– రేణుక అయోల
చీకటి గుట్టుగా
సరదాగా హాయిగా వుంటుంది
వెలుతురు రానంతవరకూ..
చీకటి పరదాలు దింపుకొని
నివురు కప్పిన నిప్పులా కాలిపోతూ
రాత్రి గుబాళించిన మల్లెలు
తెల్లారి రంగుమారి వికృతంగా నవ్వినట్లు
సెక్స్ వర్కర్‌లన్న ముద్రలతో
సమాజానికి దూరం జరిగీ కుళ్ళిపోతున్నా….
ఎయిడ్స్ భూతం నిలువెల్లా కబళిస్తున్నా..
ఆ కుంపటిలో నిప్పులు ఎగదొయ్యడానికి అందరూ సిద్ధమే..
బూడిదలో ఎముకల్లా
కరిగిపోయిన జీవితాలు..
చిరిగిన జీవితాలకి గుర్తులు
పాలబుగ్గల చిన్నారులు
పసి బుగ్గలకి అంటిన గుర్తులు
చెరపాలన్నా చెరగని మరకలు…
ఎయిడ్స్ ఎయిడ్స్ అంటూ
చీకటిని మరింత చీకటి చేసి
ఉపన్యాసాల కాగడాలు వెలిగించీ
మరింత నిశీధిలోకి తోసేసేకన్నా
రాలిపోతున్న పూలని
పసి మొగ్గలని వాడిపోకుండా
కొందరిని కాపాడినా…
ఆ చీకటి సమాధులు చిగురిస్తాయి
ఆకుపచ్చని ఒకరెమ్మ అయినా
హాయిగా నవ్వగలుగుతుంది.