సాధికారత – యం. రత్నమాల

”ఏంటమ్మా అరుణిమా! మీ పెద్దత్తేంటమ్మా అట్లా తెల్లచీరతో, నుదుట బొట్టూ, చేతులకు మట్టి గాజులు తీసేసి ఇదేంటమ్మా విచిత్రంగా- తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరనారిగా అప్పటినుంచి కమ్యూనిస్టు పార్టీలో కార్యకర్త స్థాయినించి కేంద్ర కమిటి స్థాయికి ఎదిగిన మీ స్వతంత్రత్త తనకు తెలిసిన వాళ్ళిండ్లలో ఎవరు ఇటువంటి మూఢాచారాలు చేసినా ఇటువంటి సాంఘిక దురాచారాలు కూడదని నచ్చజెప్పి చివరకు ఎదిరించి పోట్లాడే మీ పెద్దత్త ఇప్పుడు ఇంత పెద్ద బొట్ట, చేతినిండా గాజుల దులారంలా అన్ని గాజులేంటి అని మేం అంటే నాకిట్లా ఇష్టం అనే మీ స్వతంత్రను అట్లా నిండుగా చూసిన వాళ్ళం ఇప్పుడిట్లా వితంతు వేషంలో చూల్లేక పోతున్నామమ్మా” అంది సుమతాంటి మా ఇంటి దగ్గరే ఉన్న షాపింగ్‌మాల్‌లో కనపడి. సుమతాంటితో పాటే కావలసిన సరుకు తీసి బుట్టలో వేసుకుంటున్న సబితాంటి ”ఏమ్మా మీరెవరూ తనని అడక్కపోయారా ఏంటమ్మా మాకు రాజకీయాలు నేర్పిన దానివి నువ్విలా ఏంటీ అని” అంది. కలిసి పోరాటంలో పాల్గొన్న మీరే అడగలేకపోతే చిన్నవాళ్ళ మేం ఏమని అడగ్గలం ఆంటీ అని అన్నానే కాని అడగనందుకు నాకు లోపల ఎంతో గిల్టీగా ఉంది. ”అవునాంటీ స్వతంత్ర పెద్దమ్మని అట్ల చూస్తాంటే మాక్కూడా ఎట్లో ఉంది. కానీ చిన్నప్పట్నించి ఎంతో ఆరాధన, అడ్మిరేషన్‌ ఉన్నవాళ్ళం పైగా మాకంటే మా అమ్మకంటే కూడా పెద్దది ఆమెని మేమెట్లా అడగ్గలం చెప్పండి ఆంటి” అంది నాతో పాటే షాపింగ్‌ మాల్‌కి వచ్చిన అరుణ స్వతంత్రత్తకి స్వయానా చెల్లెలు బిడ్డ. మా చిన్నప్పుడు మా ఇద్దరి ఊళ్ళలో ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉండేది. మా రెండూళ్ళ మధ్య ఊరిలో ఉండే ఊర్లో హైస్కూలు నించి, హైదరాబాద్‌కి వచ్చి ఒకటే కాలేజీ ఒకటే యూనివర్సిటీలో చదివి ఇప్పుడు ఒకే కాలేజీలో లెక్చరర్లుగా చేస్తూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం ఎప్పుడూ ఎక్కడైనా కలిసే కనబడతాం అని అందరూ మమ్మల్ని జంట కవులు అంటూంటారు. మేమెట్లా అడగ్గలం అని వాళ్ళతో అన్నామే కాని అడగనందుకు మమ్మల్ని మేమే తప్పు పట్టుకున్నాం. దారి పొడుగునా ఒక అత్త గురించే మాట్లాడుకుంటూ ఇంటికొచ్చాకా ఆమె గురించే. మా తాత భారత స్వాతంత్ర పోరాటంలో జైలు పాలై విడుదలై తిరిగి ఇంటికి వచ్చాక పుట్టిందని బిడ్డకు ‘స్వతంత్ర’ అని పేరు పెట్టుకున్నందుకు పేరుకు తగ్గట్టు స్వతంత్రత్త తెలంగాణ సాయుధ పోరాటంలో పదిహేనేళ్ళయినా నిండక ముందే అంతకు ముందే పోరాటంలో నాయకుడైన అన్న ప్రోత్సాహంతో పోరు బాట పట్టి సాయుధంగా తుపాకి చేత బట్టి పోరాడిందని మా కుటుంబాల్లో మా తరం పిల్లలందరికి ఆమె అంటే అంతులేని అభిమానం, ఆదర్శం. మిలిటెంట్‌గా తుపాకి బట్టి పోరాడ్డమే కానీ రాజకీయాలు వంట బట్టించుకోలేదేమో, మాకు ఆమె ఉపన్యాసాలు వినేప్పుడు వ్యక్తిగత జీవితంలో ఆమె వ్యవహారం వల్ల మాకు పొడజూపిన సందేహాలు అత్తనిప్పుడిట్లా చూసినంగ గట్టిపడ్డాయి.

