మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినం అభినందనలు. ‘హేపీ న్యూఇయర్’ లాగా ‘హేపీ ఉమన్స్ డే’ ఒక గ్రీటింగ్‌లాగా పడికట్టు పదంగా మారిపోయింది. ఎన్నో సవాళ్ళ మధ్య, హింసాయుత పరిస్థితుల్లో, మతమౌఢ్యపు అంధకారంలో నిత్య పోరాటం సల్పుతున్న ఆధునిక మహిళకు అరుణారుణ అభివందనాలు అభినందనలు. మత అసహనం తోడేళ్ళ గుంపులాగా వెంటాడుతున్న ఈనాటి నేపధ్యంలో స్త్రీల రక్షణ కోసం ఎన్నో చట్టాలున్నప్పటికీ అమలుకు నోచుకోని వైనం మనం చూస్తున్నాం. మహిళలపై పురుషుడు చేసే సర్వ దౌర్జన్యాలకి, హింసలకి, అత్యాచారాలకి తీవ్రమైన శిక్షలు విధించే అవకాశమున్న చట్టాలు వరుసగా బారులు తీరి వున్నాయి. స్త్రీల ఉద్యమం అడిగిన చట్టం, అడగని చట్టం అన్నింటిని ప్రభుత్వాలు చేసాయి. తీవ్రమైన శిక్షలూ ప్రతిపాదించాయి. అయినప్పటికీ ప్రతిక్షణం దేశంలో ఏదో ఒక మూల ఎవరో ఒక మహిళ, బాలిక దారుణ హింసకి గురౌతూనే వుంది. చట్టం తన పనితాను చేయకపోవడం వల్ల, పోలీసులు లా అండ్ ఆర్డర్ మాత్రమే తమ బాధ్యతగా భావించడం వల్ల, జనాభాలో సగభాగమున్న మహిళల మీద జరుగుతున్న హింసని నివారించాల్సిన, అడుకట్టవేయాల్సిన అంశంగా భావించకపోవడం వల్ల ప్రభుత్వాలు చేసిన సర్వచట్టాలూ బూడిదలో పోసిన పన్నీరుగా పనికి రాకుండా పోతున్నాయి.
చట్టం చేయడంలో వున్న ఉత్సాహాన్ని అమలులో ప్రదర్శించకపోవడం చాలా ప్రస్ఫుటంగా కనబడుతోంది. గృహహింస నివారణ కోసం, గృహ హింస చట్టం అమలు కోసం ఏర్పరచిన వ్యవస్థని చిన్నాభిన్నం చేసి నిర్భయ సెంటర్‌లు, సఖి సెంటర్‌లు ఆపైగా మార్చేసి, కనీస బడ్జెట్ కూడా కేటాయించకుండా నడపాలనుకోవడం వెనక వున్నది స్త్రీల అంశాలపట్ల, వారిమీద అమలవుతున్న హింసల పట్ల చిన్నచూపు, తిరస్కార భావమే.
చట్టాల అమలు తీరు ఇలా వుంటే దేశం మొత్తం మీద పెనుచీకటిలాగా కమ్ముకుంటున్న మతోన్మాదధోరణులు మహిళల మీద మరింత హింసని ప్రేరేపించే సంకేతాలను పంపుతున్నాయి. మహిళల్ని ముందడుగు వేయనీయకుండా కట్టడి చేయాలనే కుట్రలూ సాగుతున్నాయి. మాటమీద, రాతమీద, ఆహారం మీద, వస్త్రధారణమీద, చదువు మీద,
ఉద్యోగం మీద, ఒకటేంటి… స్త్రీల జీవితాలకు సంబంధించిన సమస్తం మీద, వారి ఆలోచనల మీద, అంతరంగాల మీద భయానకమైన ఆంక్షలతో కూడిన దాడి జరుగుతోంది.
దశాబ్దాలుగా స్త్రీల ఉద్యమం పోరాడి సాధించుకున్న హక్కులను హరించాలనే దుర్మార్గమైన కుట్రలు సాగుతున్నాయి. పోరాడి వదిలించుకున్న అనేక సామాజిక రుగ్మతలను, కట్టుబాట్లను, అనాచారాలను మహిళలపై తిరిగి రుద్దే ప్రయత్నాలూ జోరుగా సాగుతున్నాయి. లౌకిక తత్వాన్ని సర్వనాశనం చేసి మతోన్మాదాన్ని, మతపరమైన క్రతువుల్ని, యజ్ఞాల్ని, యాగాల్ని, కుంకుమ పూజల్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ప్రజలు తమ సమస్యపై పోరాడకుండా వారిని గుళ్ళవేపు, భక్తివేపు తరుముతున్నారు. ఒకవైపు వరదల్లా పారుతున్న ఆల్కహాల్, మరోవైపు ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్న భక్తి మత్తులో సామాన్యుడు జోగుతున్నాడు. మెలుకువ రాగానే మహిళల మీద పడుతున్నాడు. ఈ రోజు ఆల్కహాల్ ఆధారిత నేరాలు, హింసలు ఎలా పెట్రేగిపోతున్నాయో ప్రతిరోజూ వార్తాపత్రికల్లో చూస్తూనే వున్నాం.
ఇలాంటి నేపధ్యంలో మహిళలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశ్యంతో ‘మహిళలు – చట్టాలు – సహాయ సంస్థలు’ ప్రత్యేక సంచికను అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా తీసుకువచ్చాం. కనీసం చట్టాల మీద అవగాహన, చైతన్యం పెరిగితే చట్టాల అమలు కోసం ఉద్యమిస్తారన్న ఆశతోనే ఈ ప్రయత్నం చేసాం. 2010లో ఇలాంటి సంచికను 20,000 కాపీలు వేసి అందరికీ పంచాం. ఐతే, ఈ ఆరేళ్ళలో వచ్చిన మరికొన్ని చట్టాల ముఖ్యాంశాలతో పాటు మరోసారి ఈ సమాచారాన్ని అందరికీ అందించాలనేది మా ఉద్దేశ్యం.
హింసలనెదుర్కొనే మహిళలందరికీ దారి చూపే దీపంగా
ఈ ప్రత్యేక సంచిక ఉపయోగపడాలని కోరుకుంటూ…. ఆకాంక్షిస్తూ….