థేరీ కథలు – వాడ్రేవు చినవీరభద్రుడు

వైశాఖ పౌర్ణమి రాత్రి. రెండున్నర వేళ ఏళ్ళ కిందట ఈ రాత్రి ఒక మానవుడు తనని వేధిస్తున్న ప్రశ్నల నుంచి బయట పడ్డాడు. ఆయన అనుభవించిన విము క్తి ఎటువంటిదో గాని, ఆయన సాన్నిధ్యంలోకి వచ్చిన వాళ్ళు, ఆయన మాటలు విన్నవాళ్ళు, ఆయన్ని తలుచుకున్న వాళ్ళూకూడా గొప్ప ప్రశాంతి పొందేరు, పొందుతూ వస్తున్నారు.

ఎప్పటికీ తెల్లవారదా అనిపించే భయానకమైన రాత్రిలాంటి జీవితం గడిపినవాళ్ళకి కూడా ఆయన మాట వినగానే జీవితం నడివేసవి వెన్నెలరాత్రిలాగా మారిపోయింది. ఆ అనుభవాన్ని వేల ఏళ్ళుగా కవులు, శిల్పులు, చిత్రకారులు, యోగులు ఎన్నో విధాల ప్రకటిస్తూనే ఉన్నారు.

అట్లాంటి స్వానుభవకథనాల్లో థేరీగాథలకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అవి తొలి బౌద్ధ సన్యాసినులు చెప్పుకున్న కథనాలు. వాళ్ళంతా దాదాపుగా బుద్ధుడి సమకాలికులు. ఆ కవితలన్నీ కూడా చాలావరకు బుద్ధుడి కాలం నాటివే. కనీసం క్రీ.పూ మూడవ శతాబ్దం నాటికి అవి ఇప్పుడు లభ్యమవుతున్న రూపం సంతరించుకున్నాయని చెప్పవచ్చు.

ఆ విధంగా అవి, బహుశా వేదకాల కవయిత్రుల తర్వాత మొదటి కవయిత్రుల కవితలు. కాని వేదాల్లో స్త్రీ ఋషులు దర్శించిన సూక్తాలు చెదురుమదురుగా కనిపిస్తే, ఈ కవితలన్నీ ఒక సంకలనంగా రూపొందేయి. అంటే, థేరీగాథలు, ప్రపంచ సాహిత్యంలోనే, స్త్రీల తొలి సాహిత్య సంకలనం, తొలి కవితా సంకలనం. ఇవి కవితలు మాత్రమే కాక స్వానుభవ కథనాలు కూడా కాబట్టి ప్రపంచంలోనే తొలి ఆత్మకథనాత్మక సాహిత్య సంకలనం కూడా.

ఇంత విశిష్టత ఉన్నప్పటికీ, ఏ కారణం చేతనో, థేరీగాథలకి క్రీ.శ 6వ శతాబ్ది దాకా, అంటే ధర్మపాలుడనే ఆయన వ్యాఖ్యానం రాసిందాకా రావలసిన గుర్తింపు రాలేదు. ఆ తర్వాత కూడా, చివరికి నిన్న మొన్నటి దాకా కూడా ప్రపంచానికి థేరీగాథల గురించి తెలియవలసినంతగా తెలియలేదు. 1883లో పాలీ టెక్ట్స్‌ సొసైటీ వారికోసం రిచర్డ్‌ పిశ్చెల్‌ చేసిన అనువాదంతో మొదలుకుని ఎన్నో అనువాదాలు వచ్చినప్పటికీ, వాటిలో రైస్‌ డేవిస్‌ వంటి మహనీయుడి అనువాదం కూడా ఉన్నప్పటికీ, 21వ శతాబ్దం మొదలయ్యాకనే థేరీగాథల మీద ప్రపంచం నిజంగా దృష్టి పెట్టిందని చెప్పాలి. అందులో భాగంగా, మూర్తి క్లాసికల్‌ లైబ్రరీ వారికోసం ఛార్లెస్‌ హాల్లిసే చేసిన అనువాదం ుష్ట్రవతీవస్త్రa్‌ష్ట్రa, ూశీవఎర శీట ుష్ట్రవ ఖీఱతీర్‌ దీబససష్ట్రఱర్‌ ఔశీఎవఅ (2015) మనబోటివారికి లభించిన గొప్ప కానుక.

థేర అనే పదం స్థవిర అనే పదం తాలుకు పాళీరూపం. స్థవిరవాదులు బుద్ధుణ్నీ, సంఘాన్నీ, ధర్మాన్నీ నమ్ముకున్న తొలితరం బౌద్ధులు. థేరీలంటే సన్యాసినులు. బుద్ధుడు తాను ప్రవచించిన ధర్మాన్ని అనుష్టించడం కోసం ఒక బౌద్ధ భిక్షు సంఘాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, అందులో చాలాకాలం దాకా స్త్రీలకి ప్రవేశాన్ని అనుమతించలేదు. అట్లా ఆయన అనుమతించిన మొదటి బౌద్ధ సన్యాసిని, ఆయన పినతల్లి, ఆయన్ని చిన్నప్పణ్ణుంచి పెంచి పెద్ద చేసిన మహాప్రజాపతి గౌతమి.

