నా కథ మరాఠీ మూలం : అక్తాయి కాంబ్లే, ఇంగ్లీషు నుండి అనువాదం : పి.శైలజ

నా పేరు అక్తాయి కాంబ్లే. ఒక మహర్‌ (దళిత) కుటుంబంలో 1949లో నేను పుట్టాను. నిప్పాని ఊరిలో మా నాన్న పురపాలక సంఘ సభ్యునిగా ఉండేవాడు. మా నాన్నకు ఏడుగురు అన్నదమ్ములు. వారి కుటుంబాలతో సహా మొత్తం 100 మందిమి ఒకే ఇంట్లో కలిసి ఉండేవాళ్ళం. మా నాన్నకి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు పిల్లలు లేకపోవడంతో, రెండో భార్యని ఇంటికి తెచ్చాడు. ఈ రెండో భార్య అంటే మా అమ్మకి ముగ్గురు పిల్లలు – ఒక అబ్బాయి. ఇద్దరు అమ్మాయిలు.

నాకు ఐదేళ్ళ వయసున్నప్పుడు హటాత్తుగా మా నాన్న పోయాడు. అప్పుడు ఇక, ఇద్దరు అమ్మలతో మేము ముగ్గురు పిల్లలం ఒంటరిగా మిగిలిపోయాం. మా తాతయ్య, మా నాన్న డబ్బు, బంగారు నగలు, మేము పిల్లలం పెరిగి పెద్దయింతరువాత మాకిస్తానని చెబుతూ, అన్నీ తన వద్దే ఉంచేసుకున్నాడు. మా తిండి తిప్పలకోసం ఒక పైసా అయినా మాకివ్వలేదు. మా నాన్న పోయి పదిరోజులు కాకముందే, మా ఇద్దరమ్మలు పొగాకు ఫ్యాక్టరీలో పనికి వెళ్ళాల్సి వచ్చింది. నేను, మా చెల్లెలు, తమ్ముడు, మరీ చిన్న పిల్లలం. పైగా స్కూలుకి వెళ్తూ ఉండడంతో పనికి వెళ్ళలేకపోయాము.

ఆ రోజుల్లో, మమ్మల్ని నేరుగా బయట కూర్చోపెట్టేవారు కాదు. స్కూలులో అంతా కలిసే కూర్చునే వాళ్ళం. మా తాత, మా తమ్ముడిని తన దగ్గరే ఉంచుకుని పెంచాడు. నన్ను మా సవతి తల్లి (పెద్దమ్మ), మా చెల్లెల్ని మా అమ్మ పెంచుతుండేవారు. ఎంత చాకిరీ చేసినా, ఈ పుగాకు, బీడీ పనికి చాలినంత డబ్బులు రాక, మాకు తిండికి కూడా గడిచేది కాదు. నాకు ఇంకా చదువు కొనసాగించాలని ఉన్నా, ఎటువంటి ఆధారం లేని పేదవాళ్ళం అవటంచేత, మా సవతి తల్లి నన్ను 6వ తరగతి వరకు మాత్రమే చదివించగలిగింది. నాకు అప్పుడు మా నాన్న బ్రతికుంటే బాగుండేదని మరీ మరీ అనిపించేది.

నేను ఇంకా పెద్ద మనిషిని కూడా కాకముందే, మా తాత నాకు పెళ్ళిచేసి పంపించేయాలని నిర్ణయించాడు. నాకు పక్క ఊరి సంబంధం చేశారు. అంతకు ముందు, మా ఇంట్లోంచి ఎవరూ వెళ్ళి మా ఆయన ఇల్లు కూడా చూడలేదు. ఎవరో ఇచ్చిన సలహా మీద, అతనిని నిర్ణయించి, పెళ్ళి చేశారు. పెళ్ళైన మొదటి ఆరునెలలు, నేను మా ఆడపడుచు ఇంట్లోనే ఉన్నాను. ఆమె నన్ను వేధించటం మొదలు పెట్టాక, మా అమ్మ నన్ను తీసికెళ్ళి ఇంట్లో పెట్టుకుంది. తరువాత, నన్ను తీసికెళ్ళటానికి వచ్చిన నా భర్తతో తన సొంత ఇంటికి నన్ను తీసికెళ్ళేట్లయితేనే పంపిస్తానని, మళ్ళీ మా ఆడబిడ్డ ఇంటికైతే పంపనని మా అమ్మ గట్టిగా చెప్పింది. దానికి ఆయన ఒప్పుకున్నాడు. కాని మళ్ళీ నన్ను వాళ్ళ అక్క ఇంటికి తీసికెళ్ళాడు. అక్కడ మేము ఇంకో 8 రోజులున్నాము. అక్కడ నుంచి నడిచి వాళ్ళ అత్తయ్య ఊరికి వెళ్ళాము. నాకు నడక అసలు అలవాటు లేదు. అప్పుడు కుండపోతగా వాన కురుస్తోంది. కప్పుకోడానికి పాత గోనెసంచి ఐనా లేదు. పూర్తిగా అలసిపోయి, వానికి తడిసి గజగజ వణుకుతూ, ఏడుస్తూ నా భర్త వెంట వెళ్ళాను. మేము వాళ్ళ అత్తయ్య ఇంట్లో ఆరునెలలు ఉన్నాము. వాళ్ళింట్లో తినే జొన్నరొట్టె నేను తిని, హరాయించుకోలేక నాకు వాంతులు అవుతుండేవి. నా ఖర్మకి ఎప్పుడూ ఏడుస్తూ ఉండేదాన్ని. ఇలా బ్రతకడం కన్నా చావు మేలని నాకనిపిస్తుండేది. ఇతరుల ఇళ్ళల్లో ఉండటం నాకు అసహ్యంగా ఉండేది. నేను పట్నవాసపుదానిని కనక వాళ్ళ రొట్టె పడటం లేదని అవహేళన చేస్తూ, నన్ను తీసికెళ్ళిపొమ్మని వాళ్ళు మా ఆయనతో చెప్తుండేవారు.

చివరికి ఎలాగైతేనేం, మా ఆయన నన్ను వాళ్ళ ఊరికి తీసికెళ్ళినప్పుడు వాళ్ళమ్మ మమ్మల్ని ఇంట్లోకి రానీయక వెళ్ళగొట్టింది. మళ్ళీ ఎక్కడా ఉండే దిక్కులేక, ఎండనకా, వాననకా రోడ్డు మీద పడ్డాము. మా ఆయన నన్ను ఒక ముసలి ముస్లిం స్త్రీ ఇంటికి తీసికెళ్ళాడు. ఆమె మాకు వండిపెట్టేది. అంటరానివాళ్ళమైన మాకు తన ఇంట్లో చోటిచ్చినందుకు మరాఠాలు అంతా ఆమెని దూషించారు. దిక్కులేకుండా ఉన్న మాకు తన ఇంట్లో చోటివ్వడం తప్పుకాదని, వంటింట్లోకి మమ్మల్ని రానివ్వదు కనుక ఫరవాలేదని ఆమె అన్నది. మాకు దూరం నించే అన్నం పెట్టేది.

అలాగే తంటాలు పడి చివరికి మా అత్త ఇంటికి వెళ్తే, నాకు గొడ్లపాకలో మాత్రం ఉండటానికి చోటు దొరికింది. మహర్ణ కులవృత్తియైన భిక్షాటనం, వీధులు ఊడ్వడంలాంటి పనులు నేను కూడా చేయాలని మా అత్త చెప్పింది. మా ఊరిలో అటువంటి పద్ధతి లేనందువలన ఆ పని చేయటానికి ససేమిరా నేను ఒప్పుకోలేదు. నా భర్త నన్ను వదిలేసినా సరే. ఈ పని మాత్రం చేయనని ఖచ్చితంగా చెప్పేశాను.

