భూమిక సంపాదకులకు, అక్టోబరు భూమిక కవర్ పేజీ చాలా బావుంది. ”భూమిని ప్రేమించే మహిళలు భూమిని దున్నడం ప్రారంభిస్తే…” పేరుతో రాసిన సంపాదకీయం ఈనాటి వ్యవసాయ సంక్షోభాన్ని కళ్ళకు కట్టినట్టు వివరించింది. అంతే కాకుండా ప్రపంచీకరణ వల్ల వ్యవసాయ రంగం ఎలా అతలా కుతలమౌతున్నదీ వివరంగా రాసారు. ముఖ్యంగా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోను జరుగుతున్న రైతుల ఆత్మహత్యల విషాదం గుండెను పిండేస్తుంది. ఇంతటి విశ్లేషణాత్మకమైన సంపాదకీయం రాసిన సంపాదకులకు అభినందనలు. – వరలక్ష్మి, విజయవాడ.
*****
డియర్ ఎడిటర్, గ్రామీణ మహిళా దినోత్సవం (అక్టోబరు 15) సందర్భంగా వెలువడిన భూమిక ప్రత్యేక సంచిక అద్భుతంగా వుంది. వ్యవసాయంలో మూడొంతుల పనిచేసే రైతక్కల ఫోటోలతో కవర్ పేజీ చాలా బావుంది. పి. ప్రశాంతి రాసిన ”ఆహార భద్రత – మహిళా సంఘాలు’ వ్యాసం అక్టోబర్ భూమికకు హైలైట్. ఆమె ప్రస్తావించిన సమతా ధరణి కార్యక్రమం కింద గ్రామీణ మహిళలు చేపట్టిన వివిధ కార్యక్రమాలు చాలా స్ఫూర్తివంతంగా వున్నాయి. స్త్రీల చేతిలో భూములుండి, నిర్ణయాధికారం వున్నట్టయితే వ్యవసాయం రంగంలో ఈ రోజున్నంత సంక్షోభం వుండకపోయేది. నిజం… మీరు సంపాదకీయంలో రాసినట్టు మహిళలు భూమిని ప్రేమిస్తారు. ఆహారభద్రతకు ప్రాధాన్యమిస్తారు. వ్యవసాయ పనుల్లో వారిపాత్ర చాలా ప్రముఖమైంది. అలాంటి స్త్రీలను రైతులుగా గుర్తించకపోవడం చాలా అన్యాయం. చక్కటి వ్యాసం రాసిన ప్రశాంతికి అభినందనలు.
– పి. అనురాధ, విశాఖపట్నం.
*****
భూమిక సంపాదకులకు, నమస్తే, అక్టోబరు సంచిక భూమికలో ఆర్.శాంత సుందరి గారు రాసిన ”అస్తిత్వ పోరాటానికి చిరునామా : అమృతా ప్రీతమ్” చదవడం ఓ మంచి అనుభవం. ముఖ్యంగా ఇమ్‌రోజ్, అమృతా ప్రీతమ్‌ల బాంధవ్యం గురించి చదువుతున్నప్పుడు, ఇమ్‌రోజ్‌లాంటి పురుషులు మన పురుషాధిక్య సమాజంలో చాలా అరుదుగా కనబడతారు. అందుకే అమృత జీవితమే ఒక ప్రేమ కావ్యంలా సాగింది.
దానికి ఇమ్‌రోజ్ లాంటి వ్యక్తులే కారణం – శాంత సుందరి గారికి ధన్యవాదాలు. – ధరణి, ఇ-మెయిల్.
*****
ఉదయ్‌మిత్రగారి ఇస్మాత్‌చుగ్తాయ్ ఫక్కున నవ్వింది…. కవిత చాలా బాగుంది. ప్రస్తుత దేశ పరిస్థితులను కళ్ళకు కట్టించినట్లుగా ఉంది. – ఆర్.డి., ఇ-మెయిల్.
*****