నిర్భయ (భూమిక నిర్వహించిన కథ, కవితల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ) – కె.వాసవదత్త రమణ

”రాజ్‌ చదువుకోవచ్చుగా పరీక్షలు దగ్గరికి పడుతున్నాయి కదరా” వైదేహి టేబుల్‌ మీద వండిన గిన్నెలు సర్దుతూ కొడుకుతో అంది వైదేహీ.
”ఓకే అమ్మా” విరాజ్‌ టీవీ ఛానల్‌ రిమోట్‌ మారుస్తూ అన్నాడు.
”ఏరా టీవీ చూడకుండా అసలు ఉండలేవా, ఏం చెబుతుంటే అర్థం కావడం లేదా? కాసేపు చదువుకో” కోపంగా అంది.
”అమ్మా నువ్వు కాలేజీలో లెక్చరర్‌వి. నాకు ఆ విషయం బాగా తెలుసు. కానీ రోజూ ఇలాగే స్పీచులు ఇవ్వకు ప్లీజ్‌, నీకు దణ్ణం పెడతాను” విసుగ్గా అన్నాడు.
”చాల్లే పిల్లాడివి పిల్లాడిగా ఉండక ముదురు మాటలకు చదివే ఇంజనీరింగ్‌ చదువుకు పెద్ద ప్రొఫెసర్‌లా ప్రవర్తిస్తున్నావు టేబుల్‌ మీద అన్ని పెట్టాను, లేచి చదువుకోని అన్నం తిను.” కఠినంగా అంటూ హ్యాండ్‌ బ్యాగ్‌ తీసుకొని విసురుగా బయటికి నడిచింది వైదేహి.

కొడుకు ప్రవర్తనకి ఆమె మనసు బాధతో కుములుతోంది. ఆమెకి చనిపోయిన తన భర్త రామచంద్ర గుర్తుకు వచ్చాడు. కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా, సిటీ బస్సు పరుగు ఎత్తుకుంటూ ఎక్కింది.

రామచంద్ర, వైదేహి ప్రేమించుకొని పెద్దల్ని ఎదిరించి మరీ పెళ్ళి చేసుకున్నారు. కులాలు వేరే అవడం, ఆర్థిక స్థితి వేరవడంతో ఇద్దరి తల్లిదండ్రులు వాళ్ళని పూర్తిగా వేలివేసారు. అతనికి బెంగుళూరులో మంచి ఉద్యోగం రావడంతో, ఇద్దరు తమ సంసారాన్ని అందరికి దూరంగా ప్రారంభించారు. కాని విధి వక్రించడంతో బైక్‌ యాక్సిడెంట్‌లో అతను మరణించాడు. అప్పట్నుంచే వైదేహి ఒంటి చేత్తో సంసారాన్ని ఈదుకుంటూ వస్తోంది. ఉన్న ఒక్క కొడుకు ఇప్పటి తరం కొత్త పోకడలకు ఆకర్షింపబడటం ఆమెకు ఆందోళన కలిగిస్తోంది.
—–
”అమ్మ నాన్న టాటా నేను వెళ్తున్నా” ఉత్సాహంగా అంది కీర్తి.
”బాయ్‌ కీర్తి” అన్నాడు వేణుమాధవ్‌.
”ఏంటండి ఇది, నాకేం నచ్చడం లేదు. ఇంత రాత్రివేళ ఇలా ఒంటరిగా ఆడపిల్లను పంపడం ఏమీ బాగులేదు” కోపంగా అంది దేవిక.

”అమ్మా ప్లీజ్‌, కాదనకు, నా పుట్టినరోజు పార్టీ రాత్రి పన్నెండు గంటలకి. ఆ టైంకే బోటులో కేకు కటింగ్‌. నాకు చాలా ఎక్జైటింగా ఉంది. మా ఫ్రెండ్స్‌ అందరు కలిసి నాకు పార్టీ ఇస్తున్నారు. అమ్మా కార్‌లో తీసుకువెళ్లి మళ్లీ నన్ను తీసుకుని వస్తారు. భయం ఏమీ లేదమ్మా” తల్లి చుట్టూ చేయి వేస్తూ గారంగా అంది కీర్తి.

”అమ్మ అంతే లేరా, అలాగే అంటుంది. నువ్వెళ్లు, ఎంజాయ్‌ ది పార్టీ, ఫోటోలు చాలా తీసుకోండి. అన్ని ఫేస్‌బుక్‌లో పెట్టాలి” హుషారుగా అన్నాడు వేణుమాధవ్‌.

నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు గేటు ముందు కార్లు దగ్గర నిలబడి ఉన్నారు. ”హాయ్‌ కీర్తి, కం కం” అంటూ గోలగా అరుస్తూ అందరూ కలిసి కీర్తికి స్వాగతం పలికి నవ్వుకుంటూ, అరుచుకుంటూ వెళ్లారు.

దేవిక పంటి బిగువున కోపాన్ని అణిచి పెట్టుకుంటూ లోపలికి నడిచింది.

”ఏమైంది దేవిక, ఎందుకు అంత సీరియస్‌ అవుతున్నావు. అది ఏదో సరదాగా పుట్టినరోజు పార్టీ అని వెళ్తోంది. వాళ్ళ ఫ్రెండ్స్‌ మన ఇంటి దగ్గర దింపుతాం అని నా దగ్గర పర్మిషన్‌ కూడా తీసుకున్నారు. అంతగా మరీ ఆలస్యం అయితే వాళ్లింట్లోనే

ఉండిపోతానంది కీర్తి. ప్రతీదానికి అడ్డంగా ఆలోచించి దాని పుట్టినరోజు పండగ వాతావరణాన్ని పాడుచేయకు” అన్నాడతను.

”ఏం మగవాళ్లో మీకు కత్తికి రెండు వైపులా పదునులే?” ఆమె కోపంగా అన్నది.

ఆ రాత్రంతా ఆమెకు కాళరాత్రే. కీర్తి ఏం చేస్తోందో, ఎప్పుడు వస్తుందో అన్న ఆలోచన ఆ తల్లి మనసులో అలజడి రేపుతునే ఉంది. రాత్రంతా కునికిపాట్లు పడుతూ ఎప్పుడో తెల్లారగట్టు ఆమె నిద్రలోకి జారింది.
—–
”ఏవండి, లేవండి” ఆదుర్దాగా భర్తని నిద్రలేపింది దేవిక.

”ఏమైంది. అప్పుడే తెల్లవారిందా, ఇక నీ దండకం మొదలు” అనుకొంటూ లేచాడు వేణుమాధవ్‌.

”ఏవండి ఆరు దాటుతోంది కీర్తి ఇంకా ఇంటికి రాలేదు. సెల్‌కి చేస్తే స్విచ్‌ ఆఫ్‌ అని వస్తోంది” కంగారుగా అంది.

ఆ మాటకి అతనికి నిద్ర మత్తు వదిలిపోయింది. అదేంటి అంటూ గబగబా లేచి కీర్తి సెల్‌కి కాల్‌ చేసాడు. సెల్‌ రెస్పాన్స్‌ లేదు. వాళ్ళ ఫ్రెండ్స్‌కి గబగబా నాలుగైదు ఫోన్లు చేశాడు. అందురు ఇంట్లోనే ఉన్నారు. కంగారుగా షర్టు ప్యాంటు వేసుకొని సెల్‌ తీసుకొని బయటికి నడిచాడు. ముందు దగ్గరగా ఉన్న నిన్న రాత్రి వచ్చిన ఫ్రెండ్‌ ఇంటికి వెళ్లాడు. ఆ అమ్మాయి ”అర్థరాత్రే అందరం ఇంటికి చేరాము అంకుల్‌” అని చెప్పడంతో అతనిలో కంగారు, వణుకు పుట్టుకు వచ్చింది. ”మరీ కీర్తి ఏడమ్మా, ఎక్కడుంది?” అని అడిగాడు.

”అదేంటి అంకుల్‌! కీర్తి ఇంటికి రాలేదా?” ఆశ్చర్యంగా అడిగింది ఆ అమ్మాయి.

”అందరు ఎవరి ఇంటి దగ్గర వాళ్లు దిగిపోయాం అంకుల్‌. చివరలో విరాజ్‌ కీర్తిని దింపేసి ఇంటికి వెళ్లిపోతాను అన్నాడు. మరికీర్తి ఏమైంది ఎక్కడికి వెళ్లింది?” ఆ అమ్మాయి ఏడుపుగొంతుతో అంది.

”ఆ విరాజ్‌ ఇల్లు ఎక్కడ?” వేణుమాధవ్‌ గొంతు పెగుల్చుకుంటూ అడిగాడు.
ఆ అమ్మాయి చెప్పిన అడ్రెస్‌ పట్టుకొని కార్‌లోంచి దిగి విరాజ్‌ ఇంట్లోకి ఆదుర్దాగా పరుగెత్తాడు.
అతను కాలింగ్‌ బెల్‌ కొట్టగానే ”ఇంత తెల్లవారే ఎవరా?” అనుకొంటూ వైదేహి తలుపు తెరిచింది.
”మా కీర్తి, మీ ఇంటిలో వున్నదా?” ధారగా కారుతున్న చెమట తుడుచుకుంటూ అడిగాడతను.

ఆశ్చర్యంగా అతని వంక చూసింది వైదేహి.
అతను అదేం పట్టించుకోకుండా, ”విరాజ్‌, విరాజ్‌ మీ అబ్బాయి ఇంట్లో ఉన్నాడా?” బిగ్గరగా అన్నాడు.
అతని కేకలు విని లోపలి నుంచి విరాజ్‌ నిద్రమత్తులో బయటికి వచ్చాడు.
”ఏదీ మా కీర్తి ఏది?” వేణుమాధవ్‌ కోపంగా అడిగాడు.
”అదేంటి అంకుల్‌, రాత్రి మీ ఇంటి ముందరే తనని దింపానుగా, కీర్తి ఏమైంది అని అంటున్నారేంటి” అన్నాడు.

”విరాజ్‌, రాత్రి వాళ్ల అమ్మాయి ఇంటికి రాలేదు. రాత్రి ఎవరు ఎక్కడ దిగారో అసలు ఏం జరిగిందో ఆయనకి వివరంగా చెప్పు” వైదేహి గట్టిగా అంది.

”రాత్రి అందరూ ఒకేసారి బయల్దేరాం” అన్నాడు విరాజ్‌!! ”మరి అందరు ఎవరిళ్లకు వాళ్లు చేరారు, మరి మా అమ్మాయి ఏమైంది?” కంపిస్తున్న స్వరంతో అడిగాడు వేణుమాధవ్‌.

”అంకుల్‌ అందరం పార్టీ అవ్వగానే బయలుదేరాం. అందరిని డ్రాప్‌ చేసుకుంటూ నందిత వాళ్ళ ఇంటికి వచ్చాం. వాళ్ల కార్‌ డ్రైవర్‌ లేట్‌ అవుతోంది నిద్ర వస్తోందని ఇంటికి వెళ్లిపోతానని అన్నాడు. సాయంత్రం నా బైక్‌ నందిత వాళ్లింట్లో పెట్టి నేను పార్టీకి వచ్చాను. అందుకే నేను, కీర్తి నా బైక్‌ మీద బయలుదేరాం. మీ ఇంటి ముందు తనని డ్రాప్‌ చేసి, మా ఇంటికి నేను రాత్రే వచ్చేసాను. మరి కీర్తి మీ ఇంటిలో లేకపోవడం ఏమిటో నాకు అర్థం కావటం లేదు” అన్నాడు, తల పట్టుకొని అతని మాటలకి సోఫాలో కూలపడి పోయాడు వేణుమాధవ్‌. వైదేహి లోపలి వెళ్లి, కాఫీ పెట్టి మంచి నీళ్లు పట్టుకు వచ్చి అతనికి ఇచ్చింది.

”మీరేం కంగారు పడకండి, మీ అమ్మాయికి ఏమీ కాదు. ఓరేయ్‌ ఆయనతో పాటుగా వెళ్లి వెతకండి ఆ అమ్మాయి ఏమైందో ఏమిటో?” వైదేహి అంది. వంద లంఖణాలు చేసిన వాడిలా కాళ్లు ఈడ్చుకుంటూ బయటకు నడిచాడు వేణుమాధవ్‌.

విరాజ్‌ లేచి వేణుమాధవ్‌తో కలిసి వెళ్లాడు.

వైదేహి ఆలోచించుకుంటూ లోపలికి నడిచి వంట మొదలుపెట్టింది. కానీ ఆమెలో ఏదో బాధ, ఆ పిల్ల దొరికిందో లేదో అన్న వేదన ఆమెని తొలిచేయసాగింది.

”అమ్మా ఈ తడిసిన బట్టలు ఉతికేవేనా?” పనిమనిషి వంటింట్లోకి తొంగిచూస్తూ అడిగింది. ”ఏవి” అంటూ వచ్చి చూసింది వైదేహి, అవి నిన్న రాత్రి విరాజ్‌ కీర్తి పుట్టినరోజు పార్టీకి వేసుకున్న బట్టలు, ఆ బట్టల్ని బకెట్లో నీళ్ళలో ఎందుకు తడిపాడు? ఆ అవసరం ఏమి వచ్చింది?? వైదేహిలో ఏదో అనుమానం మొదలయ్యింది.

”ఆరేసేయ్‌” అంటూ, ఆ పనిమనిషికి పురమాయించి
కాళ్లు చేతులు చల్ల పడిపోగా హాల్లో సోఫాలో కూలపడిపోయింది.
ఆమె మనసు అంతా చెదిరిపోయింది. కొడుక్కి ఫోన్‌ చేసింది. ”ఏరా, ఎక్కడున్నావు” అంటూ.
”అంకుల్‌ నేను మా ఫ్రెండ్స్‌ అందరిళ్లకు తిరుగుతున్నాము. అన్ని చోట్లా ఫోన్‌ చేసాం. కీర్తి ఎక్కడా లేదమ్మా?” కంగారుగా అన్నాడతను.

”అంకుల్‌, ఆంటి బాగా ఏడుస్తున్నారు. మా ఫ్రెండ్స్‌ అందరూ కూడా వచ్చారు. కానీ అసలేం జరిగిందో అందరికి అంతా అయోమయంగా ఉంది. పోలీస్‌ కంప్లైంట్‌ ఇవ్వాలని ఇప్పుడే

వాళ్లు అనుకుంటున్నారు”.

అతని ఆఖరి మాటకి వైదేహి ఉలిక్కిపడింది.
”నువ్వు వెంటనే ఇంటికి వచ్చేయ్‌” అంది కంగారుగా.
”ఏమైంది అమ్మ?” అన్నాడు.

”నువ్వింకేం మాట్లాడకు, అక్కడ ఉండకు. వెంటనే ఇంటికి బయలుదేరి వచ్చేసెయ్‌” అంది గాబరాగా. కీర్తిని ఆఖరున కొడుకు దింపాడన్న విషయం ఆమెకి చాలా ఆందోళన కలిగిస్తోంది. పోలీస్‌లు తన కొడుకుని అనుమానిస్తారేమోనన్న ఊహ ఆమెని భయకంపితురాల్ని చేసింది. ఆమె కళ్లలో నీళ్లు ధారగా కారసాగాయి.

—–

”ఏడవకు, కీర్తికి ఏమి కాదు దేవికా, పోలీస్‌ కంప్లైంట్‌ ఇద్దాం” అన్నాడు వేణుమాధవ్‌.

షాక్‌ కొట్టిందానిలా చూసింది దేవిక. ”కీర్తి, కీర్తి” అంటూ బిగ్గరగా ఏడ్చేసింది. ”నా కూతురు ఎక్కడ? వద్దు వద్దు పుట్టినరోజు పూట పంపకండి అంటూనే ఉన్నాను. ఆడపిల్ల అర్థరాత్రి బయటికి వెళ్లడం ఏమిటి అన్నా కూడా మీ తండ్రీ కూతుళ్ళు నా మాట వినలేదు, నన్నో పల్లెటూరు బైతులా చూసారు, ఇప్పుడే జరిగింది? ఏది?? నా కూతుర్ని నాకు తెచ్చి ఇవ్వండి అంతే. లేకపోతే నేనూరుకోను?” నరికిన మానులా నేలమీద కూలిపోయింది దేవిక.

ఆఖరికి ఇంక ఏ మార్గము దొరకక వేణుమాధవ్‌ పోలీస్‌ కంప్లైంట్‌ ఇచ్చి వచ్చాడు.

——-

”ఏరా రాత్రి వేసుకున్న నీ బట్టల్ని ఎందుకు తడిపావు?” కొడుకు ఇంట్లో అడుగుపెడుతూనే కఠినంగా అడిగింది వైదేహి.

”రాత్రి అందరు కేకు పూసేసారమ్మ, మొత్తం బట్టలన్ని పాడైపోయాయి. అందుకే నీళ్ళలో వేసాను” అన్నాడు.

కొడుకు కళ్ళలోకి సూటిగా చూస్తూ ”ఏరా నిజం చెప్పు రాత్రి ఏమి జరిగింది? ఆ అమ్మాయిని అసలు వాళ్ల ఇంటి దగ్గర దింపావా?” అడిగింది.

తల్లి మాటలకు కరెంటు షాక్‌ తగిలిన వాడిలా చూసాడు. దిగ్గున లేచి, తల్లి చేయి పట్టుకొని, ”ఏంటమ్మా నా గురించి ఇలా ఇంత హీనంగా, ఛ ఛ ఇలా ఆలోచిస్తున్నావు ఏంటి? కీర్తి, నా ఫ్రెండ్‌ అంతే! ఈ ఏడాది అయితే, అందరం ఉద్యోగాల్లోకి, పై చదువుల్లోకి వెళ్లిపోతాం. అందుకనే సరదాగా పార్టీలు చేసుకుంటాము. కలసి తిరుగుతాం, సినిమాలు చూస్తాము. అంతే కానీ, ఇంకే విధంగాను నేను దిగజారలేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు, ఇదిగో సెల్‌లో ఫోటోలు ఉన్నాయి, కావాలంటే చూడు” అన్నాడు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా, కొడుకును దగ్గరగా తీసుకొని వైదేహి అతని తల ఆప్యాయంగా నిమిరింది. ఇంతలో కాలింగ్‌ బెల్‌ మోగింది, ”విరాజ్‌ ఎవరు? పోలీస్‌ స్టేషన్‌కి రావాలి” అంటూ కానిస్టేబుల్‌ గుమ్మం ముందు నిలబడి అడిగాడు.

వైదేహి ముఖంలో బాధావీచిక కదలాడింది. ‘భగవంతుడా ఏమిటీ పరీక్ష’ అనుకుంటూ, ముందు నుంచీ ఆప్తుడుగా అండగా నిలబడ్డ మిత్రుడు ప్రభాకర్‌కి గబగబా ఫోన్‌ చేసి, అతన్ని రమ్మని చెప్పి, విరాజ్‌ని తీసుకొని మనసులో దేవుళ్ళందరికి దండాలు పెట్టుకుంటూ పోలీస్‌ స్టేషన్‌కి బయలుదేరింది వైదేహి.

పోలీసులు విరాజ్‌ని, అతని స్నేహితులు అందరిని కలసి ప్రశ్నలు వేసారు. విడి విడిగాను స్టేట్‌మెంట్లు రికార్డు చేసారు. కాని విరాజ్‌ కీర్తిని తన ఇంటి ముందు దింపడం అనే చోట కథ ఆగిపోతోంది. ఆ తరువాత కీర్తి ఏమైంది అన్న మిస్టరీ వీడడం లేదు. ఆ తరువాత కీర్తి ఎక్కడికి వెళ్లిందో, ఇంట్లోకి ఎందుకు వెళ్లలేదో అన్న చిక్కుముడి వీడటం లేదు. పోలీస్‌ స్టేషన్‌లో ఓ వైపున వేణుమాధవ్‌, దేవికా కూర్చుని ఉన్నారు. వైదేహి ఓదార్పుగా దేవిక మీద చేయి వేసింది. ఆమె బావురుమంది.

”ఏడవకండి ప్లీజ్‌, మీ అమ్మాయికి ఏమీ కాదు, తప్పకుండా ఇంటికి తిరిగి వస్తుంది” అంది వైదేహి లోగొంతుకతో.

”ఆ ఆశతోనే ఎదురు చూస్తున్నాను. ఏమో, నా కూతురు ఎక్కడుందో ఏంటో? ఏమైందో?” వెక్కివెక్కి ఏడ్చింది దేవిక.

”అయినా అర్థరాత్రి పార్టీలు ఏమిటయ్యా, శుభ్రంగా ఇంట్లో కూర్చొని చక్కగా చదువుకోక, పుట్టినరోజు పార్టీలు ఇంట్లో జరపుకోకుండా రోడ్ల మీద తిరగడాలు ఏమిటి? పైగా అమ్మాయిలని బైక్‌ల మీద వేసుకొని? మీరందరు వాళ్లని కాపాడటానికి పెద్ద వస్తాదులు అనుకుంటున్నారా? అయినా ఈ కాలపు అమ్మాయిలకి అంతకన్నా బుద్ధి లేదు. స్వేచ్ఛ కావాలంటున్నారు. అర్థరాత్రిళ్లు బయట తిరుగుతున్నారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేశానికి స్వతంత్రం వచ్చింది కాని ఆడవాళ్లకి ఇవాళ్టికి రాలేదు, ఆడపిల్ల అంత స్వేచ్ఛగా అర్థరాత్రి రోడ్డు మీద తిరిగే రోజులు రాలేదు. మేము పోలీసులం ఎంతకని మిమ్మల్ని కాపాడగలం. అలాగే ఈ కాలం తల్లిదండ్రులూ అసలు బాధ్యతగా వ్యవహరించడం లేదు. అందుకే పిల్లలు కూడా బాధ్యతారహితంగా తిరుగుతున్నారు. ఈ తరం పిల్లలకి బొత్తిగా భయం, క్రమశిక్షణ లేవు. మా రోజులే నయం, తండ్రి ఎదురుగా నిలబడి కూడా మాట్లాడలేక పోయేవాళ్లం. ఇప్పుడేమో ఆడపిల్లలు, మగపిల్లలు విరగబడిపోతున్నారు. బలాదూరుగా తిరగడానికి అలవాటు పడిపోతున్నారు. అందుకే నేరాల శాతం రోజు రోజుకి పెరిగిపోతోంది” ఇన్‌స్పెక్టర్‌ కుర్రాళ్లకేసి చూస్తూ గట్టిగా అరుస్తున్నాడు. వైదేహి, వేణుమాధవ్‌, దేవిక అపరాదుల్లా తలవంచుకున్నారు.

——

మర్నాడు కీర్తి శవం ఊరవతల దొరికింది. ఎవరో రేప్‌ చేసి దారుణంగా చంపేసారు???

