చాలా దృశ్యాలు చూస్తాం… రోజూ చూసేవే కదా నిర్లక్ష్యం చేస్తాం!
అనేక పుస్తకాలు చదువుతాం…. సంతోషమో, దుఃఖమో, ఆనందమో… బాధో… ఆ సమయానికి అనుభవించి వదిలేస్తాం! దృశ్యాలైనా.. అక్షరాలైనా… కొన్ని మాత్రం తీవ్రంగా కదిలిస్తాయి.
ఎప్పటికీ గుర్తుండిపోతాయి! నన్నేం చేశావంటూ ప్రశ్నిస్తాయి! ఏదో ఒకటి రాసేంత వరకు వెంటాడతాయి! అలా తనను వెంటాడిన దృశ్యాలకు అక్షరరూపం ఇచ్చిన రచయిత్రి… చైతన్య పింగళి! రాసింది రెండు పుస్తకాలే… అయినా జాతీయ ఖ్యాతిని తెచ్చుకున్నది. మొదటి పుస్తకానికే కేంద్రసాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని అందుకున్నది! పింగళి వెంకయ్య మునిమనుమరాలుగా వచ్చే పేరు కన్న… నన్ను నేనుగా నిరూపించుకోవడమే ఇష్టమని చెబుతున్నది!
”1930లో ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీ! అందులో పనిచేస్తున్న విప్లవకారులు ఇద్దరు ఒక స్థావరంలో బ్రిటిష్ సైన్యానికి దొరికారు. లోపల ఉన్నవాళ్లు లొంగిపోవాలని… షర్ట్ విప్పి, చేతులు పైకి ఎత్తి బయటికి రావాలని సైన్యం ఆదేశాలు జారీ చేసింది. ‘నేను చీరకట్టుకుని ఉన్నాను. పైట తొలగించి బయటికి రావాలా? అవసరం లేదా?’ అని ఓ ఆడగొంతు. ఆ గొంతులో సిగ్గు లేదు, భయం లేదు… కేవలం నిర్లక్ష్యం ప్రతిధ్వనిస్తోంది. అది బ్రిటిష్ సైనికులను దిగ్భ్రాÛంతికి గురి చేసింది. ఆ గొంతు చిట్టగాంగ్ విప్లవకారిణి కల్పనాదత్‌ది. ఆమెతో ఉన్న నాయకుడు తారకేశ్వర్! బయటికి వచ్చేముందు తారకేశ్వర్ కల్పనతో ఓ మాట అన్నాడు ‘బులు నాకోసం ఎదురుచూస్తావా?’ అని! బయటికి వచ్చాక తారకేశ్వర్‌ను ఉరితీశారు. శవాన్ని కూడా కనబడనీయలేదు. ఇచ్చిన ఒక్కమాటకోసం ఎదురుచూస్తూనే ఉంది కల్పన!” కల్పన మాటల్లోని ధైర్యం.. ఆ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ… చైతన్యను కదిలించింది. అదే సమయంలో దేశాన్ని కుదిపేసిన నిర్భయ ఘటన జరిగింది. ఇలాంటప్పుడే కల్పనాలాంటి విప్లవ వనితల స్ఫూర్తిని… ఈ తరానికి అందించాలనుకుంది చైతన్య. ఫలితం… ‘చిట్టగాంగ్ విప్లవ వనితలు’ పుస్తకం వచ్చింది.
అయితే ఒక్క కల్పనాదత్ మాత్రమే కాదు… ఉద్యమం అంటే తెలియని, ఊరు దాటని అమ్మాయిలూ ఆ పోరాటంలో ఉన్నారు. ఒకరి నేపథ్యానికి ఇంకొకరి నేపథ్యానికి సంబంధం లేదు. ప్రీతీలతా వడేదార్, బ్రాహ్మణ వితంతువు సావిత్రీదేవి, సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన ప్రేమలత… ఇలా బ్రిటిష్‌కు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటం చేసిన మొదటితరం భారతీయ మహిళల కథలన్నీ ఇందులో పొందుపరిచింది చైతన్య.
