో మామూలే. 

 అందుకు మీనాక్షికి ఏం అభ్యంతరం లేదు.  ఆ బాక్స్‌లో ఉన్న బొమ్మను చూస్తే కాస్త విచారం కలిగింది మీనాక్షికి. 

 అందులో అమ్మాయి (ఏదో హిట్‌ మూవీ హీరోయిన్‌) తను తొడుక్కున్న లోవెయిస్ట్‌ జీన్స్‌ను వీలయినంత కిందకీ, పైనున్న స్లీవ్‌లెస్‌ షార్ట్‌ టాప్‌ను వీలయినంత పైకీ లాగుతూ తను అందం అనుకున్న శరీరాన్ని ప్రదర్శిస్తోంది.  పత్రికల భాషలో చెప్పాలంటే అందాలు ఆరబోస్తోంది.  ”ఏవిటిదీ?” మళ్ళీ గాఢంగా నిట్టూర్చింది.  మీనాక్షి నిట్టూర్పులూ ఆపసోపాలూ విని మీనాక్షి వెనగ్గా వచ్చి పత్రికలోకి తొంగిచసింది రీతూ.  చూస్తూనే, ”వావ్‌!” అని తన ఆనందాశ్చర్యాలు ప్రకటించింది.  ”అబ్బ! ఏం ఫోజిచ్చిందే.  ఏం ఫిగరూ! రియల్లీ!” అని మాటలుడిగి గుడ్లప్పగించి ఆ నటి పొట్ట అందాన్ని కళ్ళతో ఆస్వాదించింది.  ”నా బొంద” విసుక్కుంటూ టప్పున పుస్తకాన్ని బల్లమీద పడేసింది మీనాక్షి.  చటుక్కున పుస్తకం తీసి మళ్ళీ ఆ బొమ్మనే తదేకంగా చూస్తూ ”ఓ! వాటే ఫిగర్‌! నాకు నిజంగా బలే జెలసీ వస్తోంది.  మమ్మీ! నా పొట్ట కూడా ఇంత ఫ్లాట్‌గా అయిపోవాలి తక్షణం అంటే కనీసం వారంలోగా.  ఏం ట్రీట్‌మెంట్‌ ఇస్తావో ఇచ్చుకో” అని కేకపెట్టింది రీతూ.  వాళ్ళమ్మకి ఓ చిన్నపాటి బ్యూటీపార్లర్‌ ఉంది.  ఆవిడ పేరు సుశీల కానీ ఎందుకో షీల అని మార్చుకుంది.  అద్దం ముందు కూచుని ముఖానికి తుది మేకప్‌ మెరుగులు దిద్దుతున్న షీలా చకచకా నడిచొచ్చి వీక్లీ అందుకుని చూసింది.  ”నీ పొట్ట ఇలా అవ్వాలంటే వారం చాలదు.  హాలీడేస్‌లో తిండెక్కువైపోయింది నీకు.”  ”మమ్మీ!” ఆగలేనిదానిలా కాలు నేలకేసి కొట్టింది రీతూ.  ముద్దుగా రీతూ నెత్తినొకటేసి మళ్ళీ సినీనటి బొమ్మలోకి చూస్తూ నుంచుంది షీలా.  ఎక్స్‌రేని పరిశీలిస్తున్న డాక్టరులా.
ఆ తల్లీకూతుళ్ళ వైఖరి చూసి కొంచెం విసుగేసింది మీనాక్షికి.  ”ఆ నటీమణి పొట్ట అంత పల్లంగా మెయింటెయిన్‌ అవడానికి అయ్యే ఖర్చంతా ఆవిడ్ని బుక్‌ చేసుకున్న సినిమావాళ్ళు పెట్టుబడి పెడతారు.  ఇక ఆవిడ తీర్చిదిద్దిన శరీరాన్ని కెమేరాకి ఎక్స్‌పోజ్‌ చెయ్యడానికి అంగుళానికిన్ని లక్షలు లెక్క చొప్పున డబ్బిస్తారు.  నువ్వు ఆవిడతో పోటీగా పొట్ట మెయింటెయిన్‌ చెయ్యాలంటే ఖర్చుతప్ప జమ ఉండదు.  నో ఇన్కమ్‌ ఓన్లీ స్పెన్డింగు”.  ఆంగ్లంలో కూడా నొక్కి వక్కాణించింది.  తల్లీకూతుళ్ళిద్దరూ కళ్ళు కలుపుకుని గుంభనంగా నవ్వుకున్నారు.  ”ఎంతయినా బ్యాంకు మనిషివికదా క్రెడిట్టూ డెబిట్టూ తప్ప మరో ఆలోచన రాదు నీకు.  ముందు మనని మనం బాగా గ్రూమింగు చేసుకోవాలి.  తరవాత అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయి” నిర్లక్ష్యంగా అంది రీతూ.  ”అన్నీ అలా ఖర్చూ జమా దృష్టితోనే చూడకూడదు మీనా” అంది షీలా.  ”మరే దృష్టితో చూడాలి?” దృష్టి ఆవిడమీదే నిశ్చలంగా నిలిపి అడిగింది మీనాక్షి” అంటే… ఐమీన్‌… బ్యూటిఫుల్‌గా ఉండడం అనేది స్త్రీయొక్క జన్మహక్కన్న మాట.  అంటే నా ఉద్దేశం స్త్రీ తన ఆనందం కోసం తనని తాను అందంగా తయారుచేసుకోవాలి.  అది ఎంతో ఆత్మవిశ్వాసాన్నిస్తుంది.”  ”ఓహో!” అంది మీనాక్షి ఆ చిన్న శబ్దంతో ఆమె వలకబోసిన వెటకారం షీలాకి ఘాటుగా తగిలింది.  ”నీకర్థంకాదులే.  మీ అమ్మ నీకు బాగా మధ్యతరగతి మనస్తత్వం నూరిపోసింది.  ఫెమినిజం రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో కూడా నువ్వు అమ్మమ్మలా మాటాడతావు.  స్టైలుగా మోడర్న్‌గా ఉండడం వల్ల ఆడవాళ్ళల్లో ఆత్మవిశ్వాసం తప్పకుండా పెరుగుతుంది.”  ”విద్య, వివేకం, విజ్ఞానం, లోకజ్ఞానం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను అంటే తప్పా?”  అమాయకంగా మొహం పెట్టి అడుగుతున్న మీనాక్షిని చూస్తుంటే ఆ పిల్ల తనని వేళాకోళం చేస్తోందో, నిజంగానే తన అభిప్రాయం అడుగుతోందో అర్థం కాలేదు షీలాకి.  ”అవుననుకో అవన్నీ ఉండాల్సిందే.  ఆడదన్నాక అందం కూడా ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు కదా?”  ”ఎవరూ?” అమాయకన్నరగా మొహంపెట్టి అడుగుతున్న మీనాక్షిని చూస్తుంటే తనేదో పెద్దగోతిలో పడబోతున్న ఫీలింగొచ్చింది షీలాకి.  ”ఏంటి ఎవరు? ఎవరేంటీ?” అంది విసుగ్గా మొహంపెట్టి.  ”అదే మీరన్నారే అందం కూడా ఎక్స్‌పెక్ట్‌ చేస్తారనీ, ఆ ఎక్స్‌పెక్ట్‌ చేసేది ఎవరూ?”  ”ఇంకెవరూ మగవాళ్ళు.” ”అద్గదీ సంగతి.  ఆడవాళ్ళు బయటకడుగుపెడితే అక్కడ కాచుకున్న మగవాళ్ళు వీళ్ళ అందాలు చూడాలనుకుంటారు కాబట్టి వీళ్ళు వాళ్ళకోసం అందాలు కాపాడుకోవాలి, పైగా ప్రదర్శించాలి.  అదీ మీరు చెపుతున్న దాని సారాంశం.  అంతేకానీ ఇందాక మీరన్నట్టు స్త్రీ తన ఆత్మానందంకోసం కాదు అందంగా ఉండడం” నవ్వింది మీనాక్షి.  షీలాకి మండుకొచ్చింది.  ”వితండవాదంలో మా రీతూని మించిపోయావే! చెప్పానుగా మీ అమ్మ నీకు బాగా ఈ మిడిల్‌క్లాసు పిచ్చిభావాలు బాగా నూరిపోసింది.  అసలు చెప్తున్నది అర్థం చేసుకోవే?  మొత్తంమీద మూడుకాళ్ళముసలమ్మలా తయారుచేసింది మీ అమ్మ.”