సాయంత్రానికల్లా పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఆ కబురు విని దేవిక స్పృహ తప్పిపడిపోయింది. ఆమెని హాస్పిటల్‌లో చేర్చారు. ”హాట్‌ఎటాక్‌ వచ్చిందని డాక్టర్లు ధ్రువీకరించారు. ట్రీట్‌మెంట్‌ కొనసాగుతోంది. ఒక్కగానొక్క కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఏమి అడిగితే అది, కొండమీద కోతినయిన తెచ్చి ఇచ్చే వారు. తమ గారాల కూతుర్ని ఇంత దారుణంగా మానభంగం చేసి హత్య చేసారన్న వార్త వేణుమాధవ్‌ నిలువెల్లా కుదిపేసింది. ”ఇంక నేను ఎందుకు బతకాలి” తల బాదుకుంటూ బిగ్గరగా ఏడ్చేసాడు.

పోలీసులు దర్యాప్తుని ప్రారంభించారు. కీర్తి శవాన్ని పోస్టుమార్టమ్‌ చేసి వేణుమాధవ్‌కి అప్పగించారు. కీర్తి దహన సంస్కారాలకి, తన కాలేజీ అంతా తరలివచ్చింది. స్నేహితులు అందరు కన్నీరు మున్నీరుగా విలపించారు.

విరాజ్‌ని ఎవరూ పట్టుకోలేకపోయారు. ”మనం కలిసిన ఆఖరి క్షణమే నీ ఆఖరి చూపు అయ్యింది కీర్తి” అంటూ అతను బాధతో కుమిలి కుమిలి ఏడ్చాడు.

ఆ మరునాడు విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఊరేగింపుగా బయలుదేరి నగర పోలీస్‌ కమీషనర్‌కి విజ్ఞప్తిని అందజేసారు. కీర్తిని హత్య, అత్యాచారం చేసిన దోషులకు ఉరిశిక్ష వేయించాలని నినాదాలు చేసారు.

మరో వారం రోజులు గడిచాయి, కీర్తి కేసు విషయం ఏమీ తేలలేదు. ఎక్కడా ఏ క్లూ లభించలేదు.

——

”విరాజ్‌, ఇంకో రెండు వారాల్లో పరీక్షలు, అన్ని విషయాలు ముందు పక్కకి పెట్టి, చదువు మీద దృష్టి పెట్టు” వైదేహి మందలింపుగా అంది. ”కీర్తిని అన్యాయంగా చంపేసారమ్మా, అదే చాలా బాధగా

ఉన్నది. మైండ్‌ డైవర్ట్‌ అవ్వడం లేదు” విరాజ్‌ టీవీ ఛానల్‌ మారుస్తూ అన్నాడు.

”కీర్తిని ఎవరో చంపలేదు మా లాంటి తల్లిదండ్రులే అన్యాయంగా చంపేసారు. మీ తరం పిల్లలకి అపరిమితమయిన స్వేచ్ఛనిచ్చి మీ బతుకులని బండ్లని చేసి, మీ పతనాన్ని మేము కళ్ళరా చూడటానికి మా గోతులు మేమే తవ్వుకుంటున్నాం. జీవచ్ఛవాలుగా మిగిలిపోతున్నాము” ఆవేశంగా అంది.

”అమ్మా” అన్నాడు విరాజ్‌.

”కాసేపు చదువుకోండి అంటే రోజూ పుస్తకాలు తీయరు, ఒక క్రమపద్ధతిగా చదువుకోరు, పరీక్షలు ముందు మటుకు నైట్‌ ఔట్స్‌, ఫ్రెండ్స్‌ గ్రూప్‌ స్టడీస్‌, సెల్‌లో చాటింగ్‌లు, వాట్సాప్‌లో షేరింగులు, ఇదా చదివే విధానం? ఏం చేస్తున్నార్రా మీరు. ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకుంటే క్రమశిక్షణగా మీ జీవితాలని గడుపుకుంటే ఇంత సంఘర్షణ ఉంటుందా? ఒక బస్సుస్టాప్‌కి

వెళ్ళు అక్కడ ఆడమగ గుంపులు, గుంపులుగా బుర్లు, కాలేజీ బంక్‌ కొట్టి మరీ ఆ సినిమాకి వెళదామా, ఈ సినిమాకి వెళదామా అని తర్జనభర్జనలు పడుతుంటారు.

ఏదైనా మాల్‌కి వెళ్ళు, కాఫీలు, పిజ్జాలు, బర్గర్‌లు తింటూ మల్టీప్లెక్స్‌లో సినిమాలు, వీకెండ్‌ వస్తే పార్టీలూ, సెలబ్రేషన్స్‌. మధ్య మధ్యలో పుట్టినరోజులు, పండగలు. తల్లిదండ్రులకు వేలల్లో డబ్బుఖర్చులు. ఏదైనా హితవు చెప్పినా మాకే తెలుసని తల ఎగరేస్తారు. లేదా ఈ చెవిన విని ఆ చెవిన వదిలేస్తారు. ఇదే నిజమైన జీవితమన్న భ్రమల్లో బతికేస్తున్నారు. మీ భవిష్యత్తుని పాడుచేసుకుంటున్నారు. క్యాంపస్‌లో ఉద్యోగాలు వస్తాయ్‌, అట్టహాసంగా పెళ్లిళ్లు చేసుకుంటారు, పిల్లల్ని కంటారు. వాళ్ళని దేశం మీదకి వదిలేస్తారు. మీకే ఓ క్రమశిక్షణ, సమయ పాలన,  నైతిక విలువలు లేవు, ఇంక మీ ముందు తరానికి ఏం నేర్పుతారు? వాళ్లని మీ కన్నా ఇంకా అధ్వాన్నంగా తయారు చేస్తారు. అన్ని విధాలుగా సమాజాన్ని భ్రష్టుపట్టిస్తారు. మా తప్పులు, మీ తప్పులు అన్నీ కలసి ముందు తరం భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నాయి.

తల్లిదండ్రులు అర్థరాత్రి పార్టీలూ ఏమిట్రా అంటూ పిల్లల్ని రెండు చెంపలు వాయించి ఇంట్లో కూర్చోబెట్టాల్సిన వాళ్లు. అలాంటిది వాళ్లే మిమ్మల్ని ఎంజాయ్‌ చేయండి అంటూ గేటు దాకా వచ్చి టాటాలూ చెబుతూ మరీ సాగనంపుతున్నారు. అంటే మీ పతనానికి తల్లిదండ్రులం పరోక్షంగా మేమే స్వాగతం పలుకుతున్నాము. తప్పుడు పెంపకం విధానాల్లో అపరిమితమైన స్వేచ్ఛనిచ్చి, సంస్కారహీనులుగా, తల బిరుసుతనం నేర్పి, మీ భవిష్యత్తుని మేమే అంధకారంలోకి నెడుతున్నాము.

కీర్తి లాంటి ఆడపిల్లల్ని సమాజానికి బలి ఇస్తున్నాము. ఆడపిల్లల్ని చీడ పురుగులకి ఆహారంగా వేస్తున్నాం. అందమైన యవ్వనాన్ని అన్యాయంగా చిదిమేస్తున్నాం.” వైదేహి ఉద్వేగంగా అంది. తల్లి ఉగ్రరూపం తొలిసారిగా చూస్తున్న విరాజ్‌కి జంకు కలిగింది. గబగబా టి.వి. కట్టేసి పుస్తకాలు ముందు వేసుకొని కూర్చున్నాడు.

——-

”ఏరా మొన్ననే చూసాను, అడుగుదామని మర్చిపోయాను. బైకు వెనుక లైట్‌ పగిలి ఉందేమిటి? యాక్సిడెంట్‌ అయ్యిందా?” వైదేహి కాలేజీ నుంచి వచ్చి హాల్‌లో సోఫాలో కూర్చుని అడిగింది. ”ఇప్పుడేమిటి, ఆ రోజు కీర్తి పుట్టినరోజున తనని గేటు దగ్గర దింపి వస్తుంటే పక్క నుండి కారువాడు రాసుకుంటూ వెళ్లాడు, అపుడే బైకు కింద పడి లైటు పగిలింది. వాడి కార్‌ డోర్‌ కూడా పూర్తిగా గీరుకుపోయింది, పరీక్షల హడావుడిలో బాగు చేయించలేదు వచ్చేవారం చేయిస్తాను” విరాజ్‌ అన్నాడు.

”మరి వాడి కారు పాడైతే వాడు గొడవ పెట్టలేదా?” ఆశ్చర్యంగా అడిగింది. ”ఏమో తాగిన మైకంలో చాలా మంది

ఉన్నారు. వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు. అర్థరాత్రి, పైగా నేను ఒక్కడిని కదా, గొడవ చేయడం ఎందుకని వచ్చేసాను” విరాజ్‌ చెబుతూ చెబుతూ ఆగిపోయాడు.

”ఏమైందిరా” అడిగింది వైదేహి.
”వాళ్లు… వాళ్లు కీర్తిని ఏమైనా చేసుంటారేమో అమ్మా”
”ఎందుకరా నీకు వాళ్ల మీద అనుమానం వచ్చింది?”

”ఎందుంటే, కీర్తి వాళ్ల గేటు తాళం వేసి ఉన్నది. వాళ్ల అమ్మగారి సెల్‌కి తను ఫోన్‌ చేస్తోంది. నేను లేట్‌ అవుతుందని నెమ్మదిగా బైక్‌ స్టార్ట్‌ చేశాను. సందు మలుపులో ఆ కారు నన్ను రాసుకుంటూ వెళ్లింది. నేను కింద పడిపోయాను. నాకిప్పుడెందుకో గట్టిగా అనిపిస్తోంది. వాళ్లే కీర్తిని ఏమైనా చేసుంటారమ్మా” అన్నాడు గట్టిగా. వైదేహి గబగబా వేణుమాధవ్‌కి ఫోన్‌ చేసి విరాజ్‌ చెప్పింది అతనికి తెలియచేసింది.

వాళ్ళు అందరూ కలసి పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ని కలిశారు. ఆ వెంటనే దర్యాప్తు కొంచెం వేరే రకంగా మొదలైంది. వేణుగోపాల్‌ వాళ్ల ఇంటికి రెండు వీధుల అవతల సి.సి. కెమెరాలు మెయిన్‌ రోడ్‌లో ఉన్నాయి. ఆరోజు ఆ రోడ్‌ మీద అర్థరాత్రి 12.30 గంటలకి వెళ్లిన కార్ల నంబర్స్‌ అన్నీ వెరిఫై చేశారు. ఎనిమిది కార్‌లు ఆ టైమ్‌లో మెయిన్‌రోడ్‌లో వెళ్లినవి ట్రేస్‌ చేసి ఆ కార్‌ ఓనర్‌ని పిలిచి విచారించారు. కార్లన్నీ పోలీస్‌ స్టేషన్‌కి తెప్పించుకుని పరిశీలించారు. అందులో ఒక కారు సైడ్‌కి అంతా గీరుకుపోయింది, కొత్తగా  పెయింట్‌ వెయ్యించింది దొరికింది.

”ఆ రాత్రి ఆ కారు నా దగ్గర లేదు, నేను ఊరికి పంపించాను” అన్నాడు. ఆ కార్‌ ఓనర్‌ ఆ రాత్రి ఆ కారు అద్దెకు తీసుకున్న డ్రైవర్‌ని విచారించారు. ఆ తర్వాత ముగ్గురు నిందితులు దొరికిపోయారు. అందులో ఒకడు కీర్తి వాళ్ళని రాత్రి పార్టీకి తీసుకువెళ్లిన కార్‌ డ్రైవరే.

”నేను ఆ అమ్మాయిని ఆఖరున దింపుతే నా మీద అనుమానం వస్తుందనే నాకు నిద్ర వస్తుందని, నేను ఇంటికి వెళ్లిపోతానని బయటపడ్డాను.

ఫోన్‌ చేయగానే మా ప్లాన్‌ ప్రకారం మా ఫ్రెండ్స్‌ కార్‌లో రెడీగా ఉన్నారు. మేము విరాజ్‌ని, కీర్తిని ఫాలో అయ్యాం. వీధి చివర ఆగాం, విరాజ్‌ కీర్తిని దింపగానే ఇంటికి వెళ్లిపోకపోయినా మేము అతని మీద దాడి చేసైనా, ఆ అమ్మాయిని ఎత్తుకుపోదామని  అనుకున్నాము. విరాజ్‌ ఎదురురావడంతో మేము గబగబా కార్‌ స్టార్ట్‌ చేసి ఆ అమ్మాయిని గేటు దగ్గర కిడ్నాప్‌ చేద్దామన్న హడావిడిలో అతనని రాసుకుంటూ ముందుకు వెళ్లాం. కీర్తిని ఊరవతల తీసుకెళ్లి అనుభవించి చంపేసాము.”

కారు డ్రైవర్‌, అతని ఫ్రెండ్స్‌ వాంగ్మూలం రికార్డు చేసి అరెస్ట్‌ చేసారు. కేసు దర్యాప్తు పూర్తైనందుకు పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. జరిగిన దుర్ఘటనకి ఊరు అంతా కొద్దిరోజులు ఉలిక్కిపడ్డారు. స్టూడెంట్స్‌ పరీక్షల హడావుడిలో పడిపోయారు.

”ఈ తప్పు ఎవరిది? ఈ తరానిదా, ఆ తరానిదా, ఆ పుట్టించిన దేవుడిదా, భ్రష్టుపడుతున్న సమాజానిదా!” అన్ని న్యూస్‌పేపర్లు కొద్దిరోజులు ఘోషించాయ్‌.

కొద్దిరోజులకి అంతా దీన్ని మరిచిపోయారు.

”ఆ దుర్మార్గులకి ఉరిశిక్ష పడితే కీర్తి తిరిగి వస్తుందా, తన నూరేళ్ళ జీవితం బుగ్గిపాలు అయిపోయింది. ఆడతనం దేవుడిచ్చిన శాపమని చరిత్ర చెబుతుంది సత్యమా? ఆడపిల్ల నిర్భయంగా జీవించే అవకాశం ఎన్ని యుగాలైనా రాదా” వైదేహి మనసు మౌనంగా రోదిస్తూనే ఉంది.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.