‘జల్-హల్’ యాత్ర జూన్ 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్ జిల్లాలలో పర్యటించింది, జల్ అంటే జలము, హల్ అంటే నాగలి అనే అర్థం వచ్చే ఈ యాత్ర కరువును – రైతు పరిస్థితిని ముడిపెడుతూ దేశ వ్యాప్తంగా నెలకొన్న కరువు పరిస్థితిని – దీనికై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పరిస్థితిని అవగాహన చేసుకోవడానికి స్వరాజ్ అభియాన్, ఏక్తాపరిషత్, ప్రజా ఉద్యమాల వేదికలు, యాక్షన్ ఎయిడ్ మిగతా ఇతర రాష్ట్ర స్థాయి సంస్థలతో కలిసి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్,
ఉత్తరప్రదేశ్ మరియు తెలంగాణలలో పర్యటించింది.
కరువు స్థితి :
ప్రస్తుతం దేశంలోని 266 జిల్లాలు, అంటే మొత్తం విస్తీర్ణంలో సుమారు 38 శాతం కరువు కోరల్లో చిక్కుకుంది. ఈ కరువు పట్ల 33 కోట్ల దేశ జనాభా, ముఖ్యంగా కూలీలు, పేద రైతులు, దళితులు, ఆదివాసీలు ఎంత గోస పడుతున్నారో మనందరం గత మూడు నెలలుగా పత్రికల్లో టీవీల్లో చూస్తున్నాం.
ఈ కరువు తెలంగాణలో కూడా అదే స్థాయిలో ఉంది. బహుశా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత ఇంత భారీ సంకటం మరొకటి ఎదురు కాలేదు. గత నవంబర్‌లోనే మన ప్రభుత్వం 7 జిల్లాల్లోని 231 మండలాలను – అంటే దాదాపు 50 శాతం తెలంగాణ భూభాగాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించింది. అలా దేశవ్యాప్తంగా కరువుందని ప్రకటనలు చేసిన రాష్ట్రాల వరుసలో 7వ రాష్ట్రంగా నిలిచింది.
కరువు తీవ్రస్థాయిలో ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలైతే చేశాయి గానీ అవేమీ ప్రజలను ఆదుకునే కార్యక్రమాలకు అవసరమైన స్థాయిలో చేపట్టడం లేదని స్వరాజ్ అభియాన్ అనే సంఘం 2015 డిసెంబర్‌లో సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన దావా వేసింది.
దేశంలో ఏ రాష్ట్ర అసెంబ్లీ గానీ, పార్లమెంట్ గానీ కరువుపై పెద్దగా చర్చ చేసిన దాఖలాలు లేవు. అయితే సుప్రీంకోర్టు మాత్రం ఈ పిటిషన్‌పై చాలా రోజుల పాటు విచారణ నిర్వహించింది. కరువు పరిస్థితిలో ప్రభుత్వాలు చేపట్టవలసిన కార్యక్రమాల మీద మూడు సుదీర్ఘమైన తీర్పులను ఇచ్చింది. అంతే కాకుండా ఈ తీర్పుల ప్రకారం ప్రభుత్వాలు ఏం చేశాయో, ఏం చేయలేదో అన్న దానిపై ఆగస్టు 1వ తారీఖున మళ్లీ విచారణ చేస్తామని కోర్టు ప్రకటించింది. కరువులో జనాలు ఇంత గోస పడుతుంటే ప్రభుత్వాలకు కుంభకర్ణుడి నిద్ర ఏమిటంటూ కోర్టు విచారం వ్యక్తం చేసింది.
కరువు కేసుగా దేశవ్యాప్తంగా పేరుగాంచిన ఈ కేసులో ఇచ్చిన తీర్పులలోని ముఖ్యాంశాలు :
కరువు ప్రాంతంగా ప్రకటించడం : ప్రభుత్వాలు కరువును ప్రకటించేటప్పుడు కేవలం తగ్గిన వర్షపాతాన్ని మాత్రమే కాకుండా, తగ్గిన సాగుభూమి విస్తీర్ణం, పంటల దిగుబడి, జల వనరుల నిల్వ (చెరువులు, నదులు, రిజర్వాయర్లు, బోర్లు, బావులు) భూమి పైన గడ్డి పొదలు ఏ మేరకు ఆవరించి ఉన్నాయి అనే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని అక్టోబర్ నెల వరకల్లా కరువుగా ప్రకటించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పింది.