”నాతో వాదించలేక మా అమ్మని తిట్టడం ఫెమినిజం అవదు ఆంటీ.  సంస్కారం అసలేకాదు.  మీరు పాయింటొది లేసి తిట్లు లంకించుకుంటే నేను మీ వాదం ఒప్పేసుకుంటానని భ్రమ పడకండి.  అసలు కోపం ఎవరి మీదొచ్చినా వారి అమ్మని తిట్టడం పురుషాహంకారానికి ప్రతీక.  మీరు ఫెమినిజమ్‌ పేరెత్తి మా అమ్మని తిట్టి స్త్రీవాదానికి తీరని ద్రోహం చేస్తున్నారు.  ఆత్మవిశ్వాసానికి, పురుషుల చేత గౌరవింపబడడానికీ అందంతో సంబంధం లేదని నేను నిరూపించగలను. ఛాలెంజ్‌” అంది మీనాక్షి కాస్త సీరియస్‌గా, కాస్త సరదాగా.  షీలా కాస్త తగ్గింది.  ”బావుందమ్మా నీతో వాదిస్తూ కూచోడానికి నాకు టైము లేదు” అంటూ లేచి చెప్పులు తొడుక్కుంది.  ”నీ మిడిల్‌క్లాస్‌ భావాలతో మా రీతూ బుర్ర తినెయ్యకు” అంది.  ”అందరం ఒకటే క్లాసులెండాంటీ” అంటించింది మీనాక్షి.  ఒంటిమీద కారం పూసుకున్నట్లైంది షీలాకి.  ”రీతూ నే పోతున్నా జాగ్రత్తగా తలుపులేసుకో తెలీని వాళ్ళొస్తే తలుపులు తియ్యకు.”  చిన్నపిల్లకి చెప్పినట్టు జాగ్రత్తలు చెప్తున్న షీలాని చూస్తూ వస్తున్న నవ్వాపుకుంది మీనాక్షి.  ”మీరు రీతూకి అందానికి చిట్కాలతో బాటు కరాటే కూడా నేర్పించండి ఆంటీ అదేదో నేర్చేసుకుంటే హాయిగా తలుపులు తీసుకునే ఉండచ్చు రీతూ” పుస్తకంలో ఇతర నటీమణుల అందాలు అబ్బురంగా చూస్తున్న రీతూ మీనాక్షి మాటల్లో వెటకారం అర్థం చేసుకోకుండా ఏదో జోకేసే ఉంటుందను కుని కిలకిలా నవ్వేసింది.  షీలాకి తిక్కరేగిపోయింది.  పళ్ళు పటపట కొరుక్కుంటూ ఏదో గొణుక్కుంటూ ఢామ్మని తలుపు లాగేసి వెళ్ళిపోయింది.
తన తల్లి వయసున్న షీలాని ఆటపట్టించడం, ఆమెతో వాదించటం నిజానికి మీనాక్షికి ఇష్టంలేదు.  కానీ అంతా తనకే తెలుసుననీ తనుచెప్పిందే వేదం అన్నట్టు ఇతరుల మాటకే మాత్రం గౌరవం ఇవ్వని షీలా మనస్తత్వం మీనాక్షిని అప్పుడప్పుడు రెచ్చగొడుతుంటుంది.  ఇవాళ మరీ రెచ్చిపోయి తన తల్లిని గురించి తక్కువగా మాట్లాడితే అసలు సహించలేక పోయింది.  మీనాక్షి తల్లి పార్వతి,  షీలా బియ్యేలో క్లాసుమేట్స్‌.  పార్వతి ఎమ్మే చదివి లెక్చరరుగా స్థిరపడింది.  భర్త రామారావు ఇంజనీరు.  ఓ ఏడాది క్రితం మరో ఇద్దరు పార్ట్‌నర్స్‌తో కలిసి షీలా పార్వతీ వాళ్ళ వీధిలోనే బ్యటీపార్లర్‌ తెరిచి ఆ పక్కనే ఓ ఇంట్లో అద్దెకు దిగడంతో ఒకరినొకరు గుర్తుపట్టుకుని పలకరించుకున్నారు.  ఆ తరవాత ఆర్నెల్లకు షీలా వాళ్ళని ఇంటివాళ్ళు ఖాళీ చెయ్యమనడంతో షీలా పార్వతిని వాళ్ళ ఇంట్లో మూడుగదులు తమకి అద్దెకివ్వమని బతిమాలుకుంది.  పార్వతి భర్త రామారావుకి ఇల్లు అద్దెకివ్వడం ఇష్టం లేకపోయినా ఫ్రెండు బతిమాలుతుంటే కాదనలేక అతన్ని ఒప్పించి ఓ పక్కగా ఉన్న మూడుగదులకు చిన్న వంటిల్లు కట్టించి ఇల్లు ఇప్పించింది పార్వతి.  అదంతా మరిచిపోయి ఇప్పుడు పార్వతినీ మీనాక్షినీ మిడిల్‌ క్లాసు భావాలని చీదరించుకోడం మీనాక్షికి నచ్చలేదు.  షీలా మిడిమిడిజ్ఞానపు ధోరణికి అడ్డుకట్ట వెయ్యాలనే నిశ్చయించుకుంది.
మీనాక్షి ఎమ్మెస్సీ పాసవుతూనే బ్యాంకాఫీసరుగా సెలెక్టయి ఉద్యోగంలో చేరిపోయింది.  ఇంక రీతూ విషయానికొస్తే ఆ పిల్ల దాదాపు మీనాక్షి ఈడుదే.  చదువుమాత్రం బీకామ్‌ పాసయి ఏవేవో కంప్యూటర్‌ కోర్సులు చేసింది.  దేనిమీదా స్థిరమైన అభిప్రాయం లేదు.  తనకు మోడల్‌గానో, కనీసం టీవీ ఏంకరుగానో అవకాశం వస్తే బాగుండునని కలలు కంటంటుంది.  అలాగని అది సాధించడానికి గట్టి ప్రయత్నమూ చెయ్యదు.  షీలా తను నడిపే బ్యూటీపార్లర్‌ బిజినెస్‌లో కూతురిని కూడా చేర్చుకోవాలని చూసింది.  కానీ దానిమీదా ఆసక్తి చూపించలేదు రీతూ.  కనిపించిన ప్రకటనకల్లా దరఖాస్తు పెడుతుంది.  ఇంటర్వ్యూలో సాధించి తీరాలన్న పట్టుదల చూపించదు.  తను ఆశపడ్డ అవకాశం మరొకరికి పోయిందని తెలియగానే అవతలివాళ్ల గురించి నీచంగా మాటాడి, ప్రచారంచేసి తన కక్ష తీర్చుకుంటుంది.
రీతూ మనస్తత్వం చూస్తే జాలేస్తుంటుంది మీనాక్షికి.  ఎప్పుడైనా ఏ సెలవురోజో వచ్చి కూచుని రీతూతో కబుర్లు చెపుతంటుంది.  రీతూ మీనాక్షీ వాళ్ళింట్లోకి రావడమే ఎక్కువగా జరుగుతంటుంది.  మీనాక్షి బ్యాంకునించి వచ్చి స్నానంచేసి తల్లికి వంటలో సాయం చేస్తుండగా రీతూ వచ్చి వాళ్ళ పనులు చూస్తూ కూచుని కబుర్లు చెప్తూండడం అలవాటు.  ఆ కబుర్లలో తనకు వంటంటే మహాచిరాకు అని తరచూ అంటూండేది.  వినీవినీ విసిగిపోయి ఒకరోజు ”మరి తినడమంటేనో?” అంది మీనాక్షి.  ఓ క్షణం బిత్తరపోయి గలగలా నవ్వేసింది రీతూ.  ”నువ్వు బలే మాటాడతావోయ్‌” అని మళ్ళీ నవ్వింది.  ‘ఈ పిల్ల మీద కోపం తెచ్చుకోడం కూడా కష్టమే’ అనుకుంది మీనాక్షి.