ఇంటికొచ్చి సరుకులు సర్దుకుని చాయ్‌ పెట్టుకుంటూ ”నీకు గుర్తుందా అరుణిమా! చిన్న తాత చనిపోయినప్పుడు సావిత్రమ్మమ్మ 50 ఏళ్ళు దాటి 60 కి దగ్గర పడుతున్న వయసు. ఆ తంతంతా చేయకుండా అడ్డుకున్న అత్త మాటలు మనం ఎంత గొప్పగా చెప్పుకునే వాళ్ళమో. ఆ మాటలన్నీ అత్త గురించీ తన దాక వచ్చేసరికి ఏమయ్యాయి. ఇంకా నయం ఆరోజు స్వతంత్ర పెద్దమ్మ శాస్త్రోక్తంగా తతంగం అంతా జరిపించుకుందని సబితాంటికి, సుమతాంటికి తెలిస్తే ఇంకెంత ఆశ్చర్యపొయ్యేవాళ్ళో అంది వేడి వేడి చాయ్‌ తాగుతున్నా స్వతంత్రత్త గురించిన మాటలే ఎంత మర్చిపోదామను కున్నా మా మధ్యలో దొర్లుతున్నాయి. ముకుందం మామ బతికున్న రోజుల్లో ఆయన మాట ఎన్నడూ గౌరవించని స్వతంత్రత్త, కొడుక్కు కట్నం తీసుకొనడానికి, సంప్రదాయ బద్ధంగా పెళ్ళి జరిపించ వ్యతిరేకించినందుకు ముకుందం మామ పెళ్ళికి దూరంగా ఉన్నా పట్టించుకోని అత్త, ఆయన నిజాయితీ నిబద్ధతను ఈసడించుకుంటూ ఎప్పుడూ ఎకసెక్కంగా ఆయనతో మాట్లాడ్డం తప్ప ఎప్పుడూ ప్రేమగా పలకరించని అత్త ఆయన పోగానే ఇప్పుడిట్లా వితంతు వేషంలో కనపడ్డం మింగుడు పడ్డం లేదు. ‘వదిలెయ్‌ మన బుర్రలు పాడు చేసుకోవడం తప్ప ఆమెను అడిగే ధైర్యం లేనప్పుడు ఎందుకు మాట్లాడుకోవడం అరుణా’ అంటూంటే ఫోన్‌ మోగింది. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు ఖమ్మం జిల్లా నుంచి పాపికొండల దాకా భూమిక పత్రిక రచయిత్రుల పర్యటన గురించి మూడ్రోజుల్లో బయల్దేరాలి రాదల్చుకున్న వాళ్ళు వెంటనే చెప్పి అడ్వాన్సు పేమెంటుగా కొంత డబ్బులు ఈ రోజే చెల్లించాలంటూ భూమిక కార్యాలయంలో పనిచేసే నీరజ ఫోన్‌ చేసింది. వెంటనే అరుణ నేను డబ్బులు ఇచ్చి రావడానికి మా ఇంటికి దగ్గరే కనుక నడుచుకుంటూ భూమిక ఆఫీస్‌ బాగ్‌లింగంపల్లి బయల్దేరాం. వచ్చాక బట్టలు సర్దుకోవడం, ప్రయాణంలో సరదాగా తినడానికి కాస్త చిరుతిళ్ళు చూసుకోవడంలో పడి స్వతంత్రత్త గురించిన ఆలోచన పూర్తిగా వదలిపోయింది.