మనసులో వెన్నెల…
అంతటి విశిష్టత ఉన్న పుస్తకం గనుకే ఆమెను ‘కేంద్రసాహిత్య అకాడమీ’ అవార్డు వచ్చింది. అదే ఆమె మొదటి పుస్తకం. అలా రచనా రంగంలోకి అడుగుపెట్టిన చైతన్య…. అప్పటికే ‘విజయవిహారం’లో జర్నలిస్టుగా పనిచేసింది. అనేక పత్రికలు ఫ్రీలాన్సింగ్ కూడా చేసింది. ఆమె రెండో పుస్తకం ‘మనసులో వెన్నెల’. గత ఏడాదే విడుదలయ్యింది. అందులో నామాలు కథ… రెండేళ్ళ కిందట తన స్నేహితురాలికి జరిగిన ఘటన. భారతదేశం ఎంత అభివృద్ధి చెందుతున్నా… మతం పేరిట మనుషులను ఎంత మూఢత్వం పట్టి పీడిస్తోందో చెప్పే కథ. ట్రాన్స్‌జెండర్స్ కథ… ఇలా అన్నీ విభిన్నమైనవే! కొత్త ప్రయత్నాలే! ప్రస్తుతం సినిమాల కోసం స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేస్తోంది! ఇంత చిన్నవయసులో అంత బాగా ఎలా రాయగలిగింది? బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా డీకాస్టిఫై ఎలా అయ్యింది? అవన్నీ తెలియాలంటే… ఆమె మాటల్లో తెలుసుకోవాల్సిందే!
నడిపించిన మహాప్రస్థానం…
”నాన్న పింగళి దశరథ రామయ్య. నాకు రెండున్నరేళ్ల వయసులోనే నాన్న హత్యకు గురయ్యారు. అమ్మానాన్నది లవ్ మ్యారేజ్. దాంతో వాళ్లకు పేరెంట్స్ సపోర్ట్ కూడా లేదు. దాంతో అమ్మ… నేను ఫిఫ్త్‌లో ఉన్నప్పుడు తను ఇంటర్… మేం ఇంటర్‌కొచ్చాక తను డిగ్రీ… ఇలా చదువుతూ ఉద్యోగం తెచ్చుకుంది. కోదాడ దగ్గర నందిగామలో పాలిటెక్నిక్ కాలేజీలో మ్యాట్రన్‌గా పనిచేసింది. చాలా కష్టపడి మమ్మల్ని పెంచింది. అమ్మ చూసిన పరిస్థితులు, ఎదుర్కొన్న సమస్యలో, మేమూ నాన్న దారిలో వెళతామేమోనన్న భయమో కానీ… ఎప్పుడు నాన్న ప్రస్తావన వచ్చినా కట్ చేసేది. ఆ ఆలోచనలు కూడా రానీయకుండా చేసేది. నాన్న పుస్తకాలేవీ మాకు అందుబాటులో లేకుండా చేసింది. నేను టెంత్ పాసయిన తరువాత వాచ్ కొనివ్వమని అడిగితే… ‘వాచ్ అయితే ఆగిపోతుంది. ఇది చదువు నిన్ను ముందుకు నడిపిస్తుంది’ అని శ్రీశ్రీ మహాప్రస్థానం పుస్తకం ఇచ్చింది. అది నేను చదివిన మొదటి పుస్తకం. ఆ తరువాత చలం, కెఎన్‌వై పతంజలి, ఓల్గా ఇలా పుస్తకాలు చదువుకుంటూనే పోయాను.
