శిలాలోలిత
అక్కడో వూరుండేది
అక్కడ మనుషులు౦డేవారు.
చేలూ చెలకాలుండేవి
చెట్టా పట్టాలేసుకుని బతికేవాళ్ళు.
సింగిడి బతుకుల్లో వెలుతురు ముద్ద లూ౦డేవి
అక్కడో తండా వుండేది. సేద్యం చేసుకుంటే హాయిగుండే స్ధితుండేది
ఇప్పుడక్కడ ఇవేవీ లేవు
ఈత మొండెం దిగులుగా కన్పిస్తుంది
తల నరికి, పండ్లు నరికి రెక్కలు నరికినట్లుంది
పోలేపల్లి మనుషులంతా ఆ ఈత మొండెం లెక్కనే వున్నారు. తండా, తండా వరద గూళ్ళ్తె
దు:ఖవర్షాన్ని కురిపిస్తున్నారు.
భూసేకరణలో సర్వం కోల్పోయారు. మందుల కంపెనీల కొరకై భవనాల నిర్మాణాలు, వెడల్పైన రోడ్లు, బోరులు, విద్యుత్ తీగలు ఉరితాళ్ళై రైతుల జీవితాలపై వడగళ్ళు కురిశాయి. 50 ఎకరాలున్న ఆసామి సైతం కట్టుగుడ్డలతో, పిల్లా పాపలతో రోడ్డు మీద నిలబడున్నారు.
ఒక్కో వ్యక్తిని కదిపితే, ఒక్కో జీవితం మాటల గుండా ప్రవహిస్తోంది.
ఈ భూమ్మీదే పుట్టిన. ఈడనే కమాయించిన. ఈ భూమి తల్లిని నమ్ముకున్న నా బొంద కూడా ఈడ్నే పెట్టాలె. నాజాగ కొచ్చి, నా ఇంట్ల కొచ్చి, నాకు భూమి లేకుండ జేసిన్రు . నాకు ఏలొద్దు లచ్చలొద్దు నా భూమినాక్కావాలె. కోటి రూపాయలైన వొద్దు’, నా భూమి నాకు యిప్పిచ్చున్రి. గంతెసాలు’
మాటల్లో పౌరుషం. కళ్ళల్లో కన్నీరు, అభిమానం కోల్పోయి, తమ ఆస్థిని తామే అడగాల్సి వచ్చినందుకు ఆవేశాలు, వాళ్ళ మాటల్లోంచి దు:ఖపు గుండె చెరియలు అమా౦తంగా విరిగి పడ్తున్నాయ్.
‘భూములు ఎంత కమ్ముకున్నారు?’
అన్నప్రశ్నకు – విసురుగా వచ్చిన సమాధానం
భూములు అమ్ముతున్నమా? లేదు. గుంజుకున్రు-
ఈ ఒక్క మాటే చాలు అక్కడ జరిగిన జరుగుతున్న అవినీతిని అద్దం పట్టడానికి
”గత్తరొచ్చి, ఉప్నెనొచ్చి, వరదలొచ్చి, ఊళ్ళు పోయినయ్ అనియిన్నంగాని, యిట్ల భూమిని మింగే రాబందులనెన్నడు ఎరగం – ఊరిని మింగే కొండసిలువొచ్చింది”.
తాత ముత్తాతలు ఇచ్చిన భూమిని సాక్కు౦టూ బతుకుతున్న వాళ్ళ యివ్వాల్టి స్తితి వస్తే – వివర్ణమైంది మనసు
1240 ఎకరాల మా భూమి భూసేకరణలో పోయింది. నలభై మందికి పైగా పోరాడి ప్రాణాలు కోల్పోయారు. ఒట్టి వూరు. ఇండ్లు, వెలిసిన మనుషులు మిగిలారు. ముదిరెడ్డి పల్లె, తండా, పోలేపల్లి, రపం చెక్కెసిన బుద్ధుడిలా మౌనంగా మిగిలాయక్కడ.