నాలుగేళ్ళుగా ప్రతి సంవత్సరం భూమిక సంపాదకురాలు సత్యవతి గారు భూమిక రచయిత్రుల విహారయాత్ర పేరుతో నిర్వహిస్తున్న పర్యటనలు అరుకు మొదలైన పర్యాటక ప్రాంతాలు చూడ్డంతో పాటూ ఆ ప్రాంతంలో సామాజిక సమస్యల గురించి ప్రజలతో మాట్లాడి రచయిత్రులు ప్రజల సమస్యల పట్ల అవగాహన పెంచుకుని ఆ సమస్యలపై భూమిక ప్రత్యేక సంచికలో ‘పర్యటనలో పాల్గొన్న రచయిత్రుల రచనలు’గా ప్రచురిస్తున్నారు. విహార యాత్రలో ఉండే ఉత్సాహం, సమస్యలు తెలుసుకోవడం వల్ల కలిగే అవగాహన చైతన్యం మేళవింపు మేలిమి ఒక్కసారి వచ్చిన వాళ్ళు మరో పర్యటన ఎట్టి పరిస్థితిలో మిస్‌ చేయడం లేదు. ప్రత్యేక సంచికల్లో రచనలు చదివి సుదూర ప్రాంతాల రచయిత్రులు కూడా ఈ పర్యటనలపట్ల ఆసక్తి చూపడం వల్ల మొదటిసారి చిన్న టెంపోలాంటి మిని బస్సు సరిపోగా ఇప్పుడు పెద్ద బస్సు కూడా సీట్లు సరిపోక ముగ్గురి సీట్లలో నలుగురు సర్దుకోవాల్సి వస్తున్నది. అందుకని ముందు సీట్లు నిండి పోకముందే చేరుకోవాలని ఆరుగంటలకు బస్సు బయలు దేరుతుందంటే అయిదు గంటలకే ఇంట్లోంచి బయల్దేరాం అయిదున్నరకల్లా భూమిక ఆఫీసు దగ్గరుంటాం.

ముందుగా ఏడు మండలాలు మునిగిపోనున్న ఖమ్మం జిల్లాకు, భధ్రాచలంలో భద్రాద్రి రామన్న దర్శనం, తర్వాత పోలవరం ముంపు మండలాలు వోలేరుపాడు, కుకునూరు, భధ్రాచలం, కూనవరం, వరరామచంద్రాపురం, చింతూరు మండలాలు ఉభయ గోదావరి జిల్లాలో పోలవరం నించి పైన గుట్ట మీద ఉన్న కొండమొదలు గ్రామాలు, పోలవరం పొంగితే మునిగి పోనున్న రాజమండ్రి వరకు బస్సులో గ్రామాలన్నీ తిరిగి, రాజమండ్రి నుంచి పడవలో గుట్టల మీది గ్రామాలు వెళ్ళాలని సత్యవతి గారు ప్రోగ్రాం ఫిక్స్‌ చేశారు.

ఏ గ్రామం వెళ్ళినా ఆదివాసీ ప్రజలు, అదివాసీయేతర చిన్న సన్న కారు రైతులు, ఇతర వృత్తుల పేదవాళ్ళు, పోలవరం నిర్మాణాన్ని అడ్డుకుంటాం అంటూ ఖరాఖండిగా చెప్పారు. ఆదివాసీయేతర భూస్వాములు (పది ఇరవై ఎకరాలకు మించి ఉన్న వాళ్ళు) మాత్రమే ఏజన్సీ ప్రాంతాల్లో ఆదివాసీయేతరులకు పట్టాలు లేవు. బినామీ పట్టాలతో ఇన్నాళ్లు ఎట్లాగో నెట్టుకొచ్చాం. అసలే జనం తెలివి మీరుతున్నారు ప్రభుత్వం ఇచ్చింది తీసుకుని భూములు అమ్ముకుని పోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

ఖమ్మం జిల్లా గ్రామాలు తిరగడం పూర్తి చేసుకుని మర్నాడు రాత్రికి రాజమండ్రి చేరుకున్నాం. రాత్రికి పర్యాటక శాఖ గెస్ట్‌హౌస్‌లో రెస్టు తీసుకుని (సత్యవతి గారు ముందే అన్ని మాట్లాడి ఏర్పాట్లు చేశారు) ఉదయం నాలుగ్గంటలకే లేచి తయారై గోదావరి తీరం చేరుకున్నాం. మేం వచ్చేవరకు రాజమండ్రిలోనే ఉండమని మర్నాడు ఉదయం పది గంటలకల్లా ఇక్కడకు బస్సుతో వచ్చి వెయిట్‌ చేయమని డ్రైవరుకు చెప్పి మేం పడవలో బయలు దేరాం.

…వానైతే లేదు కానీ వాననీటిలో జోరువానలో పడవ ప్రయాణం తీరమెక్కడో… అంటూ కొందరు కోరస్‌ పాటందుకున్నారు పాటకు కొందరు స్టెప్పులేస్తూ డాన్సు ”పడవ పక్కకు జరుగుతుందమ్మా ఎక్కువమంది ఒక పక్క కూడకండమ్మా” పడవ నడుపుతున్న వాళ్ళ హెచ్చరికలు పట్టించుకోకుండా కేరింతలు. ఒంగి నీళ్ళలో చేతులు పెట్టేవాళ్ళు కొందరు, కాళ్ళు నీళ్ళలోకి కిందకేసి పాదాలు ముంచే వాళ్ళు కొందరు, ఒకరి మీద ఒకరు నీళ్ళు చిలకరించుకుంటూ నవ్వుతూ తుళ్ళుతూ సరదాగా గోలగోలగా ఉత్సాహం ఉరకలేస్తూ అలల నురుగులపై తేలుతూ పడవ ప్రయాణం మౌనంగా అనుభవిస్తూ నేను. ఇంతలోనే పడవ కొండమొదలు గుట్టల పాదాల చెంత ఆగింది. పేరున్న పెద్ద రచయిత్రులు, కొత్తగా రాస్తున్న రచయిత్రులు అందరూ ఒకరితో ఒకరు పోటాపోటీగా దిగడంలోనూ హడావుడి పరుగులతో ఇసుకలో ఓ పదడుగులైనా వేయకుండానే ఇసుకలో కాళ్ళు కూరుకుపోయి ఆయాసంగా రొప్పుతూ చెప్పులు చేతబట్టుకుని అలవాటు లేని నడక. ఇంకా నయం చిన్న హ్యాండ్‌ బాగులు తప్ప లగేజీ లేదు. ఉంటే ఈ మాత్రం కూడా నడవలేకపోయేవాళ్ళం. ఇసుక తిన్నె దాటినాక గుట్టపైకి తలెత్తి చూస్తూ అందరి చేతులు గుండెలపైకి ”అమ్మో ఇంతెత్తు ఎట్ల ఎక్కేది…” అంటూ కొందరక్కడే కూలబడి పొయ్యారు. కాసేపు అందరం అక్కడే కూచుని సీసాల్లో

ఉన్న నీళ్ళు తాగి మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ రొప్పుతూ రోజుతూ పైకి నడక సాగించాం. అక్కడి వాళ్ళు గంటన్నరలో ఎక్కే దూరాన్ని మేం నాలుగ్గంటలకు పైగా నడిచి చేరుకున్నాం. మొదటి గ్రామ శివారులో ఒక పెద్ద రాతిపలకపై చెక్కిన అక్షరాలు ”ఇక్కడి నుంచి ఏజెన్సీ ప్రాంతం. ఇక్కడ గ్రామసభల అనుమతి లేనిదే భూములు అమ్మడం కానీ కొనడం గానీ చేయరాదు. ఆదివాసీలు తప్ప ఇతరులు ఇక్కడ పట్టాభూములకి అనర్హులు. భూముల విషయంలోనే ప్రభుత్వమైనా సరే గ్రామసభల అనుమతి లేకుండా ఎటువంటి లావాదేవీలు చేయడానికి వీలులేదు. ఇది రాజ్యాంగంలో అయిదవ షెడ్యూలు ప్రకారం హెచ్చరిక” అని పెద్ద పెద్ద అక్షరాలతో చెక్కి ఉంది. ఈ ఫలకం బి.డి. శర్మ గారు ఎస్‌.టి. కమీషన్‌ ఛైర్‌పర్సన్‌గా ఉన్న కాలంలో ఇక్కడకి వచ్చినప్పుడు వేయించారని అక్కడి ఆదివాసీలు చెప్పారు.

