కొండేపూడి నిర్మల
హైదరాబాద్‌లో వారం రోజులు వుండాల్సిన పని పడింది. దిల్‌సుఖ్‌నగర్‌లో వున్న మా చెల్లెలు లీల ఇంటికొచ్చాను. నిన్న పొద్దున్నే కాఫీ తాగుతూ మొగుడ్ని ఫోన్లో వింటున్నాను.
అనారోగ్యాల మధ్య, ఆర్ధిక బాధల మధ్య నెత్తి మీదకు జారిన నూరు వరహాల కొమ్మనీ గానీ దాని మీదున్న నీలి పచ్చ పిట్టను కానీ పట్టించుకోలేదు. లీల అత్తగారు పిలిచి చూపించింది ”అదిగో ఆ పిట్టని చూడు…అబ్బ ఎంత బావుందో నీలి పచ్చ మొహాం, నల్లటి రెక్కల దాని మీద ఆకుపచ్చ గీతల… అయ్యో ఎగిరిపోతోంది.. ప్చ్!కాసేపు అలా కూచుంటే బావుండు. రంగులు కలిపేదాకా ఆగడం లేదు” అంది.
ఆవిడ సంతోషాలూ, విచారాలూ ఇంట్లో వాళ్ళూ పెద్దగా పట్టించుకోరు. ఎందుకండే ఆవిడే కాదు అలాంటి కోరికలున్న ఆడది ఎవరైనాగానీ మంచి అత్త, అమ్మ, పిన్ని, వదినా కాగలిగిందా లేదా? రుచిగా వొండడం, సేవలు చేయడం చాతనవునా కాదా అనేది మాత్రమే చర్చ అవుతుంది. మగవాడి కళా హృదయాన్ని, ప్రతిభని పట్టించుకుని గౌరవించినట్టుగా ఆడవాళ్ళని గుర్తించలేకపోతాం. నా వరకూ నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఆవిడ పెయింటింగ్సు చూసి అబ్బుర పడ్డమే తప్ప భూమిక పాఠకులకోసం పరిచయం చెయ్యలేకపోయాను. ప్రతిభకి జండర్ లేకపోవచ్చు కానీ గుర్తింపు? ప్రచారానికి మాత్రం జండర్ వుంది. కాబట్టి నా కాలమ్‌లో ఈ సారి విజయలక్ష్మిని గురించి చెప్పదలుచుకున్నాను.
ఎనభైయ్యేళ్ళ గోపాలుని విజయలక్ష్మి అణిముత్యాల్లాంటి పెయింటింగ్సు వేస్తుంది. మీ గురించి రాస్తాను అనగానే… ”అయ్యో..వద్దు…నేనంత గొప్పదాన్ని కాదు. సాధించాల్సింది ఇంకా చాలా వుంది” అంది మోహమాటంగా. చాలా సేపు ఏవేవో మాటల్లో పెట్టి వివరాలు సేకరించాల్సి వచ్చింది.
ఊహ తెలియని వయసులో పలక మీద ఓనమాలు కంటే బొమ్మలేసేసిందిట విజయలక్ష్మి.గుంటూరుజిల్లా నరసరావు పేటలో 1938లో పుట్టిన తను థర్డ్‌ఫారం చదువుతూ వుండగానే మేనబావకు ఇల్లాలైంది. ఒక్కతే కూతురు అవడంతో భర్తతో కలిసి అమ్మ దగ్గరే వుండేది. నా కళకు కారణం అమ్మ, బావ అంటుంది తను నిజాయితీగా. ఇప్పుడు ఇద్దరూ లేరు. వాళ్ళ జ్ఞాపకాలుగా అనేక పెయింటింగ్సు వున్నాయి. పెళ్ళయిం తర్వాత తెలుగులో ఎమ్మే, హిందీ ప్రవీణ చేశారు. తెలుగు, హిందీ సంస్కృత భాషలో ఎన్నో గ్రంధాలు చదివారు.
