సమాజంలో పీడనకు గురయ్యేవారిని గురించి చెప్పుకోవాలంటే వృద్ధులు, నిరుపేదలు, పిల్లలు, స్త్రీలు, దళితులు, గిరిజనులు, శారీరక, మానసిక అసహాయతతో బాధపడే వాళ్ళుగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేస్తున్నా దశాబ్దాలు గడుస్తున్నా మౌలిక మార్పు రావటం లేదు. ఇందుకు ప్రధాన కారణం వాటి నిర్మాణంలోనే అమలుకు తూట్లు పొడిచే లొసుగులు ఉండటమనేది మేధావుల ఉవాచ.
మన రాష్ట్ర ప్రభుత్వం తల్లిదండ్రులు, సీనియర్ పౌరుల పోషణ, సంక్షేమ చట్టాన్ని జి.వో.ఎం.ఎస్. నెం.10 మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం మరియు వికలాంగ సంక్షేమశాఖ, తేదీ 22-04-2008 ద్వారా అమలులోకి తెచ్చింది.
ప్రస్తుతమున్న పరిస్థితులలో, తమ వారసులపై పోషణ హక్కు కోరుతూ న్యాయస్థానాలను ఆశ్రయించటం ఎంతో ఖర్చుతోనూ, కాలయాపనతోనూ కూడిన పనిగా తయారయింది. అందువల్ల వారి హక్కుల క్లెయింలు సత్వరం తక్కువ ఖర్చుతో పరిష్కారమయ్యేలా చూసేందుకు ఈ చట్టం తెస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ చట్టం ప్రకారం ప్రతి సబ్ డివిజన్‌కు ఒకటి లేదా అంతకుమించిన ట్రిబ్యునళ్ళను ఏర్పాటు చేయాలి. సబ్‌డివిజన్‌లో అధికారి హోదాకు తక్కువకాని అధికారితో వీటిని ప్రారంభించాలి.
అరవై సంవత్సరాలు పైబడిన సీనియర్ పౌరులకు అంటే తల్లిదండ్రులు/తల్లి లేదా తండ్రి అవసరాలను సంతానం/వారసులు తీర్చాలి. అటువంటి సీనియర్ పౌరుల ఆస్తులకు ఒకరికి మించి వారసులు ఉన్నప్పుడు ఆస్తిని పంచుకున్న నిష్పత్తిలోనే సీనియర్ పౌరుల జీవనానికయ్యే ఖర్చులు భరించాలి. సదరు సీనియర్ పౌరులు సంతానం లేనివారయితే వారి ఆస్తులు ఎవరికి చెందుతాయో సదరు బంధువులు ఖర్చులు భరించాలి. అలా పోషణ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న, నిర్వహణ క్లెయిం కోరే సీనియర్ పౌరులు ట్రిబ్యునల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా వారి తరపున అంగీకారం పొందిన వ్యక్తులు దరఖాస్తు చేయవచ్చు. తన దృష్టికి వచ్చిన కేసుల విషయంలో ట్రిబ్యునల్ తనంత తాను కూడా విచారణ చేపట్టవచ్చు. లేదా ఏదయినా రిజిష్టర్ అయివున్న సొసైటీకి కానీ, స్వచ్ఛంద సంస్థ కానీ వారి తరపున ట్రిబ్యునల్‌కు దరఖాస్తు చేయవచ్చు.
ఫిర్యాదు దరఖాస్తు అందిన వెంటనే ట్రిబ్యునల్ మధ్యంతరంగా వారి జీవనం కోసం కొంత మొత్తాన్ని సదరు తల్లిదండ్రులు, లేదా సీనియర్ పౌరునికి చెల్లించాల్సిందిగా ఆదేశించవచ్చు. పై దరఖాస్తు అందిన వెంటనే కక్షిదారులకు నోటీసు పంపి వారి వాదనలు వినవచ్చు. ఈ నెలసరి భత్యానికి సంబంధించిన దరఖాస్తు అందిన 90 రోజులలోగా విచారణ జరిపి పరిష్కరిస్తారు. ఏదైనా అనివార్యమైన ప్రత్యేక పరిస్థితుల్లో గరిష్టంగా 30 రోజుల పరిమితికి లోబడి గడువును పెంచవచ్చు. తిరిగి గడువు పెంచే వీలులేదు. ఈ దరఖాస్తును అర్జీదారుడు నివసించే ప్రదేశంలోని ట్రిబ్యునల్‌లోగానీ, కక్షిదారుడు నివసించే ప్రదేశంలోని ట్రిబ్యునల్‌లో గాని ఎక్కడయినా దాఖలు చేయవచ్చు.
ట్రిబ్యునల్ సదరు దరఖాస్తును విచారించే ముందుగా దానిని రాజీ అధికారికి పంపుతుంది. రాజీ అధికారి నెలలోపుగా సముచిత పరిష్కారంతో తన నివేదికను ట్రిబ్యునల్‌కు పంపుతారు. సదరు నివేదికను ట్రిబ్యునల్ ఉత్తర్వులుగా జారీచేస్తుంది. రాజీ అధికారిగా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లేదా ఆ స్థాయికి తగ్గని అధికారిని ప్రభుత్వం అధికారికంగా నియమించిన వ్యక్తి, లేదా చట్టప్రకారం నమోదయిన స్వచ్ఛంద సంస్థ అధికారిగానీ అయివుంటారు.
భారతదేశం వెలుపల కక్షిదారులు నివసిస్తున్నట్లయితే ఈ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురింపజేసి ఇందుకై నియుక్తులైన అధికారులద్వారా అందజేయటమౌతుంది.