మహమ్మద్ జబ్బర్
50 ఎకరాల పొలం మాది. 50 మంది కుటుంబ సభ్యులం. ఇప్పుడు మాకు సెంటు భూమి కూడా లేదు. మేం అమ్మమన్నా, పొలుసుల దౌర్జన్యంతో బలవంతంగా చెక్కులు ఇచ్చారు. 12 వేలు ఎకరమన్నారు అని కూడా అంతా యివ్వలేదు. కంపెనీ వాళ్ళకు 17 లక్షలకు ఎకరం చొప్పున యిచ్చినట్లు తెలిసింది. కనీసం 12 లక్షల కాడికన్నాకట్టి యిమ్మని కలెక్టర్‌కి నివేదన పత్రం యిచ్చాం. అతీగతీ లేదు. బతుకు తెరువు లేక రోడ్లమీదున్నాం.
రవీందర్ గౌడ్
35 ఎకరాలు పవి. అన్నీ గుంజుకున్నారు. ఉద్యోగమిస్తామన్నారు. 200 గజాలలో ఇల్లు కడతామన్నారు.ఊరి పెద్దల్ని జమ జేసి12 మంది కమిటీలో కూర్చొని నిర్ణయాలు తీసుకున్నారంట. 370 కుటుంబాలు సర్వనాశనం అయ్యాయి. అందరు చదువురానోళ్ళే. రైతులే. గ్రీన్ పార్క్ వస్తదంట. అరవిందో ఫార్మసీ వస్తదంట అవి తెచ్చే రసాయనాలతో ఊర్లన్నీ ఖరాబు కవాడే కాదు. ఇటు కృష్ణనీరు పాడైతది. వేరే దేశాల్లో ఈ మందుల కంపెనీ పెడితే వాళ్ళకు రోగాలొస్తయని. మనదేశం ప్రజలు కారు చౌకని యిక్కడ పెడ్తున్నారు. అడిగేటోడు ఎవరు? వినేటోడు ఎవరు? న్యాయం ఎక్కడిది? న్యాయం ఎవ్వరి చేతులుంది? ఇట్లాంటి విషపూరితమైన కంపెనీ లొద్దంటున్నాం. ప్యాక్టరీలొద్దు. ఆత్మగౌరవంతో బతికే బతుకులే చాలు మా భూమి
మాక్కావాలి.
రవూఫ్
15 ఎకరాల మావి. పైస తీసుకోలేదు. మా భూమి మాకే అన్నం. అయినా గుంజుకున్నరు.యిప్పుడు బతుకు ఎల్లకన్నాయియ్యి. పైసల మరి అంటే మాతాన లేవు. కోర్టులున్నయ్. ఆనాడు వద్దన్నవ్‌గదా అంటు౦రు. ఎకరాకు లక్ష ఆదాయమొచ్చేది. మేమెట్ల బతకాలి?
సుక్కమ్మ
రెండెకరాలు మావి పన్నెండేలు అన్నరు. ఒక ఎకరం పైసలిచ్చిన్రు. మిగతా పైసలియ్యలే. అడిగితే లేవంటున్రు. ఆ పైసలన్నీ ఐపోయె సూపర్నెంటుకు, యం.ఆర్. వోకు మధ్యనోడినే యిచ్చుకుంట వచ్చేసరికి యింటికేం మిగిలినయ్ . మాకు న్యాయం జరుగలేదు. అరవిందో కంపెనీ రాయి ఎత్తేసినం, జెండాలు పీకినాం. బోర్ తవ్వితే పూడ్చినం. పోలీసోల్లకి కాపోల్ల పిల్లగాడు, మాదిగోళ్ళ పిల్లగాడు యీపులిచ్చిన్రు. ముగ్గురు పిల్లగాళ్లు సచ్చిపోయిన్రు. ఆరెకరాల భూమి పోయింది. యినంగానే మా నాయనకు గుండెపోటు వచ్చి చచ్చిపోయిండు.
పెద్ద పెంటయ్య
మా గ్రామపెద్దలు ఈ తీరు చేసిన్రు. సేను పాయె, సెలకపాయె. కోటి రుపాయలిచ్చినా మా కొద్దు. మా భూమి మాకే కావాలి. అంటూ పోలికేక పెట్టాడు.
మొగులమ్మ
ఐదుగురుమంది పిల్లలు నాకు.ఎనిమిది ఎకరాలు పాయె. తండ్రి లెక్క మంచిగుండె మగడు భూమి పోంగనే ప్రాణం తీసుకున్నడు. కూసునేకెనే జాగలేదు. నేనెట్ట బతకాలే . ఏంగవాలే. చెప్పున్రి. మీరన్న?
ఎల్లయ్య
25 ఎకరాలు వవి. పైసలియ్యలేదు. కలెక్టరాఫీసు చుట్టు తిరుగుతున్నాం. ఎవ్వరు పలుకుత లేరు. 11 మంది కుటుంబం వది. మొహబబ్ నగరెక్కడ? జెడ్చెర్ల ఎక్కడ? ఎట్లా తిరగాలె. ఎట్ల బతకాలె. నా భూమి నాకిపిచ౦డీ.
గంగమ్మ
ఊరి ప్ర్ఝ్జ్జజలకి నమస్తే. 5 ఎకరాలు మావి. గా చంద్రమౌళి సూపర్నెంటు మొసం జేసిండు. పెజల ముందుకి రావాలె. పైసలు పూరగన్నయియ్యల. భూమన్న యియ్యల.
హమ్రి
14 ఎకరాలు మాకున్నయ్. నా మగడు భూమి గురించే చచ్చి పోయిండు. నలుగురు పిల్లల పెండ్లిండెల్ల చెయ్యల. మీటింగులు మీటింగులు ఎన్ని తర్లో వచ్చినం. నలుగరు మొగోళ్ళు చచ్చి పోయిన్రు. మొండి గోడలోలె యరాండ్ల మున్నం. చాయ్ తాగానీక కూడా పైసల్లేవు. మా భూమి మక్కావాలె. మారెక్కలు మాకున్నయ్ సాలు.
రంగమ్మ
తిరిగినం తిరిగినం యష్టకొచ్చింది. ఉరకాలంటే ఉరికినం. కొట్టాలంటే కొట్నం, తిటంటే తిట్నం. జీపు లెక్కుమంటే ఎక్కినం. గల్లవట్టి కొట్టినం. ఐన మారలె. 2ఎకరాలు పాయె తాగనీకె గంజి కూడా లేదు.
గౌరమ్మ
భూమి ఆడుకొన్నడో లేడో తెల్వదు. వచ్చినోడు కోన్నడో, కొనవోడో తెల్వండు. కాల్జెయున్రని వచ్చిండ్రు. నరుకుతానన్న. ఐన ఈడ్చితన్నిన్రు. మీటింగుల కొచ్చి వచ్చి యష్టకొచ్చింది. పోటోలు తీస్కోని యిసుగొచ్చింది. మాట్లాడి మాట్లాడి యిసుగున పడ్డం. మా బతుకేలేం మారత లేవు. సదువుకున్నోళ్ళ్ళు మీరన్న జెప్పున్రి.
రత్నమాల
ఇది ఒక ఊరి రెండు ఊర్ల సమస్య కాదు. దేశానికి సంబంధించినవి.కొన్నాళ్ళకు యిట్లా అమ్ముకుంటూ పోతుంటే జాగానే మిగలదు. దేశానికే భూమన్నది లేకుండా పోతుంది. పచ్చటి పర్యావరణమంతా పాడైపోతోంది. నీళ్ళు,గాలి అన్నీ కలుషితమైపోతాయి. ఎముకలన్న విరిగి పోతాయి. ఒక ఊర్లో స్త్రీకి 13 సార్లు గర్భస్రావమైంది.
Pingback: పోలేపల్లి ఒక దు:ఖపు వరదగూడు « Fighting Injustice in Polepally (Jadcherla) SEZ