పైకి వెళ్ళగా ఇంకా మొదటి గ్రామం అయినా చేరకుండానే కొద్ది దూరంలో కోలాహలంగా ఆదివాసీలు హడావుడిగా గుంపులు గుంపులుగా పలు దారుల్లో వస్తూ కనిపించారు. అక్కడంతా

ఉత్సాహంగా పండగ వాతావరణంలా ఉంది. 69-70లలో కొండ మొదలు గ్రామాల్లో విప్లవ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆదివాసీల భూపోరాటంలో పోలీసు కాల్పుల్లో అమరులైన ఆదివాసీ రైతుల స్మారక స్థూపం ఆవిష్కరణకు స్థూపం చుట్టూరా ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ చెట్లు నరకి భూమి చదును చేసి సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ పక్క భోజనాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోపక్క విశాలమైన వేదిక సిద్ధం చేస్తున్నారు. అన్ని గ్రామాలనించి కాలిబాటన నడిచి వస్తూ జనం – వృద్ధులు, పిల్లలు, ఆడ, మొగా అందరూ గుంపులు గుంపులుగా సభాస్థలి చేరుకుంటున్నారు. అన్ని గ్రామాలు తిరిగే పని లేకుండా వాళ్ళతో ఇక్కడే మాట్లాడొచ్చు ఒకటి రెండు గ్రామాలు దగ్గరిగా ఉన్నవి చూస్తే చాలు అని మేం కాస్త ఊపిరి పీల్చుకుని ఈ రోజు ఇక్కడ స్థూపం ఆవిష్కరణ మాకిట్లా కలిసి వచ్చిందని సంతోషించాం.

అక్కడే చెట్ల చాటుకు వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుని,

కాళ్ళు చేతులు కడుక్కుని కాసేపు కూర్చుని విశ్రాంతి తీసుకున్నాం. కొండెక్కి వచ్చిన బడలిక కాస్త తగ్గగానే వెంట తెచ్చుకున్న వీడియో కెమెరాలు తీసుకుని వారి జీవన విధానం, సంస్క ృతి, గతంలో వాళ్ళ పోరాటాల గురించి, ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుపై వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుని రికార్డు చేసుకున్నాం. పోలవరం వ్యతిరేక పోరాటంలో లాఠీచార్జీల్లో దెబ్బలు తగిలిన వాళ్ళతో మాట్లాడాం. ఆరోజు అరెస్టు అయి ఇంకా జైల్లోనే బెయిలు కూడా దొరక్కుండా ఖైదీలుగా మగ్గుతున్న వాళ్ళ కుటుంబాలతోనూ మాట్లాడాం. ఇప్పటికీ 40 మంది వృద్ధులతో సహా ఆడా మొగా జైళ్ళలోనే ఉన్నారు. బెయిలు కూడా ఇవ్వడం లేదని చెప్పారు. రాజమండ్రి దాకా వెళ్ళి వాళ్ళని చూసి రావడం, బెయిలు కోసం తిరగడం ఆర్థికంగానే కాదు పనులు మానుకుని రానూ పోనూ రెండు రోజులు తిరగడం కష్టంగా

ఉందని చెప్పారు.

ఇంతలో భోజనాలు తయారు కావడంతో అందర్నీ వరసగా కూచోపెట్టి టేకాకు విస్తళ్ళలో భోజనాలు వడ్డించారు వాళ్ళతో పాటే మాక్కూడా – చిక్కుడుకాయ కూర, దోసకాయ పప్పు, పులుసు ఎంతో రుచిగా ఉన్నాయి. అలవాటు లేని దొడ్డు బియ్యం అన్నం అయినా అందరం ఆవురావురంటూ తృప్తిగా తిని అక్కడే అరగంట విశ్రాంతి తీసుకున్నాం.