నా భర్త నన్ను కష్టపెట్టకపోయినా, ఏ పని చేసేవాడు కాదు. దాంతో నేను పొలం పనికి వెళ్ళేదాన్ని. నాకు పని రాకపోయినా, మిగతా ఆడవాళ్ళు నాకు నేర్పించారు. రోజంతా పొలంలో పనిచేసి, సాయంత్రం పొయ్యిలోకి కట్టెలు ఏరుకుని వెళ్ళేదాన్ని. అలా తినడానికి సరైన తిండి, కట్టుకోడానికి బట్టలు లేక ఒక ఏడాదిపైన గడిపాను. కాని, నాకు బయటపడడానికి వేరే మార్గం లేకపోయింది. మా అమ్మ పరిస్థితి కూడా అధ్వాన్నంగా ఉండటంతో, నా భర్త నాకు నచ్చకపోయినా, అతనితో కలిసి ఉండనని చెప్పే ధైర్యం లేకపోయింది. మా తాత, నాయనమ్మలు కాని, మా మామయ్యలు కాని ఎవ్వరూ నా గురించి పట్టించుకోలేదు. అలా ఏడుస్తూ, రోజులు గడిపేదాన్ని. విషం తినో నీళ్ళలో మునిగో చచ్చిపోవాలని కూడా అనుకున్నాను.

త్వరలోనే గర్భవతిని కూడా అయి, శక్తి లేక, నీరసంతో తూలిపడుతుండేదాన్ని. ఏ పని చేయలేకపోయేదాన్ని. అప్పటికీ మా అత్త తను తినే రొట్టెలో, నాకు సగమైనా ఇచ్చేది కాదు. ఒక పొరుగింటి ఆమె నాకు రొట్టె, టీ ఇస్తూ ఉండేది. ఇది తెలుసుకున్న మా అత్త ఆమెను కూడా నానా మాటలు అన్నది. అప్పుడింక నేను పొలాల్లోకి వెళ్ళి, కింద పడ్డ మామిడికాయలు, నల్లమట్టి తిని, నీళ్ళు తాగి ఇంటికొచ్చేదాన్ని. ఇది మొదలుపెట్టిన మూడునెలలు తరువాత. ఇంకా ఇంకా నీరసమైపోయి, చివరికి మాట్లాడటానికి కూడా ఓపిక పోయింది. ఇది విన్న మా అమ్మ నన్ను తనతో తీసికెళ్ళింది. రెండు నెలల తరువాత, మా ఆయన వచ్చి నన్ను పంపమని అడిగాడు. అప్పుడు మా తమ్ముడు అతనితో ”నీకు సిగ్గులేదా? మీ అమ్మ, అక్కవాళ్ళు తిని, ఈ కడుపుతో ఉన్న పిల్లకు ఏమీ ఇవ్వకుండా మాడిస్తే ఆమె ఎట్లా బతుకుతుంది? ఆమె అట్లాగే మాడి, మాడి చచ్చిపోతే, నువ్వు మళ్ళీ పెళ్ళి చేసుకుంటావు. కాని నేను మాత్రం నా అక్కని పోగొట్టుకునేవాడిని. ఆమె పనిచేస్తుంటే, నువ్వు మాత్రం ఆమె సంపాదన మీద పడి తింటున్నావు. మేము తనని నీతో పంపము” అన్నాడు. అప్పుడు నేను మా తమ్ముడితో అన్నాను: ”ఎందుకట్లా అంటావు? ఇదంతా నా తలరాత. నా పెళ్ళి చేసినప్పుడు మీకు తెలుసు ఈ సంగతి. నేనేదో ఇంట్లోంచి పారిపోయేదానిలాగా, తొందరపడి నాకు పెళ్ళి చేశారు. ఇప్పుడు నాకు కష్టపడితే గాని తిండి గడవని పరిస్థితి. పైగా నీ పేరుకి ఏ మచ్చా రాకూడదు. రేపొద్దున్న నా మూలంగా నీ పరువు పోయిందని నీవనకూడదు. కులం ప్రతిష్ట కోసం నేను మట్టి తినడానికి కూడా సిద్ధపడాలి?”