”మా మమ్మీవన్నీ చాలా మోడర్న్‌ ఆలోచనలు.  ఆవిడ ఆచరణలో కూడా ఓ తరం ముందుంది.  నువ్వేమో నీతరం కంటే ఓ తరం వెనకున్నావ్‌.  అందుకే మీ ఇద్దరికీ తరుచూ క్లాష్‌ వస్తోంది.”  సినిమా పత్రిక పేజీ తిరగేస్తూ అంది రీతూ.  ”సరే మేం ఇద్దరం ముందో వెనకో ఎక్కడో ఉన్నాం.  నీ సంగతేంటి?  నువ్వెక్కడున్నావో నీకేమయినా తెలుసా?” అంది ఇరిటేషనాపు కుంటూ మీనాక్షి.  అయోమయంగా మీనాక్షి వైపు చూసి భళ్ళున నవ్వేసింది.  ”అలా నవ్వేస్తే జవాబు దాటెయ్యచ్చను కుంటున్నావేమో కానీ ఎప్పటికైనా నీ సంగతి నువ్వాలోచించుకోవాలిసిందే కదా రీతూ!” అంది.  ”మమ్మీ నేనూ ఆలోచిస్తూనే ఉన్నాం.  నాకు మటుకు మోడలింగు చెయ్యాలని ఉంది.  మామ్‌ తన కాంటాక్ట్స్‌తో ఏదైనా చేస్తుందిలే” నిర్లక్ష్యంగా అంటూ టీవీ ఆన్‌ చేసింది.  టీవీలో ఓ యాడ్‌ వస్తోంది.  ఓ మగాడు ఒంటిమీద ఏదో సెంటు స్ప్రే చేసుకున్నాడు.  ఆ వాసనకి ఆకర్షితులై తొంభైతొమ్మిదిపాయింట్‌ తొమ్మిది శాతం శరీరాన్ని అనాచ్ఛాదితంగా వదిలేసిన ఆడవాళ్ళు మందలుమందలుగా అతనికోసం పరిగెత్తుకొస్తున్నారు.  ”అదమ్మాయ్‌ సంగతి.  ఆ తంబలో నువ్వూ ఒకతిగా నటిస్తావు మోడలింగు కెరీర్‌గా తీసుకున్నాక.” అంది మీనాక్షి రియాక్షన్‌ కోసం రీతూ మొహంలోకి చూస్తూ ”నవ్వకు పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రంలాగా ప్రశ్నలన్నిటికీ నవ్వే సమాధానం  చేసెయ్యకు”  అంది.  ”నిన్నందుకే వితండవాదం అంటుంది మా మమ్మీ.  మోడలయితే ఇలాంటివి మాత్రమే చేస్తారా? అయినా ప్రొఫెషన్‌లోకి ప్రవేశించాక ఏమైనా చెయ్యాల్సిందే.  అసలే చాలా కాంపిటీటివ్‌ ఫీల్డ్‌.” అంది రీతూ అప్పుడే తను మోడలింగులోకి అడుగెట్టేసినట్టు ఊహించు్కుంటూ.  ”అదీ పాయింటు.  ప్రొఫెషనులోకి ప్రవేశించాక కదా ఇలాంటి వేషాలు వెయ్యల్సిందీ? మరి నువ్విప్పుడే వేసేద్దామని తొందర పడతావెందుకూ?”  నిలదీసింది  మీనాక్షి.  ”వాడ్డూయూమీన్‌?” ”నా మీనింగేంటంటే నువ్విప్పుడు అలా ఎక్స్‌పోజింగు చేసే ప్రొఫెషనులో లేవు.  అయినా లోవెయిస్ట్‌ జీన్సూ, షార్ట్‌ టాప్సూ వేసుకుని నీ పొత్తికడుపూ, వీపూ ఎట్సెట్రా ప్రదర్శించి ఊళ్లో మగాళ్లని వినోద పరుస్తుంటావ్‌.  ప్రబంధకవులు వర్ణించి పోసిన అంగాంగాలూ ప్రదర్శిస్తుంటావ్‌.  స్లీవ్‌లెస్‌ వేసుకుని జబ్బలు, బాహు మూలాలూ, మినీ స్కర్ట్సు వేసుకుని అరటిబోదెల్లాంటి తొడలు ఇదంతా ఫ్రీగా ఎక్స్‌పోజ్‌ అండ్‌ ఎగ్జిబిట్‌ చేస్తున్నావ్‌.  ఆ ప్రొఫెషనులో ఉన్నవాళ్ళకి లాగా నీకెవరూ రెమ్యూనరేషనివ్వట్లేదు.  మరి నువ్వీ ప్రదర్శనలన్నీ ఎందుకు చేస్తున్నట్టూ?  ఎప్పుడైనా ఆలోచించుకున్నావా?  మీ అమ్మలాగా నాది మధ్యతరగతి మనస్తత్వం అని ఎగరకు.  ఎవరి తరగతేమిటో అందరికీ తెలుసు” అంది మీనాక్షి.  ”ఇది ఇప్పటి ట్రెండ్‌.  మనం ఒళ్లంతా కప్పేసుకుని ముడుచుకుపోవాల్సిన అవసరం లేదు.  బోల్డ్‌గా మగాళ్ళతో సమానంగా…”.
”ఆఁ! దొరికావ్‌. ఏమన్నావ్‌? మగాళ్ళతో సమానంగా అనికదూఒ.  ఏదీ స్లీవ్‌లెస్‌ చొక్కా వేసుకుని ఆఫీసుకెళ్ళే మగాడినొక్కడిని చూపించు.  నీలాగా తొడలు కనిపించే టైపు నిక్కరు వేసుకుని ఆఫీసు దాకా ఎందుకు మామూలు పనులమీద బయటికొచ్చే మగాడు మనళ్ళో నాకింతవరకూ కనిపించలా. ఏదో వాళ్ళు చేసే పనికి అవసరమైతే తప్ప…అంటే ఏ డ్రెయినేజి క్లీనింగు చెయ్యడం లాంటి పనులు చేసేటప్పుడో తప్ప ప్యాంటు పైకి కట్టే మగాళ్ళు నాకు రోడ్ల మీద కనపడలా.  మరి నువ్వూ నీలాంటి అమ్మాయిలు కొందరు మాత్రం చాలా ఈజీగా శరీరాన్ని గాలికి వదిలెయ్యడం చూసి బాధపడుతున్నాను.”  కొంచెం ఆవేశంగా అంది మీనాక్షి.  ”అలా కాదులే మీనా…”  ”నువ్వా మీనా అనడం మానెయ్‌.  నా పేరు మీనాక్షి నీకు క్షి పలకదా?” అంది తిక్కరేగినదానిలా మీనాక్షి.  ”అబ్బ! అంత కోపం ఎందుకూ?  నువ్వడిగినదాని గురించే ఆలోచిస్తున్నా.  ఏమో మరి.  ఇది ఇప్పటి ఫ్యాషను.  నా ఫ్రెండ్స్‌ చాలామంది ఇలాగే వేసుకుంటారు.  ఇదేదో ఘోరమైన ఎక్స్‌పోజింగని ఎవరూ అనరు.”  ”పోనీ ఎవరూ అనకపోయినా మనకి మనమే ఆలోచించుకోవచ్చుగా.  ట్రెండని ఇలాంటి డ్రెస్సులు వేసుకుని ఆడపిల్లలు ఎంత రిస్క్‌ తీసుకుంటున్నారో!  ఎవరో ఇదే ట్రెండు, ఇదే ఫ్యాషన్‌ అని మార్కెట్లోకి వదుల్తారివి.  ఈ పొల్యూషన్‌ రోజుల్లో చర్మాన్ని ఈ కలుషిత వాతావరణానికి ఎక్స్పోజ్‌ చేసి అమ్మాయిలు లేనిపోని రోగాలు కొనితెచ్చుకునే అవకాశం చాలా ఎక్కువ.  నా పాయింటదీ.  అందంగా ఉన్నాయికదా అని శరీరభాగాలని దుస్తుల్లేకుండా వదిలేస్తే ఆరోగ్యానికి ముప్పు రావచ్చు ఆలోచించు.  ఆరోగ్యంగా ఉన్నవాళ్ళల్లో ఆకర్షణుంటుంది కానీ రోగిష్ఠి చర్మాన్ని ఎంత ప్రదర్శించినా వైద్యుల్ని తప్ప ఎవరినీ ఆకర్షించదు.  ఆరోగ్యానికి ప్రమాదం తెచ్చే ఏ ఫ్యాషనునైనా మనం తిరస్కరించాలి.  ఒప్పుకుంటావా?” అడిగింది.  రీతూ ఆలోచనలో పడ్డట్టూ మౌనం వహించింది.  ”నేనీ పాయింటే మీ అమ్మగారికి చెప్దామనుకున్నా.  ఆవిడ అపార్ధంచేసుకుని నామీద ధ్వజం ఎత్తేసారు.  అయినా రీతూ అమ్మ చెప్పిందికదా అని ఆచరించెయ్యక్కర్లేదు.  మన సొంత బుర్ర కూడా అప్పుడప్పుడు ఉపయెగిస్తుండాలి.  ఏవంటావ్‌?” అంటూ లేచి తమ ఇంట్లోకెళ్ళిపోయింది మీనాక్షి.  ”ఏంటి ఇవాళేదో నీకూ షీలాకీ పెద్ద ఘర్షణ అయినట్టుగా ఉందే?  గొంతులు పై స్థాయిలో వినబడ్డాయ్‌” అంది పార్వతి లోపలికొస్తున్న కూతురుని చూసి.  ”మా ఇద్దరి మధ్యా అతిశాంతియుతంగా జరిగిన చర్చలను ఘర్షణ అని వర్ణించడాన్ని నేను ఖండిస్తున్నాను.”  ”అదేనమ్మా ఆ అతిశాంతే మా చెవులు బద్దలు కొట్టింది” అంది పార్వతి నవ్వేస్తూ.  ”అప్పుడప్పుడు కనపడ్డ వాళ్లందరినీ సురేంద్రనాథ్‌ బెనర్జీలంతటి వాళ్ళని చేసెయ్యాలనిపించి అలా చర్చల్లోకి దింపుతూంటా.” అంది మీనాక్షి.  పార్వతి పకపకా నవ్వేసింది.
