ఖనా ‘విద్యచే శాశ్వతంబుగ వినుతి కెక్కు’ó – భండారు అచ్చమాంబ

తెలుగులో తొలికథ రాసిన భండారు అచ్చమాంబ, స్త్రీల చరిత్రను రాసిన తొలి చరిత్రకారిణి కూడా. ఆమె రాసిన ”అబలా సచ్చరిత్ర రత్నమాల” పుస్తకాన్ని భారత వీరనారీమణుల జీవిత సంగ్రహము పేరుతో ఆమె మరణానంతరం కొమర్రాజు వినాయకరావు గారు ప్రచురించారు. ఈ సంచిక నుండి ఒక్కో వీరనారి చరిత్రను ప్రచురించాలని నిర్ణయించాము. మా ఈ ప్రయత్నం వెనక స్ఫూర్తి శ్రీ వి.ఎ.కె. రంగారావుగారు. అచ్చమాంబ గ్రాంధిక భాషలో రాసిన వ్యాసాలను పాఠకుల సౌలభ్యం కోసం వాడుక భాషలోకి మార్చి రాయడం జరిగింది. పాఠకులు ఆదరిస్తారనే నమ్మకం మాకుంది.                      – ఎడిటర్‌.

పూర్వకాలంలో ‘ఖనా’ అనే స్త్రీ జ్యోతిశ్శాస్త్రంలో అధిక ప్రావీణురాలై ఉండేది. ఆమె రాసిన కవిత్వం ఆబాలవృద్ధులకు ఎంతో ప్రియంగా ఉండేదని ఖ్యాతి గాంచింది. కాని మన దేశంలో చరిత్రలు రాసే అలవాటు లేనందున ఆమె చరిత్ర వివరంగా ఎ్కడా దొరకలేదు. దీనికి ఎంతో చింతించాల్సి ఉంది.

ఖనా తల్లిదండ్రులెవరో తెలియదు. కాని ఆమె జననీజనకులు చిన్నప్పుడే మృతి చెందటం వలన ఆమెను ఎవరో అనార్యుడు పెంచుకొని అతడే ఆమెకు జోతిష విద్య నేర్పించాడని ఒక వింత కథ చెప్తారు. ప్రాచీన కాలంలో ఆర్యులకంటె అనార్యులే జ్యోతిష్యంలో విశేష పాండిత్యం కలిగి ఉండేవారని అంటారు. ఖనా కుశాగ్ర బుద్ధి కలిగినదైనందున ఇతర బాలికలలా ఆటలతో కాలం గడపక తన పెంపుడు తండ్రి దగ్గర తక్కువ కాలంలోనే సంపూర్ణ జ్యోతిశ్శాస్త్రాన్ని అభ్యసించిందట! ఆ పెంపుడు తండ్రి ఈమె తెలివికి ఎంతగానో సంతోషించి తనకు వచ్చిన విద్యనంతటిని ఆమెకు సంపూర్ణంగా నేర్పించాడు. ఇలా పురుషులకు కూడా దుర్లభమైన గణితము, జ్యోతిష్యము ఈమెకి కరతలామలకములయ్యాయి.

ఖనా నివసించే గ్రామములోనే మిహిరుడనే బ్రాహ్మణ యువకుడు అనార్యులచే పెంచబడ్డాడు. పెంపుడు తండ్రి ఐన అనార్యుడు మిహిరుడిని పుత్రవాత్సల్యంతో పెంచి పెద్దవాడ్ని చేసి జ్యోతిషంలో అపార పండితుడ్ని చేసాడట. ఖనా, మిహిరులిద్దరూ యుక్త వయస్కులైనాక తమ పెంపుడు తండ్రుల అనుమతితో వివాహం చేసుకుని సంసారం చేస్తున్నారు.

ఖనా తల్లిదండ్రులెవరన్నదీ తెలియక పోయినా మిహిరుని వంశము మనకు తెలుసు. లోక ప్రసిద్ధుడైన విక్రమాదిత్యుడి సభలో నవరత్నములలో ఒకడైన వరాహునికి ఈ మిహిరుడు పుత్రుడట. వరాహుడు జ్యోతిషమునందు అధిక ప్రావీణుడై జ్యోతిష గ్రంథాలు కొన్ని రచించాడు. ఆయనకు మిహిరుడు పుట్టగానే జాతకము వేసి చూసి అందులో సంఖ్యలు తప్పు అవటం వలన, నూరేళ్ళ ఆయుర్ధాయం ఉన్నా తండ్రి లెక్కకు పది సంవత్సరాలే జీవితమని వచ్చిందట. అందుకు వరాహుడు ఎంతో చింతించి పిల్లవాడు పది సంవత్సరాలు పెరిగి మృతి చెందితే విశేషమైన దుఃఖమవుతుంది కనుక, ఇప్పుడే వీడినెక్కడైనా వదిలేస్తే బాగుండునని అనుకుని, కర్రదోనెలో బాలుడ్ని ఉంచి నీటి ప్రవాహంలో వదిలేశాడట. తర్వాత ఆ బాలుడు ఒక అనార్యునికి దొరకగా, వారు సాకి విద్య నేర్పించిన సంగతి ముందే వ్రాసాను.

వివాహానంతరం ఖనా, మిహిరులు ఇద్దరూ ఆర్యులలోనికి వెళ్ళాలని కోరిక కలిగి, తమ పాలనాకర్తల అనుమతి అడిగారు. అందుకు వారు సమ్మతించి వారిని పంపిరావడానికి వారి వెంట ఒక అనార్యదాసిని పంపి ఆమె చేతికి కొన్ని జ్యోతిష గ్రంథాలను ఇచ్చారు. ఆర్యులుండే ప్రాంతపు పొలిమేర దాటి వారి దేశంలోకి వెళ్ళేటపుడు, ఆ స్త్రీ జ్యోతిషంలో ఖనాకి, మిహిరునికి ఉన్న ప్రజ్ఞను పరీక్షించ సాగింది. వారు జ్యోతిషంలో పండితులని తెలిస్తే ఆ పుస్తకాలు మరల స్వదేశానికి తీసుకురమ్మని, లేనియెడల పుస్తకాలని వారికిచ్చిరమ్మని అనార్యులు చెప్పారట. కాని వారిని పరీక్షించటానకి ఆ దాసి అక్కడ ఈనడానికి సిద్ధంగా ఉన్న ఆవుని మిహిరునికి చూపించి ‘ఈ ఆవుకి ఎర్ర దూడ పుడ్తుందా, తెల్లదూడ పుడ్తుందా’ అని అడిగింది. మిహిరుడు ‘తెల్లదూడ పుడ్తుంద’ని జవాబు చెప్పాడు. అంతలోనే ఆ ఆవు ఈనగా ఎర్రదూడ పుట్టింది. దాంతో ఆ దాసి మిహిరునికి జ్యోతిష జ్ఞానము పూర్తిగా లేదని తలచి, ఆ పుస్తకాలని అతనికిచ్చి తన స్వదేశానికి వెళ్ళిపోయిందట. దాంతో మిహిరుడు తనన్ని  రోజుల నుండి శ్రమపడి అభ్యసించిన విద్యలో తాను ప్రవీణుడు కానందుకు ఎంతో చింతించి యింత కష్టపడినా రాని విద్య ఇక పుస్తకాల వలన ఏమొస్తుందని కోపంతో ఆ పుస్తకాలని ఏట్లో పారవేసాడు. అప్పుడు ఖనా దగ్గరలోనే ఉంది కనుక, పరిగెత్తుకెళ్ళి ఆ పుస్తకాలలో రెంటింని మాత్రం నదీ ప్రవాహంలో నుండి ఇవతలికి తీసింది. మిగిలిన పుస్తకాలు ఆమెకి దొరకక ప్రవాహంలో కొట్టుకుని పోయాయి. తర్వాత దంపతులు తిన్నగా విక్రమాదిత్యుడు వేటకి వచ్చి ఉన్న స్థలానికి దగ్గర్లోని గ్రామానికి చేరారు. అక్కడ విక్రమాదిత్యుడు విద్వాంసులని గౌరవిస్తాడని విని మిహిరుడు రాజు సందర్శనం చేసి తన విద్యావిశేషాన్ని కొంత కనపరచగా రాజు సంతోషించి ఆయనని తన ఆస్థాన పండితుడిగా చేసి తన గ్రామానికి తీసుకెళ్ళి వరాహుని పిలిపించి ఈ దంపతులని అతనికి చూపించి ‘వీరిని నీ ఇంట ఉంచుకోమని’ చెప్పాడు. ఆపై వరాహుడు వారిని తన ఇంట్లో ఉంచుకున్నాడు. కొంతకాలానికి వరాహునికి తాను పారవేసిన తన కుమారుడే ఈ మిహిరుడని తెలిసి తండ్రీ కొడుకులిద్దరికీ అపరిమిత ఆనందం కలిగింది. తర్వాత ఎప్పుడూ వరాహుడు, మిహిరుడు, ఖనా తమలో  తాము జ్యోతిషం గురించి అనేక ప్రసంగాలు చేస్తూ జ్యోతిశ్శాస్త్రములోని కొత్త కొత్త సంగతులను కనిపెట్టసాగారు. మిహిరుడు తండ్రితో సమాన విద్యా విశేషాలు కలవాడు. విక్రమార్కుని సభలోను, దేశమంతటిలోను ఆయన కీర్తిని కొనియాడని వారు లేరు. ఖనా ఇంటి వద్ద ఉండి రాజసభకు ఎప్పుడూ పోకపోయినా, ఆమె యొక్క సుగుణ సంపద, విద్యా పరిమళం దిగంతాలకు వ్యాపించింది. వరాహుని కోడలు, మిహిరుని భార్య అయిన ఖనా ఖగోళ విద్యలో అధిక ప్రావీణురాలని అందరూ చెప్పుకుంటుండేవారు.

ఇలా ఉండగా ఒకరోజు విక్రముడు వరహుని పిలిచి ఆకాశంలో గల నక్షత్రాల సంఖ్య చెప్పమన్నాడట! అందుకాయన గ్రంథాలను శోధించి కూడా నక్షత్రాల సంఖ్యను కనుక్కోలేక, ఆకాశంలోని నక్షత్రాలని లెక్కించటానికి వీలు లేనందున ఎంతో చింతించి ఆ సంగతి కుమారునికి తెలిపాడు. కుమారుడు తన శక్తి అంతా వినియోగించి చూసినాగాని ఆ యుక్తులేవీ నక్షత్ర సంఖ్య తెల్పడానికి ఎంత మాత్రమూ పనికిరాలేదు! ఇలా తండ్రీకొడుకు లిద్దరూ ఏం చేయ్యాలో తోచక రాజసభలో తమకు అవమానం కలుగునని చింతాక్రాంతులై ఉండగా, వారిని చూచి ఖనా వారి విచారానికి కారణం అడిగింది. ఆమె అందుకు కారణం తెల్సుకొని దీనికింత విచారం ఎందుకని వారికి కొంత ధైర్యం చెప్పి తానొక గడియసేపు లెక్కవేసి నక్షత్ర సంఖ్యని కనిపెట్టి వారికి చూపించింది. దానికి వారు సంతోషించి భోజనాలు చేసి, రాజసభకు పోయి ఆ నక్షత్ర సంఖ్యని, దానిని కనుగొన్న తీరుని వివరించగా సభికులం దరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. అప్పుడు వరాహుడు ఆ మహాకార్యం తమ ప్రజ్ఞ వలన తెలియలేదని, తన కోడలే విద్యాధికురాలైనందున ఈ సంఖ్య సులభంగా కనిపెట్టగలిగిందని చెప్పాడు. ఆ మాటవిని అక్కడున్నవారందరూ ఆ మనిషిని వేనోళ్ళ కొనియాడారు. విక్రమాదిత్యుడు చాలా సంతోషించి ”నా సభలోని నవరత్నములలో రేపటి నుండి ఆమె దశమ రత్నంగా ఉంటుంది. కాబట్టి రేపట్నుండి ఆమెని తప్పక సభకు తీసుకురమ్మని ఆనతిచ్చాడు! రాజాజ్ఞ విన్నంతనే వరాహునికి అత్యంత భయం కలిగింది. ఎందుకంటే, స్త్రీలను రాజ సభలలోకి తీసుకుపోవటం ఎంతో అవమానకరమని, లోకనిందాస్పదమని వరాహుని అభిప్రాయమట! కోడలిని రాజసభకు తీసుకుపోకపోతే రాజు అత్యంత ఆగ్రహిస్తాడని తలచి వరాహుడు ఇందుకు మూలకారకు రాలైన ఖనాను చంపివేస్తే బాగుండని నిశ్చయించుకున్నాడట! వరహుడు ఆ సంగతి కుమారు నికి తెలిపి నీ భార్య నాలుక కోయమని ఆజ్ఞాపించాడట! కాని సద్గుణవతి ఐన ప్రియభార్యని అంత క్రూరంగా చంపడానికి మిహిరునికి ఎంత మాత్రము మనసొప్పలేదట! ఈ సంగతంతా ఖనాకి తెలిసి మామగారి ఆజ్ఞను ఉల్లంఘించక శిరసావహించి తన నాలుకని చూపించి ఖండించమని భర్తని భక్తితో వేడుకొందట! దాంతో అతడు మనసు దృఢపరచుకొని ప్రియభార్య యొక్క నాలుకను ఖడ్గంతో కోసేసాడట! దాన్తో ఆమె త్వరలోనే యీహలోకం విడిచిందట!

