కండ్లు మూసుకు పోతుంటే
ఊహలు ఉడాయించుకు పోతుంటాయి?
ఊహలకు నిద్రరాదా?
వాటిది నిరంతర జాగరణ శీలమా?
ఊహలు కునుకు తీస్తే
మెరుపుల పరుగులు కుంటుపడుతాయి.
పక్షులు ఆకాశంలోనే వేలాడిపోతాయి.
చూపులూ ఊహలూ
చేతుల్లో చేతులు వేసుకుని సాగిపోవా?
వాటి దారులు వేరా?
ఏమో మరి?
ఒక్కొక్కసారి
ఊహలు స్తబ్ధంగా ఉండిపోతే
చూపులు దిక్కులను చుట్టి వస్తాయి.
చూపులు మందగించిపోతే
ఊహలు ధరణీ గగనాలకు
వంతెనలు కడుతుంటాయి.
ఊహించిదంతా
చూపుల్లో ఒదిగిపోతే
చూసిందంతా
ఆకృతి పొందిన ఊహలుగా
ఎదుట నిలిచిపోతే
చూపులూ ఊహలూ
పరస్పరాలింగనంలో
పరవశించి పోతాయి.