హాల్లో దివానుమీద వాలిపోయి పక్కన పడిఉన్న వారపత్రిక తీసింది మీనాక్షి.  తెరవగానే మధ్యపేజీలో నటించడం మానేసిన నడివయసు నటీమణి బొమ్మ దర్శనమిచ్చింది.  పేజీ నిండా ఆవిడ ప్రస్తుతపు జీవితవిశేషాలే.  ఆవిడ కొన్నాళ్ళక్రితం చట్టబద్ధంగా వివాహవడిన భర్తతో ఏదో విదేశంలో కాపురం పెట్టి కొన్నాళ్ళు గడిపాక ఆ కాపురం పడక తిరిగి వచ్చేసి, లేటువయసులో హిట్స్‌ ఇస్తున్న మరో నాయకుడితో కలిసి జీవిస్తోందిట.  తనతో సమానమైన వయసున్న అతని పిల్లలను కూడా ఆకట్టుకుని ఇంట్లో అందరికీ తల్లోనాలుకగా వ్యవహరించి మంచిపేరు తెచ్చుకుందిట… దిబ్బట దిరిగుండంట.  ”ఇదెక్కడిగోల?” విసుక్కుంది మీనాక్షి.  ”నీకన్నీ విసుగే! ఏవిటది?” మీనాక్షి వదిన వాణి ఆమె చేతిలో పుస్తకం అందుకుని చూసింది.  ”వావ్‌! ఈవిడ తెలుసా మా మేనవమగారి బావమరిదికి భార్యవైపు చుట్టం.  కిందటిమాటు ఢిల్లీలో మావయ్య వాళ్ళింటికి మేం వెళ్ళినప్పుడు ఆ బావమరిది కుటుంబంతో పాటు ఈవిడకూడా వచ్చి అక్కడుంది.  ఆవిడతో ఇంకాసేపు మాటాడదామనుకుంటే మీ అన్నయ్యకంతా తొందరేనాయె.  పదపదమని తొందరపెట్టేస్తే ఇంటికెళ్ళిపోవాల్సొచ్చింది.” అంది గబగబా కళ్ళతో అక్కడ రాసిన సమాచారమంతా జుర్రేస్తూ.  ”ఇంతకీ నీకంత విసుగెందు కొచ్చిందీ?  ఈవిడ సినిొమాలో వేసినన్నాళ్ళూ బలే బాగా ఏక్ట్‌ చేసేదిలే!”  ”అదే నా బాధానూ.  ఆవిడ ఏక్టింగు గురించో ఇంకేదైనా టాలెంటుంటే దాని గురించో వ్రాయక, ఆవిడ భర్త నొదిలేసి వచ్చి ఎవరింట్లోనో తల్లోనాలుకగా ఉంటోందనీ రాసి ఇన్ని పేజీలు వేస్టు చెయ్యడం ఎందుకూ అని.  పాఠకులకి తల్లోనాలుకలు కాక మెదళ్ళుంటాయని ఇదిరాసి వేసిన వాళ్ళకి తెలియదులా ఉంది.  అదేవన్నా పెద్ద ఎఛీవ్‌మెంటా?”  ”అది కాదు మీనాక్షి! వాళ్ళు బాగా డబ్బు, పాపులారిటీ సంపాదించడం వల్ల బోల్డ్‌గా ఉంటారు.  మామూలు ఆడవాళ్ళకన్నా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు.  అందుకనే అలా రాసారు”.  తన అవగాహన తను చెప్పింది వాణి.  ”ఇష్టంలేని కాపురాన్ని చట్టబద్ధంగా విడాకులతో రద్దుచేసుకుని జీవితం సరిదిద్దుకున్న ఆడవాళ్ళు – నీ భాషలో మామూలు ఆడవాళ్ళు – బోలెడు మంది తెలుసు నాకు.  ఇదీవిడ కొత్తగా సాధించిన విజయం కాదులే” అంది మీనాక్షి.  ”అయినా అవన్నీ వాళ్ళ పెర్సనల్‌ మేటర్స్‌.  మనం నటులను వాళ్ళ నటనపరంగానే చూడాలి.” అంది వాణి ఉదారంగా. ”కదా మరీ?  ఆవిడ తన నటనతో ప్రేక్షకులను అలరించి ఆనందపరిచిందనో, కుదిపేసి ఏడిపించేసిందనో రాసుంటే నేన ఆహాఓహో అనుండేదాన్ని.  ఆవిడ పెర్సనల్‌ విషయాలతో ఇన్ని పేజీలు వేస్టు చేస్తే చిర్రెత్తు కొచ్చింది.”  ”ఏమోనమ్మా నీకు ఎప్పుడు విసుగొస్తుందో ఎప్పుడు ఆనందం వస్తుందో నీకే తెలియలి” అంది వాణి.  అలా అని తను మీనాక్షితో ఏకీభవించట్లేదని డిక్లేర్‌ చేసింది.  ”అయినా ఆవిడిష్టం ఆవిడది.  ఆవిడ జీవితం ఆవిడ ఇష్టప్రకారం నడుపుకోవడంలో తప్పు నాకేం కనిపించట్లేదు” అని కూడా అంది మీనాక్షిని విసిగించిన అసలు విషయం అర్థం చేసుకోకుండా.  మీనాక్షి విమర్శిస్తున్నది ఆ సినీనటి వ్యక్తిగత ఇష్టాయిష్టాలను కాదని, ఆ పత్రిక వారి విధానాలని మాత్రమే అని తెలుసుకునే ఓర్పు లేకపోయింది వాణికి.  మీనాక్షికి ఇంక వాదించే ఓపికలేక మౌనమే శరణ్యం అయింది.
