బాణాలు – గుల్లేళ్ళు – రమణిక గుప్తా అనువాదం: సి. వసంత

నేను ఆసుపత్రి నుండే కుజూలో ‘కాంట్రాక్టులని రద్దు చెయ్యండి’ – అనే నినాదం మొదలుపెట్టి రాబోయే ఉద్యమానికి నాంది పలికాను. నా విరిగిన చేతులతో కళ్ళాన్ని సంబాళించాను. ఆసుపత్రిలో ఉండికూడా రెండు నెలలు ప్రచారం చేయించాను. ఈ యుద్ధంలో తాము వెనుకబడకూడదు అన్న ఉద్దేశ్యంతో శ్రీకృష్ణ సింహ్‌, రామానంద్‌ తివారి, జసరాజ్‌ సింహ్‌ ముందుకు నడిచారు. నిజానికి తులసీ సింహ్‌ కేవలం కార్మికుల పార్టీ హితం కోరి ఈ యుద్ధంలో దుమికారు. మా ఉద్యమానికి ప్రణబ్‌ చటర్జీ సమర్ధత ఉంది.

ఈసారి కార్మికులందరు ఆయుధాలను చేతబూని కుజు చేరాలని ప్రణాళిక వేసుకున్నాము. నామీద హత్యా ప్రయత్నం, నామీద పడ్డ దెబ్బలు మా ఉద్యమానికి సంజీవినిగా పని చేయడమే కాక శత్రువుల గుండెలలో భయం పుట్టడానికి ఎంతో దోహద పడ్డాయి. ఇప్పుడు మా ఉద్యమం రాష్ట్రం అంతటా వ్యాపించింది. మేం ఒంటరిగా లేం. మాతో పాటు వేల సంఖ్యలో కార్మికులు నడిచారు. ‘కుజ్‌ వైపు ప్రస్థానం’ అని నినాదం చేసాం. బాణాలు పట్టుకుని రండి – గుల్లేళ్లని పట్టుకు రండి, కుజు వైపు ప్రస్థానం’ అంటూ ఉంటే, ఈ నినాదాలు నలువైపులా ప్రతిధ్వనించాయి. గిరీడిహ్‌ నుండి కూడా కార్మికులు రావడం మొదలు పెట్టారు. రైలీ గఢా, గిద్దీ, కేదలా, ఝార్‌ఖండ్‌, బేరమోల నుండి కూడా కార్మికులు వారితో పాటు గ్రామస్థులు కూడా రావడం మొదలు పెట్టారు. మాకు సహకారం అందించడం మొదలు పెట్టారు.

సభకి చేరగానే మమ్మల్ని కాంట్రాక్టర్లు చంపిస్తారని ముఖ్యంగా నన్ను చంపిస్తారని పోలీసులు ప్రచారం చేయడం మొదలు పెట్టారు. నేను ఆ రోజు సభకి వెళ్తే నన్ను చూపించే వాళ్ళే. అందువలన ఆరోజు నా ప్రాణాలకీ ముప్పు ఉందని చెబుతూ రక్షణ కల్పించాలన్న ఉద్దేశ్యంతో నన్ను చరహీలో అరెస్టు చేసారు. సంయుక్త సోషలిస్ట్‌ పార్టీ ప్రభుత్వంలో పనిచేసిన మాజీ మంత్రి రామానంద్‌ తివారి, శ్రీకృష్ణ సింహ్‌, తులసీ సింహ్‌, హిందూ మజ్దూర్‌ సంఘ్‌ నేత జస్‌రాజ్‌ సింహ్‌ మాతో పాటు అరెస్ట్‌ అయ్యారు. మా కార్మికులను ముఖ్యంగా కేదలా వాళ్ళని అడవుల్లో పట్టుకుని పోలీసులు, గూండాలు కొట్టారు. అయినా మా వాళ్ళు నిరుత్సాహ పడలేదు.