విపత్తు నిర్వహణా చట్టం అమలు : 2005 నుంచి అమల్లో ఉన్న ఈ చట్టం చాలా స్పష్టంగా కరువు తదితర విపత్తుల నిర్వహణ – అంటే తగిన ముందు జాగ్రత్త, నష్ట నివారణ, ఉపశమనం, పరిహారం అని స్పష్టంగా చెప్పినప్పటికీ ప్రభుత్వాలు ఆశించిన స్థాయిలో కరువుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనీ, ఇంకా ఈ చట్టంలో ప్రకటించినట్టుగా విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, చట్టం అమలులోకి వచ్చిన వెంటనే ఏర్పాటు చేయవలసిన జాతీయ నిధిని ఇంతవరకు ఏర్పాటు చేయలేదనే విషయాన్ని ఎత్తిచూపుతూ రాబోయే 3 నెలల లోపు సదరు నిధిని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఆహార భద్రత : జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం పేద, ఇతర అవసరమైన కుటుంబాలలోని ప్రతి వ్యక్తికీ నెలకు 5 కిలోల ఆహార ధాన్యాన్ని (బియ్యం, గోధుమలు) రేషన్ కార్డు లేకపోయినా సరఫరా చేయాలనే నియమాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కరువు తదితర విపత్తుల సందర్భంగానైనా ఈ సరఫరా చాలా సమర్థవంతంగా ఉండాలని ఆదేశించింది.
మధ్యాహ్న భోజనం : కరువు పీడిత ప్రాంతాలలో ఎండాకాలం సెలవులైనా బడిపిల్లలకు రోజూ మధ్యాహ్నం భోజనం అందిస్తూ వారానికి కనీసం మూడు రోజులైనా గుడ్డు లేదా పాలు ఇవ్వాలని చెప్పింది.
ఉపాధి పని : కరువు ప్రాంతాలలో ఉపాధి పని 150 రోజులకు పెంచుతున్నట్టు పేరుకు ప్రకటించినా అన్ని రాష్ట్రాలూ
ఉపాధి పనులను చాలా నిరాశాజనకంగా అమలు చేస్తున్నాయని సుప్రీంకోర్టు వాపోయింది. అంతే కాకుండా కూలీ పైసలు చెల్లించడంలో ప్రభుత్వాలు చాలా జాగు చేస్తున్నాయంటూ సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇకనైనా పని పూర్తయిన 15 రోజులలోపు కూలి పైసలు తప్పనిసరిగా చెల్లించాలని ఆదేశించింది.
ఎన్నో రోజుల విచారణ ఫలితంగా కరువును సమర్థవంతంగా ఎదుర్కొనే దిశగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏ మేరకు అమలవుతున్నాయో తెలుసుకొని, మళ్లీ వాయిదా నాటికి ఆ సంగతులను సుప్రీంకోర్టుకు విన్నవించుకోవాలనే ఉద్దేశంతో స్వరాజ్ అభియాన్, ఏకతా పరిషత్, జల్ బిరాదరీ, జాతీయ ప్రజా ఉద్యమాల ఐక్యవేదిక, తదితర సంస్థలు కలిసి లాతూర్ నుంచి బుందేల్‌ఖండ్ వరకు ఒక యాత్రను తలపెట్టాయి. పది రోజుల పాటు కరువు పీడిత గ్రామాలలోని ప్రజల పరిస్థితులను స్వయంగా తెలుసుకునే ఉద్దేశంతో 2016 మే 21న ప్రారంభించిన ఈ యాత్ర పేరే ‘జల్ – హల్ (నీళ్లు – నాగలి) యాత్ర’!
నీటి సమస్యకు సమిష్టిగా సరియైన పరిష్కారం కనుక్కోవడం ద్వారానే భారతదేశం లాంటి వ్యవసాయిక దేశంలో ప్రజల జీవితాలు కరువు బారిన పడకుండా ఉంటాయనే ఉద్దేశంతో మొదలైనందువల్లనే దీన్ని జల్ – హల్ యాత్ర అని పిలుస్తున్నాం. మరాఠ్వాడా ప్రాంతం నుంచి బుందేల్‌ఖండ్ వరకు మొదలైన ఈ యాత్ర జూన్ 2 నుంచి 4 వరకు తెలంగాణలో కొనసాగుతుంది.
తెలంగాణ రాష్ట్రంలోని అనేక సంఘాలు, ఎన్‌జీవోలు, వ్యక్తులు కలిసి ఒక కమిటీగా ఏర్పడి ఈ యాత్రను మహబూబ్‌నగర్, నల్గొండ, మెదక్ జిల్లాలలో నిర్వహించ తలపెట్టారు.