మీనాక్షి అన్న ఉద్యోగరీత్యా ఢిల్లీలో ఉంటారు.  కూతురు గీత స్కూలు సెలవలని వాణి ప్రస్తుతం వచ్చి ఉంది.  ఆవిడ పుట్టిల్లు కూడా ఇదే ఊరు.  సెలవల్లో వచ్చినప్పుడల్లా దగ్గరలో ఉన్న డ్యాన్స్‌ స్కూల్లో గీతని చేర్పించి నేర్పిస్తూ ఉంటుంది వాణి.  గీత ఈ ఊళ్ళో కూడా ఫ్రెండ్స్‌ని సంపాదించుకుని కాలక్షేపం చెయ్యవచ్చన్న ఉద్దేశంతో డాన్స్‌ స్కూలుకి వెడుతుందే తప్ప డాన్స్‌ మీద పెద్దగా ఆసక్తి చూపించదు.  ఓరోజు బ్యాంకునించి వచ్చిన మీనాక్షితో ”డాన్స్‌మాస్టారు ప్రోగ్రామిప్పిస్తారుట మాచేత.  పేరెంట్సుని రమ్మన్నారు.  డ్రెస్సుల సంగతి మాటాడి డబ్బులు ఇచ్చివొస్తుంది మమ్మీ” అని చెప్పింది గీత.  ”ఓహో అప్పుడే స్టేజెక్కేస్తావన్న మాట.  గుడ్‌” అంది పేపరుతీసి చదువుతూ.  గీత టీవీ వైపు తిరిగిపోయి కుర్చీలో కూచునే టీవీలో వాళ్ళలాగే కాళ్ళు కొడుతూ బైఠాయింపు డాన్స్‌ చెయ్యడంలో మునిగిపోయింది.  రాత్రి తొమ్మిదవుతుండగా ఇల్లు చేరింది వాణి.  ”అబ్బో ఈవిడగారి డాన్సు ప్రోగ్రామ్‌ కాదుగానీ వేలకివేలు పొయ్యాలిసొస్తోంది” అంది కూతురివైపు గర్వంగా చూసుకుంటూ.  ”నేనసలు ప్రోగ్రామ్‌ చెయ్యనన్నాను కదా.  మేష్టారు సరేనని వేరే అమ్మాయిని తీసుకున్నారు.  మధ్యలో నువ్వొచ్చి మా గీతనీ తీసుకోవాలని ఆయన్నొకటే బతిమాలేసావు.  ఆయన డబ్బులు వొదిలిస్తాడని నాకు ముందే తెలుసు.  అందుకే నేను ప్రోగ్రామ్‌లో చెయ్యనన్నా.  నువ్వొచ్చి పెద్ద గొప్పగా వాదించి గోతిలో పడ్డావ్‌.”  గీత వాళ్ళమ్మని హేళనగా చూస్తూ నవ్వింది.  వాణి సర్రున లేచింది.  ”ఏమిటే నేనింత ఖర్చుపెట్టి కష్టపడుతుంటే నీకు వేళాకోళంగా ఉందా?  అవునూ, ఏవేఁ కూచిపూడి డాన్స్‌ క్లాసుకి వెడుతూ బొట్టు పెట్టుకోకుండా పోతావా?  నీ ఫ్రెండు వందనా వాళ్ళమ్మ నువ్వెళ్ళాక నాదగ్గరకొచ్చి ఆ పిల్ల మీ గీతా?  మొహాన బొట్టులేకపోయేసరికి ఎవరి పిల్లో అనుకున్నా.  ఇలాంటి చోటికొచ్చేటప్పుడు పిల్లకి బొట్టెట్టాలమ్మా అంటుంటే తల కొట్టేసినట్టయింది.  నీకేం రోగమొచ్చిందే బొట్టెందుకు పెట్టుకోలేదు?” అరిచింది వాణి గీత నెత్తిన ఒక్కటేసి.  ”కొడతావేం?” అంటూ ఒంటికాలి మీద లేచింది పన్నెండేళ్ల గీత.  ”ఆ ఆంటీకెంతసేపూ ఇంకోళ్ల మీద కంప్లెయింట్లివ్వడమే హాబీ.  అసలు నేను బొట్టెట్టుకోపోతే ఆవిడకొచ్చిన నష్టవేంటిటా?  ఆవిడ కిష్టమైంది ఆవిడ పెట్టుకుంది.  నాకివాళ ఇష్టం కాలేదు నేను పెట్టుకోలేదు.  దానికింత రాద్ధాంతం ఏంటసలు?” నేనేం తక్కువ తినలా అన్నట్లు తల్లిమీద కేకలేసింది గీత.  రెండురోజుల క్రితం వాణి సినీనటి విషయంలో చెప్పిన మాటలు గీత నోట్లోంచి రావడం కాస్త ఆశ్చర్యమనిపించింది మీనాక్షికి.  కానీ వాణి తను సినీనటి విషయంలో చెప్పిన గొప్ప సిద్ధాంతం తన కూతురి దాకా వచ్చేసరికి తనకే ఆమోదయెగ్యం కాలేదు.
”ఇంకెప్పుడూ నా జోలికి రావద్దని ఆ ఆంటీకి ఓ వార్ణింగిస్తా” అన్న కేకతో తనవంతు అరుపులూ చిందులూ ముగించి దివాను మీద దబ్బున  పడి ఓ కాలు కుర్చీమీద, మరో కాలు టీపాయిమీదా వేసి కూచుని కుషను మీదకి వాలింది గీత.  ”ఆ కాళ్ళూ రెండూ దగ్గరపెట్టు ముందు.  టైటుగా ఆకేప్రిస్‌‌ ఒకటీ నీ మొహానికి.” లాగి గీత చెంపఛెళ్ళుమనిపించింది వాణి.  బ్యారుమని ఏడుస్తూ,  కాళ్ళు బాదుకుంటూ బెడ్రూమ్‌ లోకి పరిగెత్తింది గీత.  ”చూసారా అత్తయ్యగారూ దీని పొగరూ” అంటూ అత్తయ్యగారివైపు చూడకుండా కూతురి వెనకే పరిగెత్తింది వాణి.
 మీనాక్షి, పార్వతి స్టన్నయి పోయారు.  ఇంత చిన్న విషయానికి తల్లీకూతుళ్ళ మధ్య ఇంత గొడవ జరుగుతుందన్నది వాళ్ళు కల్లో కూడా ఊహించని విషయం.  అప్పుడే ఇంటి కొచ్చిన రామారావు ”ఏంటీ గొడవ?” గుసగుసగా మీనాక్షిని అడిగాడు.  ”ఏంలేదు నాన్నా.  తల్లీకూతుళ్ళు ఏవో ఫ్యామిలీమాటర్స్‌ చర్చించుకుంటున్నారు.  శాంతియుత చర్చలు మాత్రమే” అంది మీనాక్షి.  ”అయితే ఇవాళ్టికి భోజనాల్లేవా?” అన్నాడాయన దీనంగా.  ముగ్గురూ నవ్వుకున్నారు.  కానీ ఆనాటి గొడవ ముగ్గురి మనసుల్లోనూ చేదునే మిగిల్చింది.
ఆ రాత్రి మీనాక్షి చాలా బాధపడింది.  అన్నయ్య క్రమశిక్షణ గానీ, తమ కుటుంబపు సంస్కారంగానీ వాణి, గీతలకు అలవడలేదని స్పష్టమైపోయింది ఆమెకు.  అంతకు ముందు షీలా మాటలు,  వాణి వెలిబుచ్చిన అభిప్రాయాలు గుర్తుకొచ్చాయి.  ఫెమినిజమ్‌ పేరుతో సూడో ఫెమినిస్టులు తయారవుతున్నారా?  కొందరు స్త్రీలకు లభిస్తున్న స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్య్రాలు సంస్కారాన్ని హరించివేస్తున్నాయా?  కుటుంబాల్లో బాంధవ్యాలను, గౌరవం ఇచ్చిపుచ్చుకునే వివేకాన్నీ నశింపచేస్తున్నాయా? అన్న ప్రశ్నలామెను వేధించాయి.