విజయలక్ష్మిలో వున్న ఇంకో విశేషం ఏమిటంటే స్నేహగుణం. చిన్నప్పుడు చదువుకున్న నేస్తాలతో కలిసి ఇప్పటికీ వూళ్ళు తిరుగుతూ వుంటుంది. స్నేహాలు నిలుపు కోవడంలో నిస్సహాయులైన చాలామంది స్త్రీలు ఈవిడ్ని చూసి నేర్చుకోవాలి. ఎక్కడికి వెళ్లినా ఓ కాగితం పెన్సిలూ దగ్గరుంచుకుని అప్పటికప్పుడు స్కెచ్ గీసుకుని కలర్ కాంబినేషన్ నిర్ణయించుకునే అలవాటుంది. ఓ పక్క మధుమేహం, మరోపక్క గర్భసంచి కాన్సరు లాంటి సమస్యలు. మంచి ఆహారంతో, ధ్యానంతో, కళా తపస్సుతో అదుపులో పెట్టానని అంటారు. పిల్లలు లేని దిగులు పెయింటింగ్సుతో తీర్చుకున్నారట. ముప్ఫయేళ్ళ వరకూ సొంతంగా తనకు తెలిసిన ధోరణిలో బొమ్మలు గీసిన విజయలక్ష్మి, కలర్ వండర్ సంస్థనుంచి పెయింటింగులోనూ, శంతన్ ఆర్ట్స్ ఆఫ్ మెడ్రాస్‌నుంచి వైవిధ్యంలోనూ మరిన్ని మెలకువలు నేర్చుకున్నారు. నిర్మల్, తంజావూర్, త్రీడి ఎఫెక్ట్ కనిపించే నైఫ్ పెయింటింగ్సు చాలా బాగా వేస్తుంది. ఈమె భర్త రామచంద్రరావు (కమర్షియల్ టాక్స్ ఆఫీసరు) ఫ్యాబ్రిక్ మీద ఇచింగు పెయింటింగ్సు వెయ్యడంలోనూ, అట్టలతో వివిధ కళా రూపాల్ని తయారు చెయ్యడం లోనూ దిట్ట.
వరంగల్ (1975) ప్రపంచ మహాసభల్లో ”సప్తాశ్వర రధమారోఢం”అనే తన పెయింటింగు చోటు చేసుకుందని చెబుతున్నప్పుడు ఆ కళ్ళలో చాలా సంతృప్తి కనిపించింది. దివాకర్ల వెంకటావధాని లాంటి సాహితీస్రష్టల నుంచి అప్పటి కలెక్టరు సముద్రాల కృష్ణమూర్తిదాకా ఈమె పెయింటింగ్సును డ్రాయింగురూంలో అలంకరించుకున్నారు. అదే సందర్భంలో రాజరాజేశ్వరిదేవి పెయింటింగును దివాకర్ల స్వయంగా ఆవిష్కరించారు.
సాహిత్యంలో మంచి అభిరుచి వుంది. సాక్షి వ్యాసాలు, విశ్వనాధ సత్యనారాయణ రచనలు, తులసీ రామాయణం, హరివంశరాయ్ బచ్చన్, మైదిలీ చరణ గుప్తా, పురాణ వైరి గ్రంధమాల, లత ఊహాగానం, శరత్ రచనాశైలి ఇష్టమని చెప్పారు. దేవనాగరీ భాషలో వున్న ‘శ్రీవిద్యాసముచ్చయం’ నాలుగు భాగాల గ్రంధాన్ని తన గురువు శ్రీ విద్యానందనాధతో కలిసి తెలుగులోకి అనువదించారు.
సంగీతం అంటే చాలా ఇష్టం. స్వయంగా వీణ నేర్చుకున్నారు. వయస్సు రీత్యా కొంచెం ఆత్మవిశ్వాసం తగ్గిందని ‘రామకృష్ణ పరమహంస నిలువెత్తు చిత్రాన్ని వెయ్యాలనిపిస్తుందని కానీ మొదలు పెట్టాక ఆగకూడదుకదా అందుకే ఆలోచిస్తున్నాను” అంది.
మొత్తంగా తన జీవితకాలంలో ”వంట చేసిన సందర్భాలు తక్కువ”ని చెప్పారు. వంట చెయ్యడంవల్ల ప్రతిభ నాలా కుంటుపడకపోవచ్చుకానీ వొంటింటికి అంకితమైపోవడంవల్ల చేయాల్సిన చాలా పనులు మాత్రం ఆగిపోతాయి. అభిరుచి ఆవిరైపోతుంది.
విజయలక్ష్మి ఆ శూన్యాన్నంతా చక్కటి ఉదయసంధ్యా సమయాలుగా మలుచుకుని రంగుల మేళవింపుతో నింపుకుంది
మనచుట్టూ ఎంతోమంది ప్రతిభావంతులున్నారు కానీ వారి గురించి చాలా మందికి తెలియదు ఎందుకంటె
వారికి ప్రచారంపైన ఇష్టం వుండదు.విజయలక్ష్మి గారి గురించి తెలియచేసినందుకు ధన్యవాదములు.