ప్రియమైన ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా!
పౌర, ప్రజాస్వామిక హక్కుల అమలుకై మౌళిక సమస్యల పరిష్కారం దిశగా కొనసాగుతున్న ప్రజా ఉద్యమాలపై రాజ్యహింసను ప్రశ్నించడం కోసం 1973లో న్యాయవాది ప్రత్తిపాడు వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శిగా, మహాకవి శ్రీశ్రీ అధ్యక్షుడుగా, ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం ఏర్పడింది. రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోవడంతో ”పౌరహక్కుల సంఘంగా పేరు మార్చి 17వ రాష్ట్ర మహాసభలను 2015 డిసెంబరు 12, 13 తేదీల్లో గుంటూరులో జరుపుకొంటున్నాము.
హిందూ మతోన్మాదం – ప్రమాదంలో హక్కులు : కేంద్ర ప్రభుత్వం, రెండు తెలుగు రాష్ట్రాలు అమలుచేస్తున్న రాజకీయ, ఆర్థిక విధానాలు ప్రజాస్వామ్యానికి, చట్టబద్ద పాలనకు, సామాజిక న్యాయానికి, పౌర, ప్రజాస్వామిక హక్కుల ఉనికికే అత్యంత ప్రమాదకర పరిస్థితులను తీసుకువచ్చాయి. కేంద్రంలో హిందూ మతశక్తులు అధికారంలోకి రావడంతో భిన్నమతాలకు, విభిన్నమైన సామాజిక, సాంస్కృతిక జీవన విధానాలకు చెందిన ప్రజల్లో అభద్రతా భావం ఏర్పడింది. ఎవరు ఏం తినాలో, ఎలాంటి దుస్తులు వేసుకోవాలో, ఏ దేవున్ని పూజించాలో, ఎవరిని ప్రేమించాలో, పెళ్ళి చేసుకోవాలో నిర్దేశిస్తూ, శాసిస్తూ హిందూ మత శక్తులు ప్రైవేటు సాంస్కృతిక సైన్యాలుగా ఏర్పడి దాడులు, హత్యలకు పాల్పడుతున్నాయి. మహారాష్ట్రలో హేతువాది నరేంద్ర ధబోల్కర్‌ను, వామపక్షవాది గోవింద్ పన్సారేను, కర్నాటకలో 77 యేళ్ళ వృద్ధుడు అభ్యుదయవాది, సాహితీవేత్త కల్బర్గి హత్యలు హిందూమత శక్తుల అసహనం ఏ స్థాయికి వెళ్ళిందో అర్థమవుతూ వుంది. ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీ గ్రామంలో గోవు మాంసం తిన్నాడనే నెపంతో ముస్లిం మతస్థుడైన మహమ్మద్ అఖ్లిక్‌ను సంఘపరివార్ శక్తులు పాశవికంగా హత్యచేసాయి. మహారాష్ట్రలో శివసేన ఆగడాలు మితిమీరి పోయాయి. గుజరాత్‌లో ముస్లింలను ఊచకోత తరహాలో కాకుండా, మత మార్పిడిల పేరుతో, గోవధ నిషేధం పేరుతో, లవ్ జిహాదీ పేరుతో దేశంలో ఏదో ఒకచోట మత విద్వేషాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ దాడులకు పాల్పడుతున్నారు. వీళ్ళు రైతుల ఆత్మహత్యల గురించి, సామాజిక న్యాయం గురించి మాట్లాడరు. పైగా రిజర్వేషన్లు వ్యతిరేకిస్తారు. వీళ్ళ అజెండా అంతా హిందూ రాజ్యాన్ని నిర్మాణం చేయడమే. అందుకోసం ఫాసిస్టు పద్ధతులనే అనుసరిస్తారు. బి.జె.పి. అధికారంలోకి వచ్చాక కవులకు, కళాకారులకు, రచయితలకు, ప్రజాస్వామిక మేధావులకు, సామాజిక కార్యకర్తలు ఈ అప్రజాస్వామిక వాతావరణాన్ని నిరసిస్తూ తమ అవార్డులను తిరిగి ఇచ్చివేస్తున్నారు. ఈ పరిస్థితి భావ ప్రకటనా స్వేచ్ఛకు, వ్యక్తి స్వేచ్ఛకు, ప్రజాస్వామిక లౌకిక విలువలకు, హక్కులకు ప్రమాదకరం.
సంఘ పరివార్ శక్తులు దేశాన్ని మధ్యయుగాల మనుధర్మం వైపు తీసుకుపోవాలని అనుకోవడం లేదు. ఆధునిక యుగంలో మనుధర్మాన్ని ప్రతిష్టించాలన్నదే వారి అజెండా. సరళీకృత ఆర్థిక విధానాలను – మను ధర్మాన్ని ముడివేసి జమిలిగా అమలుచేయాలన్నదే వారి ఆకాంక్ష. నరేంద్రమోడి ‘మేక్ ఇండియా, డిజిటల్ ఇండియా’ నినాదాల్లోని అర్థం యిదే. ఒకవైపు విదేశాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ, పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాడు. మరోవైపు ప్రభుత్వరంగ పరిశ్రమల నుండి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఉపసంహరిస్తున్నారు. విదేశీ, స్వదేశీ కార్పొరేటు రంగాలకు ఎర్రతివాచీ పరిచి పెట్టుబడులకు అవసరమైన మౌళిక సదుపాయాలు – భూమి, నీరు, విద్యుత్తు పన్నుల మినహాయింపులు, రాయితీలు కల్పించడానికి చట్టాల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది చీణూ ప్రభుత్వం. ప్రజా ఉద్యమాల ఒత్తిడితో ఖూూ తెచ్చిన భూసేకరణ చట్టాన్ని కార్పొరేట్ రంగానికి అనుకూలంగా సవరించి ఆర్డినెన్సుల ద్వారా అమలు చేయాలని ప్రయత్నించింది. మైనింగ్ చట్టాలను పారిశ్రామిక అభివృద్ధి, నియంత్రణ చట్టాలను, పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా మార్చింది. 44 లేబరు చట్టాలను 4 చట్టాలుగా మార్పు చేసి, అందులో కార్మిక సంఘం చట్టానికి, పారిశ్రామిక వివాదాల చట్టానికి సవరణలు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. పరిమితమైన సమ్మె హక్కును, కార్మిక సంఘాలను నిర్వీర్యం చేయడానికి, ఫలితంగా శ్రామిక వర్గాన్ని, వారి శ్రమను పెట్టుబడిదారులు స్వేచ్ఛగా దోచుకోవడానికి, చట్టపరమైన ఆటంకాలను తొలగించడానికి సిద్ధం అయ్యింది. గతంలో ఖూూ కి ప్రస్తుతం చీణూ విధానాల్లో పెద్దగా మార్పేమీలేదు. అయితే ఖూూ ప్రభుత్వ విధానాలకు ప్రజల నుండి వచ్చిన నిరసనలను దృష్టిలో ఉంచుకొని, నిరసనలను, ఉద్యమాలను పక్కదారి మళ్ళించడానికి మతవిద్వేషాన్ని దేశమంతా రెచ్చగొడుతున్నారు. ప్రజల భౌతిక అవసరాలను, జీవనోపాధిని దెబ్బతీస్తూ, మత విశ్వాసాలతో బ్రతకమంటున్నారు. ఈ వ్యూహం అత్యంత ప్రమాదకరమైంది. హక్కుల అస్తిత్వానికి, రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామిక విలువలకు పూర్తిగా వ్యతిరేక వ్యూహాన్ని, ఆలోచనలను మనం తీవ్రంగా వ్యతిరేకించాలి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితిలు భారతీయ జనతాపార్టీకి మద్దతుదారులే. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ‘అభివృద్ధి’ నమూనా ఒకటే. వాటి ఆలోచనా ధోరణి ఒకటే. కానీ, తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమపార్టీగా చెప్పుకుంటూ ఉంది. తెలంగాణ సమాజమంతా ఒక్కటై అసాధారణ పోరాటపటిమతో, ఆత్మబలిదానాలతో రాష్ట్రాన్ని సాధించుకున్నారు. కొత్త రాష్ట్రంలో తమ ఆశలు, ఆకాంక్షలు నెరవేరుతాయనీ, తమ బ్రతుకులు బాగుపడతాయనీ ఆశించారు. తెలంగాణ ప్రజల ఆశలు ఆవిరైపోయాయి. వారి కలలు భగ్నమైపోయాయి. రైతుల ఆత్మహత్యలు, బూటకపు ఎన్‌కౌంటర్ హత్యలు తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతూనే ఉన్నాయి. అధికారంలోకి రావడంతోనే టి.వి. ఛానళ్ళపై నిషేధం విధించారు. ముఖ్యమంత్రి కె.సి.ఆర్. నిరంకుశత్వానికి, నిర్లక్ష్యానికి, ప్రజావ్యతిరేక విధానాలకు మళ్ళీ ప్రజల నిరసన గళం మొదలైంది. ఉద్యమపార్టీ అంటూనే ప్రతిపక్షాల, ప్రజల నిరసనలను అధికార పార్టీ నాయకులు ‘పిల్లిమొగ్గలు’గా చిత్రీకరించడాన్ని తెలంగాణ సమాజం సహించదని చరిత్ర చెబుతోంది.