శలవలైపోయాక వాణి, గీత ఢిల్లీ వెళ్ళిపోయారు.  ఇప్పుడు షీలా వాటాలోంచి రోజూ ఏవో గొడవలు వినపడడం మొదలయింది.  రీతూ తండ్రికి కూతురు పెళ్ళీలేక పైచదువులూ లేక కనీసం చిన్నపాటి ఉద్యోగమైనా లేక వృధాగా కాలక్షేపం చెయ్యడం నచ్చలేదు.  కనీసం తను తీసుకొచ్చిన సంబంధమేదైనా చూసి నచ్చితే పెళ్ళిచేసుకోమని కూతురిని బతిమాలేవాడు.  తల్లి సపోర్ట్‌ చూసుకుని తండ్రి మాటవినేదికాదు రీతూ.  బతిమలాటలు దెబ్బలాటల్లోకి దిగాయి.  వాళ్ళ గొడవ వద్దనుకున్నా మీనాక్షి వాళ్ళ చెవిని పడుతనే ఉండేది.  ఈ గొడవలు భరించలేక వాళ్ళని ఖాళీ చేసెయ్యమని అడగాలన్న నిర్ణయనికొచ్చారు రామారావు, పార్వతి.  ఇంతలో అనుకోని అద్భుతం ఒకటి జరిగింది.  మీనాక్షి బలవంతం మీద ఎప్పుడో రీతూ రాసిన బ్యాంకు పరీక్షల్లో నెగ్గి, ఆమె ప్రోద్బలం మీదే ఎటెండయిన ఇంటర్వ్యూ ఫలించింది.  మీనాక్షి చేస్తున్న బ్రాంచిలోనే క్లర్క్‌గా ఎపాయింట్‌మెంటొచ్చింది.  రీతూ తండ్రి ఆనందించాడు.  కూతుర్ని అభినందించాడు.  షీలా, రీతూ మాత్రం అంతగా సంతోషించలేదు.  తమ లెవెల్‌కి తగ్గ ఉద్యోగం ఇదికాదని షీలా నమ్మకమైతే తను కలలుగన్న కెరీర్‌ ఇది కాదన్న బాధ రీతూది.  వచ్చిన అవకాశం వొదులుకోవద్దని మీనాక్షి పదేపదే చెప్పగా ఏదో మీనాక్షిని ఉద్ధరిస్తున్నట్టు ఉద్యోగంలో చేరింది రీతూ.  మంచి పబ్లిక్‌ రిలేషన్సున్న ఆ బ్రాంచ్‌లో పని బాగా నచ్చింది రీతూకి.  ఒక నెల తిరిగేసరికల్లా పనిని క్షుణ్ణంగా నేర్చుకుని ఎంజాయ్‌ చెయ్యడం మొదలెట్టింది. సహజంగా పదిమంది మధ్య ఉండడానికి ఇష్టపడే రీతూ.  అయితే రీతూ వల్ల అనుకోని సమస్యలెదురయ్యాయి ఆ బ్యాంకులోనే ఆఫీసరుగా ఉన్న సుందరానికి.  సుందరం సీటు రీతూ కుర్చీ వెనకే వుంటుంది.  ఇద్దరి సీట్లకీ బాగా దూరం ఉన్నా, రీతూ వెనకభాగం సుందరం తలెత్తినప్పుడల్లా కనిపిస్తూనే ఉంటుంది.  దానివల్ల సుందరం ఏమీ ఇబ్బందిపడలేదు.  సుందరానికి ఇంట్లో చదువుకుని ఉద్యోగం చేస్తున్న అక్క ఉంది.  ఉన్నత విద్యలభ్యసించి పదవులేలుతున్న ఆడవాళ్ళు చాలామందే ఉన్నారతని బంధువర్గంలో.  అందువల్ల అతనికి ఇంటాబయటా నెగ్గుకొచ్చే ఆడవాళ్ళంటే గౌరవమే కానీ చులకన లేదు.  వచ్చిన చిక్కల్లా తన దుస్తుల పద్ధతి మార్చుకోని రీతూవల్లా, అందరి సీట్ల మధ్యా తిరుగుతండే మెసెంజరు బోయ్‌ మల్లేశం వల్ల.
రీతూ ఎందుకైనా వంగినప్పుడల్లా ఆమె నడుం వెనకభాగంలో జీన్స్‌ ప్యాంటు చిన్న సంచీ మూతిలా తెరుచుకుంటుంది.  కస్టమర్‌కి ఏ టోకెన్‌ ఇవ్వడానికో కౌంటర్‌ పైకి చెయ్యి జాపినపుడు స్లీవులెస్‌ టాప్‌ హొయలుపోతుంది.  ఇవేవీ సుందరానికి ఇబ్బంది కలిగించలేదు.  కానీ మెసెంజరు బోయ్‌ మల్లేశానికి మాత్రం ప్రదర్శితమవుతున్న చర్మసౌందర్యాల చమక్కులతో కళ్ళువెళ్ళుకొచ్చి మతిపోతోంది.  ఒక్కోసారి ఒక్కో అందం తళుక్కు మన్నప్పుడల్లా కళ్ళు పెద్దవిచేసి ఎటెండరు కుర్రాడు ఏకాంబరానికి కన్నుకొట్టడం,  ఇద్దరూ కలిసి సైగలు చేసుకుని గుంభనంగా నవ్వుకోటం జరుగుతోంది.  ఈ కుర్రాళ్ళిద్దరి వెకిలితనం సుందరాన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టింది.
ఓ రోజు నెమ్మదిగా తన సీనియరు రామంగారికి విషయం వివరించాడు.  ఇద్దరూ కలిసి మేనేజరుగారికి చెప్పారు.  బ్యాంకు రద్దీ తగ్గాక మేనేజర్‌ రీతూని పిలిచి మన కల్చరు దృష్ట్యా చీరలుగానీ, చుడీదార్లు గానీ, కనీసం జీన్స్‌ మీద పొడుగు షర్ట్‌నైనా వేసుకుని బేంకుకొస్తే బాగుంటుందని చాలా మర్యాదగా సూచించాడు.  రీతూ ఢుమఢమలాడుతూ ఆయన రూములోంచి ఇవతలకి రావడం మీనాక్షి గమనించింది.  రీతూని పంపేసాక మల్లేశాన్ని, ఏకాంబరాన్నీ పిలిచి వార్నింగిచ్చాడాయన.  ఆ సాయంత్రం రీతూ మీనాక్షి దగ్గరకొచ్చి చిందులు తొక్కింది.  ”మీ బేంకుకేమైనా డ్రెస్‌ కోడ్‌ ఉందా?  నాకిచ్చిన ఎపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌లో అలాంటి రూల్సేం లేవే?  ఇదంతా ఆ ముసలి మేనేజరుకి పుట్టిన బుద్ధేలా ఉంది” అంటూ ఏదేదో అంది.  ఆ పిల్ల కొద్దిగా శాంతపడ్డాక ”ఏదోలే.  ఆ ఎటెండరూ, వాళ్ళు వెకిలి కామెంట్స్‌ చేస్తున్నారన్న బాధ కొద్దీ నీకో సలహా ఇచ్చాడాయన.  పాటిస్తే పాటించు లేకపోతే లేదు.  అయినా ఇంకా ప్రొబేషన్‌లోనే ఉన్నావు కాబట్టి సలహా పాటించడమే మంచిది.  నీ ఇష్టం మరి” అని ఆ మాటలు అక్కడతో తుంచేసింది మీనాక్షి.  రీతూ ఆలోచనలో పడింది.  ఏమాలోచించుకుందో చుడీదార్లలోకి మారింది.  అయితే స్లీవ్‌లెస్‌ స్టైలు మాత్రం మానలేదు.  ఇలా ఓ మోస్తరుగా కాలం గడుస్తుండగా రీతూ తండ్రి ఓ పెళ్ళి సంబంధం తీసుకొచ్చాడు.  కుర్రవాడు ఐటి రంగంలో పెద్ద పొజిషనులో ఉన్నాడు.  మంచి కుటుంబం.  అన్నిటికన్నా ముఖ్యం అతని జీతం రీతూ జీతానికి దాదాపు పదిరెట్లు.  షీలా మూర్ఛబోయింది అతని జీతం అంకె చూసి.  రీతూ ఎగిరి గంతేసి మీనాక్షి ముందు వాలి డాడీ ఎంత మంచి డాడీయో చెప్పింది.  మీనాక్షి సంతోషించింది.  ఓ ఆదివారంనాడు పిల్లాడు పిల్లని చూడ్డానికొచ్చాడు.  వెళ్ళాడు.  రెండేరోజులు రీతూ గాల్లో నడిచింది.  మేనేజరుగారిని వినయంగా విష్‌ చేసింది.  మూడోనాడు రాత్రి మొహం మూడంకెలా పెట్టుకుని మీనాక్షి దగ్గరకొచ్చింది రీతూ.  ఏడుపొకటే తక్కువగా ఉన్న ఆమె మొహం చూసి సంగతి గ్రహించేసింది మీనాక్షి. ”నాకేదో చర్మవ్యాధి ఉందని నన్ను పెళ్ళాడ్డానికి ఒప్పుకోలేదుట ఆ గుడ్డి వెధవ.  పైగా ముందు ట్రీట్‌మెంటిప్పించాకే మరే సంబంధమైనా చూడండని డాడీకి సలహా కూడా ఇచ్చాడట రాస్కెల్‌” ఏడుపు ఆపుకుంటూ చెప్పింది రీతూ.