కొందరీ కథను ఇట్లా చెప్తారు: విక్రమార్కుని ఆజ్ఞ ప్రకారం ఖనా అతని సభలోని పదవ రత్నమయ్యిందని, తరువాత కొన్ని రోజులకి చనిపోయిందని. ఇలా చెప్పేవారు ఈమె సహజంగా మానవులందరూ మృతి చెందినట్లే మృతి చెందిందని, పరులచే చంపబడలేదని చెప్తారు. మొదటి కథకంటే ఈ రెండో కథే ఎక్కువ నమ్మకంగా ఉంది. విక్రముడి కాలంలో స్త్రీలకు రాణివాసంలేదని అనేక విషయాల వలన తెలుస్తోంది. అదీగాక అసలు రాణివాసం ఉంటే రాజు ఖనాను రాజసభకు తీసుకురమ్మని ఎలా చెప్పించాడు? తన ప్రియభార్యని నిష్కారణంగా మిహిరుడు చంపాడన్న కౄరపు మాట నమ్మదగింది కాదు. కనుక రెండో కథ నమ్మశక్యంగా ఉంది.

ఈ చరిత్రలో అనేక సాధ్యాసాధ్యాలైన సంగతులు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. వాటిని వదిలేసినా పూర్వకాలమునందు ఒక స్త్రీ, పురుషులకు కూడా అసాధ్యమైన జ్యోతిర్విద్యని అభ్యసించి, ప్రావీణ్యత పొంది ఉందని, ఆమెకు జ్యోతిషము యొక్క భాగాలైన జాతక స్కంధములోను, గణిత స్కంధములోను అసమాన ప్రజ్ఞ కలిగి ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ఖనా యొక్క బుద్ధి ఇలాంటి క్లిష్టమైన విషయాలలో ఇంత సులభంగా ప్రవేశించటం చూస్తే, స్త్రీల బుద్ధి పురుషుల బుద్ధికంటె మందమని, ఆడవారి మెదడు (ఆలోచన) మగవారి మెదడుకంటె బలహీనమని తక్కువ తూగునని అందువలన పురుషులకు తెలిసినంత జ్ఞానం అతివలకు తెలియుట అసంభవమని  చెప్పేవారి మాటలన్నీ పక్షపాతపు ప్రవచనాలని నిర్వివాదంగా చెప్పవచ్చు. స్త్రీలు నైసర్గిక మూర్ఖురాళ్ళని, విద్యాగంధము ఏ మాత్రం సోకనివ్వనందున వారు మూర్ఖురాళ్ళుగా కనిపిస్తారని చెప్పవచ్చు. బాల్యంలో బాలురు బాలికలు సమాన తెలివితేటలు కలిగి ఉంటారని మనకందరికీ తెలిసినమాటే. బాలురకంటె బాలికలెప్పుడూ బుద్ధి హీనులుగా ఉండరని బాల్యంలో ఆడపిల్ల ఎలాంటి తెలివికలదైనా తల్లిదండ్రులు ఆమెకెంత మాత్రము విద్య నేర్పక జ్ఞానాభివృద్ధికి తగిన సదుపాయములేవి చేయనందున ఆమె వివేక హీనురాలవుతోంది. బాలుడు చిన్నతనంలో ఎంత మందబుద్ధి ఐనా వానికైదేళ్ళు రాగానే తల్లిదండ్రులు విద్య నేర్పి అతనికి గల మాంద్యమును తొలగించి జ్ఞానాభివృద్ధి కొరకు అనేక శాస్త్రాలను చదివిస్తారు. కాబట్టి వాడు మిక్కిలి ప్రజ్ఞావంతుడై ప్రసిద్ధుడవుతాడు. చిన్నపుడు అతనికంటె ఎక్కువ ప్రజ్ఞగల అతని అక్క మాత్రం విద్యాగంధం ఏమీలేనందున మహా మూర్ఖశిఖామణి అయ్యుంటుంది. ఇలా తల్లిదండ్రుల పక్షపాతమే పురుష సంతతిలోను, స్త్రీ సంతతిలోను జ్ఞానాన్ని గురించిన మహా అంతరం వచ్చిందేగాని, స్త్రీల స్వాభావిక మూర్ఖత్వం వలన కాదు. కాబట్టి స్త్రీలకు పక్షపాతం లేకుండా పురుషులు విద్య నేర్పిస్తే స్త్రీలు కూడా అసామాన్య బుద్ధి చాతుర్యాలను చూపి పురుషులకు అనేక విషయాలలో సాయం చేసి అర్థాంగి అన్న  పేరుని సార్థకం చేస్తారని నొక్కి వక్కాణించటానికి సందేహం లేదు.

Share
This entry was posted in చరిత్ర చీకటిలో వెలుగు రవ్వలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.