కరువు పరిస్థితులు – తెలంగాణ ప్రభుత్వ స్పందన
– ఎండాకాలంలో కూడా మధ్యాహ్న భోజనం బడిపిల్లలకు అందించాలని సుప్రీంకోర్టు చెప్పముందే తెలంగాణ ప్రభుత్వం మధ్యాహ్న భోజనాన్ని కొనసాగించాలనే నిర్ణయాన్ని తీసుకుంది.
– కరువులో మనుషులే కాదు, పశువులు కూడా గోస పడుతున్నాయని కొన్ని ప్రాంతాలలో గడ్డి పంపిణీని షురూ చేసింది.
– అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటి పంపిణీ చేయడమే కాకుండా నీటి కరువుకు శాశ్వత పరిష్కారంగా ‘మిషన్ కాకతీయ’ ను వేగవంతం చేసింది. అంతే కాకుండా, ఇంటింటికీ ఇంకుడు గుంతలు తవ్వాలని పిలుపునిచ్చింది.
– ఆహార భద్రతాచట్టం లబ్ధిదారుల కుటుంబాలలో మనిషికి నెలకు 5 కిలోల ఆహార ధాన్యాన్ని ఇవ్వాలని చెబితే తెలంగాణలో అవసరమైన, అర్హులైన కుటుంబాలలో మనిషికి నెలకు 6 కిలోల బియ్యాన్ని ‘అంత్యోదయ’ కార్డు కలిగిన కుటుంబాలకు నెలకు 35 కిలోల బియ్యం పంపిణీ చేస్తోంది.
– నీటిని బాగా గుంజే పత్తి లాంటి పంటలకు బదులు సోయాబీన్స్‌ను ప్రోత్సహించే కార్యక్రమాన్ని తీసుకుంది.
ఇటువంటి మరెన్నో కార్యక్రమాలను తీసుకొని వచ్చినా అవి సరిగా అమలవుతున్నాయా, మనుషుల, పశువుల తక్షణ అవసరాలను ఏ మేరకు తీరుస్తున్నాయో ప్రత్యక్షంగా, ప్రజల భాగస్వామ్యంతో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రభుత్వ శాఖలే ప్రకటించిన కరువుకు సంబంధించిన మరి కొన్ని విషయాలు :
– ఎండకు, వడగాల్పులకు తట్టుకోలేక ఇప్పటికే 1500కు పైగా మంది ప్రాణాలు కోల్పోయినట్టు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఇలా వడదెబ్బకు మృతి చెందిన వారంతా దినకూలీలు, ఉపాధి పనివాళ్ళు, పశువుల కాపర్లు, ఇంకా పని చేస్తే తప్ప పూట గడవని పేదలు. దినపత్రికల్లో వార్తలు ఎలా ఉన్నా ఇప్పటి వరకు 317 మంది వడదెబ్బతో మృతి చెందినట్లు రాష్ట్ర విపత్తు నివారణ శాఖ ధ్రువీకరించింది. ఈ సంఖ్య ఇంతకంటే తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొని ఉన్న మరాఠ్వాడా, బుందేల్‌ఖండ్ ప్రాంతాలతో పోలిస్తే చాలా రెట్లు ఎక్కువ. ఈ విషయాన్ని ప్రజలు, ప్రభుత్వాలు సీరియస్‌గా ఆలోచించి, అవసరమైన చర్యలు చేపట్టడం ద్వారా నివారించగల ఈ మరణాలను గణనీయంగా తగ్గించవచ్చు.
– రాష్ట్ర వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం గడచిన వానా కాలం (ఖరీఫ్) వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి సగానికి సగం తగ్గింది. ఇక ఎండాకాలం (రబీ) దాదాపు లేనట్టే. అంటే మళ్లీ మంచి వర్షాలు పడినా, పంటలు పండి ధాన్యం అందుబాటులోకి రావాలంటే ఇంకా 6 నెలలైనా పడుతుంది. అంతవరకు రేషన్ బియ్యం మాత్రమే ఆధారమవుతుంది. అయితే చాలా కుటుంబాలకు రేషన్ ద్వారా వచ్చిన బియ్యంతో నెలంతా గడవదు. పైగా నిత్యావసరాల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి.
– కరువు ఫలితంగా ఏర్పడిన ఆర్థిక లోటును పూరించుకోవడం పేద వర్గాలకు దాదాపు అసాధ్యమైన విషయం. అందుబాటులో వున్న కొన్ని గణాంకాలనే పరిశీలిస్తే – ఏప్రిల్ నాటికే తెలంగాణ 2.15 లక్షల పశువులను అడ్డికి పావుసేరు లెక్కన అమ్ముకున్నారు. దాదాపు 1000 రైస్ మిల్లులు బంద్ కావడం వల్ల తక్కువలో తక్కువ 75 వేల మంది ఉపాధి కోల్పోయారు. ఇంతటి తీవ్రమైన, లోతైన, దీర్ఘకాలిక ప్రభావం చూపే కరువు లాంటి విపత్తుల నుంచి బాధిత సమూహాలను బైట పడెయ్యాలంటే ప్రభుత్వాలు మరింత చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సుప్రీంకోర్టు చెప్పినట్టు విపత్తు సహాయం అనేది ప్రజల హక్కుగా గుర్తించవలసి ఉంది.
ఈ సందర్భంగా కరువు పీడిత గ్రామాలకు జల్ హల్ యాత్ర ప్రత్యక్షంగా వెళ్ళి కరువు పరిస్థితులను స్వయంగా తెలుసుకుంది. ఈ యాత్రలో భాగంగా మొత్తం మూడు జిల్లాలలో 9 గ్రామాలను సందర్శించడం జరిగింది.
ప్రతి గ్రామంలోను కరువుకు సంబంధించి ప్రభుత్వం కరువు ప్రకటిత మండలాలలో ఏ రకమైన చర్యలు తీసుకున్నది, సుప్రీంకోర్టు తీర్పులో ప్రస్తావించిన అంశాల అమలు తీరు ఎలాగున్నదో తెలుసుకునే ప్రయత్నం జరిగింది.
ఆహార భద్రత : సుప్రీంకోర్టు చెప్పినట్టు రేషన్ కార్డు లేకపోయినా ఆహార ధాన్యాన్ని సరఫరా చేయాలనే తీర్పు పూర్తి తరహాలో అమలు కావడం లేదు. అన్ని గ్రామాలలో ప్రజలు చెప్పిందేమిటంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డును అనుసంథానం చేయడం వలన 20-30 శాతం మందికి పైగా రేషన్ తీసుకోవడం లేదని – ఒకవేళ ఇచ్చినా బియ్యం తప్ప మిగతావన్నీ కావలసిన పరిమాణంలో రావడం లేదని చెప్పారు.
ఉపాధి పని : సుప్రీం కోర్టు చెప్పినట్టు 150 రోజుల పని కల్పన సంగతి అటుంచితే మహబూబ్‌నగర్ జిల్లాలోని నవాబ్ పేట మండలంలో కూచారు గ్రామం ప్రజలలో కొందరికి ఇంకా మూడు సంవత్సరాల నుండి పని చేసిన ఉపాధి కూలీ రాలేదు. ఏ గ్రామానికి వెళ్ళినా పరిస్థితి దాదాపు ఇలానే ఉంది. నెల నుండి 6 నెలల వరకు వేతనం అందని వారున్నారు. అసలయితే 2015-16 సంవత్సరానికి రాష్ట్రం సరాసరి దినాలు 53.92 కాగా ఏప్రిల్, మే నెలలలో 26.9 సరాసరి దినాల పని కల్పన జరిగింది. మేము తిరిగిన ఆరు మండలాలు హన్వాడ, నవాబ్‌పేట, బొమ్మల రామారం, కొండపాక, తొగటలు 52 నుండి 70 దినాల వరకు ఉన్నాయి. ఇదిలా ఉంచితే వేతనాల చెల్లింపులు రెండు వారాలలోగా అనేది కాగితాలకు మాత్రమే పరిమితమయ్యింది. పనిదగ్గర వసతులు అసలు మాట్లాడుకునే అవసరం లేదు. కనీస వేతనం 60 – 130 వరకు పడుతుంది. చాలామందికి కనీస వేతనం ఎంతో కూడా తెలియదు.
మధ్యాహ్న భోజనం : రాష్ట్రం మధ్యాహ్న భోజన విషయంలో మాత్రం ఒక అడుగు ముందే ఉంది. కోర్టు తీర్పు వెలువడక ముందే తెలంగాణ ప్రభుత్వం వేసవి సెలవుల్లో కూడా పిల్లలకు భోజన వసతి కల్పించింది. పూర్తి శాతం పిల్లలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించు కోకపోయినా భోజనం మాత్రం క్రమం తప్పకుండా అందజేస్తున్నారు. పొదుపు సంఘాల మహిళలతో మాట్లాడినపుడు దాదాపు 5 నుండి 6 నెలల బిల్లులు పెండింగ్ ఉంది అని చెప్పారు.