సంతానం లేదా బంధువులు ట్రిబ్యునల్ ముందు హాజరుకాకుండా, బుద్ధిపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తున్నట్లు భావించిన పక్షంలో, కేసును ఏకపక్షంగా విచారించి తీర్పును ఇవ్వటమౌతుంది.
ఈ ట్రిబ్యునళ్ళలో సీనియర్ పౌరులకు లేదా తల్లిదండ్రులకు ఎటువంటి ఫీజులు లేకుండానే వ్యయ ప్రొసీడింగ్‌ల ఉత్తరువు, నిర్వహణ ఉత్తర్వులను ట్రిబ్యునల్ జారీ చేస్తుంది.
ట్రిబ్యునల్ ఫిర్యాదుదారుని నిర్వహణ చెల్లింపు డబ్బుకు 5 శాతం నుంచీ 18 శాతానికి మించకుండా ఆలస్య రుసుముగా వడ్డీ చెల్లించాల్సిందిగా కూడా ఆదేశించవచ్చు. తల్లిదండ్రులకు నిర్వహణ పిటిషన్ వెనుకకు తీసుకునేందుకు అనుమతి ఉంది. ఐతే వారు తిరిగి నిర్వహణకై పిటిషన్ దాఖలు చేసుకోవడానికి కూడా వెసులుబాటు ఉంది.
ఈ ట్రిబ్యునల్ తీర్పు నచ్చని పక్షంలో సీనియర్ పౌరులు/తల్లిదండ్రులు అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌లో ప్రకటించి, ప్రతి జిల్లాకు అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయవలసి వుంది. జిల్లా మేజిస్ట్రేటు స్థాయికి తగ్గని అధికారి ఆధ్వర్యంలో ఈ అప్పిలేట్ ట్రిబ్యునల్ నిర్వహణ జరుగుతుంది. సీనియర్ పౌరుడు/తల్లిదండ్రులు ట్రిబ్యునల్ ఉత్తర్వు తనకు ఆమోదయోగ్యం కాని పరిస్థితుల్లో ట్రిబ్యునల్ తీర్పు వెలువడిన 60 రోజుల లోగా అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు దరఖాస్తు చేసుకోవాలి. అయితే తగిన కారణాన్ని సహేతుకంగా చూపించగలిగితే 60 రోజుల తర్వాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్పిలేట్ ట్రిబ్యునల్ అవసరమైన రికార్డులు తెప్పించుకొని, కక్షిదారులు ఇరువురి వాదనలు విన్న తరువాత తీర్పు చెబుతుంది. అలా వినకుండా ఏ అప్పీలును ఏరకంగానూ తిరస్కరించకూడదు. అప్పీలును అందుకున్న నెల రోజులలోగా ఉత్తర్వులు వెలువరించి ఇరుపక్షాలకూ ఉచితంగా అందించాలి. ట్రిబ్యునల్‌కు వారే వెళ్ళాలి కానీ న్యాయవాది ద్వారా అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో వాదనలు వినిపించటం నిషేధించారు.
నిరుపేదలకు వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయాలని ఈ చట్టం నిర్దేశిస్తోంది. ప్రారంభకాలంలో కనీసం జిల్లాకు ఒక వృద్ధాశ్రమం స్థాపించి ఒక్కోదాంట్లో 150 మందికి తగ్గకుండా నిరుపేద వృద్ధులకు ఆశ్రయం కల్పించాలి. సదరు వృద్ధాశ్రమాలలో నివసిస్తుండే వారికి ఆహారంతోబాటు వైద్యం, వినోదం వంటి వాటిని అందించాలి. నిర్వహణ నిబంధనలను రాష్ట్రప్రభుత్వం ఏర్పరచాలి.
ప్రభుత్వ ఆసుపత్రులలోనూ, ప్రభుత్వం పాక్షికంగా నిధులు అందించే హాస్పిటళ్ళలోనూ సీనియర్ పౌరులందరికి ప్రత్యేకంగా పడకలు ఏర్పరచటం, వృద్ధాప్య సంరక్షణలో అనుభవం ఉన్న వైద్యులను జిల్లా వైద్యశాలల్లో నియమించటం, సీనియర్ పౌరులకు నేరుగా క్యూ పద్ధతి ప్రవేశపెట్టటం వంటివి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని చట్టం నిర్దేశిస్తున్నది.
ఈ చట్టం అమలులోకి వచ్చిన తరువాత సీనియర్ పౌరులు బహుమతిగా కానీ, సంరక్షణ బాధ్యత చూసే విధంగా ఒప్పందం ద్వారా కానీ ఆస్తిని బదిలీ చేసిన సందర్భంలో అలా బదిలీ చేయించుకున్న వ్యక్తి సీనియర్ పౌరునకు జీవన అవసరాలను తీర్చి సక్రమ వసతులు కల్పించటంలో విఫలమైనా, తిరస్కరించినా, ఆ బదిలీ చెల్లదు. సదరు ఆస్తిని బదిలీ చేయటం మోసం కింద భావించి బదిలీ చెల్లదని ప్రకటించవచ్చు.
ఇక తల్లిదండ్రులు, సీనియర్ పౌరుల రక్షణ నిర్వహణ చూడాల్సిన సంతానం కానీ, ఆస్తి వారసులు కానీ వారిని చూడకుండా ఉన్నా, విడిచిపెట్టినా వారికి శిక్ష పడుతుంది. మూడు నెలల వరకూ జైలుశిక్ష, లేదా ఐదువేల వరకూ జరిమానా, లేదా రెండూ కలిపి విధించవచ్చు.
తల్లిదండ్రులు, సీనియర్ పౌరుల పోషణ, సంక్షేమ చట్టం – 2007
(ఆసియా లా హోస్ ప్రచురణలు – అనువాదం : కె.ఎల్.ఎన్.శర్మ)