ఇంతలో ”సభ మొదలు కాబోతోంది అందరూ వేదిక వద్దకి రావాలి” అంటూ మైకులో ప్రకటన. మేం అంతా లేచి వేదిక వద్దకు వెళ్ళాం. అక్కడ కొందరు ఆదివాసీ పెద్దలు పత్రికల వాళ్ళతో మాట్లాడుతున్నారు. మేం కూడా వాళ్ళున్న దగ్గరికి వెళ్ళి వాళ్ళను డిస్టర్బ్‌ చేయకుండా వాళ్ళు మాట్లాడేవి వింటున్నాం. సభ గురించి, స్థూపం గురించి, ఆనాటి భూపోరాటం గురించి, ప్రస్తుతం నడుస్తున్న పోలవరం నిర్మాణ వ్యతిరేక పోరాటం గురించి చెప్పి ఆ తర్వాత సభలో మాట్లాడబోయే వక్తలను పరిచయం చేశారు. పత్రికల వాళ్ళతో పాటు మేం కూడా వాళ్ళ మాటల్ని వీడియో, ఆడియో కెమెరాలో రికార్డు చేసుకున్నాం. సభలో మాట్లాడే వక్తలు, అధ్యక్షుల వారిని పరిచయం చేస్తూ మొదటగా ”ఈమె బుజ్జమ్మ. చిన్నప్పుడు వాళ్ళ అమ్మవాళ్ళు ఏ పేరు పెట్టినా ఇప్పుడామె పిల్లా పెద్దా అందరి నోళ్ళలో బుజ్జమ్మే. ఆనాటి పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నది. ఆ రోజు పోలీసు కాల్పులో బుజ్జమ్మ భర్తకి ఛాతిలో ఒకటి, భుజం మీద ఒకటి రెండు తూటాలు తగిలి అక్కడికక్కడే ప్రాణం ఒదిలాడు. అయినా ఇప్పటి వరకూ అన్ని పోరాటాల్లో అగ్రభాగాన ఉండి పోరాడుతున్న బుజ్జమ్మే కాసేపట్లో స్థూపాన్ని ఆవిష్కరిస్తుంది. వెంటనే జరిగే సభలో కూడా బుజ్జమ్మే ప్రధానవక్త” అంటూ పరిచయం చేశారు. విలేకరులు బుజ్జమ్మ మాట్లాడే విషయాలు వినడం కంటే ఆమెను ఎగాదిగా కింద నుంచి పైకి, పై నుంచి కిందికు చూడ్డం గమనించిన బుజ్జమ్మ ”ఏందట్లా చూస్తుండరు? బొట్టూ గాజులు అన్ని పెట్టుకుంది, మొగుడు పోయినంక కూడా ఏందనేనా మీరట్టా చూస్తుండరు. ఏందయ్యా చదుకున్నోళ్ళు మీకీమాత్రం తెల్వదా? బొట్టు గాజులు అన్నీ పెళ్ళిచేసుకున్నందుకు వచ్చినయా? పెళ్ళికి ముందే నేపుట్టినప్పటి నుంచే మా అమ్మ నాయన నాకు బొట్టు బెట్టిండ్రు, చేతులకు గాజులు, కాళ్ళకు కడాలు తొడిగిండ్రు. పెండ్లిల నా మొగడు పుస్తెకట్టిండు, కాలిగోళ్ళకు మెట్టెలు తొడిగిండు. ఆడుపోయినంక పుస్తె, మెట్టెలు తీసేసిన, మరి అమ్మ అయ్య బెట్టిన బొట్టు గాజులెందుకు తీసేయాల? అట్లానే ఉంచుకున్నా, ఎరికయిందా? ఇంక నన్ను ఇసిత్రంగ చూసుడాపి చెప్పేది రాసుకోండి” అని నవ్వింది. మాటలో ఎంత సాధికారత! అరుణ నేను ఒకరివైపు ఒకరం చూసుకున్నాం. అప్పుడిద్దరి మనసుల్లో మెదిలింది స్వతంత్రత్త రూపమే. బొట్టు లేకుండా మట్టిగాజులు తీసేసి చేతికి డజను చొప్పున బంగారు గాజులు తెల్లచీరలో స్వతంత్ర రూపం. కేంద్ర కమిటీ స్థాయికి ఎదిగిన స్వతంత్రత్త రాజకీయ, సాంస్క ృతిక అవగాహన ఆచరణ స్థాయితో చూస్తే అక్షరం కూడా రాయలేని చదవలేని ఆదివాసీ బుజ్జమ్మ రాజకీయ సాంస్క ృతిక చైతన్యం, అవగాహన, ఆచరణ ఎంత గొప్పది కదా అనుకున్నాం. అందుకే ఈ రోజు స్త్రీల సాధికారత గురించి మాట్లాడే స్వతంత్రత్త గొంతులో వినిపించని సాధికారత బుజ్జమ్మ గొంతులో ఖంగుమంది అని కూడా అనిపించింది.

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో