నాకు వెలుతురూ చీకటీ ఒక్కటే
చీకటి చెడ్డదని
చీకటి పడాకా బయట తిరగొద్దని ఊదరకొడతావ్
కానీ… చెడ్డది చీకటి కాదురా నీ బుద్ధి
నాకు ఇల్లూ రోడ్డూ ఒక్కటే
రోడ్లమ్మట తిరగొద్దని హుకుం జారీ చేస్తావ్
కానీ… రోడ్లు చెడ్డవి కాదురా
రోడ్ల మీద నువ్వేసే రౌడీ వేషాలు చెడ్డవి
నాకు చీరా జీన్సూ ఒక్కటే
జీన్సెయ్యొద్దని జబర్దస్తీ చేస్తావ్
కానీ… నువ్వేమైనా పంచె కట్టి
పిలక పెట్టి తిరుగుతున్నావా చెప్పు
చీర భారతీయతకి చిహ్నమని చిందులేస్తావ్
కానీ… చీరల్ని నీ ముఖాన విసిరి
వెదురు బొంగుల్తో చితక్కొట్టడానికొస్తారు
ఈశాన్య రాష్ట్రాల ఏడుగురు అక్కాచెల్లెళ్లు
అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పురోగమన యుగంలోంచి
మధ్య యుగాల మహా చీకటిలోకి ఈ తిరోగమనమేల
నువ్వు పోతే పో…
నన్ను మాత్రం లాగకు…
నా గమనం ముందుకే
అయినా… జీవితం నాది
నీ పెత్తనమేందిరా???