మా కార్యకర్తలు బెనర్జీ బాబు, శివనాథ్‌ సింహ్‌ గిద్దీ నుండి అక్కడికి చేరారు. ఆరా లోనే మీటింగు జరగాలని వాళ్ళ ఉద్దేశ్యం. బాణం, గుల్లేళ్ళు, లాఠీ, పిస్తోళ్ళతో తలబడాలి. పోలీసులు కూడా భయపడ్డారు. బాణాలకి పోలీసులు, గూండాలు భయపడతారు. నలువైపులా అడవులే. ఎటువేపు నుండైనా బాణం వచ్చి తగలవచ్చు. మీటింగు సమయంలో ఆరా గనులలో వేలమంది కార్మికులు విల్లులు, బాణాలు, గుల్లేళ్ళు మొదలైనవి తీసుకు వచ్చారు. అందరు ఒక చోటికి చేరారు. ఆ తరువాత అడవి దారి నుండి పది – ఇరవై కిలోమీటర్ల దాకా నడిచి వెళ్ళారు. అక్కడ రైలీగఢా లీడర్‌షిప్‌ని పన్నాబాయి, అమీర్‌ఖాన్‌ సంబాళించారు. బి.ఎన్‌. బెనర్జీ, లాల్‌సింహ్‌, నాగర్‌, చౌహాను గార్లతో గిద్దీ, సౌందా ల నుండి ఎన్‌.సి.డి.సి లో పర్మనెంట్‌ అయిన కార్మికులు కూడా వచ్చారు. రేలీగఢ్‌లో ముండా, భత్తు, ఓఝా, మిశ్ర, మున్నీదేవి, చాసోదేవి, ప్రేమ్‌దాస్‌, దీక్షిత్‌ ఇంకా సతిరామ్‌ యాదవ్‌ నేతృత్వంలో ఇంతకు ముందే వేల సంఖ్యలో కార్మికులు అక్కడ ఉన్నారు.

మెజిస్ట్రేటు మీటింగ్‌ పెట్టడానికి అడ్డు పడ్డారు. కాని పన్నాబాయి, బెనర్జీలు ”గొడవ అయితే అయింది కాని మీటింగు జరిపి తీరుతాం” అంటూ ముందుకు సాగారు.

నలువైపులా అడవులన్నీ మెజిస్ట్రేట్‌కి తెలుసు. దాదాపు పది వేల మంది కార్మికులు ఒక చోటికి చేరారు. వంద రెండొందల మంది గూండాలు, పోలీసులు ఏం చేయగలుగుతారు. పిస్తోళ్ళు పేలిస్తే రెండు వైపులా ఎందరో చచ్చేవాళ్ళు. కార్మికులకు అడవిలో పౌరులు తెలుసు కాని పోలీసులు, గూండాలకు తెలియదు. అందువలన మేజిస్ట్రేట్‌ పోలీసులు, కాంట్రాక్టర్‌లు ఎంత వద్దన్నా మీటింగు పెట్టడానికి అనుమతి ఇచ్చారు. మీటింగులోనే మేజిస్ట్రేట్‌ కార్మికులకు మా అరెస్ట్‌ విషయం తెలిపారు. మా సంఘానికి అసులు షీబూకాళీ బెనర్జీ గనులలో సభ ఏర్పాటు చేయడమే గగనం.

మీటింగు అయ్యాక ఆరా గనుల దగ్గర నుండి ఏడు కిలోమీటర్లు నడిచి వచ్చి దివిటీలు చేతబట్టి వేల-వేల కార్మికుల ఊరేగింపు షీబూకాళీ బెనర్జీ ఇంటి ముందు ప్రదర్శన జరపాలన్న ఉద్దేశ్యంతో కుజు బజారుకి చేరింది. కుజు బజారులోని వ్యాపారస్థులు దుకాణాలు మూసేసారు. నిజానికి కార్మికులు వాళ్ళకి ఎటువంటి హాని తలపెట్ట లేదు. ఊరేగింపు శాంతియుతంగా నినాదాలు చేస్తూ ముందుకు నడిచింది. కాని వాళ్ళల్లో నిబిడీకృతమైన చెడ్డతనం వాళ్ళని భయగ్రస్తులను చేసింది. నామీద దాడి జరిగిన రోజున అందరు తమాషా చూసారు. నోరు విప్పలేదు. వాళ్ళకి కాంట్రాక్టర్ల భయం ఉంది. వాళ్ళకు ప్రతీ రోజు వాళ్ళతో సంబంధం ఉంటుంది. కార్మికులు ఉద్రిక్తులై హింసవైపు నడవ లేదు. శాంతియుతంగా ముందడుగు వేసారు.

కార్మికుల ఉద్దేశ్యం – శాంతియుతంగా ప్రదర్శన చేయడం – అంతేకాని అల్లర్లు చేయడం హింసను ప్రోత్సహించడం ఎంతమాత్రమూ కాదు. యాజమాన్యం కాంట్రాక్టర్లు, మాఫియాల ఉద్దేశ్యం దీనికి వ్యతిరేకం. మాఫియా, యాజమాన్యం వాళ్ళలో కొందరు హింసని ప్రవేశపెట్టి అవతలి వాళ్ళు ధైర్యం కోల్పోయేలా చేస్తారు. దీనికి వ్యతిరేకంగా కార్మికులు మాఫియాలను, యాజమాన్యం వారికి హెచ్చరిక చేస్తారు – జాగ్రత్త! మాలో మీతో భేటీ చేయగల శక్తి ఉంది. మా దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి. కాని దాడి చేయడానికి కాదు, రక్షణ కోసం. మేం పిరికి వాళ్ళం ఎంత మాత్రం కాదు. ధైర్యం ఉంటే ఎదురుగా రండి-”

హింసను కోరేవారికి అహింసను వాంఛించేవారికి ఇదీ భేదం. ఇద్దరు చేసే పోరాటంలో చాలా భేదం ఉంది. ఈ విషయం మీద మేరరీ టేలర్‌తో హజారీబాగ్‌ జైల్లో దీర్ఘ చర్చ జరిపాను. ఈ సంఘటన జరిగిన తరువాత కొన్ని కారణాల వలన కుజులో యూనియన్‌ శాఖను తెరవలేక పోయాం. కాని ఇక్కడ జరుగుతున్న అన్యాయ, అక్రమాలని ఎదిరించాం. భయాందోళనలను దూరం చేసాం.

మమ్మల్ని బెరహీలో అరెస్ట్‌ చేసారు. హజారీబాగ్‌ జైలుకి పంపించారు. రామానంద్‌ తివారి ఇంకా మరికొందరు నేతలని సెల్‌కి పంపించి వేసారు. నన్ను మహిళా సెల్‌లో ఉంచారు. మేం అందరం అసలు బెయిల్‌ తీసుకోడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే మా దృష్టిలో అసలు అరెస్ట్‌ చేయడమే చట్టవిరుద్ధం. షీబూకాళీ బెనర్జీని సంతోష పెట్టడానికే గవర్నమెంటు మమ్మల్ని అరెస్ట్‌ చేసింది. ప్రణవ్‌ చటర్జీ పాట్నా హైకోర్టులో మా అరెస్ట్‌కి విరుద్ధంగా రిట్‌ పిటీషన్‌ వేసారు. 15 రోజులు మేం జైల్లో ఉన్నాము. ఏ షరతు లేకుండా మమ్మల్ని విడుదల చేసింది. నేతలందరు పాట్నా వెళ్ళిపోయారు. నేను కోల్‌-ఫీల్డ్‌కి వెళ్ళిపోయాను. మేం రైల్‌ గఢా ఉద్యమానికి ఏర్పాట్లు చేయడం మొదలు పెట్టాము.

చంపా – చమేలీల కలయిక

జైల్లో ప్రతీరోజు సూపరింటెండెంట్‌ గదికి ఎర్రలైట్‌ ఉన్న ఎలక్ట్రిక్‌ పరికరంతో విరిగిన నా చేతికి ట్రీట్‌మెంటు తీసుకోడానికి వెళ్ళాల్సి వచ్చేది. నేను దుస్తులు ధరించే స్థితిలో లేను. మేరీటేలర్‌, కల్పన అనే నక్సలైట్లు నా పక్కన ఉన్న సెల్‌లో ఉండేవారు. రోజులో నేను ఎప్పుడైనా జైలు ఆవరణలోకి వచ్చినపుడు ఈ ఇద్దరి ఆడపిల్లలతో మాట్లాడేదాన్ని.

