– భార్గవీ రఘురాం , ఇంటర్‌వ్యూ: కె. సత్యవతి
వ్యాధులను ఎదుర్కొనే శక్తిని, ప్రతిఘటించే శక్తిని నాశనం చేసే వైరస్ హెచ్.ఐ.వి. అయితే హెచ్ఐవిని పూర్తిగా సొంతం చేసుకుని పెంచుకోవడమే ఎయిడ్స్ అని నా అభిప్రాయం.ఒక మంచి లక్షణాన్ని సొంతం చేసుకోవచ్చు. ఒక మంచి పుస్తకాన్నో, ఒక పూదోటనో సొంతం చేసుకోవచ్చు. భగవంతుడు మనకిచ్చిన జీవితాన్ని నిర్ధాక్షిణ్యంగా, నిశ్శబ్దంగా పచ్చని చెట్టును నిలువెల్లా ఎండగట్టి చంపేసే వేరుపురుగులాంటి ఎయిడ్స్ ని ఎవరైనా ఎందుకు సొంతం చేసుకోవాలి? అలా చేసుకుంటారా? ఒకవేళ ఎవరైనా దాని బారిన పడ్డారంటే వారికి దాని గురించి తెలియకపోవటం,దాని గురించి విని వుండకపోవడం ముఖ్య కారణం.
సమాజంలో బాధ్యతగల తల్లిదండ్రులు పిల్లలకు చిన్నతనం నుంచి నైతిక విలువలను, బాధ్యతలను గురించి విడమర్చి చెప్పకపోవటం కూడా కారణమే. స్నేహితుల్లాగా సంకోచం లేకుండా వారికొచ్చే సందేహాలను విడమర్చి తెలియచెప్పకపోవడం కూడా కారణం. అనేక విధాలుగా యువతను రెచ్చగొట్టే సందర్భాలుంటాయి. సరైన సమయంలో జీవితాన్ని ఆస్వాదించే ప్రవృత్తి, సహనం పిల్లలకు లేకపోవడం కూడా కారణం. మాకేం ఫర్వాలేదు అనే ధీమా కూడా కారణం కావచ్చు. అంతేకాదు అనేక కారణాలవల్ల దురదృష్టవశాత్తు వ్యభిచారంలాంటి వృత్తిలోకి దిగినవారికి తగిన అవగాహన కల్పించేందుకు సరిపడిన వనరులు సమకూర్చుకోలేకపోవడం కూడా ఒక కారణం. కేవలం లైంగికంగానే కాకుండా కలుషిత రక్తమార్పిడి కూడా హెచ్ఐవి రావడానికి కారణం.కాని కూటికి గతిలేక రక్తం అమ్ముకునే దాతలెందరో? వారికి ఈ భయంకర వ్యాధిగూర్చి ఎంత అవగాహన వుందో?
రక్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అవసరమైనవారికివ్వాలి. అలాంటి సంస్థలపై నియంత్రణా విభాగాలు నిక్కచ్చిగా వ్యవహరించాలి. ప్రతి మెట్టు దగ్గర నిర్దిష్టమైన పరీక్షలు, వాటి ప్రక్రియలు బాధ్యతాయుతంగా వుండాలి. ప్రభుత్వమే కాదు, సమాజంలో ప్రతి ఒక్కరు తమవంతు బాధ్యతను నిర్వర్తిస్తే హెచ్ఐవిని నివారించవచ్చు. మానవుడు సామాజిక జీవి. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, వత్తిడి పెరిగినా పంచుకునేందుకు మరొకరికోసం వెదుకుతాడు. అందుకే పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో ఇంత విశృంఖలత్వం లేదన్పిస్తుంది. ఎనీవే, ప్రచారం, వనరులు ఎంత ముఖ్యమో, సంకోచం మాని బాధ్యతాయుతంగా దాన్ని గూర్చి తెలుసుకోవటం, తెలియచెప్పటం, స్వాభిమానంతో ప్రతిఘటించకుండా సహకరించటం అవసరం. పెళ్ళికి ముందు వధూవరులిద్దరూ రక్తపరీక్షలు చేయించుకోవాలన్న చట్టం రావడం చాలా ముదావహం.
హెచ్ఐవి గురించి ఇంటింటికి ప్రచారం జరగాలి. వాళ్ళకు కావల్సిన రీడింగ్ మెటీరియల్ అందుబాటులో వుంచాలి. గ్రామాల్లోనివారికి తీరుబడి వున్న సమయాల్లో రేడియోల ద్వారా విన్పించాలి, గ్రామ సభలు, మహిళా మండలులు కూర్చుని మాట్లాడుకునేటప్పుడు, నలుగురు పనిచేస్తున్నప్పుడు వారికి విన్పించాలి. పోస్టర్స్ తయారుచేసి ప్రతి డ్వాక్రా మీటింగ్స్ లో పెట్టాలి. ఎంట్రన్స్ లలో పెడ్తే చూస్తూ వుంటారు. మగవాళ్ళు అంటే ట్రాన్స్‌పోర్ట్, లారీ డ్రైవర్లు లాంటివారికి అవేర్‌నెస్ రావాలి. వారికి కండోమ్‌లు ఇవ్వాలి. తప్పు చెయ్యకుండా నివారించడం వారి మానసిక పరిస్థితిపై ఆధారపడి వుటుంది.
హెచ్ఐవి / ఎయిడ్స్ అనేది ఏ సెక్షన్ వారికైనా రావచ్చు. ఇప్పుడు సమాజంలో రిస్క్ అందరికీ వుంది. నేనెందుకు రక్తపరీక్షలు చేయించుకోవాలనే ఇగో లేకుండా రక్తపరీక్ష చేయించుకోవాలి.
ప్రచార సరళిని మార్చడం గురించి ఏంటంటే ఒకరితో ఒకరు స్నేహభావంతో వుంటూ బాధ్యతతో వుండాలి. బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం నాలుగు దశల్లో ఏ దశలో చెయ్యాల్సిన పని ఆ దశలో చెయ్యాలి. ప్రచారం సెల్ఫ్ కంట్రోల్ దిశగా వుండాలి.
యూత్ ఎవరికి వాళ్ళు ఎనలైజ్ చేసుకోగల్గాలి. స్నేహంగా వుండొచ్చు, కాని శారీరక సంబంధం వేరు. వారిని రెచ్చగొట్టే వాళ్ళుంటారు, కాని ఎవరి బాధ్యత వారికి తెలియాలి.
పాజిటివ్స్ పట్ల సానుభూతితో వుండాలి. వాళ్ళని చూపించి హెచ్ఐవి రాకుండా ఏవిధంగా నివారించాలనే దాన్ని గూర్చి తెలియజేయాలి.