యెవరెవరో..
ఏమేమో…
చెప్తూనే ఉన్నారు..
యేళ్ళ తరబడి.. నా అడుగుల్ని, నడకల్ని
నియంత్రిస్తూనే వున్నారు..
నా పడకల్ని, చూపుల్ని, నవ్వుల్ని..
నిర్ణయిస్తూనే ఉన్నారు..
వడివడిగా పరిగెత్తనియ్యక..
అందంగా.. బంధాల్ని..
నా ధైర్యాన్ని హరించే పిరికి మందుల్ని..
శతాబ్దాలుగా..
అలుపూ సొలుపూ లేక..
నూరిపోస్తూనే వున్నారు..
నన్ను క్షేత్రమన్నారు..
వాళ్ళబీజాల ఫలదీకరణల ప్రయోగాలకు
నన్ను పరీక్షాకేంద్రంగా మార్చారు..
వాడి పటుత్వ నిర్ధారణకు..
నన్ను పావుగా వాడిపడేశాడు.
నేనో ప్రాణమున్న పరీక్ష నాళికను..
నాలోకి యేవేవో యాసిడ్లు పంపి..
విస్తృతంగా.. వికృతంగా..
విస్తారంగా..
వంశాంకురాల కోసం..
గర్భాశయపు సారాన్ని పెంచే..
పరీక్షలు చేసారు..
తొలిరాత్రిపేరుతో శృంగారం రంగరించి..
ఘాటైన విషాల్ని..
కామమనే కషాయాన్ని.
నా మౌనాన్ని అంగీకారంగా నిర్వచించిన
‘పెద్దవాళ్ళ’ ఆసరాతో..
నా పచ్చి గాజుదేహంలోకి..
రాక్షసంగా ఒలికించారు..
.. గాజు పొరలు చిట్లి.. నెత్తురోడిన నన్ను..
ఆనందంగా ”కన్య”నని తేల్చారు.
యెవరెవరో..
నన్ను దేవతనిచేసారు..
గుళ్ళనే, ఇళ్ళనే జైళ్ళలో బంధించి..
నా ప్రమేయం లేకుండా.. చీరలను చుట్టబెట్టి..
గంగిరెద్దు అలంకరణలు ఒంటినిండా చేసి..
నలుగు పెట్టి, పసుపూ పారాణి పూసి….
మొద్దులా నిలబెట్టారు..
తలరాతలు వాళ్ళురాసి..
దాసిగా, తల్లిగా, రంభలా..
జన్మంతా..
ఓ సోమరిపోతుసేవకై..
బలిపశువును చేసారు..
నాకోసం వంటగదులు కట్టారు, వంటపాత్రలు కొన్నారు..
నా ఆస్తిపాస్తులు నిర్ణయించి..
నన్నేలుకోమన్నారు..
నన్ను మహరాణివని, దేవతవని..
గ్రంధాలు రచించి..
నా మూగనోము ఆసరాతో..
గ్రంధసాంగులయ్యారు..
..యెవరెవరో..
శీలపరీక్షలు చేసారు..
యేళ్ళకేళ్ళు నన్ను మత్తులోకి తోసారు..
ముక్కు చెవులూ కోసారు, శాపగ్రస్తను చేసారు..
కులటనే ముద్రవేసి..
నా బ్రతుకు బండలు చేసారు..
ఇంకెవరో రాకముందే..
నేను మేల్కోవాలి..
వడిగా నా నడుము కట్టుకొని
నా శాపాల సిలువ నుండే..
నా ఆయుధాల్ని చెక్కుతాను..
నా ఒంట్లోని యెముకలనుండి..
నా బాణాల్ని సానపడతాను..
నా సంకెళ్లను తెంచుకొని..
యెవరెవరో రాసేసిన తలరాతను చెరిపి..
నా కంపిస్తున్న నరాలతో తాళ్ళను పేని..
నాపై
నీ తరతరాల పెత్తనాన్ని..
దశాబ్దాల నేరాల్ని..
నేనే ఉరివేస్తాను..
నా రేపటి భవిష్యత్తును
నేనే..
తిరిగి రాస్తాను..
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags