ఓల్గా… ఈ పేరును నేను స్త్రీవాద రచయిత్రి ఓల్గాతో పరిచయం కాకముందే విన్నాను. నన్ను చాలా ప్రభావితం చేసిన పుస్తకాల్లో ఒకటైన ”ఓల్గా నుండి గంగాతీరం” – రాహుల్ సాంకృత్యాయన్ పుస్తకం చదువుతూ-తన్మయమవుతూ, అబ్బురపడుతూ, తొలిసారి ఓల్గా అనే పేరు విన్నాన్నేను. రష్యాలో ప్రవహించే నది ఓల్గా అని తెలిసాక, నదులతో వున్న మమేకత కారణంగా ఓల్గా నదితో ప్రేమలో పడ్డాను. బహుశా పి. లలితకుమారి కూడా నాలాగే ఓల్గా నదిని ప్రేమించి తన పేరునే ఓల్గాగా మార్చేసుకుంది కాబోలు.
తెలుగు సాహిత్యానికి స్త్రీవాద స్పృహను కలిగించి, ఎనభైల నుండి వచ్చిన సాహిత్యానికి అటు, ఇటు ఒక స్పష్టమైన గీత గీసింది ఓల్గా రచనలే అనడం అతిశయోక్తి కాదు. ఎనభైలకు ముందు, ఎనభైలకి తరువాత వచ్చిన తెలుగు సాహిత్యాన్ని తులనాత్మకంగా అధ్యయనం చేస్తే ఒక స్పష్టమైన, సూటైన, ఘాటైన మార్పు కనిపిస్తుంది. అప్పటి వరకు సాహిత్యంలో రచయితలతో పాటు రచయిత్రులున్నా స్త్రీవాద స్పృహతో స్త్రీల కోణం నుంచి రచనలు చేసిన వారు తక్కువే. రంగనాయకమ్మ మార్క్సిజమ్ వెలుగులో స్త్రీ సమస్య మీద పదునైన రచనలు చేసారు. అలాగే వాసిరెడ్డి సీతాదేవి ఇంకొంత మంది రచయిత్రులు కూడా చెదురుమదురుగా స్త్రీల అంశాలను స్పృశిస్తూ రాసారు. కాల్పనిక, కాలక్షేప క్షుద్ర రచనలతో పాఠకుల్ని మన్నుతిన్న మిన్నాగుల్లా మత్తులో వుంచిన కాల్పనిక సాహిత్యాన్ని పెద్ద చీపురుకట్టతో ఊడ్చిపారేసి, స్త్రీల వాస్తవిక సమస్యలతో పాటు అప్పటి వరకు సాహిత్యంలో అంటరానివిగా వున్న అనేక అంశాలను తీసుకుని ఓ వెల్లువలాగా స్త్రీవాద రచయిత్రులు తెలుగు సాహిత్యంలోకి దూసుకొచ్చారు. వందల సంఖ్యలో రచయితృలు కథ, కవిత్వం, నవల, వ్యాస రచనల్లో ప్రవేశించి తెలుగు సాహిత్యానికి స్త్రీ వాద సొబగునద్దారు.
తెలుగు సాహిత్యంలోను, సమాజంలోను స్త్రీవాద భావాల వ్యాప్తికి దోహదం చేసి, స్త్రీవాద ఉద్యమంలో నాయకత్వ స్థాయిలో నిలబడిన వాళ్ళల్లో ఓల్గా ఒకరు. భిన్నమైన తన రచనల ద్వారా అమలులో వున్న అన్ని పితృస్వామ్య నిర్మాణాలను నిక్కచ్చిగా ప్రశ్నించిన తీవ్రమైన గొంతు ఓల్గా. పురాణ పాత్రల్ని తీసుకుని స్త్రీవాద కోణంలో వాటిని విశ్లేషిస్తూ రాసిన కథలు, ఇంతకాలం ఆయా పాత్రల్ని అర్థం చేసుకున్న తీరుకి భిన్నంగా… ఓల్గా చిత్రించిన పద్ధతికి గొప్ప వ్యత్యాసం కనబడుతుంది. ఆ కథల సంపుటి ”విముక్త”కి సాహిత్య అకాడమీ అవార్డు రావడం నిజంగా అద్భుతమైన విషయం. ‘విముక్త’కు అవార్డు రావడం ఓల్గాకి కూడా చాలా సంతోషం కలిగించింది. దానికి కారణం ఆయా పౌరాణిక పాత్రల ప్రభావం భారతీయ సమాజం మీద చాలా వుంది. ఆయా పాత్రలకి పాతివ్రత్య వాసనలద్ది భారతీయ స్త్రీలమీద ఆ భావజాలాన్ని రుద్దిన విషయం మనందరికీ తెలుసు. అందుకే ”విముక్త” ప్రభుత్వ అవార్డును గెలుచుకోవడం గొప్ప విశేషమే. ఇందుకుగాను ఓల్గాను తప్పకుండా అభినందించాలి.
తెలుగు సాహిత్యానికి స్త్రీవాద స్పృహనివ్వడంలో ముఖ్య స్థానంలో వున్న ఓల్గా రచనలు, మరెంతోమంది స్త్రీవాద రచయిత్రులుగా, కవయిత్రులుగా ఎదగడానికి, నిలవడానికి స్ఫూర్తి నిచ్చాయి. ‘నీలి మేఘాలు’ కవితా సంకలనం దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రేవతీదేవి, సావిత్రి, ఈశ్వరి, జయప్రభ, విమల, పి.సత్యవతి, కొండేపూడి నిర్మల, ఘంటశాల నిర్మల, పాటిబండ్ల రజని, శిలాలోలిత, సుజాతా పట్వారి ఇంకా ఎందెరెందరో తమ స్త్రీవాద రచనలతో తెలుగు సమాజాన్ని ఒక కుదుపు కుదిపారు. స్త్రీవాద ఉద్యమంలో నాయకత్వ స్థానంలో వుండి తెలుగు సాహిత్యాన్ని స్త్రీవాద ఎజండాతో ముందుకు నడిపి, సమాజంలో గణనీయమైన మార్పులకు బలమైన పునాది వేసిన వారిలో ఖచ్చితంగా ఓల్గా ప్రముఖ స్థానంలో వుంటుంది.
అలాంటి స్త్రీవాదికి, స్త్రీవాదానికి వచ్చిన సాహిత్య అకాడమీ అవార్డును మనసారా ఆహ్వానిస్తూ… ఓల్గాకి హృదయపూర్వక అభినందనలతో….
కె. సత్యవతి & పి. ప్రశాంతి