భూమిక మిత్రులకు,
నమస్తే !
మార్చి 2016 సంచిక చూసి చాలా ఆశ్చర్య పోయాను. ప్రభుత్వంలోని ఒక ప్రణాళికా విభాగం, నూరుగురు
ఉద్యోగులతో చేయగలిగిన పని, ఏదో కాస్తంత సహానుభూతి, సహకారం తప్ప, ఎటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నిర్మాణ వ్యవస్థాలేని భూమిక నిర్వహించడం! అందునా ఆడవాళ్ళు నిర్వహించే పత్రిక… సంపాదక, సలహా సభ్యులలో మచ్చుకైనా మగ నాకొడుకు లేని పత్రిక నిర్వహించడం..! చాల గొప్ప విషయమే కాదు, రికార్డుల కెక్కవలసిన విషయం. సంపాదకురాలు సత్యవతి తల్లి మాత్రమే కాదు, అమ్మ తల్లి అంటాను నేను. ఈ పుస్తకాన్నే భూమిక ప్రచురణగా మంచి కాలికో బౌండ్ చేసి ప్రచురిస్తే అన్ని లా కాలేజీలకూ, లా బుక్ హవుస్‌లకూ కూడా గొప్పగా ఉపయోగపడుతుంది. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ యివ్వగలిగిన సమగ్ర దృక్పథం కలిగిన రిపోర్టు ఇది. ఇందుకు తోడ్పడిన వారందరికీ నా నిండు కృతజ్ఞతలు, స్సలాములు. ఈసారి వివిధ మత చట్టాల గురించి వాటిలోని లోటుపాట్ల గురించి ప్రత్యేక సంచిక, వివిధ కేసుల వివరాలతో యివ్వండి.
వందనాలతో… – డి. నటరాజ్, విశాఖ మహానగరం
……..ఙ……..
గౌరవ సంపాదకులకు నమస్సుమాంజలులు
ఓల్గా గారిని గురించి చక్కగా ఆవిష్కరించారు.
కథలు, కథానికలు, వ్యాసాలు చాలా బాగున్నాయి. అస్మిత సమావేశ చిత్రణ బావుంది. అదే వ్యాసంలో ఆహూతులను ఆహుతులను చేశారు. చిన్న దీర్ఘం తగ్గించడంతో ఎంత అర్థభేదమో గ్రహించండి… ప్రూఫ్ రీడింగ్ చూడడంలో పొరపాటనుకుంటున్నా.
పుస్తకాల కవర్ పేజీ ప్రచురించటంవల్ల అటు రచయితలకు ఇటు చదువరులకు ఉపయోగం లేదు. చిరునామాలు వ్రాస్తే బావుంటుంది.
మీ ప్రయత్నం బావుంది. కొనసాగిస్తారని ఆశిస్తున్నా… – ఎ.బి. ఆనంద్, విజయవాడ.
……..ఙ……..
భూమిక స్త్రీవాద మాసపత్రిక ఎడిటర్ సత్యవతి గారికి నమస్తే,
మార్చి నెల భూమిక పత్రిక అందింది. మహిళల గురించి పత్రికలో మీరు ఇచ్చిన చట్టాలు, వివిధ సంస్థల చిరునామాలు, అలాగే జిల్లా అధికారుల ఫోన్ నెంబర్లు ఎంతో విలువైన సమాచారం అందించారు. ఒక్క మాటలో చెప్పాలంటే వెలకట్టలేని సమాచారం అని చెప్పవచ్చు. స్త్రీలకు సంబంధించిన రచనలే కాకుండా వారికి అవసరం అయిన ఇలాంటి వివరాలు అందించడం చాలా అభినందనీయం. మీ పత్రిక ద్వారా మరింత మంచి జరగాలని మీరు మరింత ఉన్నత శిఖరాలకు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ధన్యవాదములతో…. – యస్.కె. గౌస్ బాషా, నెల్లూరు.
……..ఙ……..
సత్యవతి గారికి నమస్కారములు.
నేను కొద్ది నెలలుగా ‘భూమిక’ చదువుతున్నా. మీరు, ప్రశాంతిగారు కలిసి వ్రాస్తున్న ‘భూమిక’ సంపాదకీయాలు చాలా సమంజసంగానూ, ఘాటుగానూ వుంటున్నవి. ఇవేకాక ‘భూమిక’ లో వస్తున్న చాలామటుకు రచనలన్నీ మీరు ఈ పత్రికను ప్రారంభించే సమయంలో అనుకొన్న ఆశయాలకు, ఉద్దేశాలకు కట్టుబడి నిబద్ధతతో రెండు దశాబ్దాలకు పైగా పత్రికను ఉన్నత స్థాయిలో తీసుకు వస్తున్నందుకు నాహృదయపూర్వకమైన అభినందనలు.
డిసెంబర్ సంచికలో మీరు వ్రాసిన వ్యాసం – ‘మహిళలు నడుపుతున్న పత్రికలు – నాడు, నేడు’ సుదీర్ఘంగా వుంది. నాకు చాలా బాగా నచ్చినది.
– వి. క్రిష్ణమూర్తి, మైసూర్.
……..ఙ……..
భూమిక మార్చి ఎడిషన్ ”చట్టాలు-సహాయ సంస్థలూ…మనం” ప్రత్యేక సంచిక వెలువరించిన మీకు ఐద్యా రాష్ట్ర కమిటీ నుండి ధన్యవాదములు. ఈ సంచిక ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావించి మా కమిటీలకు కూడా అందుబాటులో ఉంచేందుకు 50 కాపీలు మాకు పంపవలసిందిగా కోరుతున్నాము. విలువైన ఈ పుస్తకాలకు మొత్తం బ్యాంక్ అకౌంట్‌లో జమ చేయగలము.
అభివందనములతో…
– డి.రమాదేవి, కార్యదర్శి, ఐద్వా.
……..ఙ……..