సంచలనాల జర్నలిస్టుగా…
ఇంటర్ తరువాత డిగ్రీ బీఏ తెలుగు చదువుతానంటే మళ్లీ పుస్తకాలు ఎక్కడ చదువుతుందో అని భయపడి వద్దన్నది. హైదరాబాద్ వచ్చి ముంతాజ్ డిగ్రీ కాలేజీలో చేరాను. డిగ్రీ చేస్తూ ‘విజయ విహారం’లో రెండేళ్లపాటు పనిచేశాను. వాళ్లు ఏడు సంచికలు నాన్న గురించే సీరియల్‌గా వేశారు. అవి చూసిన తరువాతే నాన్న పుస్తకాలు చదివాను. అక్కడ పనిచేసినప్పుడు నా వరకు నేను ఎదుర్కొన్న సమస్యలే రాయాలనిపించింది.
నేను ఇంటర్‌లో ఉండగా మా సీనియర్స్‌కి ఫేర్వెల్ పార్టీ ఇవ్వడానికి గిఫ్ట్స్ కొనడానికి విజయవాడ షాపింగ్‌కు వెళ్లాం. అప్పుడు షాపింగ్ మాల్స్‌లో టాయిలెట్స్ లేవు. మా ఫ్రెండ్ ఒకమ్మాయి బాత్‌రూమ్‌కు వెళ్లాలి. చాలా ఇబ్బంది పడింది. ప్లేస్ లేకపోవడంతో ఆటోమేటిక్‌గా పాస్ చేసింది. ఆ ఘటన తరువాత కాలేజీలో అబ్బాయిలు తనను చూసి హగ్గీస్ చూపించి కామెంట్ చేసేవారు. అది తట్టుకోలేక ఆ అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసింది. అమ్మాయిలకు అన్నీ సమస్యలే. ఈ విషయమై నేను రాసిన ఆర్టికల్ అమ్మకు బాగా నచ్చింది. ఆ తరువాత అనేకం రాశాను. కానీ తనకు నచ్చని దారిలో వెళ్లినందుకు (విజయవిహారంలో పనిచేసినందుకు) మూడేళ్లపాటు నాతో మాట్లాడలేదు. బర్త్‌డే అప్పుడు మాత్రం కాల్ చేసి విష్‌చేసేది.
డీకాస్టిఫై…
అయితే నేను పెరుగుతున్న క్రమంలో నేను ఐదారు తరగతుల్లో ఉన్నప్పుడు అనుకుంటా… ‘కృష్ణ మాదిగ’ పేరుతో పోస్టర్స్ గోడల మీద ఉంటే… నా చుట్టుపక్కల వాళ్ల రియాక్షన్ ఎలా
ఉండేదంటే… ‘చౌదరి, రెడ్డి అని పెట్టుకున్నట్టు మాదిగ అని పెట్టుకోవడం ఏంటి పేరు వెనకాల?’ అని అందరూ అంటుంటే నేనూ ఆశ్చర్యపోయినా. ఎందుకు పెట్టుకోకూడదు అని అర్థం చేసుకునే వయసు నాకు లేదు. దానికి నేపథ్యం ప్రధాన కారణం. కానీ ‘అంటరాని వసంతం’ చదివాక నాకు కొంత ఇష్యూస్ అర్థమయ్యాయి. అగ్రకులంలో పుట్టిన పురుషుడు అయితే… అర్థం చేసుకోలేడు, మహిళను కాబట్టి… వివక్షను తొందరగా అర్థం చేసుకోగలిగాను. అయితే కులాన్ని, జెండర్‌ను మనం… ఎంచుకుని పుట్టం, పుట్టుకతో వాటికి సంబంధం లేదు. ఎక్కడ, ఎట్లా బతుకుతున్నామన్నది ప్రధానమని నమ్ముతాను. అందుకే కులాంతర సహజీవనం మాది. నా సహచరుడు బాలగంగాధర తిలక్ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. గోదావరి జిల్లాలోని గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగినా… కమ్యూనిస్టు భావాలున్న వ్యక్తి. మా మామగారు కళాకారుడు. ఆయన చాలా లిబరల్. విప్లవాలు, సిద్ధాంతాలు మాట్లాడకపోయినా… సమానత్వం అనేది ఇంట్లో ఆచరించి చూపిస్తారు. అట్లాంటి పేరెంట్స్ ప్రభావం వల్ల తిలక్ కూడా ఇంట్లో అంత లిబరల్‌గా ఉంటాడు. నా నాలుగేళ్ల కొడుకు ఖుదీరాంబోస్ (పాప పుడితే ప్రీతీలత అని పెట్టాలనుకున్నాం)ని కూడా అలాగే పెంచాలనుకుంటున్నా. నేను ‘చిట్టగాంగ్ విప్లవ వనితలు’ రాస్తున్న సమయంలో.. మా అత్తగారికి క్యాన్సర్ కీమో నడుస్తోంది. మూడు రోజులు రెస్ట్ తీసుకుంది. అంతే ఫోర్త్ డే నుంచి నా గురించి ఆమె కేర్ తీసుకుంది. అంతగా కదలించాయి అందులోని ఘటనలు ఆమెను. వాళ్ల గురించి చదివిన తరువాత… ”ఈ రోగాలు, బాధలు వస్తాయి, పోతాయి. ఇలాంటివయితే ఖచ్చితంగా రాయాలి” అన్నది. టు ఇయర్స్ బ్యాక్ తను చనిపోయింది.
ప్రతిభ వారసత్వం కాదు…
వారసత్వం అనేదాన్ని నేను నమ్మను. అయితే పేరున్న కుటుంబంలో పుట్టడం వల్ల ఆ ఎక్స్‌పోజర్ ఉంటుంది. ఆ బెనిఫిట్స్ వద్దనుకున్నా వస్తాయి. పింగళి వెంకయ్యగారి వారసత్వాన్ని మా నాన్నే రిజెక్ట్ చేశాడు. ప్రభుత్వం ఏదో ఇస్తా అన్నా తీసుకోలేదు. ఇక నేను అస్సలు అంగీకరించను. ఇప్పుడు ఎంతో మంది తమ పోరాటాలతో, ప్రతిభతో పైకెదిగినవాళ్లున్నారు. వాళ్లను వాళ్లు నిరూపించుకుంటున్నారు. కాబట్టి ఎవరి గుర్తింపు వారిదే అని నమ్ముతాను. అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పటిదాకా మా అమ్మ నన్నో ‘సంఘ వ్యతిరేకి’ అనుకుంటోంది. ఈ అవార్డుతో దానికి ఆమోద ముద్ర పడింది (నవ్వుతూ)! అయితే ఇప్పుడు సంతోషంతో ఉంది… ఆమె సంతోషంతో నాకు రెట్టింపు ఆనందం!
మణిపూర్ మహిళల గురించి…
రెండేళ్లుగా ఈశాన్య రాష్ట్రాల ఇష్యూస్ మీద పరిశోధన చేస్తున్నాను. అయితే అది పెద్ద సబ్జెక్ట్ అయిపోయింది. అందుకే మణిపూర్ ఒక్కటి సెలక్ట్ చేసుకుని వర్క్ చేస్తున్నాను. మణిపూర్‌లో మహారాజుకు, బ్రిటిష్‌కి వ్యతిరేకంగా ఆ కాలంలో వేల మంది మహిళలు పోరాటం చేశారు. ఆ మహిళా ఉద్యమాల కొనసాగింపే నేటి ఇరోం షర్మిలా పోరాటం. ఈ మధ్యే వెళ్లి ఇరోం షర్మిలాను కలిశాను. దీన్నంతటినీ ఎలా రాయాలన్న దాంట్లో ఇంకా క్లారిటీ లేదు. చివరగా ఏంఫామ్‌కు వెళ్తుందో చూడాలి. సోనీసోరీ మీద కూడా రాయాలనుకుంటున్నా” అంటూ ముగించింది చైతన్య!