గతంలో ‘నేను తప్పులు చేసాను’ ‘ఇప్పుడు మారిపోయాను’ ‘నన్ను నమ్మండి’ అంటూ బాబు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రజలను మరోసారి మోసం చేస్తున్నాడు. గతంలో కంటె మరింత దూకుడుగా ప్రపంచబ్యాంకు ‘అభివృద్ధి’ నమూనాను అమలు చేస్తున్నాడు. ప్రభుత్వ అభివృద్ధి విధానాలను వ్యతిరేకించే వారినంతా ప్రజావ్యతిరేకులనీ, దుర్మార్గులనీ, రాజధాని నిర్మాణం చేసే పద్ధతిని వ్యతిరేకించే వారినంతా చరిత్ర హీనులని తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నారు. అధికారంలోకి వస్తూనే 20 మంది ఎర్రచందనం కూలీలను శేషాచలంలో ఎన్‌కౌంటర్ పేరుతో హతమార్చింది ప్రభుత్వం. తన వ్యక్తిగత ప్రచారం, ప్రతిష్ఠ కోసం గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులు బలికావాల్సి వచ్చింది. భక్తిని, పూజలను, శంకుస్థాపనలను ప్రభుత్వమే నిర్వహిస్తూ ఈ కార్యక్రమాలను కార్పొరేటు వ్యాపారం స్థాయికి తీసుకువెళ్ళాడు.
భూ సమీకరణ పేరుతో రాజధాని నిర్మాణానికి అవసరానికి మించి ఎక్కువ భూములు బలవంతంగా సేకరించారు. భూములిచ్చిన రైతులకు ప్యాకేజీ ప్రకటించి వారి జీవనోపాధి హక్కును కాలరాస్తున్నారు. అందమైన ఊహల్లో విహరించమంటున్నాడు. కాపిటల్ రీజనల్ డెవలప్‌మెంట్ (జ=ణూ) ను ఏర్పాటుచేసి, రాజధాని ప్రాంతాన్ని 8 వేల చ||కి.మీ. విస్తీర్ణానికి పెంచి, రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టాడు. శాస్త్రవేత్తలు, పర్యావరణ వేత్తలు కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేస్తే భవిష్యత్తులో భూకంపాలు, వరదలు, పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని చెప్పినా పట్టించుకోవడం లేదు. భూములు కోల్పోయిన రైతులకు, కౌలు రైతులకు, వ్యవసాయం పై ఆధారపడి బ్రతుకుతున్న ప్రజలకు రాజధాని అభివృద్ధి వెలుగు నీడల్లో వీరి జీవితాలు చీకట్లోకి నెట్టివేయబడతాయి. ‘కాపిటల్ సిటీ’ వీరందరికి ‘కాపిటల్ పనిష్‌మెంట్’ అవుతుంది. అభివృద్ధి చెందిన జిల్లాల్లోనే అభివృద్ధి కేంద్రీకృతం అవుతోంది. ఇది ప్రాంతీయ అసమానతలకు దారి తీస్తుంది. రాయలసీమ ప్రాంతం నిర్లక్ష్యం చేయబడుతోందని అభిప్రాయం బలపడుతోంది.