పెళ్ళిచపులనాటి రీతూ అలంకరణ మీనాక్షికి కళ్ళకి కట్టినట్టైంది. మామూలుగా జీన్సు, తళతళమెరిసే చమ్కీలున్న పింక్‌ షార్ట్‌ టాప్‌.  అంతవరకూ బానే ఉంది.  ఎడంజబ్బమీద గులాబిరంగు టాటూ.  బొడ్డుకి పక్కగా లేతపచ్చరంగులో చిన్నచిన్న పూసలు రెండు వేలాడుతున్న బొడ్డాభరణం.  బొట్టులేని నుదుటిని కనుబొమలదాక కప్పేసిన నలుపు. రాగిరంగుతో చారలచారల జుట్టు.  అతనికేం అనుమానం కలిగిందో పాపం!  కాసేపు ఏవో ఓదార్పుమాటలు చెప్పి పంపించింది మీనాక్షి.  కానీ రీతూ తండ్రి మాత్రం ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోలేక పోయాడు.  కూతురిచేత పిచ్చివేషాలు మానిపించకపోతే తాటవలిచేస్తా నన్న లెవెల్లో భార్యతో గొడవపడ్డాడు.  తల్లీకూతురూ అతన్ని ఎదిరించి యుద్ధం చేసారు.  ఆ రాత్రి ఒంటిగంటదాకా జరిగిన వీళ్ళ యుద్ధం ధాటికి ఇరుగూపొరుగూ నిద్రకి దూరమయ్యారు.  రెండ్రోజులకొకసారి ఇలాంటి కురుక్షేత్రాలు ఆ పోర్షనులో క్రమం తప్పకుండా జరుగుతూ వచ్చాయి.  ఓ పదిరోజులు సహించి ఇంక పార్వతి, రామారావు షీలా వాళ్ళని ఇల్లు ఖాళీ చేసెయ్యమని నోటీసిచ్చారు.  ”ఇంతోటి బోడి ఇల్లూ మాకు దొరకదనుకోకండి” అని షీలా విరుచుకుపడింది.  ”ఈ వెధవ బ్యాంకు జీతానికి డెబ్భైరెట్ల జీతంతో నాకో పెద్ద కంపెనీలో జాబ్‌ దొరికింది” అని చెప్పి బోడి బేంకు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి పోయింది రీతూ.  ఫస్టుకల్లా ఇల్లు ఖాళీచేసి వెళ్ళిపోయారా కుటుంబం.  ఎక్కడకెడు తున్నదీ ఎవరూ అడగలేదు.  వాళ్ళు చెప్పలేదు.  తరవాత ఏడాదికి మీనాక్షి తనకి నచ్చిన వరుడ్ని పెళ్ళి చేసుకుంది.  చిన్న కొత్త ఇంట్లో భర్తతో కాపురం పెట్టింది. బేంకువాళ్ళు వేరే బ్రాంచికి ట్రాన్స్ఫర్‌ చేసారు.  ఓ రోజు స్కూటీ రిపేరుకిచ్చి బస్‌స్టాండులో నిలబడింది మీనాక్షి.  ”మీనా…మీనాక్షీ!” అని తన పేరెవరో పిలవడం విని వెనక్కి తిరిగి చూసింది.  ”మీనాక్షీ! నేనూ.  గుర్తుపట్టలేదుకదూ!” అంటూ ఓ మహిళ దగ్గరగా వచ్చింది.  పొడుగు చేతుల చుడీదార్‌, చున్నీని తలమీదుగా మొహం సరిగా కనపడకుండా వేసుకుని నిలబడున్న ఆవిడని గుర్తుపట్టలేకపోయింది ”నేనూ రీతూని.”  ”వాట్‌?! రీతూ నిజంగా నువ్వేనా?!” ఆశ్చర్యం పట్టలేకపోయింది మీనాక్షి.  చటుక్కున మీనాక్షిని పట్టుకుని భోరున ఏడ్చేసింది రీతూ.  వస్తున్న ఆటోని ఆపి రీతూని తన ఇంటికి తీసుకెళ్ళింది మీనాక్షి.
ఇంట్లో కూచుని స్థిమితపడ్డాక చెప్పింది రీతూ.  ”నువ్వు ఫ్యాషన్ల కోసం ఎగబడి ఆరోగ్యం పాడుచేసుకోకూడదు.  ఏదైనా కొంత లిమిట్‌లో ఉండాలని చెప్తూండేదానివి.  నీవన్నీ పాతకాలం భావాలు అని కొట్టిపడేసేవాళ్ళం నేనూ మా అమ్మ.  అప్పుడు నీమాట వినకపోగా నిన్ను హేళనగా చూసినందుకు ఫలితం అనుభవిస్తున్నా” అంటూ మణికట్టుదాకా ఉన్న స్లీవ్‌ పైకి లాగింది.  తెల్లటి ఆమె చేతులమీద ఎర్రెర్రగా ఏవో చిన్నచిన్న మచ్చలు కనిపించాయి.  ”కొన్నాళ్ళ కిందట ఒకటి రెండు మచ్చలు నడుంమీద, పొట్టమీద కనిపించాయి.  అప్పుడు మా అమ్మ తన ఫ్రెండెవరో కొత్తరకం స్కిన్‌ ట్రీట్మెంటు బ్రహ్మాండంగా చేసేసి, మచ్చలు మాయం చేసి చర్మ సౌందర్యం పెంపొందించేస్తోందని నన్నావిడ దగ్గరకి తీసుకెళ్ళి చూపించింది.  ఆవిడ వైద్యంతో మచ్చలు రంగుమారి, పెద్దవైపోవడంతో ఆ వైద్యం మానేసాను.  గత వారం రోజులుగా కొన్ని మచ్చలు మొహంమీద కూడా మొదలయ్యాయి”.  మొహం చేతుల్లో దాచుకుని మళ్ళీ ఏడ్చింది రీతూ.  ఆమె పక్కనే కూచుని వీపు రాస్తూ కాసేపు ఏడవనిచ్చింది మీనాక్షి.  ఏడుపు ఉధృతం తగ్గాక ”నువ్వు కాస్త చన్నీళ్ళతో మొహం కడుక్కో రీతూ నేనీలోపు కాఫీ కలుపుకొస్తా” అని బాత్రూములోకి పంపి తను వంటింట్లోకి నడిచింది.  ”అసలు నేను ఆ బ్యాంక్‌ జాబ్‌ వదిలెయ్యడానికి కారణం జీతంలో తేడా కంటే ఆ కంపెనీలో నాకు నచ్చిన తరహా ఫాస్ట్‌లైఫ్‌ గడిపే నా ఫ్రెండ్స్‌ పనిచేస్తూండడమే.  పార్టీలు, పబ్బూ, బోయ్‌ఫ్రెండ్సూ అంటూ వాళ్ళేదో ఎంజాయ్‌ చేసి బాపుకుంటున్నారన్న భ్రమతో అందులో అవకాశం రాగానే చేరిపోయాను.  జీతం బాగానే ఇచ్చినా, ఆ కంపెనీ వాళ్ళు గొడ్డుచాకిరీ చేయించుకునేవారు.  సంపాదించిందంతా ఫ్రెండ్స్‌తో పార్టీలకి షోకులకీ ఖర్చుచేసుకుంటూ బతకడమే గొప్పను కున్నాను.  ఆ ఫ్రెండ్స్‌ పిచ్చిలో పడ్డందుకు నాకు బాగా శాస్తి జరిగిందిలే.  ఈ మచ్చలు మొదలయ్యాక అందరూ తప్పించుకు తిరుగుతున్నారు.  అసలు నాకు వాళ్ళు ఒరగబెట్టిందేమీ లేదులే.  వాళ్ళల్లో వాళ్ళూ అంతే.  కెరీర్‌గ్రాఫ్‌లో ముందుకు దూసుకుపోడానికి అవతలివాళ్ళకి ఎంతటి ద్రోహం చెయ్యడానికైనా వెనకాడరు.  మళ్ళీ అవసరమైతే కావలించేసుకోడాలు!  ఈ మచ్చలు నాకోరకంగా మేలు చేసాయిలే.  దండగమారి స్నేహాలన్నీ వదలగొట్టాయి” కడుపులో బాధనంతా చెప్పుకొచ్చింది రీతూ.  ”నీలాగా నా మంచిని కోరే అసలయిన స్నేహితులు నాకొక్కళ్ళు తగల్లా ఇప్పటి వరకూ” నిట్టూర్చి తలొంచుకుంది.  ”పోన్లే రీతూ జరిగినవి మర్చిపో.  ఏం జరగాలో ఆలోచిద్దాం.  మా మేనమామగారొకాయన డాక్టర్‌ సూర్యారావ్‌ అనీ స్కిన్‌ స్పెషలిస్ట్‌ ఉన్నారు.  చూపించుకుంటావా?  మంచి డాక్టరే” అడిగింది మీనాక్షి. చూపించుకుంటానన్నట్టు తలూపింది.
