స్త్రీల పట్ల అన్ని రకాల వివక్షతలు నిర్మూలన ఒప్పందం (సిడా) మీద భారతదేశం సంతకం చేసిన క్రమంలోంచి మహిళల రక్షణ కోసం అనేక సంస్థల, వ్యవస్థల ఆవిర్భావం జరిగింది. జాతీయ స్థాయిలోను, రాష్ట్రస్థాయిలోను ఈ సంస్థలు మహిళలకోసం పనిచేయడానికి పూనుకున్నాయి. జాతీయ మహిళా కమీషన్, రాష్ట్ర మహిళా కమీషన్ ఈ కోవలోవే. అలాగే రాష్ట్ర స్థాయిలో మహిళలపై అమలయ్యే నేరాలను, ముఖ్యంగా వరకట్న, కుటుంబ హింసకు సంబంధించిన నేరాల విషయమై ఫిర్యాదులు స్వీకరించడానికి పోలీసు శాఖలోని సిఐడి విభాగం ఆధ్వర్యంలో ”ఉమెన్ ప్రొటెక్షన్ సెల్” ఏర్పాటయింది.
బాధిత స్త్రీలు ఈ సెల్‌లో తమ ఫిర్యాదులు దాఖలు చేయవచ్చు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల పోలీస్ స్టేషన్‌లకు ‘ఉమెన్ ప్రొటెక్షన్ సెల్’ నుండి ఈ ఫిర్యాదులను పంపడం, బాధితుల కేసులు నమోదు చేయించడం, సంబంధిత పోలీస్ స్టేషన్ ద్వారా బాధిత మహిళకి రక్షణ కల్పించడం, ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయించడం ఈ సెల్ ముఖ్య బాధ్యతలు. చాలా కాలంగా ఈ సెల్ కార్యక్రమాలు ”ట్రాఫికింగ్”కే పరిమితమవ్వడం వల్ల కుటుంబ హింసకు సంబంధించిన కేసుల నమోదు తగ్గినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ బాధిత మహిళలకు అన్ని రకాల సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ సిఐడి కార్యాలయంలో 2004లో ఒక సపోర్ట్ సెంటర్‌ను ప్రారంభించింది.
2013 నుండి భూమిక ఆధ్వర్యంలో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌లో సపోర్టు సెంటర్ నడుస్తోంది. బాధిత మహిళలకి కౌన్సిలింగ్, రిఫరల్ సదుపాయాలను ఈ సెంటర్ సమకూర్చుతోంది. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ రాష్ట్రస్థాయి సంస్థ కాబట్టి రాష్ట్రం నలుమూలల నుండి బాధిత మహిళలు ఈ సెంటర్‌లో తమ ఫిర్యాదులను దాఖలు చేయవచ్చు. వివిధ పద్ధతుల ద్వారా వారికి రక్షణ, న్యాయం జరిగేలా చూడడం ఈ సెల్ ప్రధాన బాధ్యత. ఆ దిశలో పనిచేయడానికి సపోర్ట్ సెంటర్ కృషి చేస్తోంది.
ఈ క్రింది నంబరుకు ఫోన్ చేసి బాధితులు తమ ఫిర్యాదు దాఖలు చేయవచ్చు, సంప్రదించవచ్చు, సహాయం పొందవచ్చు. నేరుగా వచ్చి సెంటర్‌లో కౌన్సిలర్‌లను కలవవచ్చు.
ఉమెన్ ప్రొటెక్షన్ సెల్, సిఐడి ఆఫీసు, ఎ.సి గార్డ్స్ మాసబ్‌టాంక్, హైద్రాబాద్.
కాల్ చెయ్యాల్సిన నంబరు : 9059693448
ఐటి కారిడార్ మహిళా పోలీస్ స్టేషన్, ఓఆర్‌ఆర్, గచ్చిబౌలిలో ఉన్న భూమిక సపోర్ట్ సెంటర్
ఫోన్ నెంబరు : 91000 22826
మహిళా పోలీస్ స్టేషన్, మంకమ్మతోట, కరీంనగరలోని భూమిక సపోర్ట్ సెంటర్
ఫోన్ నెంబరు : 94912 14479