ఆమెతో సహా 70 మంది బౌద్ధ సన్యాసినుల అనుభవ కథనాలు కవిత్వమే థేరీగాథలు. ఆ డెబ్బై మందితో పాటు, మరొక 530 మంది సన్యాసినులు కూడా రెండు కవితల్లో కనిపిస్తారు. అంటే మొత్తం 600 మంది సన్యాసినుల అనుభవాలన్నమాట.

ఆ డెబ్బై మంది సన్యాసినుల అనుభవాలన్నిటినీ కలిపి రాస్తే అదొక ఇతిహాసమవుతుంది. దానికదే ఒక విస్తృత, విషాదమయ, విస్మయకారక ప్రపంచం. అందులో బ్రాహ్మణ, క్షత్రియ కుటుంబాలకు చెందిన స్త్రీలు మాత్రమే కాక, శాక్యులూ, లిచ్ఛవులూ కూడా ఉన్నారు. సంపన్న వర్తకుల కుమార్తెలు, భార్యలు ఉన్నారు. బుద్ధుడు జన్మించిన శాక్యవంశానికి చెందిన స్త్రీలతో పాటు ఆయన సిద్ధార్థుడిగా జీవించినప్పుడు ఆయనకు సహచరులుగా సంతోషాన్నిచ్చిన స్త్రీలు ఉన్నారు. బింబిసారుడి అంతఃపురానికి చెందిన స్త్రీలతో పాటు, ప్రసేనజిత్తు సోదరి, థేరమహాకస్సపుడి భార్య, సారిపుత్తుడి ముగ్గురు చెల్లెళ్ళూ, ఆలవిక రాజు కూతురు, కోసల ప్రధానమంత్రి కుమార్తె కూడా ఉన్నారు. సిద్ధార్థగౌతముడి పినతల్లి మహామాయ గౌతమితో పాటు, అంబాపాలితో సహా నలుగురు వేశ్యలు కూడా ఉన్నారు. సుసంపన్న జీవితాన్ని చూసిన స్త్రీలే కాక, పేదరికం, భరించలేని దుఖం, గర్భశోకం చవిచూసిన స్త్రీలు, మృత్యువు లేని ఒక్క ఇంటినుంచి కూడా గుప్పెడు ఆవాలు తేలేకపోయిన కిసగౌతమి కూడా ఉన్నారు. అనాథపిండకుడి ఇంట్లో పనిచేసిన దాసితో పాటు, నిర్భాగ్యస్త్రీలు, పిల్లలు తిండిపెట్టకుండా ఇంట్లోనుంచి బయటకి వెళ్ళగొట్టినవాళ్ళు, దుర్మార్గుడైన భర్తని భరించలేక అతణ్ణి చంపేసిన బద్ధకుండలకేశి వంటి స్త్రీలు కూడా ఉన్నారు.

ఒక్క మాటలో చెప్పాలంటే, క్రీస్తు పూర్వపు 6వ శతాబ్దమంతా ఈ కవితాసంకలనంలో కనిపిస్తుంది. గొప్ప విషయమేమిటంటే, అటువంటి వివిధ, విరుద్ధ నేపథ్యాల నుండి వచ్చిన ఆ స్త్రీలంతా ఒక సంఘంగా, ఒక సోదరసమాజంగా మారగలగడం, మనగలగడం. ఇప్పుడు రకరకాల అణచివేతల నుంచి తప్పించి స్త్రీలని ఒక్కతావున సంఘటిత పరచాలని ఇప్పుడెందరో కోరుకుంటున్నా ఆ ప్రయత్నాలు పూర్తిగా ఫలించడం లేదు. కాని థేరీగాథల్లో కనవచ్చే aరరశీషఱa్‌వస ష్ట్రబఎaఅఱ్‌వ బుద్ధుడి అమేయమైన వ్యక్తిత్వం వల్ల సాధ్యపడిందా, లేక ఆ స్త్రీల కరుణామయ జీవితాలవల్ల సంఘటితపడిందా చెప్పడం కష్టం. ఈ సంకలనం, వివిధ స్త్రీల అనుభవ కథనాలుగా కూడా ఎంతో విలువైనదే. అంతేకాక, ఆ స్త్రీలు తమ జీవితంలో ఒక సంక్షుభిత క్షణంలో ఎవరికి వారు పొందిన వజూఱజూష్ట్రaఅవ వల్ల, ఇదొక ఆధ్యాత్మిక రచనాసంపుటి కూడా. కాని ఈ రెండింటికన్నా కూడా ఈ సంకలనం విలువ దీన్లోని కవిత్వంలో

ఉంది. ముఖ్యంగా అంబాపాలి కవిత.