తరువాత, మా తమ్ముడు మా ఇద్దరిని తన వద్ద

ఉండమన్నాడు. నేను మా అమ్మతో బీడీ పనికి వెళ్ళటం మొదలుపెట్టాను. మా ఆయన మాత్రం ఏ పనీ చేయకుండా జూదమాడేవాడు. రాత్రి షిఫ్టులో కూడా పని చేశాను. నా భర్తని ఏమన్నా అడగాలంటే, తాగొచ్చి, తిట్టి, కొడతానని బెదిరించేవాడు. అందుకని ఏమీ అనలేకపోయేదాన్ని. ఇంకెవరన్నా మగవాడితో మాట్లాడితే అనుమానించేవాడు. వాళ్ళు నా అన్నదమ్ములలాంటి వాళ్ళని చెప్పినా నమ్మేవాడు కాదు. రాత్రి షిఫ్టు అయ్యే సమయానికి మేము పనిచేసే స్థలానికి వచ్చి నన్ను చూస్తూ నుంచునేవాడు. నేను ఎవరన్నా మగవాడితో కలిసి పనిచేస్తూ కనిపిస్తే ‘ఇంక పని మానేసి, ఇంటికి పద’ అనేవాడు.

ఒక రాత్రి మా ఆయనొచ్చి నాతో పోట్లాడటం మొదలుపెట్టేసరికి మా మేనేజరు ”ఆమె ఫ్యాక్టరీ బయట నీ భార్య, పనికోసం ఇక్కడికొచ్చాక, నీకు ఆమె మీద ఏ హక్కూ లేదు. ఆమె పనికి మేము జీతమిస్తాము. నీ దాదాగిరి మేము సహించము” అన్నాడు. నా సంపాదన మీద బ్రతుకుతున్నందుకు కూడా మేనేజరు మా ఆయనని చీవాట్లు పెట్టారు.

మిగతా స్త్రీలందరూ కూడా నామీద సానుభూతి చూపేవారు. ఇట్లాంటి మనిషి ఎక్కడ దొరికాడు మీకు అని మా అమ్మనడిగేవారు. ఎనిమిది నెలలు నిండేవరకు పనిచేస్తూనే ఉన్నాను. నాకు కొడుకు పుట్టాక మా సవతి తల్లే నాకన్నీ చేసింది. నా కొడుకు పుట్టిన మూడు వారాలకు మా ఆయన వచ్చి తనతో రమ్మని బలవంతపెట్టాడు. మా తమ్ముడు నన్ను, బాబుని పంపటానికి ఒప్పుకుని, మమ్మల్ని బాగా చూసుకోమని చెప్పాడు. మా సవతితల్లి నాకు ఆహారం, బట్టలతో సహా అన్నీ ఇచ్చి పంపింది. మా ఆయన మొత్తం అన్నీ సరుకులు అయేదాక ఇంట్లోంచి బయటకి కదలలేదు. ఆ తరువాత తోటలోకి వెళ్ళి అక్కడే పనిచేసుకుంటూ ఉండటం మొదలుపెట్టాడు. నా బాధలన్నీ మళ్ళీ మొదలయ్యాయి. ప్రసవమై ఒకటిన్నర నెలలు కూడా కాలేదు. ఇంట్లో ఒక బియ్యపు గింజైనా లేదు. నేను పొలాల్లోకి, తోపుల్లోకి వెళ్ళి కూరగాయలు తేవటం మొదలుపెట్టాను. ఉప్పువేసి వండి, రొట్టె కూడా లేకుండా అట్లాగే తినేదాన్ని. నా కొడుకు మరీ చిన్నవాడవడంతో వానల్లో వెళ్ళలేక పొలానికి వెళ్ళేదాన్ని కాదు.

మళ్ళీ మా అత్త ఇంట్లోని గొడ్లపాకలోకి చేరాను. బాగా వానలు కురిసినప్పుడు దగ్గరలో ఉన్న ఏరు పొంగి, నీళ్ళు లోపలికి వచ్చేవి. చిన్న పాములు, కట్టెలు, వెదురుతో చేసిన గోడలు మీద పాకుతుండేవి. నా కొడుకుతో సహా గదిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలనిపించేది. మేము బతికున్నామో, చచ్చామో చూడటానికి కూడా మా ఆయన రాలేదు. వానలు తగ్గాక, ఊక ఒకరి దగ్గిర నుంచి, చిక్కుడుకాయలు ఇంకొకరి దగ్గరి నుంచి తీసుకుని, అవి దంచి రొట్టె చేసి, వాటిని మిరపకాయలతో తినేదాన్ని. పిల్లవాడికి పాలు కొనడానికి డబ్బులు లేవు. నేను రొట్టె, పచ్చిపల్లీలు, చెరుకుగడలమీద బ్రతికాను. అయినప్పటికీ పిల్లవాడు ఆరోగ్యంగానే పెరిగాడు. పిల్లలకు సాధారణంగా వచ్చే దగ్గు, విరోచనాలు లాంటివి వాడికేమీ రాలేదు. జీవితం భగవంతుడు ఇచ్చిన వరంగా భావించి ఆత్మహత్య చేసుకోకూడదని నాలుగు నెలలు అట్లాగే పట్టుదలగా బతికాను. మా ఆయన ఇంకా ఎంతకాలం ఇలా ప్రవర్తిస్తాడో, తనే ఓడిపోతాడో, నేనే ఓడిపోతానో చూడాలని అనుకున్నాను.

మా తమ్ముడు జబ్బుపడి హటాత్తుగా చనిపోయాడు. మా సవతితల్లి నన్ను తన దగ్గరుండి, పుగాకు ఫ్యాక్టరీలో పనిచేసుకుని బ్రతకమని చెప్పింది. ఐతే నేను మాత్రం భర్తని వదిలేసిందని నలుగురూ నన్నే అంటారని చెప్పాను. తరువాత చాలా సంవత్సరాలు, మా ఆయన నన్ను తీసుకెళ్ళడం, వెళ్ళి నేను మళ్ళీ కష్టాలు పడటం మామూలై పోయింది. ఇట్లాగే, నాకు ముగ్గురు పిల్లలు పుట్టారు. మూడవబిడ్డ పుట్టినప్పుడు, అదేరోజు మా ఆయన మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ అతనొస్తే వెళ్ళనని అప్పుడు ఇంక నేను నిర్ణయించుకున్నాను. ఎవరేమన్నా పట్టించుకోకుండా, కష్టపడి పనిచేసి పిల్లలను పెంచాలని అనుకున్నాను. మా అమ్మ దగ్గరే ఉండి పుగాకు ఫ్యాక్టరీకి వెళ్ళడం మొదలుపెట్టాను.మా పై అధికారులు, మమ్మల్ని చాలా బాధలు పెట్టేవారు. మా మేనేజరు, ఫ్యాక్టరీ యజమాని మరీ అధ్వాన్నం. ఎవరైనా కొంచెం అందమైన స్త్రీ కనిపిస్తే ఆఫీసు ఊడవమనే నెపంతో పిలిచి బలాత్కరించేవారు. ఆ సమయంలో, పనిలోంచి తీసేస్తారనే భయంతో ఎదురుతిరుగలేకపోయేవాళ్ళము. ఆడవాళ్ళు ఎవరూ కూడా ఏమీ అనలేక ఊరుకోవలసి వచ్చేది. నేను కూడా, నా పని పోతే పిల్లలకి తిండి ఎలా గడుస్తుందనే భయంతో గడిపేదాన్ని. మాకు పోషించే దిక్కెవరూ లేకపోవడంతో, అట్లాగే భయంతో రోజులు గడిపేదాన్ని. అందరూ ఆడవాళ్ళు, బీదరికంతో ఉన్నవారే. పైగా ఎక్కువమంది మహర్లు. కులం ఎంత పాతుకుపోయిందంటే, మహర్‌ స్త్రీలని, తాళం చెవులని, మంచినీళ్ళ గిన్నెలని కూడా ముట్టుకోనిచ్చేవారు కాదు. నీళ్ళడిగితే, దూరం నుంచి ఇచ్చేవారు.