మర్నాడు సూర్యారావు దగ్గరకి రీతూని తీసుకెళ్ళింది మీనాక్షి.  ఆయన రీతూని పరీక్షించాడు.  కొన్ని టెస్టులు రాసి చేయించుకు రమ్మన్నాడు.  వారం తరవాత టెస్టు రిపోర్టులన్నీ పుచ్చుకు మళ్ళీ వెళ్ళారు.  ”నీదేం ప్రమాదకరమైన జబ్బు కాదమ్మా ట్రీట్మెంట్‌తో తగ్గుతుంది.  అయితే ఇప్పటికే డిసీజ్‌ కొంత ఎడ్వాన్స్‌ అయింది కాబట్టి టైం పట్టచ్చు” అని మందులు రాసిచ్చి ఎలా వాడాలో వివరించాడు.  ”అసలు నాకు ఇదెందుకొచ్చింది డాక్టరుగారూ?” చిన్నగొంతుతో అడిగింది రీతూ.  ”ఎండకీ పొల్యూషన్‌కి సెన్సిటివ్‌ స్కిన్‌ ఎక్కువగా ఎక్స్పోజ్‌ అవడం, స్ట్రెన్సూ ఇలాంటివే చిన్నచిన్న కారణాలుంటాయి.”  ”మరి నా కొలీగ్సు చాలామంది అమ్మాయిలు నాలాగే డ్రెస్‌ చేసుకుంటారు, నాలాగే వర్క్‌ప్రెషర్స్‌ ఫేస్‌ చేస్తుంటారు.  మరి వాళ్ళెవరికీ రాని డిసీజ్‌ నాకెందుకొచ్చింది?” దాదాపు కళ్ళనీళ్ళ పర్యంతమవుతూ అడిగింది రీతూ.  ”అందరికీ ఒకే రియక్షన్‌ రావాలని లేదు.  వాళ్ళకింకేమైనా ప్రాబ్లెమ్స్‌ వచ్చుండచ్చు.  అసలు వాళ్ళకీ ప్రాబ్లెమ్‌ రాలేదని నువ్వెలా చెప్పగలవు? నీతో చెప్పుకోలేదు కాబట్టి. అంతేనా?” నవ్వాడాయన.  ”ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనకొకళ్ళకే ఈ కష్టం వచ్చిందనుకుంటాం.  అది తప్పు.  నీ పరిధిలో నీకు ఇదే సమస్య ఉన్నవాళ్ళు ఇంకెవరూ కనిపించలేదేమో.  కానీ నేను ఇలాంటి కేసులు వందలకొద్దీ చూస్తుంటాను.  నాకు తెలుసు.  ఈ సమస్య చాలామందికే ఉంది.  వాళ్ళలో నీ కొలీగ్స ఉన్నారేమో ఎవరికి తెలుసు!” రీతూ చిన్నగా నవ్వి ఊరుకుంది.  ”చాలామటుకు స్కిన్‌ డిసీజెస్‌ మనసులో ఆందోళన, ఆవేదన లాంటి వాటివల్ల ఎగ్రవేట్‌ అవుతాయి.  ఎక్కువవుతాయి.  అందుకని ఏం బెంగ పడకుండా ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకో.  త్వరగా తగ్గుతుంది” అని ధైర్యం చెప్పాడాయన.  ఆయనకు థాంక్స్‌ చెప్పి లేచారిద్దరూ.
మందులు కొన్నాక, ”కాసేపు మాఇంటికిరా కాఫీతాగి కబుర్లు చెప్పుకుందాం” అని తీసుకెళ్ళింది రీతూని.  కాఫీ తాగుతూ ”ఇంత జరగడానికి మా అమ్మే కారణం.  ఏనాడూ నాకిది మంచీ ఇది చెడూ అని చెప్పలా.  అసలావిడకి తెలుస్తేగా?  ఆవిడకే ఓ పద్ధతీ పాడూ లేదు.  నన్నూ అలాగే తెయ్యమ్మలా పెంచింది.  ఇప్పుడు నాన్న మాటల విలువ తెలుస్తోంది.  తీరా ఈ మచ్చలొచ్చాక్కూడా తన ఫ్రెండు ఆ క్వాక్‌ దగ్గరికి తీసుకెళ్ళిందేకానీ డాక్టరు దగ్గరికి తీసుకెళ్లనే లేదు.  నేనీ మధ్య ఇవన్నీ ఆలోచించుకునే ఆవిడతో మాటాడ్డం మానేసాను.  డాడీ నేనూ ఇప్పుడు సఖ్యంగా ఉంటున్నాం” అంది.  ”అసలు మీ ఇంట్లో అన్నాళ్ళున్నా కూడా నేనూ, మమ్మీ మీ ఫ్యామిలీలో ఉండే క్రమశిక్షణ, సభ్యతా, సంస్కారం కొంచెం కూడా నేర్చుకోలేక పోయాం.  పైగా మీ గురించి లోకువగా మాటాడేవాళ్ళం తలుచుకుంటే బలే సిగ్గేస్తోంది” అంది రీతూ.
”అదంతా మరిచిపో.  ఇకనుంచీ అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండు.  మందులు శ్రద్ధగా వాడు.  మావయ్య పదిరోజుల తరవాత ఒకసారి వచ్చి చూపించుకోమన్నారు కదా మర్చిపోకుండా వెళ్ళు.  నేన ఫోన్‌ చేసి గుర్తు చేస్తాన్లే.”  ”నీకు నేనంటే ఎంత శ్రద్ధ మీనాక్షీ!  ఇందులో పదోవంతు శ్రద్ధ మా అమ్మకుంటేనా…” ”అదుగో అన్నిటికీ అమ్మనే బ్లేమ్‌ చేసే అలవాటు మానుకో.  ఆవిడ ఏంచెప్పినా నీ వివేకంతో నువ్వూ ఆలోచించాలికదా.  నీ బుర్ర కూడా ఉపయెగించూ అని చాలాసార్లు చెప్పాన్నీకు.  నువ్వు వింటేనా.  సరే జరిగినదాంట్లో తప్పెవరిదీ అని గొడవలు పెంచుకోడంకన్నా ఇకముందు ఇలాంటి పొరబాట్లు జరక్కుండా చూసుకోడం ముఖ్యం.”  రీతూకి ధైర్యం చెప్పి పంపింది మీనాక్షి.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.