పర్యటించిన అన్ని గ్రామాలలో గత సంవత్సరంలో ఖరీఫ్ పంటనష్టానికిగాను రావాల్సిన పంటనష్ట పరిహారం ఇంకా అందలేదు.
సుప్రీం కోర్టు చెప్పినట్టు గతంలో తీసుకున్న పంట రుణాలు మాఫీ చేసి, రాబోయే ఖరీఫ్‌కు కొత్త రుణాలు ఇవ్వలేదు.
కరువు కాలంలో పశువుల మేత కొరకు ఫోడర్ డిస్ట్రిబ్యూషన్ జరగలేదు సరికదా అసలు గడ్డి పంపిణీ చేస్తారనే విషయం చాలామంది రైతులకు తెలీదు.
పశువులకు మేతకే కాదు, త్రాగడానికి నీరు పోయలేక దాదాపు ప్రతి గ్రామంలో 70 శాతం పశువులను అమ్మేసారు.
ప్రతి గ్రామంలో కనీసం 600 – 1000 వరకు బోర్లు వేసారు. వాటిలో 10% కూడా నీళ్ళు పోయడం లేదు. లోతు కూడా దాదాపు 500-1000 అడుగుల వరకూ వేసినవే.
వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, స్వచ్ఛ భారత్‌లో భాగంగా కట్టాల్సిన వ్యక్తిగత మరుగుదొడ్లు సదుపాయాలలో సమస్యలున్నాయి. ఒంటరి స్త్రీలు లేదా పెళ్ళి కాని, భర్తలు వదిలేసిన స్త్రీలకు పెన్షన్ సమస్య వుంది. పెన్షన్ వచ్చేవారిలో కొందరికి ఆధార్ కార్డు లింకువలన వచ్చేది కూడా రాకుండా పోయింది.
‘తెల్ల గాజులుంటేనే వితంతు ఫించనులు అర్హులని’ రంగు గాజులుంటే అనర్హులనే మాటలు భరించలేక మౌనం వహిస్తున్నారు. సమస్యలన్ని ఇలాగుంటే గ్రామాలలో మహిళల, పిల్లల పరిస్థితి దారుణంగా వుంది. గ్రామ పంచాయితీల డబ్బుతో వాటర్ ట్యాంకర్లతో తాగడానికి నీటిని సరఫరా చేస్తున్నా, అవి సరిపోక, కొన్ని గ్రామాలలో వారికి అందక త్రాగడానికి నీళ్ళు తేవడానికి 2 – 3 కి.మీ. దూరం ప్రయాణించవలసి వస్తుంది. పనులు లేక, ఉపాధి పనులకు సకాలంలో వేతనాలు లేక కుటుంబాన్ని పోషించలేక అడ్డా మీద కూలీలుగా వెళుతున్నారు. దాదాపు ప్రతి గ్రామం నుండి రోజుకు కనీసం 60 – 70 మంది వరకు దగ్గరలో వున్న టౌనులకు పనులకు వెళుతున్నారు.
యాత్ర తిరిగిన ప్రాంతాలలో, సమావేశాలలో కూడా సమస్యల గూర్చిన విషయాలు ప్రస్తావించింది కూడా వారే.
వలస జిల్లాగా పేరుగాంచిన పాలమూరు జిల్లాలో ఇంకా అంటరాని తనం రాజ్యమేలుతోంది. హోటళ్ళలో వేరు గ్లాసులు, దళితులు గుళ్ళలోకి ప్రవేశం ఇంకా బహిష్కారంగానే వుంది.
”జల్ – హల్” యాత్రలో భాగంగా మెదక్ జిల్లాలో ఎర్రవెల్లి, వేములఘాట్, పాటిగడ్డ కిష్టాపూర్‌లలో మల్లన్న సాగర్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చేస్తున్న దీక్షలకు జల్ – హల్ యాత్ర బృందం తమ మద్ధతును తెలియ చేసింది. ముఖ్యంగా జాతీయ
ఉద్యమ సంస్థలైన ”స్వరాజ్ అభియాన్” ప్రజా ఉద్యమాల వేదిక, ఏక్తా పరిషత్‌లు ఈ విషయాన్ని జాతీయ స్థాయిలో మద్దతు
ఉంటుందని తెలిపాయి.