ఆడవాళ్ళంతా నాతో మంచిగా ఉండేవారు. ఎందుకంటే యజమానిని ఏమన్నా అడగాలంటే, నేను ముందుండేదాన్ని అప్పట్లో కూడా. నాకు కొంత ధైర్యం ఉండేది. మా మేనేజరు గాని, యజమాని గాని ఎవరినన్నా బలవంతపెట్టినా లేక బలాత్కరించినా, అసలే భయంతో ఉన్న ఆమెని మిగతావారు కూడా తక్కువచేసి హీనంగా చూసేవారు. అప్పుడు నేను వాళ్ళతో అది తప్పని, ఇది ఎవరికన్నా జరగచ్చు అని చెప్పేదాన్ని. మేము 16 గంటలు విరామం లేకుండా కష్టపడి పనిచేసినా, మాకు రూ.1.25లు మాత్రమే కూలీగా వచ్చేది. మా సవతితల్లి చనిపోయినప్పుడు, మా యజమాని వద్దకి డబ్బు అప్పు అడగడానికి వెళ్ళాను. నాకు రు.100లు ఇమ్మని, తిరిగి ఇచ్చేస్తానని చెప్పి ఎంత కాళ్ళావేళ్ళాపడినా, నాకు అతను పైసా ఇవ్వలేదు. తర్వాత మా చిన్నాన్నని అప్పు అడిగితే, ఆయన కూడా ఇవ్వలేదు. మా నాన్న సంపాదన అంతా మింగేసినవాడు ఇతనే. నాకు అతని గొంతు పిసికి చంపాలన్నంత కోపం వచ్చింది.

తర్వాత పది ఏళ్ళు ఒక జంతువులాగ గొడ్డుచాకిరీ చేశాను. రోజంతా పనిచేశాక సాయంత్రమన్నా గొడ్లకి విశ్రాంతి దొరుకుతుందేమో కాని, మా కది కూడా లేదు. అర్థరాత్రి ఒంటిగంట, 2 గంటలదాకా పనిచేసి, ఏ కొద్ది గంటలో పడుకుని, మళ్ళీ లేచి వంటచేసి, స్నానం చేసి 8 గంటలకల్లా మళ్ళీ పనిలోకి వెళ్ళేదాన్ని. అట్లా 24 గంటలూ పనిచేసేదాన్ని. నాకెప్పుడన్నా జబ్బు చేస్తే, మందులు కూడా కొనడానికి లేక, పిల్లలు బాధపడాల్సి వచ్చేది. ఆఖరికి పిల్లలు పస్తుండాల్సి వచ్చినా, నేను ఎవరి దగ్గరకీ వెళ్ళి యాచించేదాన్ని కాదు. మా అమ్మ చనిపోయాక, నేను ఒక్కదాన్ని పనిచేసి, నా ముగ్గురు పిల్లల్ని పోషించుకునేదాన్ని. నాకు భయమనేది మెల్లిగా పోయి, తెగువ ధైర్యం పెంచుకోసాగాను.

ఒకసారి నేను పనిచేస్తున్న ఫ్యాక్టరీ మూతబడి, నేను ఇంకొకచోట పనిచేయాల్సి వచ్చింది. ఆ ఫ్యాక్టరీ యజమాని నామీద కన్నేసి, తన ఆఫీసు ఊడవడానికి నన్ను పంపించమని సూపర్‌వైజర్‌కి చెప్పాడు. నేను వెళ్ళకపోయేసరికి, నా ధర ఎంతో అడగమన్నాడు. నా మొగుడితో పడుకోడానికి తన భార్య రేటెంతో యజమానిని అడగమని సూపర్‌వైజర్‌ని పంపించాను. ఇది విన్న అతను, కోపంతో పెట్రోలు పంపు అద్దాలు పగలగొట్టి నన్ను పనిలోంచి తీసేయమని సూపర్‌వైజర్‌ని ఆదేశించాడు. ఈ కారణం చేత, అట్లా ఉన్నపళాన వెళ్ళిపోవడానికి నేను ఒప్పుకోలేదు. నేను యజమానితో అన్నాను ”నువ్వు మిగతా ఆడవాళ్ళని బెదిరించి భయపెట్టగలవేమోగాని నేను మాత్రం భయపడను. నేను ముందు పనిచేసిన చోట, నేను ఈ సమస్యను ఎదుర్కోలేదు. నువ్వెవరు అడగడానికి? నీ ఫ్యాక్టరీలో మేము పనిచేస్తున్నంత మాత్రాన నువ్వెక్కడికి పిలిస్తే అక్కడికి వస్తామనుకోకు. మేము పేదవాళ్ళమేగాని, బజార్లో మాత్రం పడలేదు. నా ఉద్యోగం పోయినా సరే, నీ కోరికలకి నేను లొంగను. నీకు బుద్ధి చెప్పి తీర్తాను”. ఇది వింటున్న మిగతా ఆడవాళ్ళందరూ చాలా భయపడి, ఇట్లా మాట్లడద్దని నాతో చెప్పారు. ఈ ఉద్యోగం మీద నాకంత పట్టింపు లేదని నేను వాళ్ళతో అన్నాను. ఏ మేనేజరు కాని, యజమాని కాని ఇట్లా అలుసు తీసుకోవాలని చూశారో, వాళ్ళని రోడ్డుమీద కొడతానని అన్నాను.

ఈ సమయానికి మా పాత ఫ్యాక్టరీని మళ్ళీ తెరిచారు. తర్వాత 2, 3 నెలలకి మేము 20 నుంచి 25 మంది ఆడవాళ్ళము యజమానికి మా కూలి పెంచమని అడిగాము. మేము అప్పటికి బీడీ కార్మిక సంఘంగా ఏర్పడబట్టి యజమాని మా కూలిని మూడున్నర రూపాయలకి పెంచడానికి ఒప్పుకున్నాడు. ఇంకొక ఫ్యాక్టరీలో, కార్మికులకి రూ.5 లు ఇప్పిస్తున్న కార్మిక సంఘం గురించి నేను మిగతా వాళ్ళకి చెప్తుండేదాన్ని. మేము కూడా ఈ విషయంలో ఏదైనా చేయాలని అనుకుంటుండేవాళ్ళము. ఆఖరికి 1980లో, ఫ్యాక్టరీ కార్మికులందరము కలిసి, (యూనియన్‌) సంఘంగా ఏర్పడ్డాము. నన్ను పనిలోంచి వెళ్ళగొట్టినా నేను భయపడలేదు. ఎక్కడ పనిచేసినా బ్రతకగలనని మా యాజమాన్యంతో అన్నాను. తర్వాత 2 ఏళ్ళ వరకు. నాకు ఎవ్వరూ పని ఇవ్వలేదు. ఐతే ఇప్పుడు నేను యూనియన్‌ ఆఫీసులో పూర్తిస్థాయి ఉద్యోగిని.

గత 4 సంవత్సరాలలో నేను చాలా అనుభవం సంపాదించాను. పుగాకు ఫ్యాక్టరీలలో పనిచేసే మా స్త్రీలమంతా చాలా ధైర్యవంతులమయ్యాము. మేము ఇప్పుడు మా భర్తలకి గాని, యజమానులకు గాని, పోలీసులకు గాని, ఎవ్వరికీ భయపడము. వాళ్ళందరితో ఎదిరించి మాట్లాడగలము. కోర్టులన్నా, జైలు అన్నా బెదిరిపోము. మా భర్తలు ఎవరైనా మాతో పోట్లాడితే, వారి అవసరం మాకు లేదని చెప్తాము. ఇదంతా మా కార్మిక సంఘం వల్ల జరిగింది. మేము ఇప్పుడు తల ఎత్తుకు తిరుగుతాము. ధైర్యంగా మాట్లాడతాము. నేను సీతలాగా కష్టాలు అనుభవించాను. అయితే ఇప్పుడు దాన్లోంచి బయటబడగలిగాను. కళ్ళుండీ గుడ్డివాళ్ళలాగా, చెవులుండీ చెవిటివాళ్లలాగా, మాట్లాడగలిగీ మూగవాళ్లలాగా బ్రతికాము. ఇదంతా మార్చగలిగాము. ఇది, ఇంతవరకూ జరిగిన నా జీవిత కథ.

(మరాఠీ నుంచి ఆంగ్లానువాదం అరుణా పెండ్సే. మరాఠీ సాహిత్య పత్రిక ‘పుస్తక పందిరి’లో ఇది మొదట ప్రచురించబడింది. లోకాయన్‌ బులెటెన్‌ నెం.4:6, 1986, సౌజన్యంతో)

(భూమిక జనవరి – మార్చి 1993 నుంచి)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.