”ప్రజలు విప్లవం కోరుకుంటున్నారు. వాళ్ళకి లాఠీలు ఇస్తే దాడి చేస్తారు. రైఫిల్స్‌ ఇస్తే కాలుస్తారు. గుండ్లు దూసుకు వెళ్తాయి. విప్లవం వచ్చి తీరుతుంది.” అని మేరీ టేలర్‌ అనేది.

కాని నేను ఇట్లా తర్కం చేసాను – ”కుజూలో పది వేల మంది గుంపు ఒక గంట దివిటీలను చేతబట్టి ప్రదర్శన కొనసాగించారు. కాని షీబూకాళీ ఇల్లు తగలబడలేదు. అసలు వాళ్ళ క్రోధం ఇంకా కట్టలు తెంచుకోలేదు. వాళ్ళు క్రాంతి సైనికులు అని అనుకునేంతగా ఇంకా గుండెలు భగభగమనలేదు. ఇప్పటికీ

వాళ్ళు సామరస్యంతో మార్గం వెతుక్కోవాలనే అనుకుంటున్నారు. మరి అట్లాంటప్పుడు ఎవరిని చంపుతారు? ప్రస్తుతం మన దేశంలో పెటీ – బూర్జువా గుంపు పీడించే సాధనాలు. వీళ్ళు బీద వర్గం నుండి వచ్చినా వాళ్ళని వాళ్ళు తక్కిన బీదవాళ్ళ కులాలకన్నా ఆధిక్యతలో ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే శాస్త్రాలు వర్ణవ్యవస్థను బలపరుస్తున్నాయి. కులాలన్నింటిలో వీళ్ళది పెద్ద కులం. నిమ్నకులానికి, నిమ్న వర్గానికి చెందిన వెట్టి చాకిరీ చేసేవాళ్ళు కూడా భారతదేశంలో పెటీ – బూర్జువా లేక జమీందారులుగా కావాలని కలలు కంటారు. పై జన్మలో అగ్రవర్ణంలో పుట్టాలని వాళ్ళు కూడా వెట్టి చాకిరీ చేసేవాళ్ళని పెట్టుకోవాలని అనుకుంటారు. భారతదేశంలో జమీందారీ వ్యవస్థను సమూలంగా నాశనం చేయాలని అందరూ శ్రమించాలని కలలు కనరు. ఎందుకంటే భారతదేశంలో శ్రామికులు ఎప్పుడూ తక్కువ కులాల వాళ్ళే ఉంటారు. ఉత్పత్తి చేసే తక్కువ కులాల శ్రామికులని తక్కువ దృష్టితో చూస్తారు. ఏ పని-పాడు చేయకుండా తక్కువ కులాల వాళ్ళని అణగదొక్కేవాళ్ళని గొప్పగా చూస్తుంది ఈ వ్యవస్థ. దాదాపు 40 కోట్ల జనాభా ఉన్న దేశంలో 28 కోట్లు తప్పకుండా పెటీ-బుర్జువాలే. ఇంతమందిని చంపడం ఎంతో కష్టం. వాళ్ళల్లో మానసిక పరివర్తనను తీసుకురావాలి. శ్రామిక శక్తి బలాన్ని ఉపయోగించి జమీందారీ పెట్టుబడుదారుల వంశాలని సమాప్తం చేయలేం. ఎందుకంటే ఈ స్థితి భారతంలో లేదు. దీనికి కారణం మధ్యమ వర్గీయ సామంతుల వ్యవస్థ, పెట్టుబడీ జమీందారు వ్యవస్థ, పీడితులు-తాడితుల మధ్య పెద్ద ఆటంకం అయి కూర్చున్నాయి.”

కాని ఆమె నాతో ఏకీభవించలేదు.

మేరీ టేలర్‌ కోసం నేను బయట బల్లపై కొన్ని కాగితాలు పెట్టాను. నేను సెల్‌లో ఉన్నప్పుడు బయట కూర్చుని రాస్తూ ఉండే దాన్ని. ఆమె ఆ కాగితాలు తీసుకుంది.

కల్పన బెంగాలీ అమ్మాయి. నేను జైల్లో ఉన్నప్పుడు ఆమె పైన ఒక కవిత రాసాను. దాన్ని ఇంగ్లీషులో అనువాదం చేసి మేరీ టేలర్‌కి వినిపించాను.

నా సెల్‌ పక్కన మహిళా ఖైదీల కోసం ఒక హాలు ఉండేది. అక్కడ ఒక ఆదివాసీల అమ్మాయి ఉండేది. ఆమె అమీర్‌ఖాన్‌ని ప్రేమ-వివాహం చేసుకోవాలనుకుంది. అల్లర్లు చెలరేగుతాయని భయపెట్టి కాంట్రాక్టర్ల మాట మీద ప్రభుత్వం ఆమెను అరెస్ట్‌ చేసి జైలుకి పంపించారు. నా బాగోగులు చూడడానికి అధికారులు ఆ అమ్మాయిని నియమించారు. ఆ అమ్మాయే నన్ను పొద్దున్న లెట్రిన్‌లో కూర్చోపెట్టేది. నా బట్టలు మార్చేది. నా చేయి విరిగింది అందువలన నా పనులు నేను చేసుకోలేక పోయేదాన్ని. మెన్‌సెస్‌లో ఉన్నప్పుడు బట్టలు మార్చుకోవడం కూడా నేను చేయలేక పోయేదాన్ని. మానసిక వేదనకి గురికావడం వలన మెన్‌సెస్‌ కూడా సరియైన టైమ్‌కి వచ్చేది కాదు. నా బట్టలు మాటిమాటికి పాడయ్యేవి. నా దగ్గర ఎక్కువ బట్టలు లేవు. వాటినే ఉతికి ఆరవేసుకోవాల్సి వచ్చేది. ఆ రోజుల్లో సోఫిస్టికేటెడ్‌ సామగ్రిని ఉపయోగించే శక్తి-సామర్థ్యాలు లేవు. ఆ అమ్మాయి నాకు సహాయ పడేది. జైల్లో సర్వీస్‌ లెట్రిన్లు ఉండేవి. సెప్టిక్‌ లెట్రిన్‌లు లేవు. అందువలన ఇంకా ఘోరమైన పరిస్థితి ఉండేది.

నాతో పాటు ఇంకా ఎందరో జైల్లో ఉన్నారు. ఆ రోజుల్లో ఒక నియమం ఉండేది. రాజకీయవేత్తలు కాని ఉద్యమకారులు కాని బందీలైతే, జైలు నుండి వెళ్ళిపోయేముందు (జమానత్‌ మీద విడుదల అయినా) ధోతి, పైజామా, కుర్తా, లాగులు, ధోవతులు వాళ్ళకి ఇవ్వాలి. వాతావరణాన్ని బట్టి కంబళ్ళు కూడా దొరికేవి. మహిళా ఖైదీలకు చీరలు, బ్లౌజులు, పెటీకోట్లు ఇచ్చేవారు. కాని ఈ నియమం తెలియని వాళ్ళు ఎప్పుడైనా అప్పుడప్పుడు వచ్చే ఖైదీలకు ఈ అధికారులు ఇచ్చేవారు కాదు. మేం అందరం జైల్లో ఉన్న మా తోటి వాళ్ళందరికి రేషను లభించేలా పోరాటం చేసాం. చివరికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఉద్యమకారులు ఇప్పుడు స్వయంగా అన్నం వండుకోవడం మొదలు పెట్టారు. జైలు అధికారులు వాళ్ళ సహాయార్థం నేరస్థులలో ఒకళ్ళిద్దరిని ఇచ్చేవారు. శుభ్రమైన స్వచ్ఛమైన భోజనం లభించసాగింది. జైలు అధికారులు మాకు వచ్చే రేషనుని కాజేసే అవకాశం కూడా లేదు. ఉద్యమకారులని తమ-తమ ఇళ్ళు గుర్తుకు వచ్చేవి కావు. మా కార్యకర్తలు చెక్‌ చేయడం వలన తిండి విషయంలో క్వాలిటీ క్వాంటిటీ రెండూ బాగా ఉండేవి. జైలు నుండి విడుదల అయ్యేటప్పుడు అందరు కంబళ్ళు బట్టలు వెంట తీసుకు వెళ్ళేవారు. మేరీ టేలర్‌ ఈ విషయంలో మాతో ఏకీభవించేది కాదు. వీటిని ఎందుకు తీసుకు వెళ్ళడం అని ఆమె ప్రశ్నించింది. విడుదల అయ్యేటప్పుడు వీటిని తీసుకు వెళ్ళాలి అన్న నియమం ఉన్నప్పుడు వాళ్ళని ఆపడం తప్పు అని నేననేదాన్ని. ఈ నియమం లేకపోతే వాళ్ళు తీసుకు వెళ్ళడం అనుచితమైన పని అవుతుంది. స్వాతంత్య్ర సమరం సమయంలో ఉద్యమకారుల సమయంలో చట్టపరమైన కొన్ని సవరణలు జరిగాయి. వాళ్ళకు కొన్ని సదుపాయాలు ఉండేవి. ఖైదీలకు బట్టలు ఇవ్వాలన్న నియమం ఎప్పుడూ ఉండేది. సోషలిస్టు పార్టీలో నేతలకి కట్టుకోడానికి బట్టలు, కప్పుకోడానికి కంబళ్ళు లేకపోతే ఏదోవిధంగా ఉద్యమాన్ని నడిపి అరెస్ట్‌ అయ్యేవారు. విడుదల అయ్యాక వాళ్ళకి రెండు జతల ధోవతులు, కురతాలు, పైజాములు, కంబళ్ళు లభించేవి.

నేను పట్టుబట్టి నా సెల్‌ నుండి బయటకి వచ్చి జైల్లో ఉన్న ఖైదీలతో కలిసేదాన్ని. ఉద్యమకారులను కూడా కలిసేదాన్ని. రాబోయే సమయంలో చేయవలసిన వాటిని ప్రణాళికలుగా రూపొందించేవాళ్ళం. ఎన్నోసార్లు జైలు సూపరింటెండెంట్‌ ఖైదీలతో గొడవ పడేవాడు. వాళ్ళతో మాట్లాడమని సమస్యను పరిష్కారం చేయమని నన్ను పంపించేవాడు. ఎక్కువగా తిండి విషయంలోనే గలాటా జరిగేది. భోజన సామగ్రి టైమ్‌కి దొరకలేదనో, తక్కువ దొరికిందనో గొడవలు అయ్యాయి. నేను ఇద్దరి మధ్య శాంతియుతంగా పరిష్కారం చేసేదాన్ని. జైలు అధికారి నన్ను మహిళా ఖైదీగా కాకుండా ఒక నేత ఖైదీగా చూసేవాడు. పురుషుల సెల్‌లో కూడా నామీద ఇదే అభిప్రాయం ఉండేది.

మేరీ టేలర్‌ తన తోటి వారితో జైలులోంచి పారిపోయింది. అప్పుడు నేను అక్కడే ఉన్నాను. వాళ్ళందరు పట్టుబడ్డారు. ఫైరింగ్‌ కూడా అయింది. దీని తరువాత ఆమెపై నిఘాని ఇంకా ఎక్కువ పెంచారు. తరువాత వీళ్ళందరిని వేరే వేరే జైళ్లలో పెట్టారు. ఇదంతా జరిగాక ప్రెస్‌వాళ్ళు మేరీ టేలర్‌కి నాకు మధ్య జరిగిన సంభాషణను ‘చంపా – చమేలీ కా మిలన్‌’ అన్న శీర్షికన ప్రచురించారు.

(ఇంకావుంది)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.