ఓ విధ్వంస దృశ్యం

సంపాదకీయం రాద్ధామనుకుని కూర్చున్నప్పుడు నా మనస్సు అల్లకల్లోలంగా వుంది. కళ్ళలోంచి ఆగకుండా కన్నీళ్ళు ఉబికి వస్తున్నాయి. ఎన్నడూ ఎరగని ఓ భయం నన్ను ఆవహించింది. గుండె రగులుతున్న  కొలిమిలా వుంది. రాత్రంతా నిద్రలేక కళ్ళు ఎర్రబడి మండుతున్నాయి. కళ్ళు మూసిన కాసేపటిలోను పీడకలలు. విధ్వంశ దృశ్యాలు. గాజు కళ్ళ తల్లులు బారులు కట్టి కన్నీరు మున్నీరవుతున్న విషాద దృశ్యాలు. ఎటుపోతున్నాం? మనమేం చేస్తున్నాం? మానవ సంబంధాలెందుకింతగా దిగజారిపోతున్నాయి? మనుష్యులుగా కాక మర బొమ్మల్లా ఎందుకు తయరవుతున్నాం? మార్కెట్‌ను ముంచెత్తుతున్న వస్తు సముదాయం ముందు మమతలు, మానవీయతలెందుకు వంగి వంగి సలామ్‌లు చేస్తున్నాయి? నా ఈ ఆవేదనకి, అంతరంగ సంఘర్షణకి కారణాలు మీతో పంచుకుంటేనే గానీ నా గుండె భారం తగ్గేట్టు లేదు.
నిన్నటి రోజు ‘భూమిక హెల్ప్‌లైన్‌’కి వచ్చిన కాల్స్‌లో అధిక శాతం అమ్మల నుండే రావడం, ఒక్కో తల్లి తన హృదయ విదారక గాధని విన్పించడం నన్ను తీవ్ర మనస్తాప్తానికి గురి చేసింది. ఓ వార్తా పత్రిక ఆదివారం మాగజైన్‌లో హెల్ప్‌లైన్‌ గురించి ఓ కథనం ప్రచురించి. మీ సమస్యలు మాతో పంచుకోండి. మీకు కావాలసిన సలహా, సమాచారం, కౌన్సిలింగు ఇస్తాము అని మేము ఆ కథనంలో చెప్పడంతో ఉదయం నుండి అర్ధరాత్రి వరకు కాల్స్‌ వెల్లువెత్తాయి. వందలాది స్త్రీల దు:ఖగాధలు కౌన్సిలర్‌ల చెవుల్లో పోటెత్తాయి. ఎన్నెన్నో సమస్యలు. పరిష్కారం కోసం ఎదురు చూపులు. తమ కష్టాన్ని పరిష్కరించడం తరువాత సంగతి కనీసం వినేవాళ్ళు. అర్ధం చేసుకునే వాళ్ళు లేక అల్లాడుతున్న నేపధ్యాలు, హింసాయుత జీవితాలు.
ఇంతకాలం గృహహింస అంటే భార్యల్ని హింసిస్తున్న భర్తల విషయమే ఎక్కువ మాట్లాడుతున్నాం. భార్య భర్తల సంబంధంలోని అసమానత్వం, పురుషాధిక్య భావజాలం మహిళల ముఖ్యంగా భార్యల జీవితాలను ఎంత సంక్షోభమయంగా చేస్తున్నాయె మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ వందల సంఖ్యలో స్త్రీలు గృహహింసకు బలవుతున్నారు. ఈ హింసకు చాలా వరకు కారణాలు కూడా మనకు తెలుసు. నిరక్షరాస్యత, ఆర్ధిక పరాధీనత,  పితృస్వామ్య భావజాలంతో పాటు మార్కెట్‌ ఎకానమీ – వస్తు వినిమయ సంస్కృతి కూడా చాలావరకు కారణాలే. హింసిస్త్ను భర్తను తిరిగి తన్నగల సత్తా వున్న మహిళ కూడా పురుషాధిక్య భావజాలం నరనరాన నూరిపోయడంవల్ల నిస్సహాయంగా హింసని భరిస్తంటుంది. కిరోసిన్‌ పోసి నిప్పంటిస్తున్నా తిరగబడక మౌనంగా ప్రాణాలు విడుస్తుంది. ప్రాణం గాల్లో కలిసిపోతున్నా తిరగబడనీయకుండా అణిచివుంచుతున్న పురుషాధిక్య భావజాలం ఎంతగా మనలో ఇంకిపోయి వుందో, దీన్ని వొదిలించుకోవాలంటే ఎంత పోరాటం చెయ్యలో, స్త్రీల ఉద్యమం ఈ దిశగా ఎంత కృషి చెయ్యలో స్పష్టంగా అర్ధమవుతోంది.
అయితే కుటుంబ హింసకి గురవుతున్న భార్యల సరసన తల్లులు కూడా చేరడం నాకు తీవ్ర దు:ఖాన్ని కలిగిస్తోంది. జన్మనిచ్చిన తల్లిని, లాలిపాడి నిద్రపుచ్చిన తల్లిని, రక్తాన్ని పంచిచ్చి, గోరు ముద్దలు తినిపించిన,  తల్లిని హింసించే కొడుకుల క్రూరత్వం నన్ను వణికిస్తోంది. నిన్నటి రోజు హెల్ప్‌లైన్‌కి ఫోన్‌ చేసి తమ దు:ఖాన్ని, తమ బాధని పంచుకున్న ఈ వృద్ధ మహిళల ఆవేదన ఎవరిచేతైనా కంటతడిపెట్టిస్తుంది.
 ఓ తల్లికి ఎనభై సంవత్సరాలు. ఈ వయస్సులో కూడా కొడుక్కి వొండి పెట్టలి. వాడికి నచ్చినట్లు వొండాలి. లేకపోతే కొడతాడు. కంచాలు విసిరేస్తాడు. ఇల్లు పీకి పందిరేసినట్టు రెచ్చిపోయి నోటికొచ్చిన తిట్లతో హింసిస్తాడు. వాడు సాదాసీదావాడు కాదు. కవిత్వాలు రాస్తాడు. నాటకాలేస్తాడు. మాతృత్వం మీద కవితలు రాసి బహుమతులు కొట్టేస్తాడు. ఇంటికొచ్చి ముసలితల్లిని కొడతాడు.
ఇంకొక కొడుకు తల్లిని చంపేస్తానని బెదిరిస్తాడు. ఉద్యోగ విరమణ చేయగానే వచ్చే డబ్బంతా తనకివ్వకపోతే చంపేస్తానని రోజూ బెదిరిస్తాడు. ఆ డబ్బుతో కారు కొనుక్కోవాలని ఆ కొడుకు దురాశ.
 నువ్వు చచ్చిపోతే నాకు ఉద్యోగం వస్తుంది. ఇంకా బతికి ఎవరిని ఉద్దరించాలి. గవర్నమెంటు ఉద్యోగం రావాలంటే కష్టం. నువ్వు చస్తే నీ ఉద్యోగం నాకొస్తుంది కదా! కన్న కొడుకు కోసం ఆ మాత్రం త్యాగం చెయ్యలేవా అంటూ రోజూ ఎమొషనల్‌ బ్లాక్‌మెయిల్‌ చేసే కొడుకు. ఎన్నని రాయను. ఎన్ని గుండె ఘోషల్ని మీకు వినిపించను. మాతృదేవోభవ అని మనం గప్పాలు కొట్టుకుంటాం కదా! అమ్మంటే దేవత, అమ్మంటే అమృతమూర్తి అంటూ కవిత్వాలు ఒలకబోస్తాం కదా! వాస్తవంలో జరుగుతున్నదేమిటి? వస్తు సముదాయం ముందు ప్రాణం గడ్డి పరకేనా? డబ్బు , బంగారం, ఆస్తులు, కార్లు, బంగళాలతో పాటు గజ్జి కురుపుల్లా పుట్టుకొచ్చిన మహా్మాల్స్‌లోని మహా చెత్త ముందు మనిషి ప్రాణం చవకేనా? ఎనభై ఏళ్ళ పండు ముసలి తల్లి మీద చేతులెత్తే ఈ భయానక సంస్కృతికి ము౦దెక్కడుంది? కళ్ళని జిగేల్‌ మన్పిస్తున్న కార్పోరేట్‌ క్రూరత్వాన్ని అడ్డుకునేదెలా? కుప్పకూలుతున్న మానవ సంబంధాల విధ్వంశ దృశ్యం మనలో మంటల్ని సృష్టించకపోతే మనమూ అందులో భాగస్వామ్యులమయ్యే ప్రమాదం మరెంతో దూరంలో లేదు.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

6 Responses to ఓ విధ్వంస దృశ్యం

  1. srikanth says:

    తల్లులను హింసించే కొడుకులు లేరనో లేక వారు చేసేది తప్పు కాదనో చెప్పడం నా వుద్దేసం కాదు కానీ, మరి వేరు కాపురం పెట్టడానికి అత్త మామలను హింసించే “కోడల్ల” గురించి స్త్రీ వాదులు పెదవి విప్పరు ఎందుకనో. ఇంతవరకూ భుమిక హెల్ప్ లైనుకు వచ్చిన వాటిలో అటువంటి వారే కనిపించలేదా…?

  2. latha says:

    ముద్దుగా పెంచడం మాత్రమే సరి పోదు.పిల్లలో వ్యక్తిత్వం నింపాలి. ఈ తరం గురువుల మీద ఏమాత్రం ఆశ లెదు, కనీసం తల్లి తండ్రులు పిల్లల పెంపకం లొ జాగ్రత్త వహించలి. పాత చింతకాయ పచ్చడి అనుకోకుండ పురాణ గాధలు, పంచతంత్ర కథలు వినిపించాలి. మొక్కై వంగనిది మానై వంగుతుందా?

  3. Anonymous says:

    ఆడ పిల్ల కన్నవారిని విడిచి వస్తే అది రూలు అదే పని మగవారిని చేయమంటే అది హింసా?

  4. హేమంత says:

    ఆడ పిల్ల కన్నవారిని విడిచి వస్తే అది రూలు అదే పని మగవారిని చేయమంటే అది హింసా?

  5. vj says:

    హెమలత గారి మాటలొ కూడ నిజము లేకపోలేదు, దీని మీద మంచి చర్చ జరగాలి

  6. Anonymous says:

    అవును ముమ్మాటికి ఇది నిజమ్ఉ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.