పారిశ్రామిక విధానం వర్సెస్ వ్యవసాయ రంగం : రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విదేశీ పెట్టుబడులకోసం వేలకోట్ల ప్రజాధనాన్ని వృధాచేస్తున్నారు. తమ రాష్ట్రాలు పెట్టుబడులకు అనుకూలమనీ, పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను రెండు వారాల్లో యిస్తామనీ, అవసరమైన భూమిని, నీరును, విద్యుత్తును, పన్నుల రాయితీలను యిస్తామనీ ప్రకటించారు. వారి కోసం 10 లక్షల ఎకరాలు ల్యాండ్ బ్యాంకు, 10 శాతం నీటిని రిజర్వు చేస్తామని, విద్యుత్తుకు సబ్సిడీ యిస్తామని పారిశ్రామిక విధానాలను ప్రకటించారు. కానీ, తీవ్ర సంక్షోభంలో ఉన్న వ్యవసాయరంగాన్ని ఆదుకోవడం లేదుకదా, మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రైతుల ఆత్మహత్యలను నివారించడానికి నిర్దిష్టమైన చర్యలు చేపట్టకుండా, గత ప్రభుత్వాల మీద నెపం వేస్తూ కేవలం నష్టపరిహారంను పెంచుతున్నారు. నష్టపరిహారంతో రైతుల ఆత్మహత్యలు ఆగవు. రైతులకు వ్యవసాయంపై భరోసా కల్పించాలి. నీటిపారుదల సౌకర్యాలను కల్పించాలి. అవసరమైన ఋణ సదుపాయం యివ్వాలి. పంటకు గిట్టుబాటుధర కల్పించాలి. మార్కెట్ శక్తుల నుండి వ్యవసాయాన్ని కాపాడాలి. రైతుల ఋణ మాఫీలో జరిగిన అవకతవకలు, నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించడంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకుల జోక్యం పరిశీలిస్తూ రైతులపట్ల ప్రభుత్వం వ్యవహారం స్పష్టం అవుతూ వుంది. ప్రస్తుతం రెండు ప్రభుత్వాలు అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలు వ్యవసాయాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టి రైతుల ఆత్మహత్యలను పెంచుతాయే తప్ప నివారించవు. పాలకులు అనుసరిస్తున్న ‘అభివృద్ధి’ విధానాల వలన మెజారిటీ ప్రజలు జీవనోపాధిని కోల్పోతారు. వారి జీవించేహక్కు కాలరాయబడుతుంది.
అభివృద్ధి – నిర్బంధం : ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అవి అమలు చేసే ఆర్థిక విధానాల్లో మార్పులేదు. పాలనా పద్ధతిలో మార్పులేదు. గత రెండున్నర దశాబ్దాల ”పాలకుల అభివృద్ధి”లో సహజవనరుల విధ్వంసం, ప్రజల విస్తాపన పెరిగింది. వీరి అభివృద్ధి నమూనాలో 10 శాతం మంది బాగుపడ్డారు. 90 శాతం ప్రజలు అభివృద్ధికి దూరంగా గెంటివేయబడ్డారు. ఆర్థిక అసమానతలు, పేదరికం పెరుగుతూ ఉన్నాయి. పేదరికం హక్కులు లేమికి దారితీస్తుంది. హక్కుల మధ్య పోటీ ఏర్పడుతుంది. సామాజిక సంక్షోభం తీవ్రమవుతుంది. దీన్ని ప్రభుత్వాలు శాంతిభద్రతల సమస్య అంటూ ప్రజల హక్కులను నియంత్రించే విధానాలను, చట్టాలను అమలు చేస్తున్నారు. ఉదాహరణకి, ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విధానాలను, రాజకీయ నాయకులను విమర్శించడం దేశద్రోహం అంటూ ఒక సర్కులర్ జారీ చేసింది. ప్రత్యామ్నాయ రాజకీయాలను, ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాలను ప్రచారం చేయడం లేదా వాటిని అమలు చేయడం ప్రభుత్వాలు సహించడం లేదు. మావోయిస్టు ఉద్యమంపై అమలు చేస్తున్న అణచివేతను, ఆపరేషన్ గ్రీన్‌హంట్‌లను వ్యతిరేకిస్తూ పౌరహక్కుల సంఘం, ఆపరేషన్ గ్రీన్‌హంట్ వ్యతిరేక కమిటి తలపెట్టిన సదస్సులు, సమావేశాలను రెండు ప్రభుత్వాలు అడ్డుకున్నాయి.
అభివృద్ధి – హక్కులు : వాస్తవానికి నిజమైన అభివృద్ధికి హక్కుల మధ్య పోటీ లేదు. అభివృద్ధి హక్కులను పరిరక్షించి, విస్తరించేదిగా ఉండాలి. ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం, అందరికీ సమాన అవకాశాలు అందుబాటులో ఉండటం, హుందాగా, ఆత్మగౌరవంతో బ్రతికే పరిస్థితులు ఉండటమే నిజమైన అభివృద్ధి. అందుకే హక్కులు అభివృద్ధిలో అంతర్భాగం. ఈ అవగాహనను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. ప్రస్తుతం పాలకుల విధానాల ఫలితంగా హక్కులకు ఎదురయ్యే సవాళ్ళను సమస్యలను ఎదుర్కోడానికి బలమైన హక్కుల ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా పయనించడానికి అవసరమైన కార్యక్రమాలను రూపొందించి, కార్యరంగంలో అమలుచేయడానికి పౌరహక్కుల సంఘం 17వ రాష్ట్ర మహాసభకు సన్నద్ధం అవుతుంది. ఈ మహాసభలు విజయవంతం కావడానికి మీ అందరి సహాయ సహకారాలను అందిస్తారని ఆశిస్తున్నాం.