బుద్ధుడికాలం దాకా, ఒక మనిషి జీవితంలో కోరుకోగల అత్యంత విలువైన అంశం త్రయీవిద్య (మూడువేదాల్లోనూ పారంగతులు కావడం)ను పొందడమే. కాని ఆ అవకాశం కొందరికి మాత్రమే అందుబాటులో ఉండేది. సమాజంలో అధికభాగం ముఖ్యం స్త్రీలకి అది అందుబాటులో లేదనే చెప్పవచ్చు. అటువంటి సమయంలో వాళ్ళకి ఆ త్రయీవిద్య బదులు బుద్ధుడొక తేవిజ్జను అందుబాటులోకి తీసుకొచ్చాడు.

ఆ తేవిజ్జ మూడు విషయాల గురించిన పరిజ్ఞానం : తామింతదాకా గడిపిన జీవితం ఎట్లాంటిది, మళ్ళా మళ్ళా అవే అనుభవాలు ఎందుకు పునరావృతమవుతాయి, ఆ పునరావృతి నుంచి బయటపడకుండా తమని అడ్డగిస్తున్నదేమిటి. వీటిని తెలుసుకుంటే, తిరిగి మళ్ళా అట్లాంటి మరొక బతుకు బతకవలసిన అగత్యం

ఉండదు.

ఇందులోని ప్రతి కవితలోనూ, ప్రతి కవయిత్రీ తాను ఆ మూడు విషయాలూ తెలుసుకోగలిగానని ప్రకటిస్తుంది. ఆ ప్రకటనలో రెండు విశేషాలున్నాయి. మొదటిది, పుస్తకాలకీ, పండితులకీ మాత్రమే పరిమితమయిన జ్ఞానం తాను కూడా పొందగలిగాననీ; రెండవది, ఆ జ్ఞానం పుస్తకాల వల్ల కాక, తన స్వానుభవం మీంచి తాను తెలుసుకోగలిగాననీ. అందుకనే, 2500 సంవత్సరాల తర్వాత కూడా ఆ కవిత్వం ఎంతో సమకాలీనంగానూ, ఎంతో స్ఫూర్తివంతంగానూ వినిపిస్తున్నది.

ఇందులోంచి రెండు కవితలు మీకోసం :

1. థేరిక

(బుద్ధుడు ఆమెతో అంటున్నాడు)

ఇప్పుడు నువ్వు కూడా థేరిలతో చేరిపోయావు

థేరికా, నీ చిన్నప్పటి పేరిప్పటికి సార్థకమైంది

నువ్వు స్వయంగా కుట్టుకున్న బొంత

నిండుగా కప్పుకుని హాయిగా నిద్రపో,

కుండలో దాచిన మూలికలాగా

నీ అశాంతికూడా వడిలిపోతుంది.

2. దంతిక

గృధ్రకూట పర్వతం మీద నేనొక

రోజంతా గడిపి బయటకు రాగానే

నది ఒడ్డున ఒక ఏనుగుని చూసాను

నదిలో మునిగి బయటకి వచ్చిందది.

పురుషుడొకడు అంకుశం చూపిస్తూ

ఆగన్నాడు, ఆగిందది, దాన్నెక్కాడు.

మచ్చికలేని మృగం, అయినా దాన్నొక

మనిషి నా కళ్ళముందే మచ్చికచేసాడు.

ఆ క్షణమే నా చిత్తం నేనూ చిక్కబట్టాను,

ఇంతకీ నేను అడవికి వెళ్ళిందందుకే కద.

3. విమల

ఒకప్పుడు నా చూపులు, రూపం, సౌందర్యం,

యవ్వనం, యశస్సు నాకెంత మత్తెక్కించేయంటే

నేనే మరే ఆడమనిషినీ మనిషిలాగా చూడలేదు.

ఈ దేహాన్నెట్లా అలంకరించేదాన్ని, గుమ్మం

దగ్గర వేశ్యలాగా, వేటగాడు పన్నిన ఉచ్చులాగా.

నన్ను చూస్తే మనుషులు మతిపోగొట్టుకునేవారు.

నా ఆభరణాలు రహస్యాంగాల్ని ప్రదర్శనకి పెట్టినట్టుండేవి.

మాయలోపడివాళ్ళు మళ్ళామళ్ళా వాటినే చూసేవారు.

ఇప్పుడు ముండిత శిరం, ఒంటినిండా

వస్త్రం, చెట్టుమొదటకూచున్నాను, భిక్ష

యాచిస్తున్నాను, దొరికింది చాలనుకుంటున్నాను.

అన్ని బంధాలూ తెగిపోయాయి, మనుషులవీ,

దేవుళ్ళవీ కూడా, హృదయమాలిన్యమంతా వంపేసాను

జీవితమిప్పుడు నిశ్చలం, నిర్మలం.

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.