మా ఇంట్లో నేను, మా చెల్లి అమ్మ, నాన్న ఉంటాము. నేను 9వ క్లాస్‌లో ఉన్నప్పుడు యంహెచ్‌యం పై కోర్ టీమ్ మెంబర్‌గా స్వార్డ్ సంస్థనుండి సెలక్ట్ అయి గత 4 సంవత్సరాలుగా ఇప్పటివరకు 2400 మంది పియర్ గ్రూప్ మెంబర్స్‌కి నేను ట్రయినింగ్ ఇవ్వడమే కాకుండా, మా స్కూల్‌లో టాయిలెట్ ముఖ్యంగా గర్ల్స్ కొరకు, న్యాప్‌కిన్స్ వాడిన వేష్టు పారేయడానికి డష్టుబిన్స్ పెట్టించడంతో పాటు 3 సంవత్సరాల క్రితం జిల్లా స్థాయిలో ట్రయినింగ్‌లో, జిల్లా అధికారుల సమక్షంలో వివిధ శాఖల అధికారుల ఎదురుగా స్కూల్‌లో సెపరేట్‌గా బాలికలకి టాయిలెట్స్ ఎందుకు ఉండాలి, బహిష్టు ప్రక్రియలు, ఋతుచక్రం, ఋతుస్రావం అంటే ఏమిటి, ఆ సమయంలో పాటించాల్సిన పద్ధతులపై ఒక రోజు శిక్షణ నిర్వహించాను.
స్వార్డ్-సిసిఎస్ వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం నవంబర్‌లో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు లో 6 ఆశ్రమ పాఠశాలల్లో దాదాపు 800 మంది బాలికలకి ఒక్కొక్క స్కూల్‌లో 2 రోజులు చొప్పున ట్రయినింగ్ ఇవ్వడం జరిగింది. వారితో పాటు టీచర్స్, ఆ స్కూల్స్‌లో ఉన్న ఏయన్‌యంలకి కూడా యంహెచ్‌యంపై ట్రయినింగ్ ఇవ్వడం జరిగింది.
ఇందుకు ఆదిలాబాదు ఐటిడీఏ-పీడీ గారు నన్ను అభినందించారు.
మొదట్లో నేను ఇటువంటి ట్రయినింగ్ తీసుకొంటున్నప్పుడు అందరు ఆడపిల్లలలాగానే సిగ్గుతో, భయంతో, అసహ్యంతో విన్నాను కానీ, బహిష్టు సమయంలో శుభ్రత విషయాలు నేను పాటించడం మొదలు పెట్టాక నాలో ఇంత మార్పు వచ్చింది.
ఏదయినా నేర్చుకోవాలి, ఆలోచించాలి, ఆచరించాలి, అప్పుడు అందరికీ చెప్పాలి.
ఇప్పుడు నేను జిల్లా స్థాయి అడ్వకసీ యంహెచ్‌యం ఫెడరేషన్ మెంబర్‌ని. నేను బహిష్టు విషయాలను ఎవ్వరికయినా, ఎక్కడయినా ట్రయినింగ్ ఇవ్వగలను.