(మహిళలోని – ”మ” అక్షరంపై మమకారంతో రాసిన కవిత)
బాల్యం…
ముక్కు పచ్చలారనప్పుడు
మురిపాలు పంచిపెట్టె
ముసిముసిగా నవ్వుతూ
మైమరచి కన్పించె
ముగ్దమోము తీరుజూసి
ముద్దబంతి అనిపించె
ముచ్చటైన నడతతో
మనసుల్లో కొలువాయె!!
బాధ్యత…
మామూలు రోజుల్లో
మంచి మిత్రులనిపించె
మాటల వరకున్నప్పుడు
మతలబేమి తెలియకుండె
మాయమాటలు జెప్పి
మతిమరుపు సృష్టించె
మచ్చికైందని తెలిసాక
మగ ఆడ వేరని మార్చిచెప్పె
మదిని దోచిన మాట దెలిపి
ముదిత నడిచే బాట మలిపె!!
బతుకు…
మూడుముళ్ళు పడకముందు
ముత్యమోలె కన్పించె
మాతృత్వపు పల్లకిలో
మాటలతో లాలించె
ముష్కర చర్యల జూసి
ముచ్చెమటలు తెచ్చుకునె
మూడేళ్ళు గాకముందె
ముల్లోకాలు చూపించె
మడతలు పడకముందే
మిడతలాగా కనిపించే!!
భవిష్యత్తు…
అందుకే…
మానవత్వ మనుగడను
మనమధ్యే నేర్పాలి
మనోనేత్ర మూళికతో
మగువ తెలివి నేర్వాలి.
మౌనాన్ని విడనాడి
మిళితమై మెలగాలి
మర్యాదను కోరుకుంటు
మణిపూసై మెరవాలి
మదనపడకు మందిముందు
మన్నించకు మారువరకు
మానసిక ఆందోళనగ
మచ్చుకైన కనిపించకు
మర్మమేమో తెలుసుకొని
మనసులోనే ఉంచుకొని
మోకరిల్లి అర్థించక
మొక్కవోని ధైర్యంతో
మూలకణము కదిలేలా
ముజ్జగములు అదిరేలా
మృగత్వపు కోరలపై
మూడోకన్ను తెరవాలి!!!